డ్రాగన్‌ శకం ముగిసింది! | Apple suppliers Foxconn and Pegatron expand production outside China | Sakshi
Sakshi News home page

డ్రాగన్‌ శకం ముగిసింది!

Published Tue, Nov 17 2020 5:32 AM | Last Updated on Tue, Nov 17 2020 6:43 AM

Apple suppliers Foxconn and Pegatron expand production outside China - Sakshi

గతమెంతో ఘనకీర్తి..?! భవిష్యత్తులో చైనా ఇదేవిధంగా చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందేమో. పిన్ను నుంచి పెద్ద యంత్రం వరకు ఏ ఉత్పత్తిని అయినా తయారు చేయగలదు చైనా. అందుకే అంత వేగంగా ఎదిగి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగలిగింది. కానీ, కరోనాతో, అమెరికాతో వాణిజ్య కయ్యం కారణంగా చైనా పరిస్థితి మారిపోనుందని నిపుణులు, పారిశ్రామికవేత్తల మాటలను పరిశీలిస్తే అర్థమైపోతోంది. ‘ప్రపంచానికి పరిశ్రమగా చైనా రోజులు ముగిసినట్టే’.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు... ఫాక్స్‌కాన్‌ బాస్‌ యంగ్‌ లీ!. దీనికి కారణంగా ట్రేడ్‌ వార్‌ (వాణిజ్య యుద్ధం)ను ఆయన పేర్కొన్నారు.

యాపిల్‌ ఐఫోన్ల నుంచి, డెల్‌ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఇలా ఒకటేమిటి అన్నింటికీ తయారీ కేంద్రం చైనాయే. యాపిల్‌ కు ప్రధాన తయారీ భాగస్వాముల్లో ఒకటైన ఫాక్స్‌కాన్‌ తోపాటుచైనా కేంద్రంగా విస్తరించిన డజను వరకు టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు చైనా బయట వైపునకు చూస్తున్నాయి. చైనా మార్కెట్‌కు, యూఎస్‌ మార్కెట్‌కు సరఫరా వ్యవస్థలను వేర్వేరుగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను మారిన పరిస్థితుల్లో అవి అవగతం చేసుకున్నాయి.  

చైనా బయట క్రమంగా మరింత తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్టు హాన్‌ హాయ్‌ ప్రెసిషన్‌ ఇండస్ట్రీ కంపెనీ (ఫాక్స్‌ కాన్‌ గా ట్రేడయ్యే సంస్థ) చైర్మన్‌ యుంగ్‌ లీ తెలిపారు. ప్రస్తుతానికి మొత్తం తయారీ సామర్థ్యంలో 30 శాతం చైనా బయట ఈ సంస్థ ఏర్పాటు చేసుకుంది. గతేడాది జూన్‌ నాటికి ఇది 25 శాతమే. ఏడాదిలో చైనా వెలుపల 5 శాతం తయారీని పెంచుకున్న ఈ సంస్థ.. భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకునే ప్రణాళికలతో ఉంది.

చైనాలో తయారై అమెరికాలోకి ప్రవేశించే ఉత్పత్తులపై పెరిగే టారిఫ్‌ల భారం పడకుండా ఉండేందుకు గాను ఫాక్స్‌ కాన్‌ సంస్థ భారత్, ఆగ్నేయాసియా, ఇతర ప్రాంతాలకు తయారీని తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్టు కంపెనీ ఫలితాల ప్రకటన సందర్బంగా యంగ్‌ లీ స్వయంగా మీడియాకు వెల్లడించారు. ‘‘భారత్‌ లేదా ఆగ్నేయాసియా లేదా అమెరికా.. ఏదైనా సరే ఆయా ప్రాంతాల్లో తయారీ ఎకోసిస్టమ్‌ ఉంది’’ అని లీ పేర్కొన్నారు. అయితే, ఫాక్స్‌ కాన్‌ తయారీలో చైనా ఇక ముందూ కీలకపాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కాకపోతే ప్రపంచానికి తయారీ కేంద్రంగా చైనా దశకం ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు.  

భారత్‌ లో ఫాక్స్‌ కాన్‌ విస్తరణ
అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడంతో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తి సంస్థలు తమ తయారీ కేంద్రాలను చైనా బయట కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాయి. అవసరమైతే యాపిల్‌ ఉత్పత్తులను పూర్తిగా చైనా బయట తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని యంగ్‌ లీ గతేడాదే ఓ సందర్భంలో చెప్పడం గమనార్హం. దీర్ఘకాలంలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్‌ తయారీ కేంద్రాలు ఏర్పాటు కావడం తథ్యమని లీ మాటలతో స్పష్టమవుతోంది.

ఫాక్స్‌కాన్‌ కు మన దేశంలోనూ తయారీ కేంద్రాలున్నాయి. మరిన్ని పెట్టుబడులతో సామర్థ్య విస్తరణ చేయనున్నట్టు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించింది కూడా. భారత్‌ లో తయారీకి అమెరికాకు చెందిన యాపిల్‌ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో యాపిల్‌ తయారీ భాగస్వామిగా ఫాక్స్‌కాన్‌ సంస్థ భారత మార్కెట్‌ పట్ల విస్తరణ ప్రణాళికలతో ఉంది. అమెరికాకు సరఫరా చేసే ఉత్పత్తుల తయారీకి భారత్‌ ను ప్రధానంగా ఫాక్స్‌కాన్‌ పరిశీలిస్తుండడం గమనార్హం. యాపిల్‌ ఐపాడ్, మ్యాక్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ కారణంగా ఫాక్స్‌ కాన్‌ జూన్‌ క్వార్టర్‌ లో 5,835 కోట్ల భారీ లాభాన్ని ప్రకటించడం గమనార్హం. ఈ సంస్థ తైవాన్‌ కు చెందినది. టెన్సెంట్‌ హోల్డింగ్స్‌కు చెందిన వీచాట్‌ వినియోగాన్ని అమెరికా పౌరులు వినియోగించకుండా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌   ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.

పోటీతత్వంతో స్వావలంబన భారత్‌
భారత్‌ తన అవసరాలను దేశీయంగా తీర్చుకునేందుకు (ఆత్మ నిర్భర్‌) దేశీయ పరిశ్రమ కచ్చితంగా మరింత పోటీనిచ్చే విధంగా మారాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్‌ ప్రభు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు రక్షణాత్మక విధానాలను అవలంబిస్తున్నతరుణంలో.. భారత్‌ కూడా తన అవసరాలకు తనపైనే ఆధారపడాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛాయుత మార్కెట్‌ కలిగిన అమెరికా సైతం రక్షణాత్మక విధానాలను అనుసరిస్తున్న విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. కనుక రానున్న రోజుల్లో ఆత్మనిర్భర్‌ కు మరే ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ‘‘మన పరిశ్రమలను మరింత పోటీయుతంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోటీతత్వం మన పరిశ్రమల సమర్థతను పెంచుతుంది. ఆ పోటీయే మనకు మేలు చేస్తుందని నేను నమ్ముతున్నాను’’ అంటూ పీహెచ్‌ డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్వహంచిన కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. ఉద్యోగ కల్పనకు కేంద్రం ఎన్నో విధాానాలను అమలు చేసినట్టు ప్రభు చెప్పారు.

చైనా ఉత్పత్తులకు తగ్గిన ఆదరణ!
న్యూఢిల్లీ: చైనా తయారీ ఉత్పత్తుల పట్ల భారతీయుల్లో ఆసక్తి తగ్గుతోందని సోషల్‌ మీడియా వేదిక లోకల్‌సర్కిల్స్‌ తన సర్వేలో వెల్లడించింది. నవంబరు 10–15 మధ్య దేశవ్యాప్తంగా 204 జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు. దీని ప్రకారం సర్వేలో పాలుపంచుకున్న వారిలో పండుగల సీజన్లో కేవలం 29 శాతం మంది మాత్రమే చైనా ఉత్పత్తులను కొనుగోలు చేశారు. గతేడాది ఈ సంఖ్య 48 శాతం ఉంది. 2019లో చేపట్టిన సర్వేలో 14,000 మందికిపైగా పాల్గొన్నారు. 2019తో పోలిస్తే ప్రస్తుత సీజన్లో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారి సంఖ్య 40 శాతం తగ్గిందని లోకల్‌సర్కిల్స్‌ ఫౌండర్‌ సచిన్‌ తపారియా తెలిపారు. ఈ ఏడాది చైనా ఉత్పత్తులు కొన్నవారిలో 71 శాతం మంది తాము స్పృహతో కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. డబ్బుకు తగ్గ విలువ కాబట్టే ఆసక్తి చూపామని 66% మంది తెలిపారు.  

దాడి తర్వాత పెరిగిన వ్యతిరేకత..
జూన్‌లో గాల్వన్‌ వ్యాలీలో చైనా సైనికుల దాడిలో భారత జవాన్లు వీర మరణం పొందిన సంఘటన తర్వాత చైనా ప్రొడక్ట్స్‌ పట్ల భారతీయుల్లో వ్యతిరేకత అధికమైంది. వచ్చే ఏడాది కాలంలో చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తామని 87 శాతం మంది వెల్లడించారు. దేశీయంగా తయారైన ప్రొడక్ట్స్‌ ఖరీదు ఉన్నప్పటికీ నాణ్యత మెరుగ్గా ఉంటుందని అత్యధికులు ఈ విషయాన్ని వ్యక్తపరిచారు. పండుగల సమయంలో లైట్లు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులు ఒకసారి మాత్రమే వినియోగించేవి కావడంతో నాణ్యత ప్రధాన అంశం కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement