
న్యూఢిల్లీ: భారత్ భద్రతకు డ్రాగన్ దేశం చైనా నుంచి అతిపెద్ద ముప్పు పొంచి ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎఫ్) బిపిన్ రావత్ ఉద్ఘాటించారు. దేశ సరిహద్దుల రక్షణ కోసం గత ఏడాది తరలించిన వేలాది మంది సైనికులను, ఆయుధాలను ఇప్పుడే వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేదని తెలిపారు. సమీప భవిష్యత్తులోనూ అది సాధ్యం కాదని అన్నారు. భారత్–చైనా మధ్య సరిహద్దు వివాదానికి పరిష్కారం లభించడం లేదని, ఇరు దేశాల మధ్య విశ్వాసం కొరవడడం, అనుమానాలు పొడసూపుతుండడమే ఇందుకు కారణమని వివరించారు.
సరిహద్దులో గానీ, సముద్రంలో గానీ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా ధీటుగా బదులు చెప్పేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని బిపిన్ రావత్ స్పష్టం చేశారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ పాలన పునఃప్రారంభం కావడం భారత్ భద్రతకు ప్రమాదకరమైన పరిణామమేనని వివరించారు. అఫ్గానిస్తాన్ నుంచి అందే ఆయుధాలతో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు బలం పుంజుకొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
గత ఏడాది జూన్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద ఇరు దేశాల సైన్యం మధ్య భీకర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరు పక్షాలు పదుల సంఖ్యలో ప్రాణనష్టాన్ని ఎదుర్కొన్నాయి. సరిహద్దుకు భారత్, చైనా భారీగా సైన్యాన్ని, ఆయుధాలను తరలించాయి. సైన్యాన్ని వెనక్కి రప్పించడానికి ఆరు పక్షాల మధ్య ఇప్పటిదాకా 13 దఫాలు చర్చలు జరిగాయి. అయినప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. ఇరు దేశాలు ఎల్‌ఏసీ వద్ద పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించాయి. సరిహద్దు వెంట తమ భూభాగాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment