RBI Deput Gov Michael Patra Reaction On Rupee Fall And Inflation Surge, Details Inside - Sakshi
Sakshi News home page

ఆగని రూపాయి ‘రికార్డు’ పతనం: ఆర్‌బీఐ ఏమందంటే

Published Sat, Jun 25 2022 9:59 AM | Last Updated on Thu, Jul 28 2022 7:31 PM

 Rupee Fall And Inflation Surge RBI Deput Gov Michael Patra reaction - Sakshi

అమెరికా డాలర్‌ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులను నివారించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దృష్టి సారిస్తుందని డిప్యూటీ గవర్నర్‌ మైఖేల్‌ డీ పాత్ర పేర్కొన్నారు. అయితే రూపాయి విలువ ఏ స్థాయిలో స్థిరపరచాలన్న అంశంపై ఎటువంటి లక్ష్యాన్ని ఆర్‌బీఐ నిర్ధేశించుకోలేదని ద్రవ్య విధాన విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన స్పష్ట చేశారు. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా గడచిన రెండు నెలల్లో బ్యాంకులకు తానిచ్చే (ఆర్‌బీఐ) రుణాలపై వసూలు చేసే వడ్దీరేటు రెపోను 90 బేసిస్‌ పాయింట్ల పెంచిన (0.40 శాతం, 0.90 శాతం) సెంట్రల్‌ బ్యాంక్‌ ద్రవ్య పరపతి విధాన కమిటీలో పాత్ర కూడా సభ్యులు. ఈ నేపథ్యంలో ‘‘భారత్‌ ఎకానమీపై అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక ప్రభావం’’ అన్న అంశంపై  ఇండస్ట్రీ చాంబర్‌ పీహెచ్‌డీసీసీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు పాత్ర వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిశీలిస్తే... 

రూపాయి ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు. డాలర్‌ ఎక్కడ ఉంటుందో అమెరికా ఫెడ్‌కి కూడా తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచి్చతంగా చెప్పాలి. మేము రూపాయి స్థిరత్వం కోసం నిరంతరం గట్టి ప్రయత్నం చేస్తాము. ఈ విషయంలో పురోగతి ఉంటుందని ఆర్‌బీఐ విశ్వసిస్తోంది. రూపాయి విలువ స్థిరీకరణపై లక్ష్యం ఏదీ లేదుకానీ, తీవ్ర ఒడిదుడుకులను నివారించడనికి మాత్రం సెంట్రల్‌ బ్యాంక్‌ అధిక ప్రాధాన్యత ఇస్తుంది. 
 రూపాయి విలువ క్షీణతను పరిశీలిస్తే, ప్రపంచంలోని పలు దేశాల కరెన్సీలకన్నా తక్కువ స్థాయిలోనే మన కరెన్సీ క్షీణత ఉంది. 600 బిలియన్‌ డాలర్ల విదేశీ మారకపు నిల్వల శక్తి నుంచి పొందిన ప్రయోజనం ఇది.  
రూపాయి–రూబుల్‌ చెల్లింపు విధానం విషయానికి వస్తే, ప్రభుత్వం ఏది నిర్ణయించినా రిజర్వ్‌ బ్యాంక్‌  దానిని నిర్వహిస్తుంది. ఇది ప్రభుత్వం నిర్ణయించాల్సిన అంశం.  
2021-22 మూడవ త్రైమాసికంలో (2021 అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య)  2.6 శాతంలో భారత్‌ కరెంట్‌ అకౌంట్‌లోటు (దేశంలోకి వచ్చి-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) సంబంధిత కాలం స్థూల దేశీయోత్పత్తిలో 2.6 శాతంగా ఉంది.  నాల్గవ త్రైమాసికంలో ఇది 1.5 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ ఒడిదుడుకులను ఎదుర్కొనే విషయంలో భారత్‌ పటిష్ట స్థాయిని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.  
 2021-22లో కరెంట్‌ అకౌంట్‌లోటు నామమాత్రంగా 1.2 శాతంగానే ఉంది. భౌగోళిక సవాళ్లు, వాణిజ్య సంబంధ అండకులు, దిగుమతుల డిమాండ్‌ పెరుగుదల వంటి పలు సవాళ్లు ఉన్నప్పటికీ భారత్‌ విదేశీ నిల్వలు పటిష్ట స్థాయిలో కొనసాగుతున్న విషయాన్ని క్యాడ్‌ తెలియస్తోంది.  
ఇతర దేశాలతో పోలి్చతే భారత్‌ ద్రవ్య పరపతి విధానం ఇంకా సరళతరంగానే ఉంది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువకు దిగివస్తుందని భావిస్తున్నాం. తదుపరి నెలల్లో మరింత దిగివస్తుందన్నది అంచనా. ప్రస్తుత పరిస్థితులు, కేంద్రం, ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల ఆధారంగా (బేస్‌లైన్‌) ఈ అంచనాలను వెలువరిస్తున్నాం. 
 ప్రపంచం ద్రవ్యోల్బణం సవాళ్లలో ఉన్న నేపథ్యంలో...ప్రస్తుతం దాని కదలికలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంది. స్థూలంగా స్థాయిలను నిర్ధేశించుకునే పరిస్థితి ఇప్పుడు లేదు.  
 ద్రవ్యోల్బణం తగ్గుదల చాలా ‘కఠినంగా‘ ఉంటుంది. అయితే భవిష్యత్‌ ద్రవ్యోల్బణం పథాన్ని నిర్దేశించు కోవడంలో భారతదేశం విజయం సాధిస్తుందని మేము విశ్వసిస్తున్నాము. తద్వారా ద్రవ్యోల్బణంపై యుద్ధంలో విజయం సాధిస్తుందని భావిస్తున్నాము.  

ద్రవ్యోల్బణంపై అందోళన 
అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ద్రవ్యోల్బణం అంచనాలుసైతం అనిశ్చితిలో ఉంటున్నట్లు ఆర్‌బీఐ ఈ నెల ప్రారంభ పాలసీ సమీక్ష సందర్భంగా పేర్కొంది. కేంద్రం నిర్దేశాల ప్రకారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2-6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో హద్దుమీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగసింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.7 శాతం రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉంటుందన్న కిత్రం అంచనాలను ఆర్‌బీఐ తాజాగా ఒకశాతం పెంచి 6.7 శాతానికి చేర్చింది. ధరల స్పీడ్‌ కట్టడికి సంబంధించి ఆర్‌బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల కన్నా ఇది 70 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) అధికం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారల్‌కు (ఇండియన్‌ బాస్కెట్‌) 105 ఉంటుందని అంచనా వేస్తోంది. దీంతోపాటు 2022లో తగిన వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలతో ఉంది. ఇది ఖరీఫ్‌ పంట దిగుబడికి దోహదపడే అంశం. ఆయా అంశాల నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటురిటైల్‌ ద్రవ్యోల్బణం 6.7 శాతం ఉంటుందని భావిస్తోంది. మొదటి త్రైమాసికంలో 7.5 శాతం, రెండవ త్రైమాసికంలో 7.4 శాతం, మూడవ త్రైమాసికంలో 6.2 నమోదయ్యే రిటైల్‌ ద్రవ్యోల్బణం నాల్గవ త్రైమాసికంలో కేంద్రం నిర్దేశిత స్థాయి లోపునకు దిగివస్తుందని, 5.8 శాతంగా నమోదవుతుందని ఆర్‌బీఐ పాలసీ సమీక్ష అంచనావేసింది. ఆగస్టు 2  నుంచి 4వ తేదీ మధ్య జరిగే పాలసీ సమీక్షలో కూడా రెపో రేటు పెంపు ఉంటుందన్న అంచనాలు వెలువడు తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు మరో ఒక శాతం పెరుగుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి.  
రూపాయి పతనం
ఇదిలావుండగా, డాలర్‌ మారకంలో రూపాయి చరిత్రాత్మక పతనం రికార్డులు కొనసాగుతున్నాయి. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ క్రితం ముగింపుతో పోలిస్తే ఒకపైసా క్షీణించి 78.33 వద్ద ముగిసింది. రూపాయి గురువారం ముగింపు 78.32. శుక్రవారం ట్రేడింగ్‌లో 78.20 వద్ద ప్రారంభమైంది. 78.19ని చూసినా ఆ స్థాయికి మించి బలపడలేదు.

ఇంట్రాడేలో 78.35ను కూడా చూసింది. చివరకు పైనా నష్టంతో 78.33 వద్ద ముగిసింది. తద్వారా ఇంట్రాడే, ముగింపుల్లో రూపాయి శుక్రవారం చరిత్రాత్మక కొత్త కనిష్టాలను చూసింది. రూపాయి వరుస పతనం ఇది ఎనిమిదవ వారం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ముగింపు కనబడని పరిస్థితి, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, సెంట్రల్‌ బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు ధోరణి, దేశీయంగా ఈక్విటీ మార్కెట్ల బలహీన ధోరణి, విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకం దారులుగా కొనసాగడం వంటి అంశాలు రూపాయి రెండు నెలల పతన ధోరణికి కారణం.

విదేశీ మారకద్రవ్య నిల్వలు @ 591 బిలియన్‌ డాలర్లు    
వారం వారీగా 6 బిలియన్‌ డాలర్ల డౌన్‌ 
కాగా, భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు జూన్‌ 17వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారంతో (జూన్‌ 10) ముగిసిన వారంతో పోలి్చచూస్తే 6 బిలియన్‌ డాలర్లు తగ్గి 591 బిలియన్‌ డాలర్లకు చేరింది. జూన్‌ 10తో ముగిసిన వారంలోకూడా అంతక్రితం వారంతో పోల్చితే ఫారెక్స్‌ దాదాపు 4 బిలియన్‌ డాలర్లకుపైగా తగ్గడ గమనార్హం. ఆర్‌బీఐ తాజాగా శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్‌ 10వ తేదీతో ముగిసిన వారంలో డాలర్లు అధికంగా ఉండే ఫారెన్‌  కరెంట్‌ అసెట్స్‌ (ఎఫ్‌సీఏ) 5.362 బిలియన్‌ డాలర్లు తగ్గి, 526.882 బిలియన్‌ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు 258 మిలియన్లు తగ్గి 40.584 బిలియన్‌ డాలర్లకు దిగివచ్చాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ఎస్‌డీఆర్‌) నిధులు మొత్తం 233 మిలియన్‌ డాలర్ల తగ్గి 18.155 బిలియన్లకు తగ్గాయి. ఐఎంఎఫ్‌ వద్ద నిల్వలు కూడా 17 మిలియన్‌ డాలర్లు తగ్గి 4.968 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement