Business relationships
-
వాణిజ్య బంధాన్ని పెనవేయగలరా?!
భారతదేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం బ్రిటన్‌కు కూడా ప్రయోజనకరమే. అందుకే బ్రిటన్ కొత్త ప్రధాని రిషీ సునాక్ తన ప్రసంగంలో రెండు దేశాల మధ్య సంబంధాలను రెండు వైపుల నుంచి మరింతగా బలపరచవలసిన ఆవశ్యకత గురించి మాట్లాడారు. అయినప్పటికీ భారత్–యు.కె. వాణిజ్య సంబంధాలకు కీలకమైన ఎఫ్.టి.ఎ.పై శ్రద్ధ వహించడానికి ఆయనకు పరిస్థితులు అనుకూలిస్తాయా అన్నది సందేహమే. ఒకటి మాత్రం వాస్తవం. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల అంశానికి అధిక ప్రాధాన్యతనిస్తూ భారత్ సునాక్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలు నెరవేరతాయా లేదా అనేది... క్షీణిస్తున్న బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను సునాక్ దృక్పథం ఏ మేరకు మెరుగుపరుస్తుందన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. భారతదేశంతో బ్రిటన్ ఆర్థిక సంబంధాలు గొప్ప ముందడుగుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఆ దేశంలోని రాజకీయ గందరగోళం బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషీ సునాక్ రాకకు దారి తీయడం భారత్‌కు అనేక విధాలైన వాణిజ్య అనుకూలతల్ని తెచ్చిపెట్టే పరిణామమే. ఇరుదేశాల మధ్య ప్రతిపాదిత ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’ (ఎఫ్.టి.ఎ.) ఈ ఏడాది జనవరి నుంచీ చర్చల స్థాయిలోనే ఉంది. చర్చలు ఫలవంతమై, ఒప్పందం అమల్లోకి రావడం కోసం రెండు దేశాలు కూడా ఎంతో ఉత్సుకతతో నిరీక్షిస్తూ ఉన్నాయన్నది నిజం. బోరిస్ జాన్సన్ స్థానంలో లిజ్ ట్రస్ కొత్త ప్రధానిగా వచ్చి నప్పటికీ ఎఫ్.టి.ఎ.పై చర్చలు అంతరాయం లేకుండా కొనసాగాయి. ట్రస్ ప్రభుత్వం స్పల్పకాల వ్యవధిలోనే అయినా శీఘ్రంగా అను సరించిన వినాశకర విధానాల కారణంగా యు.కె. మరింతగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో, యు.కె.ను గట్టెక్కించే మార్గాలను అన్వేషించడం సునాక్ ప్రథమ కర్తవ్యం అయింది. ప్రధానిగా సునాక్ తన ప్రసంగంలో రెండు దేశాల మధ్య సంబంధాలను రెండు వైపుల నుంచి మరింతగా బలపరచవలసిన ఆవశ్యకత గురించి మాట్లాడినప్పటికీ, భారత్–యు.కె. వాణిజ్య సంబంధాలకు కీలకమైన ఎఫ్.టి.ఎ.పై శ్రద్ధ వహించడానికి ఆయనకు పరిస్థితులు అనుకూలిస్తాయా అన్నది సందేహమే. 2023 వరకైనా ఈ ప్రతిపాదిత ఒప్పందం అప్రస్తుత అంశంగా మూలన పడే అవకాశముంది. ఎఫ్.టి.ఎ. సంభవమయ్యేందుకు ఉన్న అవకాశాలు ప్రధానిగా ట్రస్ నిష్క్రమించడానికి ముందే సన్నగిల్లాయి. వీసాల గడువు ముగిసి పోయినా కూడా దేశంలోనే ఉండిపోయే అలవాటున్న భారతీయుల వలసలను ఈ ఒప్పందం సులభతరం చేస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి సుయెల్లా బ్రేవెర్మాన్ అనడంతోనే చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు చర్చల వాతావరణాన్ని దెబ్బ తీశాయి. అయినప్పటికీ, గతవారం బ్రిటన్ రాజకీయ పరిస్థితులు నాటకీయంగా మారే వరకు కూడా ఎఫ్.టి.ఎ.ని ఖరారు పరచు కోవాలన్న దృఢ సంకల్పం ఇరువైపులా కనిపించింది. అసలు ఎందుకు ఈ ఒప్పందం విషయమై భారత్–బ్రిటన్ గట్టి పట్టుతో ఉన్నాయన్న ప్రశ్నకు తగిన సమాధానమే ఉంది. మొదట బ్రిటన్ వైపు నుంచి చూద్దాం. ఐరోపా సమాఖ్య నుంచి ఆ దేశం బయటికి వచ్చేయడంతో సమాఖ్యలోని తక్కిన దేశాలతో ఉన్న అనుసంధాన వారధులను బ్రిటన్ తనకై తను కూల్చుకున్నట్లయింది. పర్యవసానమే... ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థతో బ్రిటన్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోక తప్పని పరిస్థితి రావడం. ఆ సమయంలో భారత్ కంటే ముందుగా అమెరికా తన వాణిజ్య భాగస్వామిగా బ్రిటన్‌తో చేతులు కలుపుతుందనే అంతా భావించారు. అయితే అందుకు విరుద్ధంగా ఎఫ్.టి.ఎ.పై చర్చలు జరపడానికి ప్రస్తుతం తనకు ఆసక్తి లేదని అమెరికా స్పష్టం చేసింది. భారతదేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం బ్రిటన్‌కు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకటి, భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవత రించింది. మొన్నటి వరకు యు.కె. ఉన్న ఐదవ స్థానంతో సమానమైన స్థాయి ఇది. కనుక బ్రిటిష్ పరిశ్రమలకు భారత్ భారీ మార్కెట్‌ను చూపిస్తుంది. రెండవది... విస్కీ, స్పిరిట్స్ వంటి బ్రిటన్‌కు మాత్రమే పరిమితమైన మేలిమి ఉత్పత్తులపై ఉండే భారీ దిగుమతి సుంకాలు తగ్గించడం ద్వారా వాటి మార్కెట్‌ను మెరుగుపరుస్తుంది. ప్రతి ఫలంగా భారత్ వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన కార్మికులకు సుల భంగా వీసాలు వచ్చేలా బ్రిటన్‌కు డిమాండ్లు పెట్టవచ్చు. అలాంటి సౌలభ్యం వీసాల జారీ విధి విధానాల్లో లేనప్పటికీ, వాణిజ్య వ్యాపా రాలకు అవసరమైన చలనశీలత ఆ మేరకు వెసులుబాట్లను కల్పించే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగనంత వరకు కూడా పొరుగున ఉన్న ఐరోపా దేశాలతో వీసా అడ్డంకుల సమస్య ఉండేది కాదు కనుక ఆ దేశాల నుంచి ప్రవాహంలా వచ్చే వారి వల్ల బ్రిటన్‌కు నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం తీరేది. ఇప్పుడీ ఎఫ్.టి.ఎ. కుదిరితే వృత్తిపరమైన కార్మికుల డిమాండ్‌లో కొంత భాగం భారతదేశం నుండి తీరవచ్చు. సరిగ్గా ఈ అంశం దగ్గరే వలసల సమస్యలపై సునాక్ మంత్రివర్గంలోని బ్రేవర్మాన్ చేసిన వ్యాఖ్యలు చర్చలు నిలిచిపోవడానికి కారణం అయ్యాయి. కీలక మార్కెట్లలో తక్కువ సుంకాల పరంగా ఎగుమతిదారులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నందున, ఎఫ్.టి.ఎ.ను ఖాయం చేసుకునేందుకు భారతదేశం కూడా సమానమైన ఆత్రుతతో ఉంది. అదే సమయంలో చైనా నుండి తృతీయ దేశాల ద్వారా ప్రవేశించే చౌక దిగుమతులను నివారించే ప్రయత్నంలో అతిపెద్ద బహుపాక్షిక సమూ హమైన ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’ (ఆర్.సి.ఇ.పి.) నుండి దూరంగా ఉండి, సభ్య దేశాలకు అందుబాటులో ఉన్న ప్రాధాన్యతా సుంకాలను భారత్ కోల్పోయింది. ఈ వైకల్యాన్ని అధిగ మించడానికి, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం కోసం భారత్ ప్రయత్నిస్తోంది. అందువల్లే బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందం అన్నది అత్యంత సంభావ్యత కలిగిన ఒక ముందడుగుగా పరిగణన పొందుతోంది. ఇరుపక్షాలకు కూడా ప్రతిష్టాత్మకమైనదిగా ప్రాముఖ్యతను సంతరించుకున్నందునే ఈ భారత్–యు.కె. వాణిజ్య ఒప్పందం నిలిచి పోవడం నిరుత్సాహానికి కారణం అయింది. అంతేకాకుండా, రెండు దేశాల మధ్య వలసవాద యుగం నాటి నుండి ప్రత్యేకమైన సంబం ధాలు ఉన్నాయనే వాస్తవం విస్మరించలేనిది. స్వాతంత్య్రం వచ్చే నాటికి భారతదేశాన్ని బ్రిటన్ కడు పేదరికంలో వదిలి వెళ్లిందనే వాస్తవం ఆగ్రహం తెప్పించేదే అయినప్పటికీ, ఏళ్ల క్రమంలో సంభ వించిన రెండు దేశాల సంబంధాలలోని పరిణతి ఒకదానితో ఒకటి సమస్థాయికి చేరేందుకు దోహదపడింది. అందుకు ఒక కారణం ఏమిటంటే, ఆ దేశంలో ప్రవాస భారతీయుల అత్యంత ప్రభావవంత మైన పాత్ర. ఇప్పుడికైతే భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ప్రధాన మంత్రి కావడం రెండు దేశాల అభివృద్ధిలో ఒక స్పష్టమైన మైలు రాయి. అంతేకాకుండా, యు.కె.లో ప్రస్తుతం భారత్ రెండవ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా ఉన్నదన్న వాస్తవం రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు దృఢతరం చేయగలిగినంత శక్తి గలది. బ్రిటన్‌లో 850 భారతీయ కంపెనీలు పనిచేస్తుండగా, భారత్‌లో 600 బ్రిటిష్ కంపె నీలు ఉండటం ఇందుకొక నిదర్శనం. భారతదేశంలో బయటి నుంచి పెట్టుబడులు పెట్టే ఆరవ అతిపెద్ద మదుపుదారు బ్రిటన్. భారత్–యు.కె. ఆర్థిక సంబంధాల భవిష్యత్తు పూర్తిగా కొత్త ప్రధానమంత్రి అనుసరించే దిశపైనే ఆధారపడి ఉంది. ఇరుదేశాల సంబంధాలను మరింత గాఢపరిచేందుకు సునాక్ స్పష్టమైన ఆసక్తి చూపుతున్నప్పటికీ, వీసా సమస్యలను సడలించడం అంటే, వలసలను ప్రోత్సహించడంతో సమానమని భావించే బ్రేవర్మాన్ వంటివారు ఆయన ప్రయత్నాలకు అవరోధం కావొచ్చు. ఈ నేపథ్యంలో.. ఆయన సుంకాలను తగ్గించడం, వీసా నియంత్రణలను సడలించడం వంటి చర్యల ద్వారా యు.కె.కి ఒనగూడే ఆర్థిక ప్రయోజనాల గురించి గట్టిగా చెప్పగలరా అన్నది రాబోయే కొద్ది నెలల్లో తేలిపోవచ్చు. ఈ క్లిష్ట స్థితి నుంచి ఇండియా నేర్చుకోవలసిన పెద్ద పాఠం ఏమిటంటే.. మరిన్ని ప్రాంతీయ, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకోడానికి తన ప్రయత్నాలను వేగవంతం చేయడం. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకునే అంశానికి అధిక ప్రాధాన్యతనిస్తూ భారత్ కొత్త యు.కె. ప్రధానిపై ఆశలు పెట్టుకుందనడంలో సందేహం లేదు. అయితే ఆ ఆశలు నెర వేరతాయా లేదా అనేది మాత్రం.. క్షీణిస్తున్న బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను రిషి సునాక్ దృక్పథం ఏ మేరకు మెరుగుపరుస్తుందన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
బ్రెజిల్ అధ్యక్షుడికి అమెజాన్ సెగలు
పోర్టో వెల్హో(బ్రెజిల్): అమెజాన్ అడవుల్లో రేగిన కార్చిచ్చు సెగలు బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారోకి తగులుకుంటున్నాయి. అడవులు తగలబడిపోతుంటే ఆయన స్పందించిన విధానంపై స్వదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్ అడవుల్లో కార్చిచ్చులు సర్వసాధారణమే అయినప్పటికీ గతంతో పోల్చి చూస్తే ఈ ఏడాది 85 శాతం పెరిగిపోయాయి. అయితే ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీయడానికి సామాజిక సంస్థలే అడవుల్ని తగలబెట్టి ఉంటాయని బోల్సోనారో చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. బ్రెజిల్ వ్యాప్తంగానూ, ప్రపంచ దేశాల్లో బ్రెజిల్ దౌత్యకార్యాలయాల ఎదుట వందలాది మంది నిరసన ప్రదర్శనలకు దిగారు. సొంత దేశంలోనే కొందరు యువకులు ‘‘బోల్సోనారో మా భవిష్యత్‌ని మసి చేస్తున్నారు‘‘అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. పోప్ ప్రాన్సిస్ కూడా తన నిరసన గళాన్ని వినిపించారు. ఊపిరితిత్తుల్లాంటి అడవులు మన భూమికి అత్యంత ముఖ్యమంటూ ప్రకటన జారీ చేశారు. ప్రేఫర్అమెజాన్ అంటూ సోషల్ మీడియాలో ఉద్యమం ప్రపంచంలోనే ట్రెండింగ్ అంశంగా మారింది. బ్రెజిల్‌తో వ్యాపార సంబంధాలు నిలిపివేస్తాం బ్రెజిల్ అధ్యక్షుడు వాణిజ్య ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన అటవీ విధానాలే కార్చిచ్చు రేపాయని, ఇవి ఇంకా కొనసాగితే బ్రెజిల్, ఇతర దక్షిణ అమెరికా దేశాలతో వ్యాపార సంబంధాలు రద్దు చేసుకుంటామని యూరోపియన్ నాయకులు హెచ్చరించారు. బ్రెజిల్ అధినేత అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలను తోసి రాజని అడవుల నరికివేత, పశువుల మేతకు చదును చేయడం, అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహించడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని ప్రపంచ దేశాల అభిప్రాయంగా ఉంది. గతంలో కూడా బోల్సోనారో అమెజాన్ వర్షారణ్యాలు బ్రెజిల్ ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా మారాయని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో బోల్సోనారోపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన దిగివచ్చారు. పర్యావరణ విధానాల్ని సవరించుకుంటామని హామీ ఇచ్చారు. మంటల్ని ఆర్పడానికి 44వేల మంది సైనికుల్ని పంపిస్తానని వెల్లడించారు. అంతేకాదు కార్చిచ్చు రేగడానికి గల కారణాలపై విచారణ జరిపి బాధ్యుల్నిశిక్షిస్తామని అధినేత చెప్పినట్టుగా ఆ దేశ న్యాయశాఖ మంత్రి, పర్యావరణ విధానాలను సమీక్షించే అధికారం ఉన్న సెర్గియో మోరో ట్విటర్లో వెల్లడించారు. ఆర్పడానికి జీ7 అండ అమెజాన్ అడవుల్లో కార్చిచ్చుని ఆర్పడానికి అన్నివిధాల సాయపడడానికి జీ7 దేశాలు ముందుకొచ్చాయి. 2.2 కోట్ల అమెరికా డాలర్లు సాయం చేస్తామని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. మంటలనార్పే విమానాలు పంపడానికి ఈ డాలర్లని వినియోగించాలని తెలిపింది. బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికాలతో కూడిన జీ7 సదస్సు అడవుల పునరుద్ధరణ ప్రణాళిక అంశంలో కూడా బ్రెజిల్‌కు ఆర్థిక సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ఆగస్టు 15 నుంచి దక్షిణ అమెరికా దేశాల్లో రోజురోజుకూ విస్తరిస్తున్న కార్చిచ్చు, బ్రెజిల్, బొలివియా, పెరూ, పరాగ్వే, ఈక్వెడార్, ఉరుగ్వే, ఉత్తర అర్జెంటీనా, వాయవ్య కొలంబియా దేశాల్లో కార్చిర్చు ( ఎరుపురంగు) -
అంతర్జాతీయ పరిణామాలు కీలకం!
న్యూఢిల్లీ: అమెరికా–చైనా వాణిజ్య సంబంధాలు, ఫెడ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు వంటి పలు కీలక అంతర్జాతీయ అంశాలకు తోడు డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మార్కెట్ ముందుగానే డిస్కౌంట్ చేసింది. నవంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి దిగి వచ్చింది. 2.33 శాతంగా నమోదైంది. మరోవైపు పారిశ్రామిక వృద్ధి రేటు అక్టోబర్‌లో 8.1 శాతం పెరిగి ఏడాది గరిష్టస్థాయికి చేరుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ వైఖరి మారడం అనేది మార్కెట్ వర్గాల్లో ఆశావాదాన్ని నింపింది.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ అన్నారు. దేశీ అంశాలు పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ అంశాలు ఏమేరకు ప్రభావం చూపుతాయనే అంశం ఆధారంగానే మార్కెట్ కదలికలు ఉండనున్నాయని పలువురు మార్కెట్ పండితులు విశ్లేషించారు. ఫెడ్ రేట్లు 25 బేసిస్ పాయింట్ల మేర పెరిగే అవకాశం.. ఈవారం మంగళ, బుధవారాల్లో (18–19) అమెరికన్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం జరగనుండగా.. ఫెడ్ ప్రామాణిక వడ్డీ రేట్లు 25 శాతం పెరిగేందుకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఫెడ్ వైఖరి ఎలా ఉండనుందనే అంశం కూడా ఇదే సమావేశం ద్వారా వెల్లడయ్యే సూచనలు ఉండడంతో దలాల్ స్ట్రీట్ వర్గాలు ప్రధానంగా దృష్టిసారించాయి. మంగళవారం యూఎస్ వాణిజ్య విభాగం భవన అనుమతులు, నవంబర్ గృహ నిర్మాణాలకు సంబంధించి నివేదికను ఇవ్వనుంది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పాలసీ ప్రకటన, బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ సమావేశం కూడా ఇదే వారంలో ఉన్నాయి. క్రూడ్ ధరల ప్రభావం.. చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన నేపథ్యంలో ఆ దేశం నుంచి డిమాండ్ తగ్గుతుందనే అంచనాల కారణంగా గతవారంలో ముడిచమురు ధరలు దిద్దుబాటుకు గురైయ్యాయి. ఇదే సమయంలో ఒపెక్ ఉత్పత్తిపై నెలకొన్న పలు అనుమానాలతో గతవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 2.25 శాతం తగ్గి 60.28 డాలర్లకు చేరుకుంది. ‘రష్యా ఉత్పత్తిని తగ్గించనుందనే ప్రకటన, అమెరికా ఎగుమతుల్లో సౌదీ అరేబియా కోత వంటి అంశాల ఆధారంగా చమురు ధరలు రేంజ్ బౌండ్లోనే ఉండేందుకు అవకాశం ఉంది.’ అని ఆనంద్ రాఠీ కమోడిటీస్ విభాగం రీసెర్చ్ హెడ్ రవీంద్ర వీ రావ్ విశ్లేషించారు. ధరలు ఏమాత్రం పడిపోయినా దేశీ మార్కెట్లకు సానుకూలంగా మారునుందన్నారు. 71.30–72.50 శ్రేణిలో రూపాయి.. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయడం, ఎన్నికల ఫలితాలు, డాలర్ బలపడడం వంటి కారణాలతో గతవారం డాలరుతో రూపాయి మారకం విలువ 109 పైసలు (1.54 శాతం) క్షీణించి 71.89 వద్దకు పడిపోయింది. ఫెడ్ సమావేశాన్ని పరిగణలోనికి తీసుకుని రూపాయి కదలికల శ్రేణి 71.30–72.50 మధ్య ఉండవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ డెరివేటివ్స్ హెడ్ అమిత్ గుప్తా అంచనావేశారు. 10,880–10,929 వద్ద నిరోధం.. నిఫ్టీ 10,700 స్థాయి వద్ద నిలవ గలిగితే అక్కడ నుంచి 10,880–10,929 స్థాయి వరకు వెళ్లేందుకు అవకాశం ఉందని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ చందన్ తపరియా విశ్లేషించారు. ఈ సూచీ కీలక మద్దతు స్థాయి 10,650 వద్ద ఉండగా.. ఈస్థాయిని కోల్పోతే 10,600 తరువాత మద్దతుగా ఉంటుందన్నారు. అమెరికా–చైనా మధ్య సంధిపై ఆశావహంగా ఇన్వెస్టర్లు వాణిజ్య యుద్ధభయాలతో ప్రపంచ మార్కెట్లను బెంబేలెత్తించిన అమెరికా–చైనాల మధ్య చర్చలు ఫలించవచ్చని ఇన్వెస్టర్లలో ఆశాభావం పెరుగుతోంది. వివాదాల పరిష్కారానికి రెండు దేశాల మధ్య కుదిరిన 90 రోజుల సయోధ్య ఒప్పందంపై చర్చలు పురోగమిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. చైనా టెలికం దిగ్గజం హువావే సీఎఫ్‌వో మింగ్ కెనడాలో అరెస్టయినప్పటికీ .. రెండు పక్షాల నుంచి పరస్పరం రెచ్చగొట్టుకునే ప్రకటనలేమీ లేకపోవడం ఇందుకు నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్, చైనా ప్రభుత్వం.. ఈ రెండు అంశా లను (టారిఫ్‌లు, మింగ్ అరెస్టు) వేర్వేరుగానే చూస్తున్నట్లుగా స్పష్టమవుతోందని వాణిజ్యవేత్త ఎడ్వర్డ్ అల్డెన్ తెలిపారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు రెట్టింపు చేసే ప్రతిపాదనలను ట్రంప్ మార్చి 1 దాకా వాయిదా వేయడం, ప్రతిగా అమెరికాతో వాణిజ్య లోటును భర్తీ చేసుకునేలా చైనా మరిన్ని అమెరికన్ ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు అంగీకరించడం తెలిసిందే. -
పవన్‌పై పరువునష్టం దావా వేస్తా: హరీశ్
సాక్షి, హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షులు బొత్సతో తనకు వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించిన పవన్‌కల్యాణ్‌పై పరువు నష్టం దావా వేస్తానని టీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బొత్సతో కేబుల్ వ్యాపార సంబంధాలున్నట్లు చేసిన ఆరోపణలను ఖండించారు. ఆయన చేసిన ఆరోపణలను 24 గంటలల్లోగా నిరూపించాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. లేని పక్షంలో దావాతో పాటు క్రిమినల్ కేసు పెడతానని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమ నాయకుల ప్రతిష్టను దిగజార్చడానికి ఇలాంటి తప్పుడు ఆరోపణలు గతంలోనూ చేశారని, ఇప్పుడు కూడా అదే పద్దతి కొనసాగిస్తున్నారన్నారు