అంతర్జాతీయ పరిణామాలు కీలకం! | Signs of progress in US-China talks | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ పరిణామాలు కీలకం!

Published Mon, Dec 17 2018 2:48 AM | Last Updated on Mon, Dec 17 2018 2:48 AM

Signs of progress in US-China talks - Sakshi

న్యూఢిల్లీ: అమెరికా–చైనా వాణిజ్య సంబంధాలు, ఫెడ్‌ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు వంటి పలు కీలక అంతర్జాతీయ అంశాలకు తోడు డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మార్కెట్‌ ముందుగానే డిస్కౌంట్‌ చేసింది. నవంబర్‌ నెలలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి దిగి వచ్చింది. 2.33 శాతంగా నమోదైంది. మరోవైపు పారిశ్రామిక వృద్ధి రేటు అక్టోబర్‌లో 8.1 శాతం పెరిగి ఏడాది గరిష్టస్థాయికి చేరుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్‌బీఐ వైఖరి మారడం అనేది మార్కెట్‌ వర్గాల్లో ఆశావాదాన్ని నింపింది.’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. దేశీ అంశాలు పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ అంశాలు ఏమేరకు ప్రభావం చూపుతాయనే అంశం ఆధారంగానే మార్కెట్‌ కదలికలు ఉండనున్నాయని పలువురు మార్కెట్‌ పండితులు విశ్లేషించారు.

ఫెడ్‌ రేట్లు 25 బేసిస్‌ పాయింట్ల మేర పెరిగే అవకాశం..
ఈవారం మంగళ, బుధవారాల్లో (18–19) అమెరికన్‌ ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ సమావేశం జరగనుండగా.. ఫెడ్‌ ప్రామాణిక వడ్డీ రేట్లు 25 శాతం పెరిగేందుకు అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఫెడ్‌ వైఖరి ఎలా ఉండనుందనే అంశం కూడా ఇదే సమావేశం ద్వారా వెల్లడయ్యే సూచనలు ఉండడంతో దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు ప్రధానంగా దృష్టిసారించాయి. మంగళవారం యూఎస్‌ వాణిజ్య విభాగం భవన అనుమతులు, నవంబర్‌ గృహ నిర్మాణాలకు సంబంధించి నివేదికను ఇవ్వనుంది. మరోవైపు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ పాలసీ ప్రకటన, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ పాలసీ సమావేశం కూడా ఇదే వారంలో ఉన్నాయి.

క్రూడ్‌ ధరల ప్రభావం..
చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన నేపథ్యంలో ఆ దేశం నుంచి డిమాండ్‌ తగ్గుతుందనే అంచనాల కారణంగా గతవారంలో ముడిచమురు ధరలు దిద్దుబాటుకు గురైయ్యాయి. ఇదే సమయంలో ఒపెక్‌ ఉత్పత్తిపై నెలకొన్న పలు అనుమానాలతో గతవారం బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 2.25 శాతం తగ్గి 60.28 డాలర్లకు చేరుకుంది. ‘రష్యా ఉత్పత్తిని తగ్గించనుందనే ప్రకటన, అమెరికా ఎగుమతుల్లో సౌదీ అరేబియా కోత వంటి అంశాల ఆధారంగా చమురు ధరలు రేంజ్‌ బౌండ్‌లోనే ఉండేందుకు అవకాశం ఉంది.’ అని ఆనంద్‌ రాఠీ కమోడిటీస్‌ విభాగం రీసెర్చ్‌ హెడ్‌ రవీంద్ర వీ రావ్‌ విశ్లేషించారు. ధరలు ఏమాత్రం పడిపోయినా దేశీ మార్కెట్లకు సానుకూలంగా మారునుందన్నారు.

71.30–72.50 శ్రేణిలో రూపాయి..
ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ తన పదవికి రాజీనామా చేయడం, ఎన్నికల ఫలితాలు, డాలర్‌ బలపడడం వంటి కారణాలతో గతవారం డాలరుతో రూపాయి మారకం విలువ 109 పైసలు (1.54 శాతం) క్షీణించి 71.89 వద్దకు పడిపోయింది. ఫెడ్‌ సమావేశాన్ని పరిగణలోనికి తీసుకుని రూపాయి కదలికల శ్రేణి  71.30–72.50 మధ్య ఉండవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ అమిత్‌ గుప్తా అంచనావేశారు.

10,880–10,929 వద్ద నిరోధం..
నిఫ్టీ 10,700 స్థాయి వద్ద నిలవ గలిగితే అక్కడ నుంచి 10,880–10,929 స్థాయి వరకు వెళ్లేందుకు అవకాశం ఉందని మోతిలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ చందన్‌ తపరియా విశ్లేషించారు. ఈ సూచీ కీలక మద్దతు స్థాయి 10,650 వద్ద ఉండగా.. ఈస్థాయిని కోల్పోతే 10,600 తరువాత మద్దతుగా ఉంటుందన్నారు.

అమెరికా–చైనా మధ్య సంధిపై ఆశావహంగా ఇన్వెస్టర్లు
వాణిజ్య యుద్ధభయాలతో ప్రపంచ మార్కెట్లను బెంబేలెత్తించిన అమెరికా–చైనాల మధ్య చర్చలు ఫలించవచ్చని ఇన్వెస్టర్లలో ఆశాభావం పెరుగుతోంది. వివాదాల పరిష్కారానికి రెండు దేశాల మధ్య కుదిరిన 90 రోజుల సయోధ్య ఒప్పందంపై చర్చలు పురోగమిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. చైనా టెలికం దిగ్గజం హువావే సీఎఫ్‌వో మింగ్‌ కెనడాలో అరెస్టయినప్పటికీ .. రెండు పక్షాల నుంచి పరస్పరం రెచ్చగొట్టుకునే ప్రకటనలేమీ లేకపోవడం ఇందుకు నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు.

ఈ పరిణామాలను బట్టి చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్‌ ట్రంప్, చైనా ప్రభుత్వం.. ఈ రెండు అంశా లను (టారిఫ్‌లు, మింగ్‌ అరెస్టు) వేర్వేరుగానే చూస్తున్నట్లుగా స్పష్టమవుతోందని వాణిజ్యవేత్త ఎడ్వర్డ్‌ అల్డెన్‌ తెలిపారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు రెట్టింపు చేసే ప్రతిపాదనలను ట్రంప్‌ మార్చి 1 దాకా వాయిదా వేయడం, ప్రతిగా అమెరికాతో వాణిజ్య లోటును భర్తీ చేసుకునేలా చైనా మరిన్ని అమెరికన్‌ ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు అంగీకరించడం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement