దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు
రాష్ట్రంలో చార్మినార్‌లో కొత్త చట్టాల కింద తొలి ఎఫ్‌ఐఆర్ నమోదు
పోలీసు దర్యాప్తు, కోర్టు విచారణలకు గడువు
దేశంలో ఎక్కడున్నా ఈ–ఎఫ్‌ఐఆర్ నమోదు
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సీఆర్‌పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఏఈ) స్థానంలో దేశవ్యాప్తంగా సోమవారం నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్‌ఏ)లోని వివిధ సెక్షన్ల కిందే దేశంలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో తొలి ఎఫ్‌ఐఆర్ చార్మినార్‌లో నమోదైంది. నంబర్ ప్లేట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తిపై కొత్త చట్టాల్లోని సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు.
కొత్త రకాల నేరాలకు చోటు..
వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యల గురించి ఈ కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వచించారు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో దేశ సార్వ¿ౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హం చేశారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులకు కొత్త అధ్యాయాన్ని చేర్చారు. పెళ్లి పేరుతో మహిళలను లోబరుచుకొని మోసగించడం, చిన్నారులపై సామూహిక అత్యాచారాలు, మూక దాడుల వంటి నేరాలకు ఐపీసీలో ప్రత్యేక సెక్షన్లు లేవు. ఆ లోటును భారతీయ న్యాయ సంహితలో భర్తీ చేశారు. సత్వర న్యాయం కోసం ప్రతి అంశంలో గడువు నిర్దేశిస్తూ బీఎన్‌ఎస్‌ఎస్‌లో 45 సెక్షన్లు చేర్చారు. అరెస్టు, తనిఖీ, సీజ్, దర్యాప్తులో పోలీసుల జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి 20కిపైగా కొత్త సెక్షన్లు ప్రవేశపెట్టారు.
కొత్త నేర చట్టాల్లోని కొన్ని ముఖ్యమైన సెక్షన్ల గురించి కుప్లంగా..
ఈ–ఎఫ్‌ఐఆర్
సెక్షన్ 173 (1) బీఎన్‌ఎస్‌ఎస్ ప్రకారం.. నేరం జరిగిన చోటు నుంచే కాకుండా దేశంలో ఎక్కడ ఉన్నా ఆన్‌లైన్‌లో ఈ–ఎఫ్‌ఐఆర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అది ప్రజల హక్కు. అనంతరం పోలీసుల నుంచి జాప్యం లేకుండా సెక్షన్ 173 (2) ప్రకారం ఎఫ్‌ఐఆర్ కాపీని పొందవచ్చు. సెక్షన్ 193 (3) (2) ప్రకారం 90 రోజుల్లోగా కేసు దర్యాప్తు పురోగతిని బాధితులకు విధిగా తెలియజేయాలి.
మరణశిక్షే..
తప్పుడు హామీతో మహిళను లోబరుచుకొని లైంగిక అవసరాలు తీర్చుకుంటే సెక్షన్ 69 కింద కఠిన నేరంగా పరిగణిస్తారు. బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడితే సెక్షన్ 70 (2) ప్రకారం మరణశిక్ష విధించే అవకాశం ఉంది. సెక్షన్ 176 (1) ప్రకారం బాధితుల ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతి తీసుకోవాలి. బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నా సెక్షన్ 184 (1) ప్రకారం ఆమె అనుమతి తప్పనిసరి. సెక్షన్ 184 (6) కింద వారంలోగా వైద్య పరీక్షల నివేదికను
సంబంధిత వైద్యుడు దర్యాప్తు అధికారి ద్వారా కోర్టుకు అందజేయాలి.
డిజిటల్ రికార్డులు...
ఎల్రక్టానిక్, డిజిటల్ రికార్డులను కూడా ప్రాథమిక సాక్ష్యంగా పరిగణిస్తారు. సెక్షన్ 2 (1) (డీ) ప్రకారం డాక్యుమెంట్ నిర్వచనాన్ని పొడిగించి అందులో వీటిని భాగం చేశారు. సెక్షన్ 61 కింద ఇతర డాక్యుమెంట్లతో సమానంగా డిజిటల్ డాక్యుమెంట్లను పరిగణిస్తారు. సెక్షన్ 62, 63 ప్రకారం కోర్టులో ఎల్రక్టానిక్ రికార్డులకు ఆమోదం ఉంటుంది.
ఈ–బయాన్..
సెక్షన్ 530 కింద కోర్టుల్లో బాధితుల నుంచి ఎల్రక్టానిక్ స్టేట్‌మెంట్ తీసుకొనేందుకు అనుమతి. ఆన్‌లైన్ ద్వారా సాక్షులు, నిందితుల హాజరు.(బీఎస్‌ఏలోని సెక్షన్ 2 కూడా ఇదే అంశాన్ని చెబుతోంది)
గడువు నిర్దేశం..
సెక్షన్ 251: తొలి విచారణ చేపట్టిన 60 రోజుల్లోగా అభియోగాలను నమోదు చేయాలి.
సెక్షన్ 346: క్రిమినల్ కేసుల విచారణలో రెండు వాయిదాలకు మించి వేయడానికి వీలులేదు.
సెక్షన్ 258: క్రిమినల్ కోర్టుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా తీర్పు వెల్లడించాలి.
పర్యవేక్షణ..
సెక్షన్ 20: కేసుల విచారణ వేగవంతం, అప్పీల్ దాఖలుపై అభిప్రాయాలను జిల్లా డైరెక్టరేట్ ప్రాసిక్యూషన్, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పర్యవేక్షిస్తుంటాయి.
అండర్ ట్రయల్స్ విడుదల...
సెక్షన్ 479: నిందితులు చేసిన నేరంలో మూడింట ఒక వంతు జైలులో ఉంటే వారి విడుదలకు అనుమతి. అయితే వారికి అదే తొలి నేరమై ఉండాలి.
తనిఖీల వీడియో రికార్డు..
సెక్షన్ 105: పోలీసులు తనిఖీలు, సీజ్‌లు చేసేటప్పుడు వీడియో రికార్డింగ్ తప్పనిసరి.
సెక్షన్ 35 (7): కేసులో మూడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే అవకాశం ఉండి.. అనారోగ్యంతో బాధపడతున్నా లేదా 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారి అరెస్టుకు డిప్యూటీ ఎస్పీ ర్యాంక్ అధికారి అనుమతి తీసుకోవాలి.
సెక్షన్ 76: ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే నేరాలకు ఫోరెన్సిక్ దర్యాప్తు తప్పనిసరి.
ఉగ్రవాదానికి నిర్వచనం..
బీఎన్‌ఎస్ సెక్షన్ 113: దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రత, ఆర్థిక భద్రతకు ముప్పవాటిల్లే చర్యలు చేపడితే ఉగ్రవాదంగా పరిగణిస్తారు.
ఆన్‌లైన్‌లోనూ సమన్లు..
నిందితులు లేదా ప్రతివాదులకు ఎస్‌ఎంఎస్, వాట్సాప్ లాంటి ఎల్రక్టానిక్ మాధ్యమాల ద్వారా కూడా సమన్లు జారీ చేయొచ్చు. దీంతో తమకు సమన్లు అందలేదని వారు తప్పించుకొనే వీలుండదు.
చైన్ స్నాచింగ్..
గతంలో చైన్ స్నాచింగ్ లాంటి వాటికి ప్రత్యేక శిక్షలు లేవు. భారతీయ న్యాయ సంహితలో స్నాచింగ్‌ను కూడా నేరంగా పేర్కొన్నారు. స్నాచింగ్‌కు పాల్పడిన వారిని నేరస్తులుగా గుర్తిస్తారు.
దేశద్రోహం..
భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్పు చేశారు. కులం, మతంతో పాటు మరే ఇతర కారణంతోనైనా సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే యావజ్జీవ శిక్ష పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment