China-US trade
-
డ్రాగన్ శకం ముగిసింది!
గతమెంతో ఘనకీర్తి..?! భవిష్యత్తులో చైనా ఇదేవిధంగా చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందేమో. పిన్ను నుంచి పెద్ద యంత్రం వరకు ఏ ఉత్పత్తిని అయినా తయారు చేయగలదు చైనా. అందుకే అంత వేగంగా ఎదిగి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగలిగింది. కానీ, కరోనాతో, అమెరికాతో వాణిజ్య కయ్యం కారణంగా చైనా పరిస్థితి మారిపోనుందని నిపుణులు, పారిశ్రామికవేత్తల మాటలను పరిశీలిస్తే అర్థమైపోతోంది. ‘ప్రపంచానికి పరిశ్రమగా చైనా రోజులు ముగిసినట్టే’.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు... ఫాక్స్‌కాన్ బాస్ యంగ్ లీ!. దీనికి కారణంగా ట్రేడ్ వార్ (వాణిజ్య యుద్ధం)ను ఆయన పేర్కొన్నారు. యాపిల్ ఐఫోన్ల నుంచి, డెల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఇలా ఒకటేమిటి అన్నింటికీ తయారీ కేంద్రం చైనాయే. యాపిల్ కు ప్రధాన తయారీ భాగస్వాముల్లో ఒకటైన ఫాక్స్‌కాన్ తోపాటుచైనా కేంద్రంగా విస్తరించిన డజను వరకు టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు చైనా బయట వైపునకు చూస్తున్నాయి. చైనా మార్కెట్‌కు, యూఎస్ మార్కెట్‌కు సరఫరా వ్యవస్థలను వేర్వేరుగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను మారిన పరిస్థితుల్లో అవి అవగతం చేసుకున్నాయి. చైనా బయట క్రమంగా మరింత తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్టు హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ (ఫాక్స్ కాన్ గా ట్రేడయ్యే సంస్థ) చైర్మన్ యుంగ్ లీ తెలిపారు. ప్రస్తుతానికి మొత్తం తయారీ సామర్థ్యంలో 30 శాతం చైనా బయట ఈ సంస్థ ఏర్పాటు చేసుకుంది. గతేడాది జూన్ నాటికి ఇది 25 శాతమే. ఏడాదిలో చైనా వెలుపల 5 శాతం తయారీని పెంచుకున్న ఈ సంస్థ.. భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకునే ప్రణాళికలతో ఉంది. చైనాలో తయారై అమెరికాలోకి ప్రవేశించే ఉత్పత్తులపై పెరిగే టారిఫ్‌ల భారం పడకుండా ఉండేందుకు గాను ఫాక్స్ కాన్ సంస్థ భారత్, ఆగ్నేయాసియా, ఇతర ప్రాంతాలకు తయారీని తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్టు కంపెనీ ఫలితాల ప్రకటన సందర్బంగా యంగ్ లీ స్వయంగా మీడియాకు వెల్లడించారు. ‘‘భారత్ లేదా ఆగ్నేయాసియా లేదా అమెరికా.. ఏదైనా సరే ఆయా ప్రాంతాల్లో తయారీ ఎకోసిస్టమ్ ఉంది’’ అని లీ పేర్కొన్నారు. అయితే, ఫాక్స్ కాన్ తయారీలో చైనా ఇక ముందూ కీలకపాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కాకపోతే ప్రపంచానికి తయారీ కేంద్రంగా చైనా దశకం ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు. భారత్ లో ఫాక్స్ కాన్ విస్తరణ అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడంతో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థలు తమ తయారీ కేంద్రాలను చైనా బయట కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాయి. అవసరమైతే యాపిల్ ఉత్పత్తులను పూర్తిగా చైనా బయట తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని యంగ్ లీ గతేడాదే ఓ సందర్భంలో చెప్పడం గమనార్హం. దీర్ఘకాలంలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలు ఏర్పాటు కావడం తథ్యమని లీ మాటలతో స్పష్టమవుతోంది. ఫాక్స్‌కాన్ కు మన దేశంలోనూ తయారీ కేంద్రాలున్నాయి. మరిన్ని పెట్టుబడులతో సామర్థ్య విస్తరణ చేయనున్నట్టు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించింది కూడా. భారత్ లో తయారీకి అమెరికాకు చెందిన యాపిల్ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో యాపిల్ తయారీ భాగస్వామిగా ఫాక్స్‌కాన్ సంస్థ భారత మార్కెట్ పట్ల విస్తరణ ప్రణాళికలతో ఉంది. అమెరికాకు సరఫరా చేసే ఉత్పత్తుల తయారీకి భారత్ ను ప్రధానంగా ఫాక్స్‌కాన్ పరిశీలిస్తుండడం గమనార్హం. యాపిల్ ఐపాడ్, మ్యాక్ ఉత్పత్తులకు డిమాండ్ కారణంగా ఫాక్స్ కాన్ జూన్ క్వార్టర్ లో 5,835 కోట్ల భారీ లాభాన్ని ప్రకటించడం గమనార్హం. ఈ సంస్థ తైవాన్ కు చెందినది. టెన్సెంట్ హోల్డింగ్స్‌కు చెందిన వీచాట్ వినియోగాన్ని అమెరికా పౌరులు వినియోగించకుండా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. పోటీతత్వంతో స్వావలంబన భారత్ భారత్ తన అవసరాలను దేశీయంగా తీర్చుకునేందుకు (ఆత్మ నిర్భర్) దేశీయ పరిశ్రమ కచ్చితంగా మరింత పోటీనిచ్చే విధంగా మారాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు రక్షణాత్మక విధానాలను అవలంబిస్తున్నతరుణంలో.. భారత్ కూడా తన అవసరాలకు తనపైనే ఆధారపడాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛాయుత మార్కెట్ కలిగిన అమెరికా సైతం రక్షణాత్మక విధానాలను అనుసరిస్తున్న విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. కనుక రానున్న రోజుల్లో ఆత్మనిర్భర్ కు మరే ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ‘‘మన పరిశ్రమలను మరింత పోటీయుతంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోటీతత్వం మన పరిశ్రమల సమర్థతను పెంచుతుంది. ఆ పోటీయే మనకు మేలు చేస్తుందని నేను నమ్ముతున్నాను’’ అంటూ పీహెచ్ డీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహంచిన కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. ఉద్యోగ కల్పనకు కేంద్రం ఎన్నో విధాానాలను అమలు చేసినట్టు ప్రభు చెప్పారు. చైనా ఉత్పత్తులకు తగ్గిన ఆదరణ! న్యూఢిల్లీ: చైనా తయారీ ఉత్పత్తుల పట్ల భారతీయుల్లో ఆసక్తి తగ్గుతోందని సోషల్ మీడియా వేదిక లోకల్‌సర్కిల్స్ తన సర్వేలో వెల్లడించింది. నవంబరు 10–15 మధ్య దేశవ్యాప్తంగా 204 జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు. దీని ప్రకారం సర్వేలో పాలుపంచుకున్న వారిలో పండుగల సీజన్లో కేవలం 29 శాతం మంది మాత్రమే చైనా ఉత్పత్తులను కొనుగోలు చేశారు. గతేడాది ఈ సంఖ్య 48 శాతం ఉంది. 2019లో చేపట్టిన సర్వేలో 14,000 మందికిపైగా పాల్గొన్నారు. 2019తో పోలిస్తే ప్రస్తుత సీజన్లో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారి సంఖ్య 40 శాతం తగ్గిందని లోకల్‌సర్కిల్స్ ఫౌండర్ సచిన్ తపారియా తెలిపారు. ఈ ఏడాది చైనా ఉత్పత్తులు కొన్నవారిలో 71 శాతం మంది తాము స్పృహతో కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. డబ్బుకు తగ్గ విలువ కాబట్టే ఆసక్తి చూపామని 66% మంది తెలిపారు. దాడి తర్వాత పెరిగిన వ్యతిరేకత.. జూన్‌లో గాల్వన్ వ్యాలీలో చైనా సైనికుల దాడిలో భారత జవాన్లు వీర మరణం పొందిన సంఘటన తర్వాత చైనా ప్రొడక్ట్స్ పట్ల భారతీయుల్లో వ్యతిరేకత అధికమైంది. వచ్చే ఏడాది కాలంలో చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తామని 87 శాతం మంది వెల్లడించారు. దేశీయంగా తయారైన ప్రొడక్ట్స్ ఖరీదు ఉన్నప్పటికీ నాణ్యత మెరుగ్గా ఉంటుందని అత్యధికులు ఈ విషయాన్ని వ్యక్తపరిచారు. పండుగల సమయంలో లైట్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ఒకసారి మాత్రమే వినియోగించేవి కావడంతో నాణ్యత ప్రధాన అంశం కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు. -
ఆ కల తీరుతుందా?
ప్రపంచ దేశాలపై అమెరికా పట్టు నిలుపుకోవాలంటే భారత్‌తో స్నేహసంబంధాలు కొనసాగించడం అగ్రరాజ్యానికి అత్యంత అవసరం. రక్షణ రంగంలో ఒబామా అనుసరించే విధానాలే బైడెన్ కొనసాగించనున్నారు. ఉగ్రవాదం పాక్ భూభాగంపై ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి ఆయన ఏ మాత్రం అంగీకరిం చరు. ఉగ్రవాదం అంశంలో పాక్‌పై ఒత్తిడి గట్టిగానే కొనసాగిస్తారన్న ఆశాభావంతో భారత్ ఉంది. చైనాతో వైఖరి వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య సంబంధాలు భారత్‌కి కీలకం. ట్రంప్ భారత్‌కే మద్దత పలుకుతూ చైనాపై కస్సుబుస్సులాడుతూనే ఉన్నారు. కానీ బైడెన్ నుంచి ఆ స్థాయి మద్దతు లభించదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో ఒక దేశం నుంచి మరొక దేశానికి ముప్పు ఉండకూడదన్న వైఖరినే ఆయన పాటించే అవకాశాలున్నాయి. మానవ హక్కులు మానవ హక్కుల ఉల్లంఘన అంశంలో భారత్ పట్ల కొత్త అధ్యక్షుడి వైఖరి ఎలా ఉంటుందో ఇప్పట్నుంచి అంచనా వెయ్యలేని పరిస్థితైతే ఉంది. మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తోందంటూ పాకిస్తాన్‌పై బైడెన్ గుర్రుగానే ఉన్నారు. మరోవైపు కశ్మీర్లో 360 ఆర్టికల్ రద్దుని ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమల మొదట్నుంచి వ్యతిరేకిస్తున్నారు. వీసా విధానం హెచ్–1బీ వీసా విధానం, ఉద్యోగాల కల్పన అంశంలో బైడెన్ విధానాలు భారత్‌కు సానుకూలంగా మారే అవకాశాలున్నాయి. అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ హెచ్–1బీ వీసాలపై కఠిన ఆంక్షలు విధించారు. అయితే బైడెన్ వాటిని సరళతరం చేస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు. అంతేకాదు చట్టవిరుద్ధంగా ఉండే వలసదారులకి అమెరికా పౌరసత్వం కల్పిస్తానని ఎన్నికల హామీ కూడా ఉంది. అదే జరిగితే 5 లక్షల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది కమలా హ్యారిస్ పాత్ర వివిధ అంశాలపై కమలకు స్పష్టమైన అభిప్రా యాలున్నాయి. అవన్నీ భారత్‌తో సంబంధాల్లో ప్రభావాన్ని చూపిస్తాయి. మరోసారి పోటీ చేయబోనని బైడెన్ చెప్పడంతో అధ్యక్షురాలయ్యే వ్యూహంతో కమలా అడుగులు వేస్తారు. ఆమె మూలాలు భారత్‌తో ముడిపడి ఉండడంతో మన దేశానికి కలిసొచ్చే అంశంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘2020 నాటికి అమెరికా, భారత్ ప్రపంచంలోనే అత్యంత సన్నిహిత దేశాలుగా అవతరించాలి. అప్పుడే ప్రపంచం హాయిగా ఉంటుంది. ఇదే నా కల — 2006లో ఓ ఇంటర్వ్యూలో బైడెన్ -
మార్కెట్‌కు ఒడిదుడుకుల వారం!
ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, దేశీ కంపెనీల క్యూ4 ఫలితాలు, కోవిడ్–19 పాజిటివ్ కేసుల ప్రకటనల వంటి కీలక అంశాలు ఈ వారంలో స్టాక్ మార్కెట్ దిశను నిర్దేశించనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. వైరస్ వ్యాప్తి విషయంలో అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదిరితే మాత్రం భారీ పతనం తప్పదని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్, ఈక్విటీ రీసెర్చ్ హెడ్ షిబాని సిర్కార్ కురియన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రతికూల వార్తలు వెలువడినా మార్కెట్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఇప్పటికే ఓవర్‌సోల్డ్ అధికంగా ఉన్న కారణంగా రిబౌండ్కు అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వీపీ అజిత్ మిశ్రా విశ్లేషించారు. అయితే, ఇది అధికస్థాయిలో నిలవలేకపోవచ్చని, ఒడిదుడుకులకు ఈవారంలో ఆస్కారం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. రంజాన్ పర్వదినం నేపథ్యంలో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే జరగనుంది. కాగా గురువారం (28న) మే నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) సిరీస్ ముగియనుంది. మరోవైపు.. హెచ్డీఎఫ్సీ, సన్‌ఫార్మా, లుపిన్, డాబర్, టీవీఎస్ మోటార్, యునైటెడ్ స్పిరిట్స్, వోల్టాస్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్, మాక్స్ ఫైనాన్షియల్, టోరెంట్ ఫార్మా, వీఐపీ ఇండస్ట్రీస్, కేపీఐటీ టెక్నాలజీస్, ఈక్విటాస్ హోల్డింగ్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, ఉషా మార్టిన్ కంపెనీలు తమ ఫలితాలను ఈవారంలోనే ప్రకటించనున్నాయి. రూ. 9,089 కోట్ల పెట్టుబడి భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మే 1–22 మధ్య కాలంలో రూ. 9,089 కోట్లను పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడైంది. ఏప్రిల్‌లో రూ. 6,883 కోట్లు, మార్చిలో రూ. 61,973 కోట్లను వెనక్కు తీసుకున్న విషయం తెలిసిందే. నేడు మార్కెట్ సెలవు రంజాన్ పర్వదినం సందర్భంగా సోమవారం (మే25న) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సెలవు. మంగళవారం (26న) మార్కెట్ యథావిధిగా పని చేస్తుంది. -
అమెరికా ఎక్స్ఛేంజీల నుంచి డ్రాగన్ అవుట్ !
వాషింగ్టన్: అమెరికా, చైనాల మధ్య వైరం రోజురోజుకు మరింతగా ముదురుతోంది. వాణిజ్య యుద్ధంగా మొదలైనది కాస్తా ఆ తర్వాత టెక్నాలజీ పోరుకు దారితీసింది. 5జీ టెలికం పరికరాల చైనా దిగ్గజం హువావేపై అమెరికా అనేక ఆంక్షలు విధించి దానితో తమ దేశ సంస్థలేవీ వ్యాపార లావాదేవీలు జరపకుండా దాదాపు అడ్డుకట్ట వేసేసింది. ఇక, కరోనా వైరస్ వివరాలను తొక్కిపెట్టి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిని వ్యాప్తి చేసిందంటూ చైనాపై మండిపడుతున్న అమెరికా ప్రస్తుతం మరో కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. తమ దేశ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయిన చైనా కంపెనీలను డీలిస్ట్ చేయడం ద్వారా బిలియన్ల కొద్దీ అమెరికన్ డాలర్లు పెట్టుబడులుగా పొందుతున్న చైనీస్ సంస్థలను, పరోక్షంగా చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా సెనేట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. ‘నేను కొత్తగా మరో ప్రచ్ఛన్న యుద్ధం కోరుకోవడం లేదు. నేను..నాతో పాటు మిగతా అందరూ కూడా నిబంధనల ప్రకారం చైనా నడుచుకోవాలనే కోరుకుంటున్నారు‘ అని బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా దీన్ని ప్రవేశపెట్టిన సెనేటర్లలో ఒకరైన జాన్ కెనెడీ వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో ఆలీబాబా, బైదు తదితర దిగ్గజ చైనా కంపెనీలకు డీలిస్టింగ్ గండం ఏర్పడింది. బిల్లు ఏం చెబుతోంది .. హోల్డింగ్ ఫారిన్ కంపెనీస్ అకౌంటబుల్ యాక్ట్ పేరిట ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రకారం అమెరికా సెక్యూరిటీస్ చట్టాలను పాటించడంలో విఫలమైనందుకు గాను నాస్డాక్, ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల నుంచి చైనా కంపెనీలను డీలిస్ట్ చేయొచ్చు. గతేడాది మార్చిలోనే సెనేటర్లు జాన్ కెనెడీ, క్రిస్ వాన్ హోలెన్ దీన్ని సెనేట్‌లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం లిస్టెడ్ విదేశీ కంపెనీలు తమపై తమ దేశ ప్రభుత్వ నియంత్రణేమీ లేదంటూ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు అమెరికాలో పబ్లిక్ కంపెనీల ఖాతాలను సమీక్షించే బోర్డు పీసీఏవోబీ తమ ఖాతాలను కూడా తనిఖీ చేసేందుకు అంగీకరించాలి. వరుసగా మూడేళ్ల పాటు నిరాకరించిన పక్షంలో నిషేధం, డీలిస్టింగ్ తప్పదు. ఇది ప్రధానంగా విదేశీ కంపెనీలన్నింటికీ వర్తించేదే. అయితే, చైనా కంపెనీల ఆడిటింగ్ విషయంలోనే సహకారం దొరకడం లేదంటూ పీసీవోఏబీ చెబుతోంది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలపైనే అమెరికా ఎక్కువ కఠినంగా చర్యలు అమలు చేయనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సేల్స్ అకౌంటింగ్ మోసాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటు న్న చైనా సంస్థ ‘లకిన్ కాఫీ’ ను డీలిస్ట్ చేస్తున్నట్లు నాస్డాక్ ప్రకటించడం దీనికి మరింత ఊతమిస్తోంది. చైనా ముందస్తు వ్యూహాలు.. అమెరికా తమ కంపెనీలపై గురిపెట్టే ప్రమాదాన్ని ముందుగానే ఊహించినా చైనా కూడా తదుపరి వ్యూహాలతో సిద్ధంగా ఉంది. హాంకాంగ్‌లో నిరసనలను అణగదొక్కే విషయంలో తమకు మద్దతుగా నిల్చిన బ్రిటన్ వైపు చూస్తోంది. ఒకవేళ అమెరికన్ ఎక్సే్చంజీల నుంచి డీలిస్ట్ అయిపోతే ప్రత్యామ్నాయంగా లండన్ ఎక్సే్చంజీలో కంపెనీలను లిస్ట్ చేసే ప్రయత్నాల్లో ఉంది. లండన్‌లో లిస్ట్ కాదల్చుకున్న కంపెనీల దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియను పునఃప్రారంభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్వదేశీ కంపెనీలకూ ట్రంప్ వార్నింగ్.. చైనాతో వాణిజ్య యుద్ధం మొదలైనప్పట్నుంచీ అమెరికన్ కంపెనీలను అక్కణ్నుంచి వచ్చేయాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. దీంతో టెక్ దిగ్గజం యాపిల్ సహా పలు కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ తదితర దేశాలకు తయారీ కార్యకలాపాలు మళ్లించడంపై కసరత్తు చేస్తున్నాయి. అయితే, ఆయా కంపెనీలను అమెరికాకే రప్పించే ప్రయత్నాల్లో ట్రంప్ ఉన్నారు. చైనా నుంచి తయారీ కేంద్రాలను స్వదేశానికే తరలించాలని.. అలా కాకుండా భారత్, ఐర్లాండ్ వంటి ఇతర దేశాలకు వెడితే వాటిపై పన్నుల మోత మోగిస్తామని ఈమధ్యే మరోమారు హెచ్చరించారు. అంతే కాకుండా.. చైనా కంపెనీల్లో తమ సంస్థలు ఇన్వెస్ట్ చేయకుండా కూడా అమెరికా చర్యలు తీసుకుంటోంది. అమెరికాలో లిస్టయిన చైనా కంపెనీల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం శ్రేయస్కరం అంటూ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌రాక్‌కు నేషనల్ లీగల్ అండ్ పాలసీ సెంటర్ సూచించింది. పర్యావరణ కార్యకర్తల ఆందోళనల కారణంగా బ్లాక్‌రాక్ ఇప్పటికే కొన్ని బొగ్గు కంపెనీల నుంచి తప్పుకుంది. ప్రభుత్వ పెన్షన్ ఫండ్‌ను నిర్వహించే థ్రిఫ్ట్ సేవింగ్స్ ప్లాన్ సంస్థ .. ఇన్వెస్ట్ చేసే విదేశీ స్టాక్స్ జాబితా నుంచి చైనా కంపెనీలను తప్పించడంలోనూ ట్రంప్ ప్రస్తుతానికి సఫలమయ్యారు. ఇది దాదాపు 500 బిలియన్ డాలర్ల నిధిని నిర్వహిస్తోంది. తమ ఇన్వెస్టర్లకు కొత్తగా అంతర్జాతీయ స్టాక్స్‌లో కూడా అవకాశం కల్పించే ఉద్దేశంతో 50 బిలియన్ డాలర్ల ఇంటర్నేషనల్ ఫండ్ పథకం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన విదేశీ స్టాక్స్ జాబితాలో చైనా కంపెనీలు లేకుండా చూసేలా ట్రంప్ ఒత్తిడి తెచ్చారని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దాదాపు 170 చైనా కంపెనీలు.. అమెరికాలోని నాస్డాక్, ఎన్వైఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల్లో దాదాపు 170 చైనా కంపెనీలు లిస్టయి ఉన్నాయి. చైనా ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తూ అమెరికాలో లిస్టయిన భారీ కంపెనీలు పదికి పైగా ఉన్నాయి. పెట్రోచైనా, చైనా లైఫ్, చైనా టెలికం, చైనా ఈస్టర్న్, చైనా సదరన్, హువానెంగ్ పవర్, అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ చైనా, చైనా పెట్రోలియం ఈ జాబితాలో ఉన్నాయి. ఇక టెక్ దిగ్గజాల్లో బైదు, ఆలీబాబా, పిన్‌డువోడువో, జేడీడాట్‌కామ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. వీటిలో ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్, బైదు, జేడీడాట్‌కామ్ సంస్థల సంయుక్త మార్కెట్ విలువ 500 బిలియన్ డాలర్ల పైగానే ఉంటుంది. -
సెన్సెక్స్ 199 పాయింట్లు అప్
ఆరంభ లాభాలు ఆవిరైనా, శుక్రవారం స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో విదేశీ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టటంతో ఆ షేర్ 3 శాతం మేర లాభపడటం, మరో దిగ్గజ కంపెనీ హెచ్‌యూఎల్ 5 శాతం పెరగడం కలసివచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం, అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తొలి దశ చర్చలు చోటు చేసుకోవడంతో ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం, వివిధ దేశాలు దశలవారీగా లాక్‌డౌన్‌ను తొలగిస్తుండటం....సానుకూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 646 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ చివరకు 199 పాయింట్ల లాభంతో 31,643 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 9,252 పాయింట్ల వద్దకు చేరింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2,075 పాయింట్లు, నిఫ్టీ 608 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఈ సూచీలు చెరో 6 శాతం మేర పతనమయ్యాయి. రోజంతా లాభాలు..... ఆసియా మార్కెట్ల దన్నుతో మన మార్కెట్ భారీ లాభాల్లో ఆరంభమయ్యాయి. రోజంతా లాభాలు కొనసాగాయి. అయితే చివర్లో లోహ, ఆర్థిక రంగ, వాహన షేర్లలో అమ్మకాలు ఒత్తిడి కనిపించింది. దీంతో ఆరంభ లాభాలు తగ్గాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు 1–2% లాభాల్లో ముగిశాయి. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 4 శాతం లాభంతో రూ.1,562 వద్ద ముగిసింది. ఈ కంపెనీకి చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ 2.3 శాతం వాటాను రూ.11,367 కోట్లతో కొనుగోలు చేసింది. దీంతో ఈ షేర్ జోరుగా పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ,.9,90,088 కోట్లకు పెరిగింది. ఈ షేర్ మరో రూ.15 మేర పెరిగితే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లకు ఎగబాకుతుంది. ► హిందుస్తాన్ యూనిలివర్(హెచ్‌యూఎల్) షేర్ 5 శాతం లాభంతో రూ.2,088 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సొసైటీ జనరల్ సంస్థ 1.3 కోట్ల షేర్లను రూ.1,902 ధరకు కొనుగోలు చేయడంతో ఈ షేర్ ఈ స్థాయిలో పెరిగింది. ► దాదాపు 200కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ కన్సూమర్, సుజ్లాన్ ఎనర్జీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 90 కంపెనీల షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, డీబీ కార్ప్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా పవర్ తదితర షేర్లు ఈ పడిపోయిన జాబితాలో ఉన్నాయి. -
మార్కెట్ ర్యాలీయా.. దిద్దుబాటా?
దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలోనూ ర్యాలీని కొనసాగిస్తుందా..లేక మరో భారీ పతనాన్ని నమోదుచేస్తుందా..? అనే సందిగ్ధంలో పడే స్తోంది. దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడం అనేది మార్కెట్‌కు సానుకూలాంశమేమి కాదని, మార్కెట్ గ్యాప్డౌన్తోప్రారంభం కావచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. కంపెనీల ఫలితాలు, కోవిడ్–19 వ్యాక్సిన్, ముడి చమురు ధరలే కీలకంగా ఉండనున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ విశ్లేషించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌వార్ ముదిరితే భారీ పతనం ఉంటుందని అన్నారు. స్వల్పకాలంలోనే దిగువస్థాయి నుంచి ర్యాలీ చేసిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో లాభాల స్వీకరణ అవకాశం ఉండనుండగా.. ఈవారంలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోడీ అన్నారు. గణాంకాల ప్రభావం: ఏప్రిల్ నెల మార్కిట్ తయారీ పీఎంఐ సోమవారం విడుదలకానుండగా.. సేవారంగ పీఎంఐ బుధవారం వెల్లడికానుంది. అమెరికా మార్కిట్ కాంపోజిట్ పీఎంఐ, సేవారంగ పీఎంఐ మంగళవారం విడుదలకానుంది. నిరుద్యోగ జాబితా శుక్రవారం రానుంది. 24 కంపెనీల ఫలితాలు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మారికో, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, యస్ బ్యాంక్, నెరోలాక్ పెయింట్స్ ఫలితాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. ఇక గతవారం మార్కెట్ ముగిసిన తర్వాత రిలయన్స్ ఫలితాలు వెల్లడికాగా, సంస్థ క్యూ4 నికర లాభం 39 శాతం తగ్గింది. ఈ ప్రభావం సోమవారం మార్కెట్ ప్రారంభంపై స్పష్టంగా ఉండనుందని రెలిగేర్ బ్రోకింగ్ పరిశోధన విభాగం వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు. ఇక చరిత్రలోనే తొలిసారిగా ఆటోమొబైల్ పరిశ్రమ ఏప్రిల్ అమ్మకాలను సున్నాగా ప్రకటించింది. -
ట్రేడ్‌వార్‌లో చైనానే విలన్!
హైదరాబాద్, సాక్షి బిజినెస్: చైనాతో అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే ఛాన్సు లేదని బెల్జియం రాజకీయ ప్రతినిధి, యూరోపియన్ యూనియన్ మాజీ ట్రేడ్ కమిషనర్ కారల్ డీ గష్ అభిప్రాయపడ్డారు. అదిగో డీల్ కుదరుతోంది, ఇదిగో కుదురుతోందంటూ వచ్చే వార్తలతో స్టాక్ మార్కెట్లు పరుగులు తీయడమే కానీ, నిజానికి ఎలాంటి డీల్ కుదరకపోవచ్చన్నారు. ట్రేడ్‌వార్ అనేది ఒక వ్యవస్థీకృత సమస్యని, ఇందుకు చైనానే ప్రధాన కారణమని, కానీ చైనాను దారికి తెచ్చేందుకు అమెరికా అనుసరిస్తున్న బలవంతపు విధానం సత్ఫలితాలు ఇవ్వదని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో పదేళ్లు ట్రేడ్‌వార్ కొనసాగినా ఆశ్చర్యం లేదన్నారు. బెల్జియం, ఇండియా మధ్య ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో వాణిజ్య సహకారం కోసం బెల్జియం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఇక్కడ ట్రేడ్‌వార్‌తో పాటు పలు అంశాలపై మాట్లాడారు. ‘బ్రెగ్జిట్ కారణంగా ఈయూలో బెల్జియం, నెదర్లాండ్స్‌పై అత్యధిక ప్రతికూల ప్రభావం ఉంటుంది. ట్రేడ్‌వార్, బ్రెగ్జిట్ నేపథ్యంలో ఇండియా, యూరోపియన్ యూని యన్ మధ్య సరికొత్త వాణిజ్య అవకాశాలకు అపార అవకాశముంది. అయితే భారత్ నుంచి ఈ దిశగా సరైన చర్యల్లేవు’ అని కారల్ డీ గష్ తెలిపారు. -
కొత్త శిఖరాలకు సూచీలు
స్టాక్ మార్కెట్లో రికార్డ్ల పరంపర కొనసాగుతోంది. మంగళవారం ఇంట్రాడేలో కొత్త రికార్డ్లను సృష్టించిన సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం ముగింపులో కొత్త శిఖరాలకు చేరాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం సానుకూల ప్రభావం చూపించింది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటం, నవంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రోజులో ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం కలసివచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 199 పాయింట్లు పెరిగి 41,021 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 63 పాయింట్లు ఎగసి 12,101 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలకు ఇవి జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపులు. వీటితో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా 31,876 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలో ముగిసింది. బ్యాంక్, ఆయిల్, గ్యాస్, వాహన, ప్రభుత్వ రంగ షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, టెలికం, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభాల స్వీకరణ కారణంగా నష్టపోయాయి. వాహన షేర్లకు ‘స్క్రాప్ పాలసీ’ లాభాలు ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించగలదన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు పెరిగాయి. వాహన తుక్కు విధానాన్ని (స్క్రాపేజ్ పాలసీ) ప్రభుత్వం తీసుకు రానున్నదన్న వార్తల కారణంగా వాహన, వాహన విడిభాగాల షేర్లు పెరిగాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఫోర్జ్, అశోక్ లేలాండ్, మారుతీ సుజుకీ, ఐషర్ మోటార్స్, హీరో మోటొకార్ప్, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటోలు 1–3 శాతం రేంజ్లో పెరిగాయి. లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్, నిఫ్టీలు రోజంతా ఇదే జోరు చూపించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో 41,076 పాయింట్లకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 77 పాయింట్లు ఎగసి 12,115 పాయింట్లకు చేరాయి. షాంఘై సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ హైల వద్ద ముగిసినప్పటికీ, వందకు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అలహాబాద్ బ్యాంక్, చెన్నై పెట్రో, జైన్ ఇరిగేషన్, ఎంఫసిస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పలు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరాయి. దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్సర్వ్, అదానీ గ్రీన్, పీఐ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► యస్ బ్యాంక్ 8 శాతం లాభంతో రూ. 68 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. నిధుల సమీకరణ నిమిత్తం ఈ నెల 29న బోర్డ్ సమావేశం జరగనున్నదన్న వార్తలు దీనికి కారణం. ► ఎస్బీఐకు చెందిన క్రెడిట్ కార్డ్‌ల విభాగం, ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించిన నేపథ్యంలో ఎస్బీఐ షేర్ 2.4 శాతం లాభంతో రూ.344 వద్ద ముగిసింది.ఈ బ్యాంక్ మార్కెట్ క్యాప్ మళ్లీ రూ.3 లక్షల కోట్లకు ఎగబాకింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడ్డ రెండో షేర్ ఇదే. ► ఎల్ అండ్ టీ షేర్ 2 శాతం నష్టంతో రూ.1,335 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. రూ.8 పెరిగితే.. పది లక్షల కోట్లకు! రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 0.7 శాతం లాభంతో రూ.1,570 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.9.96 లక్షల కోట్లకు పెరిగింది. ఈ షేర్ రూ.8 పెరిగితే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుంది. భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇదే. -
విదేశీ పెట్టుబడులకు గాలం
అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకోవడంపై భారత్ దృష్టి సారిస్తోంది. బహుళజాతి సంస్థ(ఎంఎన్సీ)లను రప్పించేందుకు తీసుకోతగిన చర్యలపై కసరత్తు చేస్తోంది. టెస్లా, గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ వంటి 324 కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలు పరిశీలిస్తోంది. ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే సంస్థలకు స్థలం ఇవ్వడంతో పాటు విద్యుత్, నీరు, రోడ్డు మార్గం వంటి సదుపాయాలు కూడా కల్పించడం తదితర అంశాలు వీటిలో ఉన్నాయి. పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ఈ మేరకు ఒక ముసాయిదా రూపొందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికన్ దిగ్గజం ఎలీ లిలీ అండ్ కో, దక్షిణ కొరియాకు చెందిన హన్వా కెమికల్ కార్పొరేషన్, తైవాన్ సంస్థ హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ తదితర దిగ్గజ కంపెనీలతో కేంద్రంలోని ఉన్నతాధికారులు సంప్రదింపులు జరపనున్నట్లు వివరించాయి. భూ, కార్మిక చట్టాలతోనే సవాలు... వాణిజ్య యుద్ధాల నేపథ్యంలో పలు పెద్ద కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి. వియత్నాం, మలేషియా వంటి దేశాలను ఎంచుకుంటున్నాయి. కఠినమైన భూసేకరణ నిబంధనలు, కార్మిక చట్టాలున్న కారణంగా భారత్‌ను పక్కన పెడుతున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు.. తామే స్థలాన్ని సేకరించుకోవాల్సి ఉంటోంది. అయితే, వివిధ కారణాల రీత్యా దీనికి చాలా సమయం పట్టేస్తుండటంతో అసలు ప్రాజెక్టును ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. ఇలాంటి ప్రతికూలాంశాలను గుర్తించిన కేంద్రం.. విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు తీసుకోతగిన చర్యలపై దృష్టి పెడుతోంది. ప్రతిపాదనలు ఇవీ... ముసాయిదా ప్రతిపాదనల ప్రకారం తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనువైన పారిశ్రామిక క్లస్టర్స్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తుంది. అలాగే పెట్టుబడులు, ఎంచుకున్న ప్రాంతం ప్రాతిపదికగా ప్రోత్సాహకాలు ఇస్తుంది. యాంటీ–డంపింగ్ సుంకాలను క్రమబద్ధీకరిస్తుంది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు, ఇంధనాన్ని ఆదా చేసే వాహనాల తయారీకి ప్రోత్సాహకాలు ఉంటాయి. అటు ఎలక్ట్రానిక్స్, టెలికం రంగాలకు సంబంధించి ఉద్యోగాలపరమైన వెసులుబాట్లు, పెట్టుబడుల ప్రాతిపదికన తయారీ సంబంధ ప్రోత్సాహకాలు మొదలైనవి పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలన్నింటినీ ప్రధాని కార్యాలయం పరిశీలిస్తోందని, త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా... 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భారత్ నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వృద్ధికి దోహదపడే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా.. ఎగుమతులను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కార్పొరేట్ ట్యాక్స్ రేటు తగ్గించడం, విదేశీ పెట్టుబడుల నిబంధనలు సడలించడం తదితర సంస్కరణలు ప్రవేశపెట్టింది. వీటి ఊతంతో వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో ర్యాంకింగ్స్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుంటోంది. ప్రపంచ బ్యాంక్ రూపొందించే ఈ లిస్టులో 2017 నుంచి ఏకంగా 37 ర్యాంకులు పైకి ఎగబాకింది. అయినప్పటికీ రువాండా, కొసొవో వంటి దేశాల కన్నా ఇంకా దిగువనే 63వ ర్యాంకులో ఉంది. దీంతో మరిన్ని సంస్కరణలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. -
అంతర్జాతీయ పరిణామాలు కీలకం!
న్యూఢిల్లీ: అమెరికా–చైనా వాణిజ్య సంబంధాలు, ఫెడ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు వంటి పలు కీలక అంతర్జాతీయ అంశాలకు తోడు డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మార్కెట్ ముందుగానే డిస్కౌంట్ చేసింది. నవంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి దిగి వచ్చింది. 2.33 శాతంగా నమోదైంది. మరోవైపు పారిశ్రామిక వృద్ధి రేటు అక్టోబర్‌లో 8.1 శాతం పెరిగి ఏడాది గరిష్టస్థాయికి చేరుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ వైఖరి మారడం అనేది మార్కెట్ వర్గాల్లో ఆశావాదాన్ని నింపింది.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ అన్నారు. దేశీ అంశాలు పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ అంశాలు ఏమేరకు ప్రభావం చూపుతాయనే అంశం ఆధారంగానే మార్కెట్ కదలికలు ఉండనున్నాయని పలువురు మార్కెట్ పండితులు విశ్లేషించారు. ఫెడ్ రేట్లు 25 బేసిస్ పాయింట్ల మేర పెరిగే అవకాశం.. ఈవారం మంగళ, బుధవారాల్లో (18–19) అమెరికన్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం జరగనుండగా.. ఫెడ్ ప్రామాణిక వడ్డీ రేట్లు 25 శాతం పెరిగేందుకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఫెడ్ వైఖరి ఎలా ఉండనుందనే అంశం కూడా ఇదే సమావేశం ద్వారా వెల్లడయ్యే సూచనలు ఉండడంతో దలాల్ స్ట్రీట్ వర్గాలు ప్రధానంగా దృష్టిసారించాయి. మంగళవారం యూఎస్ వాణిజ్య విభాగం భవన అనుమతులు, నవంబర్ గృహ నిర్మాణాలకు సంబంధించి నివేదికను ఇవ్వనుంది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పాలసీ ప్రకటన, బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ సమావేశం కూడా ఇదే వారంలో ఉన్నాయి. క్రూడ్ ధరల ప్రభావం.. చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన నేపథ్యంలో ఆ దేశం నుంచి డిమాండ్ తగ్గుతుందనే అంచనాల కారణంగా గతవారంలో ముడిచమురు ధరలు దిద్దుబాటుకు గురైయ్యాయి. ఇదే సమయంలో ఒపెక్ ఉత్పత్తిపై నెలకొన్న పలు అనుమానాలతో గతవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 2.25 శాతం తగ్గి 60.28 డాలర్లకు చేరుకుంది. ‘రష్యా ఉత్పత్తిని తగ్గించనుందనే ప్రకటన, అమెరికా ఎగుమతుల్లో సౌదీ అరేబియా కోత వంటి అంశాల ఆధారంగా చమురు ధరలు రేంజ్ బౌండ్లోనే ఉండేందుకు అవకాశం ఉంది.’ అని ఆనంద్ రాఠీ కమోడిటీస్ విభాగం రీసెర్చ్ హెడ్ రవీంద్ర వీ రావ్ విశ్లేషించారు. ధరలు ఏమాత్రం పడిపోయినా దేశీ మార్కెట్లకు సానుకూలంగా మారునుందన్నారు. 71.30–72.50 శ్రేణిలో రూపాయి.. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయడం, ఎన్నికల ఫలితాలు, డాలర్ బలపడడం వంటి కారణాలతో గతవారం డాలరుతో రూపాయి మారకం విలువ 109 పైసలు (1.54 శాతం) క్షీణించి 71.89 వద్దకు పడిపోయింది. ఫెడ్ సమావేశాన్ని పరిగణలోనికి తీసుకుని రూపాయి కదలికల శ్రేణి 71.30–72.50 మధ్య ఉండవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ డెరివేటివ్స్ హెడ్ అమిత్ గుప్తా అంచనావేశారు. 10,880–10,929 వద్ద నిరోధం.. నిఫ్టీ 10,700 స్థాయి వద్ద నిలవ గలిగితే అక్కడ నుంచి 10,880–10,929 స్థాయి వరకు వెళ్లేందుకు అవకాశం ఉందని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ చందన్ తపరియా విశ్లేషించారు. ఈ సూచీ కీలక మద్దతు స్థాయి 10,650 వద్ద ఉండగా.. ఈస్థాయిని కోల్పోతే 10,600 తరువాత మద్దతుగా ఉంటుందన్నారు. అమెరికా–చైనా మధ్య సంధిపై ఆశావహంగా ఇన్వెస్టర్లు వాణిజ్య యుద్ధభయాలతో ప్రపంచ మార్కెట్లను బెంబేలెత్తించిన అమెరికా–చైనాల మధ్య చర్చలు ఫలించవచ్చని ఇన్వెస్టర్లలో ఆశాభావం పెరుగుతోంది. వివాదాల పరిష్కారానికి రెండు దేశాల మధ్య కుదిరిన 90 రోజుల సయోధ్య ఒప్పందంపై చర్చలు పురోగమిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. చైనా టెలికం దిగ్గజం హువావే సీఎఫ్‌వో మింగ్ కెనడాలో అరెస్టయినప్పటికీ .. రెండు పక్షాల నుంచి పరస్పరం రెచ్చగొట్టుకునే ప్రకటనలేమీ లేకపోవడం ఇందుకు నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్, చైనా ప్రభుత్వం.. ఈ రెండు అంశా లను (టారిఫ్‌లు, మింగ్ అరెస్టు) వేర్వేరుగానే చూస్తున్నట్లుగా స్పష్టమవుతోందని వాణిజ్యవేత్త ఎడ్వర్డ్ అల్డెన్ తెలిపారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు రెట్టింపు చేసే ప్రతిపాదనలను ట్రంప్ మార్చి 1 దాకా వాయిదా వేయడం, ప్రతిగా అమెరికాతో వాణిజ్య లోటును భర్తీ చేసుకునేలా చైనా మరిన్ని అమెరికన్ ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు అంగీకరించడం తెలిసిందే. -
ట్రంప్ తో భేటీకానున్న అగ్రనేత
బీజింగ్: రెండు అగ్రదేశాల అధినేతలు వచ్చే వారం భేటీ కానున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సమావేశం కానున్నారు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా పర్యటనకు ముందు ఫిన్ లాండ్ కు వెళతారని తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి 6 వరకు ఫిన్ లాండ్ లో జిన్‌పింగ్ పర్యటిస్తారని చెప్పారు. 6, 7 తేదీల్లో అమెరికాలోని ఫ్లోరిడాలో పర్యటిస్తారని తెలిపారు. ఫోర్లిడా మార్-ఏ-లాగోలో ఉన్న ట్రంప్ వ్యక్తిగత నివాసంలో ఆయనతో జిన్‌పింగ్ సమావేశమవుతారు. ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై ఇరువురు నాయకులు చర్చించే అవకాశముంది. 'అమెరికాతో వర్తక భాగస్వామం పెంపొందించుకోవాలని చైనా కోరుకుంటోంది. చర్చల ద్వారా వాణిజ్య, వర్తక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నామ'ని లుకాంగ్ పేర్కొన్నారు. 2016లో రెండు దేశాల మధ్య 519.6 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగినట్టు వెల్లడించారు.