రుణ ఎగవేతదారుల జాబితా ఇవ్వనందుకు గరిష్ట జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు తెలియజేయాలనే నోటీసును నేను సమాచార కమిషనర్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌కు ఇచ్చినందుకు కారణాలు అడుగుతున్నారు. చట్టం ప్రకారం సమాచారం ఎవరి దగ్గర ఉందో ఆ అధికారి సమాచారం ఇవ్వకపోతే నోటీసులు ఎన్నోసార్లు ఇచ్చాను. దానిపై ఎవరూ ప్రశ్నించలేదు. ఈ సారి గవర్నర్ స్థాయి అధికారికి ఇచ్చేసరికి చర్చ జరిగింది.
ఆర్బీఐ రుణ ఎగవేతదారుల గురించి, బ్యాంకుల ఇన్స్‌పెక్షన్ నివేదికల గురించి వెల్లడించాలని మన పూర్వ కమిషనర్ శైలేశ్ గాంధీ ఇచ్చిన పదకొండు ఆదేశాలను ఆ సంస్థ పాటించకుండా సుప్రీం కోర్టులో సవాలు చేయడం, మన సర్వోన్నత న్యాయస్థానం, ఆర్బీఐ వాదం చెల్లదని కొట్టి వేసిన తరువాత కూడా ఆ ఆదేశాలను ఆర్బీఐ పాటించడం లేదని బాధపడుతూ శైలేశ్ గాంధీ ఒక సామాన్యవ్యక్తిగా ఆర్టీఐ కింద ఫిర్యాదు చేస్తే, దానికి ఆర్టీఐ దరఖాస్తు ఆధారం లేదనే సాకుతో సమాచార కమిషన్ తిరస్కరించినపుడు ఎవ్వరూ అడగలేదు. బ్యాంకులకు డబ్బు ఎగవేసిన వారి వివరాలు, బ్యాంకు ఇన్స్‌పెక్షన్ నివేదికలు వెల్లడించాలని కోరుతూ ఆర్టీఐ దరఖాస్తు దాఖలైతేనే కదా ఆ వ్యవహారం సీఐసీని దాటి సుప్రీంకోర్టుదాకా వెళ్లింది? సుప్రీంకోర్టు ఆదేశించినా సరే ఆ సమాచారం ఇవ్వను పొమ్మని ఆర్బీఐ తన అధికారిక అంతర్జాల వేదికపై బాహాటంగా ప్రకటన చేసింది.
సుప్రీంకోర్టులో ఒక పిల్ విచారణలో ఉంది కనుక ఇవ్వకపోవడం అన్యాయం. ఇదే సమాచారం కోరుతూ మరొక అప్పీలు వచ్చినపుడు గతంలో పదకొండు అప్పీళ్లలో సీఐసీ ఇచ్చిన ఆదేశాలను, సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ఆర్బీఐ తిరస్కరించిన విషయాన్ని గమనించి ఇప్పటికైనా ఆ ఆదేశాలను పాటించాలని ఆర్బీఐకి ఉత్తర్వులు జారీచేశాను.
ఆర్టీఐ చట్టం రాకముందు 2003లో ఒక పిల్ ద్వారా అప్పుఎగవేతదారుల వివరాలు అడిగితే, సుప్రీంకోర్టు సీల్డ్ కవర్‌లో ఆ వివరాలు ఇమ్మని ఆర్బీఐని ఆదేశించింది. వారిచ్చారు. ఇంతవరకు ఆ విచారణ ముగియనే లేదు. విచారణలో ఒక అంశం ఉంది కనుక ఆ అంశంపై ఏ సమాచారమూ ఇవ్వబోమని ప్రజాసమాచార అధికారి కూడా సెక్షన్ 8(1)(బి) ప్రకారం అనడానికి వీల్లేదు. కోర్టులు నిషేధించిన సమాచారం మాత్రమే ఇవ్వకూడదు. కాని ఈ చట్టనియమానికి వ్యతిరేకంగా ఇద్దరు కమిషనర్లు పెండింగ్ కేసు నెపంతో, సుప్రీంకోర్టు ఏ విషయమో తేల్చేదాకా మేమేమీ చెప్పం అనడం సబబుకాదు. మరోవైపు ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం ఆర్బీఐ పదకొండు అప్పీళ్లపై విచారణ జరిపి తుదితీర్పు ఇస్తూ వివరాలన్నీ ఇవ్వాలని ఆదేశిస్తే దాన్ని పాటించకపోవడం తప్పు.
సీఐసీ ఇచ్చిన పదకొండు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్థించిన విషయం గుర్తించాలి. సెక్షన్ 4(1)(బి) ఆర్టీఐ చట్టం 2005 ప్రకారం ప్రతి ప్రభుత్వ సంస్థ ముఖ్యంగా ఆర్బీఐ స్వయంగా వెల్లడి చేయవలసిన సమాచారం వెల్లడి చేయాలని నిర్దేశిస్తూ ఉంటే, సుప్రీంకోర్టు చెప్పిన తరువాత కూడా ‘నేను చెప్పను పొమ్మం’టూ ఉంటే ఆ అంశాన్ని పరీక్షించి సరైన చర్యలు తీసుకునే అధికారం సీఐసీకి ఉంది. జనం డబ్బును ఎగవేసిన దురుద్దేశపూర్వక రుణగ్రస్తుల పేర్లను రహస్యంగా కాపాడే నేరానికి సహకరించే చట్టపరమైన బాధ్యతేదీ కమిషన్ మీద లేదు. ఎవరి పేర్లు దాచాలని చూస్తున్నారు? జూన్ 2017 నాటికి తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, మన భారతీయ బ్యాంకులను కొల్లగొట్టిన రుణగ్రస్తులు వారు, 2017 సెప్టెంబర్ 30 నాటి లెక్కల ప్రకారం లక్షా పదివేల కోట్ల రూపాయలు బాకీ పడిన ఘనులు వారు, వేయి కోట్లరూపాయలకు పైగా అప్పు తీసుకుని మొత్తం 26 వేల కోట్లదాకా ఎగవేసిన 11 అగ్రశ్రేణి రుణగ్రహీతలు వారు, జూన్ 30, 2018 లెక్కల ప్రకారం మిలియనీర్లయి ఉండి కూడా 50 కోట్ల కన్న ఎక్కువ అప్పు ఎగవేసి, బ్యాంకులు కేసులు వేస్తే దేశం వదిలి పారిపోయి విదేశాల్లో స్థిరపడిన 7000 మంది ఘరానా ప్రముఖులు.
ఇంకా ఎందరో థగ్గులు, మాతృభూమిని దోచుకునే దొరల వివరాలు ప్రజలకు తెలియకూడదా? ఒకవైపు మూడులక్షల మంది రైతులు చిన్న అప్పులు చెల్లించలేదనే నింద భరించలేక ప్రాణాలు పొలాల్లోనే వదిలేస్తుంటే, మన బ్యాంకులను దోచుకుని విదేశాల్లో బతికే ఈ దుర్మార్గుల పేర్లను రక్షించాలని కమిషనర్లుగా మేం ఏదైనా ప్రమాణం చేసామా? ఇప్పటికైనా శైలేశ్ గాంధీ ఇచ్చిన వెల్లడి ఆదేశాలను, వాటిని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునూ అమలు చేయడానికి తగిన చర్యలు మొదలు పెట్టాలి. మన సమాచార చట్టం మీద, సీఐసీ సంస్థ మీద జనానికి ఉన్న నమ్మకాన్ని కాస్తయినా పెంచాలి.
వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
Published Fri, Nov 23 2018 1:29 AM | Last Updated on Fri, Nov 23 2018 1:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment