Border protection
-
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ 97 వేల మంది భారతీయులు పట్టివేత
వాషింగ్టన్: 2022 అక్టోబర్–2023 సెప్టెంబర్ కాలంలో అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 96,917 మంది భారతీయులు పట్టుబడినట్లు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(యూసీబీపీ) తెలిపింది. ఇటీవల అక్రమంగా ప్రవేశించిన భారతీయుల సంఖ్య అయిదు రెట్లు పెరిగిందని పేర్కొంది. 2019–20లో 19,883 మంది పట్టుబడగా ఈ సంఖ్య 2020–21లో 30,662కు చేరిందని, 2021–22లో 63, 927కు పెరిగిందని వివరించింది. 2022 అక్టోబర్–2023 సెప్టెంబర్ మధ్యన దొరికిపోయిన వారిలో కెనడా సరిహద్దుల్లో 30,010 మంది, మెక్సికో సరిహద్దుల్లో మరో 41,770 మంది ఉన్నారని తెలిపింది. యువత అత్యధికంగా 84 వేల మంది వరకు ఉన్నట్లు పేర్కొంది. ఒంటరిగా వచ్చి మరో 730 మంది మైనర్లు కూడా ఉన్నట్లు వివరించింది. -
భారత్ భద్రతకు చైనా నుంచి అతిపెద్ద ముప్పు
న్యూఢిల్లీ: భారత్ భద్రతకు డ్రాగన్ దేశం చైనా నుంచి అతిపెద్ద ముప్పు పొంచి ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎఫ్) బిపిన్ రావత్ ఉద్ఘాటించారు. దేశ సరిహద్దుల రక్షణ కోసం గత ఏడాది తరలించిన వేలాది మంది సైనికులను, ఆయుధాలను ఇప్పుడే వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేదని తెలిపారు. సమీప భవిష్యత్తులోనూ అది సాధ్యం కాదని అన్నారు. భారత్–చైనా మధ్య సరిహద్దు వివాదానికి పరిష్కారం లభించడం లేదని, ఇరు దేశాల మధ్య విశ్వాసం కొరవడడం, అనుమానాలు పొడసూపుతుండడమే ఇందుకు కారణమని వివరించారు. సరిహద్దులో గానీ, సముద్రంలో గానీ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా ధీటుగా బదులు చెప్పేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని బిపిన్ రావత్ స్పష్టం చేశారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ పాలన పునఃప్రారంభం కావడం భారత్ భద్రతకు ప్రమాదకరమైన పరిణామమేనని వివరించారు. అఫ్గానిస్తాన్ నుంచి అందే ఆయుధాలతో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు బలం పుంజుకొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది జూన్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ఇరు దేశాల సైన్యం మధ్య భీకర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరు పక్షాలు పదుల సంఖ్యలో ప్రాణనష్టాన్ని ఎదుర్కొన్నాయి. సరిహద్దుకు భారత్, చైనా భారీగా సైన్యాన్ని, ఆయుధాలను తరలించాయి. సైన్యాన్ని వెనక్కి రప్పించడానికి ఆరు పక్షాల మధ్య ఇప్పటిదాకా 13 దఫాలు చర్చలు జరిగాయి. అయినప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. ఇరు దేశాలు ఎల్ఏసీ వద్ద పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించాయి. సరిహద్దు వెంట తమ భూభాగాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటున్నాయి. -
మెక్సికో సరిహద్దు గోడకు 1.14 లక్షల కోట్లు
వాషింగ్టన్: మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించడానికి వచ్చే పదేళ్ల కాలానికి సుమారు రూ.1.14 లక్షల కోట్లు కేటాయించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఎన్నికల ప్రచారంలో చేసిన ఈ వాగ్దానాన్ని ఎలా నెరవేరుస్తారన్న దానిపై కొంత స్పష్టత వచ్చింది. సరిహద్దు రక్షణకు మొత్తం సుమారు రూ.2.09 లక్షల కోట్లు అవసరమని అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ఒక అంచనా పత్రాన్ని విడుదల చేసింది. అందులో గోడ నిర్మాణానికి రూ.1.14 లక్షల కోట్లు, సాంకేతిక పరికరాలకు సుమారు 36 వేల కోట్లు, రోడ్డు నిర్మాణం, నిర్వహణ తదితరాలకు సుమారు రూ.6 వేల కోట్ల చొప్పున ప్రతిపాదించారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2027 నాటికి అమెరికా నుంచి మెక్సికోను వేరు చేస్తూ 1552 కి.మీ మేర గోడ లేదా కంచె పూర్తవుతుంది. మరోవైపు, పాక్‌ను దారిలోకి తేవడానికి ఆర్థిక సాయం నిలిపేయడమే కాకుండా ఇతర అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని అమెరికా తెలిపింది. తాలిబన్, హక్కానీ నెట్వర్క్ లాంటి ఉగ్ర సంస్థల నిర్మూలనకు పాకిస్తాన్‌ను ఒప్పించేందుకు ఇంకా ఎన్నో మార్గాలున్నాయని ఉన్నతాధికారి చెప్పారు. -
సరిహద్దు రక్షణ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తాం
కోల్‌కతా: రోహింగ్యాలు సహా దేశంలోకి వచ్చే అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడానికి భారత్–బంగ్లాదేశ్‌ల మధ్య త్వరలోనే ఏకీకృత కమాండ్ నేతృత్వంలో ‘సరిహద్దు రక్షణ గ్రిడ్’ను ఏర్పాటు చేస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులతో రాజ్‌నాథ్ గురువారం నాడిక్కడ భేటీ అయ్యారు. కంచెలు, నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ సంస్థలు, రాష్ట్ర పోలీసులు, బీఎస్ఎఫ్, ఇతర కేంద్ర, రాష్ట్ర బలగాలతో 4,036 కి.మీ మేర ‘సరిహద్దు రక్షణ గ్రిడ్’ను ఏర్పాటు చేస్తామన్నారు. ఏకీకృత కమాండ్‌లో ఆర్మీ, పారామిలటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులు భాగస్వాములుగా ఉంటారన్నారు. -
సరిహద్దు రక్షణలో అమరుడైన ఏపీ సైనికుడు
రాజస్థాన్ సరిహద్దులో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చుండూరు(తెనాలి): దేశ సరిహద్దు రక్షణలో ఏపీ సైనికుడు ఒకరు అమరుడయ్యారు. రాజస్థాన్ సరిహద్దుల్లోని అల్వార్‌లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో గుంటూరు జిల్లాకు చెందిన జవాన్ మోదుకూరి నాగరాజు(29) మృతిచెందారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఈ సంఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని మండలకేంద్రం చుండూరు నాగరాజు స్వగ్రామం. ఆయన మృతి గురించి ఆదివారం సమాచారమందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. నాగరాజుకు భార్య, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. భార్య ప్రస్తుతం నిండుచూలాలు. ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భర్త అమరుడైన విషయాన్ని తెలియజేయలేదు. పదేళ్లక్రితమే సైన్యంలో చేరిక.. నాగరాజు ఏడేళ్ల వయసులోనే తల్లి శివకుమారి మరణించగా.. వ్యవసాయం చేసుకుంటూ తండ్రి సోమయ్య పిల్లల్ని పెంచారు. పదోతరగతి వరకు చదివిన నాగరాజుకు సైన్యంలో చేరాలనే ఆసక్తి. దీంతో పదేళ్లక్రితం సైన్యంలో చేరి, దూరవిద్యలో ఇంటర్మీడియట్ పూర్తిచేశారు. రాజస్థాన్‌లోని అల్వార్ వద్ద సరిహద్దుల్లో ఆర్టిలరీ గన్నర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నాగరాజు అన్నయ్య శివనారాయణ వ్యవసాయం చేస్తుండగా.. తమ్ముడు కృష్ణ సైతం సైన్యంలో చేరారు. ప్రస్తుతం కృష్ణ జమ్మూకశ్మీర్‌లో విధుల్లో ఉన్నారు. కాగా, నాగరాజు భౌతికకాయం ఆదివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో స్వగ్రామమైన చుండూరుకు చేరింది.