న్యూఢిల్లీ: చైనా ఇంకో చోట మళ్లీ కయ్యానికి కాలుదువ్వుతోందంటున్నారు మిలటరీ విశ్లేషకులు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సైనికుల కదలికలను పరిశీలిస్తే దౌలత్ బేగ్ ఓల్డీ, డెప్‌సాంగ్ సెక్టార్లలో తాజాగా వివాదాలు లేవనెత్తే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. దౌలత్ బేగ్ ఓల్డీకి తూర్పు ప్రాంతంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైన్యం చురుకుగా కదులుతోందని, ఆ ప్రాంతంలో క్యాంపులు ఏర్పాటు కావడమే కాకుండా.. వాహనాల కదలికలు కూడా ఎక్కువయ్యాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
2016 ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ సైనిక స్థావరం వద్దనే ఈ క్యాంపులు ఏర్పాటు కావడం గమనార్హం. ఈ నెలలో తీసిన కొన్ని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా కొత్త క్యాంపుల గురించి తెలియగా.. స్థానిక నిఘా వర్గాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. చైనా కదలికలకు అనుగుణంగా భారత్ మే నెల చివరిలోనే డెప్‌సాంగ్ ప్రాంతానికి తన బలగాలను తరలించిందని సమాచారం. 2013లో చైనా ఇదే డెప్‌సాంగ్ ప్రాంతంలో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
గల్వాన్‌లో బల ప్రదర్శన
తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో భారత్ చైనాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు చైనా సైనికులు గల్వాన్ ప్రాంతంలోనే తిష్టవేయగా.. భారత్ తన యుద్ధ విమానాలతో ఆ ప్రాంతంలో విన్యాసాలు చేయించింది. జూన్ 15న ఈ ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు బాహాబాహీకి దిగడం మేకులతో కూడిన గదలు, కర్రలతో చైనా సైనికులు జరిపిన దాడిలో భారత సైనికులు 20 మంది వీరమరణం పొందడం తెలిసిన విషయమే. ఈ ఘటన తరువాత ఇరు పక్షాలు అక్కడికి మరిన్ని బలగాలను తరలించి బలప్రదర్శనకు దిగాయి. (వేగంగా బలగాలు వెనక్కి)
తాజాగా బుధవారం లేహ్‌లోని ఓ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన భారత యుద్ధ విమానాలు 240 కి.మీ.ల దూరంలోని సరిహద్దుల వరకూ ప్రయాణించాయి. రోడ్డుమార్గంలో చెక్‌పాయింట్లు ఏర్పాటు కావడమే కాకుండా లేహ్‌లో మిలటరీ కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నట్లు సమాచారం. లేహ్ రహదారులపై మిలటరీ వాహనాలు క్యూలు కట్టాయని స్థానికులు తెలపగా.. భారత సైనికులు ఇప్పుడు చెప్పుకోదగ్గ స్థాయిలో ఈ ప్రాంతంలో ఉన్నారని మిలటరీ అధికారి ఒకరు తెలిపారు.
పాకిస్థాన్, చైనాలు రెండింటికీ సరిహద్దు అయిన ఈ ప్రాంతంలో మిలటరీ కార్యకలాపాలు మనుపెన్నడూ లేనంత స్థాయిలో చోటు చసుకోవడంలో స్థానికుడు ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. గల్వాన్ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలేవీ కనిపించడం లేదని, అదే సమయంలో చైనా ఆక్రమించినట్టుగా చెబుతున్న భూభాగాన్ని భారత్ మళ్లీ చేజిక్కించుకునే అవకాశాలు తక్కువేనని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన హర్‡్ష పంత్ వ్యాఖ్యానించడం గమనార్హం.
జూన్ 22 నాటి ఉపగ్రహచిత్రం
Comments
Please login to add a commentAdd a comment