విశ్లేషణ
మన దేశంలో నిందితులకు బేడీలు వేయడం అతి మామూలు విషయం. ఈ విధంగా బేడీలు వేయడం చట్టబద్ధమేనా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బేడీలు వేయడానికి చట్టబద్ధత లేదా? నిందితులు తప్పించుకుంటే ఎలా అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 49 ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తి తప్పించుకోకుండా కావలసిన నిర్బంధాన్ని పోలీసులు ఉపయోగించవచ్చు. అంతేకాని నిందితులకి సాధారణంగా బేడీలు వేయకూడదు. ఈ విషయాన్ని చాలా కేసులలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అరెస్ట్ చేసినప్పుడు సంకెళ్ళు వేయాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదు. అరెస్ట్ అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛను నిలుపుదల చేయడం. అది కోర్టు ఉత్తర్వుల వల్ల కావచ్చు లేక అతని మీద ఆరోపించబడిన నేరానికి జవాబు చెప్పటం కోసం కావచ్చు. అరెస్ట్ ఉద్దేశ్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అతనిపై ఉన్న క్రిమినల్ ఆరోపణలకు అతను కోర్టులో జవాబు చెప్పటానికి, రెండవది అతను ఏదైనా నేరం చేయకుండా నిరోధించటానికి.
అరెస్ట్ చేసే క్రమంలో అవసరమైన బలప్రయోగాన్ని పోలీసులు ఉపయోగించవచ్చు. అయితే ఆ వ్యక్తి అరెస్ట్‌ని నిరోధించినప్పుడు మాత్రమే బలప్రయోగం చేయాల్సి ఉంటుంది. జీవిత ఖైదు కానీ మరణ శిక్ష కానీ విధించే నేరం చేసిన వ్యక్తులను అవసరమైతే చంపటానికి కూడా అవకాశం ఉంది. అంతే కానీ సంకెళ్ళు వేయాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదు.
సంకెళ్ళు వేయడాన్ని చట్టం ఆమోదించదు. సంకెళ్ళు వేయడం లాంటి చర్యలు అమానుషమనీ, ముద్దాయి గౌరవానికి భంగం కలిగించడమనీ చాలా కేసుల్లో సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 లకు సంకెళ్ళు వేయడం అనేది విరుద్ధం. సంకెళ్ళు, బంధనాలు శిక్షపడిన ఖైదీలకు కానీ విచారణలో ఉన్న ఖైదీలకు కానీ వేయడానికి వీలులేదు.
కోర్టు ముందు హాజరు పరిచిన ముద్దాయిలకు సంకెళ్ళు వేయాలంటే మెజిస్ట్రేట్ అనుమతి అవసరం. ఆ వ్యక్తి పారిపోడానికి ప్రయత్నం చేస్తాడని ఆధారాలు ఉన్నపుడు, పోలీసుల కస్టడీ నుంచి పారిపోతాడని కచ్చితంగా భావించినప్పుడు, అరుదైన కేసుల్లో, హింసాత్మకమైన ప్రవృత్తి ఉన్నప్పుడు, వాళ్ళు అపాయకరమైన వ్యక్తులు అయినప్పుడు మేజిస్ట్రేట్ ఈ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అలా నిర్ణయానికి రావడానికి మేజిస్ట్రేట్ కారణాలు కూడా రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చాలా కేసుల్లో స్పష్టం చేసింది.
అందులో ప్రముఖమైన కేసు ప్రేమ్ శంకర్ శుక్లా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ (ఏఐఆర్ 1980 సుప్రీం కోర్టు 1535). ఒకవేళ పోలీసులు సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించి సంకెళ్ళు వేసినట్లైతే వారు కోర్టు ధిక్కార నేరం కింద శిక్షింపబడతారని సుప్రీంకోర్టు సిటిజెన్స్ డెమొక్రసీ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం 1996 సుప్రీంకోర్టు కేసెస్ (క్రిమినల్) 612 లో స్పష్టం చేసింది. సంకెళ్ళు వేయకుండా ముద్దాయి తప్పించుకోకుండా ఉండడానికి సుప్రీంకోర్టు ప్రేమ్ శంకర్ శుక్లా కేసులో కొన్ని ప్రత్యామ్నాయాలను సూచించింది. అవి ఎస్కార్ట్‌లో ఉన్న పోలీసుల సంఖ్య పెంచాలి. వాళ్ళకి ఆయుధాలు ఇవ్వాలి. వారికి సరైన శిక్షణ కూడా ఇవ్వాలి.
అయితే కొత్తగా వచ్చిన ‘భారతీయ నాగరిక సురక్ష సంహిత’ సంకెళ్ళు వేయడం విషయంలో అనుమతి ఇచ్చింది. ఈ కొత్త చట్టం లోని సెక్షన్ 43లో అరెస్ట్ ఎలా చేయాలో చెప్పారు. అదే విధంగా సబ్ సెక్షన్ 3లో అరెస్ట్ చేసినప్పుడు సంకెళ్ళు వేయడం గురించి కూడా చెప్పారు. నేర స్వభావాన్ని నేర తీవ్రతను బట్టి అరెస్ట్ చేసిన వ్యక్తులకు సంకెళ్ళు వేయవచ్చు.
అలవాటుపడిన నేరస్థులకు, మళ్ళీ మళ్ళీ నేరం చేసిన వ్యక్తులకు, కస్టడీ నుంచి తప్పించుకున్న వ్యక్తులకు, వ్యవస్థీకృత నేరం చేసిన వ్యక్తులకు, తీవ్రవాద చర్యలు పాల్పడిన వ్యక్తులకు, మాదక ద్రవ్యాల నేరాలు చేసిన వ్యక్తులకు, ఆయుధాలు, మందుగుండు సామాను అక్రమంగా కలిగిన వ్యక్తులకు; హత్య, రేప్, యాసిడ్ దాడి, నకిలీ నాణాలు, నోట్లు కలిగి ఉన్న వ్యక్తులకు, మనుషుల అక్రమ రవాణా చేసే వ్యక్తులకు, పిల్లలపై సెక్స్ నేరాలు చేసిన వ్యక్తులకు, రాజ్యంగ వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తులకు పోలీసులు సంకెళ్ళు వేయవచ్చని ఈ నిబంధన చెప్తుంది. రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన నేరాలు ఏమిటి అనే విషయంలో స్పష్టత లేదు. అందుకని అందరికీ సంకెళ్ళు వేసే అవకాశం ఉంది.
మళ్ళీ నేరం చేసిన వ్యక్తులకు సంకెళ్ళు వేయవచ్చు. దీన్ని చట్టంలో నిర్వచించలేదు. అందుకని ఇది కూడా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు భార్యా భర్తల మధ్య తగువు ఏర్పడి కట్నం కోసం వేధిస్తున్నారన్న దరఖాస్తుతో బాటు మరెన్నో కేసులను పెట్టిన సందర్భాలను మనం చూస్తున్నాం.
ఆ కేసులు నిజమైనవా అబద్ధమైనవా అన్న విషయం అప్పుడు తెలియదు. ఈ కేసులు భర్త మీదే కాకుండా కుటుంబ సభ్యులందరి మీదా పెడుతున్నారు. అలాంటప్పుడు వారందరికీ సంకెళ్ళు వేసే పరిస్థితి చట్టం కల్పిస్తుంది. అప్పుడు వాళ్ళు ఎంతటి అసౌకర్యానికి గురవుతారో, ఎంతటి అవమానానికి గురవుతారో ఊహించవచ్చు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇట్లా ఎన్నో కేసులను ఉదాహరించవచ్చు.
చట్టం అనుమతి ఇవ్వనప్పుడే సంకెళ్ల సంస్కృతి మన దేశంలో ఉంది. సంకెళ్ళు వేయడమే కాదు నేరారోపణలకు గురి అయిన వ్యక్తులను ఊరేగించడం మనం చూస్తున్నాం. ప్రజలు ఆవిధంగా కోరుకుంటున్నారు కాబట్టి మేము ఊరేగిస్తున్నామని పోలీసులు అంటారు. చట్టం అనుమతి ఇవ్వనప్పుడు ఆ విధంగా ఊరేగించటం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు కొన్ని సందర్భాలలో సంకెళ్ళు వేయడాన్ని చట్టం అనుమతి ఇస్తుంది.
ఇలాంటప్పుడు సంకెళ్ళు వేసి దుర్వినియోగం చేసే పరిస్థితి ఎక్కువ అవుతుంది. సంకెళ్ళు వేయడం రాజ్యాంగ విరుద్ధం, మానవ హక్కుల ఉల్లంఘన అని సుప్రీం కోర్టు చాలా కేసుల్లో చెప్పింది. ఆ తీర్పులన్నింటినీ ప్రక్కన పెట్టి కొత్త చట్టంలో సంకెళ్ళు వేసే వెసులుబాటును పార్లమెంటు కల్పించింది. ఈ వెసులుబాటు మరెంత దుర్వినియోగం అవుతుందో వేచి చూడాలి.
డా‘‘ మంగారి రాజేందర్
వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ ‘ 9440483001
Comments
Please login to add a commentAdd a comment