ఆరంభ లాభాలు ఆవిరైనా, శుక్రవారం స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో విదేశీ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టటంతో ఆ షేర్ 3 శాతం మేర లాభపడటం, మరో దిగ్గజ కంపెనీ హెచ్‌యూఎల్ 5 శాతం పెరగడం కలసివచ్చింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం, అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తొలి దశ చర్చలు చోటు చేసుకోవడంతో ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం, వివిధ దేశాలు దశలవారీగా లాక్‌డౌన్‌ను తొలగిస్తుండటం....సానుకూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 646 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ చివరకు 199 పాయింట్ల లాభంతో 31,643 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 9,252 పాయింట్ల వద్దకు చేరింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2,075 పాయింట్లు, నిఫ్టీ 608 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ఈ సూచీలు చెరో 6 శాతం మేర పతనమయ్యాయి.
రోజంతా లాభాలు.....
ఆసియా మార్కెట్ల దన్నుతో మన మార్కెట్ భారీ లాభాల్లో ఆరంభమయ్యాయి. రోజంతా లాభాలు కొనసాగాయి. అయితే చివర్లో లోహ, ఆర్థిక రంగ, వాహన షేర్లలో అమ్మకాలు ఒత్తిడి కనిపించింది. దీంతో ఆరంభ లాభాలు తగ్గాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు 1–2% లాభాల్లో ముగిశాయి.
► రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 4 శాతం లాభంతో రూ.1,562 వద్ద ముగిసింది. ఈ కంపెనీకి చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లో అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ 2.3 శాతం వాటాను రూ.11,367 కోట్లతో కొనుగోలు చేసింది. దీంతో ఈ షేర్ జోరుగా పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ,.9,90,088 కోట్లకు పెరిగింది. ఈ షేర్ మరో రూ.15 మేర పెరిగితే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లకు ఎగబాకుతుంది.
► హిందుస్తాన్ యూనిలివర్(హెచ్‌యూఎల్) షేర్ 5 శాతం లాభంతో రూ.2,088 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సొసైటీ జనరల్ సంస్థ 1.3 కోట్ల షేర్లను రూ.1,902 ధరకు కొనుగోలు చేయడంతో ఈ షేర్ ఈ స్థాయిలో పెరిగింది.
► దాదాపు 200కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ కన్సూమర్, సుజ్లాన్ ఎనర్జీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
► దాదాపు 90 కంపెనీల షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, డీబీ కార్ప్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్, ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా పవర్ తదితర షేర్లు ఈ పడిపోయిన జాబితాలో ఉన్నాయి.
సెన్సెక్స్ 199 పాయింట్లు అప్
Published Sat, May 9 2020 5:03 AM | Last Updated on Sat, May 9 2020 5:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment