Foxconn Begins Production Of Upcoming Apple iPhone 15 Production In India - Sakshi
Sakshi News home page

చైనాను నమ్మలేం, భారత్‌లో ఐఫోన్‌ 15 తయారీపై యాపిల్‌ కీలక నిర్ణయం

Published Wed, Aug 16 2023 3:50 PM | Last Updated on Wed, Aug 16 2023 6:16 PM

Foxconn Begins Production Of Upcoming Apple Iphone 15 In India - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా 85 శాతం ఐఫోన్‌ల తయారీతో గుత్తాదిపత్యం వహిస్తున్న డ్రాగన్‌ కంట్రీకి భారీ షాక్‌ తగలనుందా? తాజాగా, యాపిల్‌ తీసుకున్న నిర్ణయం చైనా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యిందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు.

ఐఫోన్‌ల తయారీలో ప్రధాన దేశమైన చైనాకు, యాపిల్‌ ప్రొడక్ట్‌ల తయారీ, సరఫరా, అమ్మకాలు, సర్వీసింగ్‌ వంటి విభాగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న భారత్‌కు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాను కాదనుకొని భారత్‌లో ఐఫోన్‌ 15ను భారీ ఎత్తున తయారు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.  

త్వరలో తమిళనాడు పెరంబదూర్‌ కేంద్రంగా ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌కు ప్లాంట్‌లో గతంలో కంటే ఎక్కువగానే ఈ లేటెస్ట్‌ ఐఫోన్‌లను తయారు చేయనుంది. చైనాలో తయారైన యాపిల్‌ ప్రొడక్ట్‌లు ఇతర దేశాలకు దిగుమతి చేసిన వారం రోజుల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.  

అప్రమత్తమైన టిమ్‌కుక్‌
యాపిల్‌ సంస్థ గత కొన్నేళ్లుగా చైనాలో తన ఉత్పత్తుల్ని తయారీ, అమ్మకాలు నిర్వహిస్తుంది. అయితే, డ్రాగన్‌ కంట్రీలో సప్లయి చైన్‌ సమస్యలు, అమెరికా - చైనాల మధ్య తగ్గిపోతున్న వ్యాపార సత్సంబంధాలు, అదే సమయంలో తయారీ కేంద్రంగా ఎదిగేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అమెరికాతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుని, తనను తాను తయారీ కేంద్రంగా మార్చుకోవాలని కోరింది. ఇలా వరుస పరిణామాలతో యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ అలెర్ట్‌ అయ్యారు.  

చైనాలో వ్యాపారం ఎప్పటికైనా ప్రమాదమనే ఓ అంచనాకు వచ్చిన యాపిల్‌ గత కొన్నేళ్లుగా తన వ్యాపారాన్ని ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. ఇందులో భాగంగా భారత్‌లో ఐఫోన్‌ 15 తయారీని ప్రారంభించనుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 

చైనా నుంచి భారత్‌కు 
చైనాలో సప్లయి చైన్‌ సమస్యలతో యాపిల్‌ తన తయారీని భారత్‌కు తరలించాలని భావించింది. కాబట్టే గత ఏడాది భారత్‌లో తయారైన యాపిల్‌ ఐఫోన్‌ షిప్‌మెంట్‌ విలువ 65 శాతం పెరిగింది. ఐఫోన్‌ల విలువ 162 శాతం పెరిగిందంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఆ నివేదికను ఊటంకిస్తూ ప్రముఖ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ కౌంటర్‌ పాయింట్‌ మరో రిపోర్ట్‌ను వెలుగులోకి తెచ్చింది. 

2022లో భారత్‌లో మొత్తం స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్‌ విలువలో యాపిల్‌కు 25 శాతం వాటాను కలిగి ఉందని వెల్లడించింది. ఈ వృద్ది రేటు 2021లో 12 శాతం నుండి పెరిగినట్లు మరికొన్ని సంస్థలు నివేదించాయి. 

ప్రమాదం అంచున చైనా ఆధిపత్యం
ప్రపంచ వ్యాప్తంగా 85 శాతం ఐఫోన్‌లను చైనానే తయారు చేస్తుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదికలో టెక్నాలజీ రిపోర్టర్‌ జిన్మీ షెన్ తెలిపారు. అయినప్పటికీ, యాపిల్ తన తయారీని చైనా నుంచి బయట (ముఖ్యంగా భారత్‌కు) దేశాలకు తరలించాలని భావిస్తున్నందున బీజింగ్‌ తన ఆధిపత్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి👉 ప్రపంచ చరిత్రలో నష్ట జాతకుడు ఇతనే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement