సమాచార కమిషనర్ల నియామకంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తాపీగా, నింపాదిగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు గుర్తిం చింది. కమిషనర్లను నియమించకపోవడం, ఉన్న వారు పదవీ విరమణ చేసిన తరువాతైనా కొత్తగా నియామకాలు చేయకపోవడం, మాజీ ప్రభుత్వోద్యోగులను నియమించడమే ప్రభుత్వాలు సమాచార హక్కును నీరుగార్చడానికి పన్నే వ్యూహాలు. కాలపరిమితుల్లో ఫైళ్ల సమాచారాన్ని పౌరులకు ఇప్పించడానికి రూపొందిన ఆర్టీఐ చట్టం కమిషనర్లు లేకుండా సాగదు. పౌరులు అడిగిన సమాచారాన్ని కమిషనర్లు ఇప్పించడంతో పాలకుల సంగతులన్నీ జనాలకు తెలియడం మొదలైంది. జనం ఏమడుగుతారో, ఏం ఇవ్వాల్సి వస్తుందో అని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, వారిపై రాజకీయ నాయకులు ఆందోళన చెందడం కూడా పెరి గిపోయింది. దీనివల్ల జనం చైతన్యవంతులవుతున్నారనీ, తప్పులు చేయదలుచుకున్న అధికారులు, ఉద్యోగులు భయపడడం వల్ల అవినీతి తగ్గుతుందని తెలిసినా కమిషనర్లను నియమించడానికి ప్రభుత్వాలు కదలడమే లేదు. ఆర్టీఐ ప్రియులు కోర్టులను ఆశ్రయించి ప్రజాప్రయోజన వాజ్యాలు వేస్తే, దానిపై కోర్టులు నోటీసులు ఇచ్చి నాలుగు అక్షింతలు వేస్తే తప్ప నియామకాల ఫైళ్లు కదలడం లేదు. ఒక్క కేంద్రమే కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల పరిస్థితి కూడా ఇంతే. కేంద్రంలో ఉన్నంత కదలిక రాష్ట్రాలలో లేకపోవడం దురదృష్టకరం. వెంట వెంటనే నియామకాలు పూర్తి చేయమంటూ సుప్రీం కోర్టు ఫిబ్రవరి 15న ఒక గణనీయమైన తీర్పు చెప్పింది. ఏపీ, తెలంగాణతో ఏడు రాష్ట్రాలు వెంటనే పారదర్శకంగా కమిషనర్ల నియామకాలు చేపట్టాలని సుప్రీం సూచించింది. నియామకాలు జరిగిన చోట పరిశీలిస్తే అందరూ మాజీ అధికారులే. ప్రభుత్వ సేవకులనే ప్రభుత్వం కమిషనర్లుగా నియమించడం ఎందుకనీ, మిగతా రంగాలలో మీకు సుప్రసిద్ధులైన వ్యక్తులే దొరకలేదా అనీ నిలదీసింది.
ఆర్టీఐ చట్టం సెక్షన్ 12(5)లో ఎనిమిది రకాల వృత్తి ఉద్యోగరంగాలను పేర్కొంటూ అందులో నిష్ణాతులైన వారిని ఎంపిక చేయాలని ఆదేశిస్తున్నా, కేవలం ఉద్యోగులనే నియమిస్తున్నారు. ‘తమ అధీనంలో పనిచేసిన మాజీ అధికారులనే కమిషనర్లుగా నియమించడంలో పక్షపాతం స్పష్టంగా కనిపిస్తున్నదని’ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎ కె సిక్రీ, ఎస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. ఏపీతో సహా చాలా రాష్ట్రాల్లో చీఫ్ కమిషనర్ లేనే లేరు. తెలంగాణలో చీఫ్, ఒక కమిషనర్ మాత్రమే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు కమిషనర్లను నియమించారు కానీ వారి పని ఇంకా మొదలు కాలేదు.
తెలంగాణలో 2019 జనవరి 23 నాటికి పది వేల 102 అప్పీల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. 2017 అక్టోబర్ 23 నుంచి 2019 జనవరి 23 వరకు దాఖలైన అప్పీల్స్‌లో 65 శాతం వినడం పూర్తయింది. 2017 సెప్టెంబర్ 15 నుంచి చీఫ్‌తోపాటు ఒక కమిషనర్ పనిచేస్తున్నారు. ఈ కమిషనర్ల సంఖ్య సరిపోదు, చాలా తక్కువ అని సుప్రీంకోర్టు విమర్శించింది. కమిషనర్ల నియామకం కాకముందే 6,825 కేసులు ఉన్నాయి. తరువాత పదివేలకు పెరి గాయి. ఈ ఇద్దరు కమిషనర్లు ఎన్నేళ్లు వింటే ఈ కేసులు ముగుస్తాయి? జనానికి ఎప్పుడు సమాచారం ఇస్తారు? తెలంగాణ కమిషన్లో మిగతా ఖాళీలు ఆర్నెల్లలో పూరించాలని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణం. అడిగిన సమాచారం ఇవ్వడం ఎందుకు, రెండో అప్పీలు వినడానికి కమిషనే లేదు. కమిషన్ వేసినా పని మొదలు కాలేదు. ఆ తరువాత మన కేసు కొన్నేళ్లదాకా రాదు. అయినా మన బాస్‌లే అక్కడ కమిషనర్లు కనుక పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదులే అనే నిర్లక్ష్య వైఖరి అక్కడ నెలకొంది. 2014లో రాష్ట్రవిభజన తరువాత సొంతంగా కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఊసే ఎత్తరు. ఉమ్మడి రాష్ట్రం కమిషనర్లలో కొందరు రిటైరయినారు. కొందరి నియామకం రద్దయింది. తరువాత తెలంగాణ ప్రభుత్వం ఇద్దరిని నియమించుకున్నది. ఏపీలో కమిషనే లేదు. ఈ హక్కు లేకుండానే రెండేళ్లు గడిపింది ఏపీ సర్కార్. హైకోర్టులో, సుప్రీం కోర్టులో కేసులు పడిన తరువాత ఇటీవల ముగ్గురిని ఎంపిక చేశారు. వారికి నియామక పత్రాలు ఇవ్వడానికి కొన్ని నెలలు పట్టింది. ఆ తరువాత నెలలు గడిచినా వారికి కార్యాలయమైనా ఉందా? కేసుల విచారణ చేపట్టారా? అనుమానమే. చీఫ్ కమిషనర్, ఇంకొందరు కమిషనర్ల ఎంపికకు చర్యలే తీసుకోవడం లేదేమిటి అని సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. మూడు నెలల్లో చీఫ్‌ను నియమించండి, కమిషన్ ఖాళీలను పూరించండి అని సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది.
వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
మాజీ సేవకులే, తాజా కమిషనర్లా?
Published Fri, Feb 22 2019 12:57 AM | Last Updated on Fri, Feb 22 2019 12:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment