Information Act
-
మాజీ సేవకులే, తాజా కమిషనర్లా?
సమాచార కమిషనర్ల నియామకంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తాపీగా, నింపాదిగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు గుర్తిం చింది. కమిషనర్లను నియమించకపోవడం, ఉన్న వారు పదవీ విరమణ చేసిన తరువాతైనా కొత్తగా నియామకాలు చేయకపోవడం, మాజీ ప్రభుత్వోద్యోగులను నియమించడమే ప్రభుత్వాలు సమాచార హక్కును నీరుగార్చడానికి పన్నే వ్యూహాలు. కాలపరిమితుల్లో ఫైళ్ల సమాచారాన్ని పౌరులకు ఇప్పించడానికి రూపొందిన ఆర్టీఐ చట్టం కమిషనర్లు లేకుండా సాగదు. పౌరులు అడిగిన సమాచారాన్ని కమిషనర్లు ఇప్పించడంతో పాలకుల సంగతులన్నీ జనాలకు తెలియడం మొదలైంది. జనం ఏమడుగుతారో, ఏం ఇవ్వాల్సి వస్తుందో అని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, వారిపై రాజకీయ నాయకులు ఆందోళన చెందడం కూడా పెరి గిపోయింది. దీనివల్ల జనం చైతన్యవంతులవుతున్నారనీ, తప్పులు చేయదలుచుకున్న అధికారులు, ఉద్యోగులు భయపడడం వల్ల అవినీతి తగ్గుతుందని తెలిసినా కమిషనర్లను నియమించడానికి ప్రభుత్వాలు కదలడమే లేదు. ఆర్టీఐ ప్రియులు కోర్టులను ఆశ్రయించి ప్రజాప్రయోజన వాజ్యాలు వేస్తే, దానిపై కోర్టులు నోటీసులు ఇచ్చి నాలుగు అక్షింతలు వేస్తే తప్ప నియామకాల ఫైళ్లు కదలడం లేదు. ఒక్క కేంద్రమే కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల పరిస్థితి కూడా ఇంతే. కేంద్రంలో ఉన్నంత కదలిక రాష్ట్రాలలో లేకపోవడం దురదృష్టకరం. వెంట వెంటనే నియామకాలు పూర్తి చేయమంటూ సుప్రీం కోర్టు ఫిబ్రవరి 15న ఒక గణనీయమైన తీర్పు చెప్పింది. ఏపీ, తెలంగాణతో ఏడు రాష్ట్రాలు వెంటనే పారదర్శకంగా కమిషనర్ల నియామకాలు చేపట్టాలని సుప్రీం సూచించింది. నియామకాలు జరిగిన చోట పరిశీలిస్తే అందరూ మాజీ అధికారులే. ప్రభుత్వ సేవకులనే ప్రభుత్వం కమిషనర్లుగా నియమించడం ఎందుకనీ, మిగతా రంగాలలో మీకు సుప్రసిద్ధులైన వ్యక్తులే దొరకలేదా అనీ నిలదీసింది. ఆర్టీఐ చట్టం సెక్షన్ 12(5)లో ఎనిమిది రకాల వృత్తి ఉద్యోగరంగాలను పేర్కొంటూ అందులో నిష్ణాతులైన వారిని ఎంపిక చేయాలని ఆదేశిస్తున్నా, కేవలం ఉద్యోగులనే నియమిస్తున్నారు. ‘తమ అధీనంలో పనిచేసిన మాజీ అధికారులనే కమిషనర్లుగా నియమించడంలో పక్షపాతం స్పష్టంగా కనిపిస్తున్నదని’ కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎ కె సిక్రీ, ఎస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు. ఏపీతో సహా చాలా రాష్ట్రాల్లో చీఫ్ కమిషనర్ లేనే లేరు. తెలంగాణలో చీఫ్, ఒక కమిషనర్ మాత్రమే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు కమిషనర్లను నియమించారు కానీ వారి పని ఇంకా మొదలు కాలేదు. తెలంగాణలో 2019 జనవరి 23 నాటికి పది వేల 102 అప్పీల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. 2017 అక్టోబర్ 23 నుంచి 2019 జనవరి 23 వరకు దాఖలైన అప్పీల్స్‌లో 65 శాతం వినడం పూర్తయింది. 2017 సెప్టెంబర్ 15 నుంచి చీఫ్‌తోపాటు ఒక కమిషనర్ పనిచేస్తున్నారు. ఈ కమిషనర్ల సంఖ్య సరిపోదు, చాలా తక్కువ అని సుప్రీంకోర్టు విమర్శించింది. కమిషనర్ల నియామకం కాకముందే 6,825 కేసులు ఉన్నాయి. తరువాత పదివేలకు పెరి గాయి. ఈ ఇద్దరు కమిషనర్లు ఎన్నేళ్లు వింటే ఈ కేసులు ముగుస్తాయి? జనానికి ఎప్పుడు సమాచారం ఇస్తారు? తెలంగాణ కమిషన్‌లో మిగతా ఖాళీలు ఆర్నెల్లలో పూరించాలని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణం. అడిగిన సమాచారం ఇవ్వడం ఎందుకు, రెండో అప్పీలు వినడానికి కమిషనే లేదు. కమిషన్ వేసినా పని మొదలు కాలేదు. ఆ తరువాత మన కేసు కొన్నేళ్లదాకా రాదు. అయినా మన బాస్‌లే అక్కడ కమిషనర్లు కనుక పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదులే అనే నిర్లక్ష్య వైఖరి అక్కడ నెలకొంది. 2014లో రాష్ట్రవిభజన తరువాత సొంతంగా కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఊసే ఎత్తరు. ఉమ్మడి రాష్ట్రం కమిషనర్లలో కొందరు రిటైరయినారు. కొందరి నియామకం రద్దయింది. తరువాత తెలంగాణ ప్రభుత్వం ఇద్దరిని నియమించుకున్నది. ఏపీలో కమిషనే లేదు. ఈ హక్కు లేకుండానే రెండేళ్లు గడిపింది ఏపీ సర్కార్. హైకోర్టులో, సుప్రీం కోర్టులో కేసులు పడిన తరువాత ఇటీవల ముగ్గురిని ఎంపిక చేశారు. వారికి నియామక పత్రాలు ఇవ్వడానికి కొన్ని నెలలు పట్టింది. ఆ తరువాత నెలలు గడిచినా వారికి కార్యాలయమైనా ఉందా? కేసుల విచారణ చేపట్టారా? అనుమానమే. చీఫ్ కమిషనర్, ఇంకొందరు కమిషనర్ల ఎంపికకు చర్యలే తీసుకోవడం లేదేమిటి అని సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది. మూడు నెలల్లో చీఫ్‌ను నియమించండి, కమిషన్ ఖాళీలను పూరించండి అని సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ఆర్టీఐని ఉల్లంఘించిన ఆర్బీఐపై చర్యలేవి?
రుణ ఎగవేతదారుల జాబితా ఇవ్వనందుకు గరిష్ట జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు తెలియజేయాలనే నోటీసును నేను సమాచార కమిషనర్‌గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌కు ఇచ్చినందుకు కారణాలు అడుగుతున్నారు. చట్టం ప్రకారం సమాచారం ఎవరి దగ్గర ఉందో ఆ అధికారి సమాచారం ఇవ్వకపోతే నోటీసులు ఎన్నోసార్లు ఇచ్చాను. దానిపై ఎవరూ ప్రశ్నించలేదు. ఈ సారి గవర్నర్ స్థాయి అధికారికి ఇచ్చేసరికి చర్చ జరిగింది. ఆర్బీఐ రుణ ఎగవేతదారుల గురించి, బ్యాంకుల ఇన్స్పెక్షన్ నివేదికల గురించి వెల్లడించాలని మన పూర్వ కమిషనర్ శైలేశ్ గాంధీ ఇచ్చిన పదకొండు ఆదేశాలను ఆ సంస్థ పాటించకుండా సుప్రీం కోర్టులో సవాలు చేయడం, మన సర్వోన్నత న్యాయస్థానం, ఆర్బీఐ వాదం చెల్లదని కొట్టి వేసిన తరువాత కూడా ఆ ఆదేశాలను ఆర్బీఐ పాటించడం లేదని బాధపడుతూ శైలేశ్ గాంధీ ఒక సామాన్యవ్యక్తిగా ఆర్టీఐ కింద ఫిర్యాదు చేస్తే, దానికి ఆర్టీఐ దరఖాస్తు ఆధారం లేదనే సాకుతో సమాచార కమిషన్ తిరస్కరించినపుడు ఎవ్వరూ అడగలేదు. బ్యాంకులకు డబ్బు ఎగవేసిన వారి వివరాలు, బ్యాంకు ఇన్స్పెక్షన్ నివేదికలు వెల్లడించాలని కోరుతూ ఆర్టీఐ దరఖాస్తు దాఖలైతేనే కదా ఆ వ్యవహారం సీఐసీని దాటి సుప్రీంకోర్టుదాకా వెళ్లింది? సుప్రీంకోర్టు ఆదేశించినా సరే ఆ సమాచారం ఇవ్వను పొమ్మని ఆర్బీఐ తన అధికారిక అంతర్జాల వేదికపై బాహాటంగా ప్రకటన చేసింది. సుప్రీంకోర్టులో ఒక పిల్ విచారణలో ఉంది కనుక ఇవ్వకపోవడం అన్యాయం. ఇదే సమాచారం కోరుతూ మరొక అప్పీలు వచ్చినపుడు గతంలో పదకొండు అప్పీళ్లలో సీఐసీ ఇచ్చిన ఆదేశాలను, సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ఆర్బీఐ తిరస్కరించిన విషయాన్ని గమనించి ఇప్పటికైనా ఆ ఆదేశాలను పాటించాలని ఆర్బీఐకి ఉత్తర్వులు జారీచేశాను. ఆర్టీఐ చట్టం రాకముందు 2003లో ఒక పిల్ ద్వారా అప్పుఎగవేతదారుల వివరాలు అడిగితే, సుప్రీంకోర్టు సీల్డ్ కవర్లో ఆ వివరాలు ఇమ్మని ఆర్బీఐని ఆదేశించింది. వారిచ్చారు. ఇంతవరకు ఆ విచారణ ముగియనే లేదు. విచారణలో ఒక అంశం ఉంది కనుక ఆ అంశంపై ఏ సమాచారమూ ఇవ్వబోమని ప్రజాసమాచార అధికారి కూడా సెక్షన్ 8(1)(బి) ప్రకారం అనడానికి వీల్లేదు. కోర్టులు నిషేధించిన సమాచారం మాత్రమే ఇవ్వకూడదు. కాని ఈ చట్టనియమానికి వ్యతిరేకంగా ఇద్దరు కమిషనర్లు పెండింగ్ కేసు నెపంతో, సుప్రీంకోర్టు ఏ విషయమో తేల్చేదాకా మేమేమీ చెప్పం అనడం సబబుకాదు. మరోవైపు ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం ఆర్బీఐ పదకొండు అప్పీళ్లపై విచారణ జరిపి తుదితీర్పు ఇస్తూ వివరాలన్నీ ఇవ్వాలని ఆదేశిస్తే దాన్ని పాటించకపోవడం తప్పు. సీఐసీ ఇచ్చిన పదకొండు ఉత్తర్వులను సుప్రీం కోర్టు సమర్థించిన విషయం గుర్తించాలి. సెక్షన్ 4(1)(బి) ఆర్టీఐ చట్టం 2005 ప్రకారం ప్రతి ప్రభుత్వ సంస్థ ముఖ్యంగా ఆర్బీఐ స్వయంగా వెల్లడి చేయవలసిన సమాచారం వెల్లడి చేయాలని నిర్దేశిస్తూ ఉంటే, సుప్రీంకోర్టు చెప్పిన తరువాత కూడా ‘నేను చెప్పను పొమ్మం’టూ ఉంటే ఆ అంశాన్ని పరీక్షించి సరైన చర్యలు తీసుకునే అధికారం సీఐసీకి ఉంది. జనం డబ్బును ఎగవేసిన దురుద్దేశపూర్వక రుణగ్రస్తుల పేర్లను రహస్యంగా కాపాడే నేరానికి సహకరించే చట్టపరమైన బాధ్యతేదీ కమిషన్ మీద లేదు. ఎవరి పేర్లు దాచాలని చూస్తున్నారు? జూన్ 2017 నాటికి తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, మన భారతీయ బ్యాంకులను కొల్లగొట్టిన రుణగ్రస్తులు వారు, 2017 సెప్టెంబర్ 30 నాటి లెక్కల ప్రకారం లక్షా పదివేల కోట్ల రూపాయలు బాకీ పడిన ఘనులు వారు, వేయి కోట్లరూపాయలకు పైగా అప్పు తీసుకుని మొత్తం 26 వేల కోట్లదాకా ఎగవేసిన 11 అగ్రశ్రేణి రుణగ్రహీతలు వారు, జూన్ 30, 2018 లెక్కల ప్రకారం మిలియనీర్లయి ఉండి కూడా 50 కోట్ల కన్న ఎక్కువ అప్పు ఎగవేసి, బ్యాంకులు కేసులు వేస్తే దేశం వదిలి పారిపోయి విదేశాల్లో స్థిరపడిన 7000 మంది ఘరానా ప్రముఖులు. ఇంకా ఎందరో థగ్గులు, మాతృభూమిని దోచుకునే దొరల వివరాలు ప్రజలకు తెలియకూడదా? ఒకవైపు మూడులక్షల మంది రైతులు చిన్న అప్పులు చెల్లించలేదనే నింద భరించలేక ప్రాణాలు పొలాల్లోనే వదిలేస్తుంటే, మన బ్యాంకులను దోచుకుని విదేశాల్లో బతికే ఈ దుర్మార్గుల పేర్లను రక్షించాలని కమిషనర్లుగా మేం ఏదైనా ప్రమాణం చేసామా? ఇప్పటికైనా శైలేశ్ గాంధీ ఇచ్చిన వెల్లడి ఆదేశాలను, వాటిని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునూ అమలు చేయడానికి తగిన చర్యలు మొదలు పెట్టాలి. మన సమాచార చట్టం మీద, సీఐసీ సంస్థ మీద జనానికి ఉన్న నమ్మకాన్ని కాస్తయినా పెంచాలి. వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ప్రజాస్వామ్య పాలనతోనే ప్రగతి
ఎచ్చెర్ల క్యాంపస్ : పారదర్శకమైన, ప్రజాస్వామ్య పాలనతో నే దేశ ప్రగతి సాధ్యం అవుతుందని కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచారి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రజాస్వామ్యంలో పాదర్శక పాలన ప్రాధాన్యత, ప్రస్తుతం సమాచా ర హక్కు చట్టం ప్రాధాన్యతపై విద్యార్థులు, బోధనా సిబ్బందినుద్దేశించి మాట్లాడారు. దేశం అభివృద్ధి చెందాలంటే పేద ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. పేద ప్రజలు ప్రగతి సాధించా లంటే నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు చేరాలని చెప్పారు. రాజకీయ జోక్యం, లంచాల వ ల్ల సమాజంలో పేదలకు, అర్హులకు ప్రభుత్వ పథకాలు చేరకుండా పోతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన, లబ్ధిదారుల ఎంపిక, ప్రజాస్వామ్యంలో కార్యనిర్వహక శాఖ పనితీరు ప్రజలు తెలుసుకునే అవకాశం సమాచార హక్కు చట్టం ద్వారా అందుబాటులోకి వచ్చిందన్నారు. తెల్ల రేషన్ కార్డు, రూ. 10 ఖర్చుతో ఎటువంటి అవినీతి అక్రమాలను అయినా ప్రజలు వెతికి తీయవచ్చునన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు ఈ హక్కును ఆయుధంగా ఉపయోగించుకొని అవినీతి పాలకులు, ఆధికారులపై పోరాడాలని సూచించారు. 1990 సంవత్సరం నుంచి సమాచార హక్కు చట్టం కోసం పోరాటం సాగిందని, చివరకు 2005లో అమల్లోకి వచ్చిందని వివరించారు. 20 ఏళ్ల సమాచారం ప్రజలు తీసుకోవచ్చునన్నారు. రేషన్ కార్డుకు లంచం అడిగిన అధికారిపై, మైనర్ బాలిక కిడ్నాప్‌పై స్పందించని అధికారిపై, లంచాలు. ప్రలోభాలకు సిద్థమై ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా చేసిన ఎందరో అధికారులపై సామాన్యులు విజయం సాధించినట్టు శ్రీధర్ చెప్పారు. ప్రభుత్వ పథకాలు అర్హత ప్రామాణికంగా అందజేయకపోతే సమాచార హక్కు చట్టం ద్వారా నిలదీయ వచ్చునన్నారు. ప్రస్తుతం సమాజంలో జాగృతి పెరగాలని, అవినీతిని కూకట వేళ్లతో సమాజం నుంచి బయటకు తీయవల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఏయూ వీసీ ప్రొఫెసర్ కూన రామ్‌జీ మాట్లాడుతూ విద్యార్థులు సచార హక్కు చట్టం గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిజస్ట్రార్ కురపాన రఘుబాబు, ప్రిన్సిపాల్ గుంట తులసీరావు, శ్రీకాకుళం ఆర్డీవో టి.వెంకటరమణ, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి పి,జగన్నాథరావు, ఎచ్చెర్ల తహసీల్దార్ శ్రీనివాసరావు, జిల్లా సమచార హక్కు చట్టం ప్రతినిధి కె.వసంతరావు పాల్గొన్నారు. -
ఒక ఉద్యోగిని.. మూడు కులాలు!
►స్టడీ సర్టిఫికెట్లో బీసీ–సీ ►సర్వీస్ రిజిస్టర్లో ఎస్టీ ►పదోన్నతి కోసం ఎస్సీ సర్టిఫికెట్ ►వైద్య ఆరోగ్యశాఖలో మాయాజాలం కడప రూరల్: సాధారణంగా ఎవరికైనా ఒక కులంపైనే ఉద్యోగం వస్తుంది. దానిపైనే పదోన్నతులు తదితర సర్వీసు అంతా నడుస్తుంది. వైద్యారోగ్యశాఖలో మాత్రం అలా జరగడం లేదు. ఓ ఉద్యోగిని వద్ద మూడు కుల ధ్రువీకరణపత్రాలు ఉన్నాయి. వాటిని శాఖ ఆమోదించడం గమనార్హం. ఈ వ్యవహారం ప్రస్తుతం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. సమాచారహక్కు చట్టం ద్వారా అందిన వివరాలు ఇలా ఉన్నాయి. పి దేవశిరోమణి స్కూల్ రికార్డ్స్‌లో బీసీ–సీ అని ఉంది. అనంతరం ఆమె జరనల్ కోటా కింద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఎర్రగుంట్ల పీహెచ్సీలో 1983 నవంబర్ 22న హెల్త్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. తర్వాత ‘ఇన్ సర్వీస్ కోటా’ కింద ముంబైలో 2001 మే 29 నుంచి 2002 మే 13 వరకు డీహెచ్ఈ (డిప్లమో హెల్త్ ఎడ్యుకేషన్)కోర్స్‌ను పూర్తిచేశారు. ఈ కోర్స్ చేసిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు మాత్రమే ఆ కోర్స్ చేసిన కాలానికి పే అండ్ అలవెన్స్‌ల (జీతభత్యాలు)ను అందజేస్తారు. అందుకు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఉద్యోగులు వైద్య ఆరోగ్యశాఖకు ‘డిక్లరేషన్’ పత్రాన్ని సమర్పించాలి. అందుకు దేవశిరోమణి తాను ఎస్టీ–సుగాలి అని ‘డిక్లరేషన్’ను సమర్పించారు. ఆ పత్రాన్ని 2001 మే 21న ఎర్రగుంట్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందారు. ఈ కుల ధ్రువీకరణకు వైద్య ఆరోగ్యశాఖ అంగీకారం తెలిపింది. దీంతో కోర్స్ పూర్తిచేసిన కాలానికి జీతభత్యాలను చెల్లించారు. అనంతరం ఆమె డీహెచ్ఈ కోర్స్ పూర్తి చేసినందున హెల్త్ ఎడ్యుకేటర్‌గా పదోన్నతి లభించింది. ప్రస్తుతం పోరుమామిళ్ల మండలం టేకూరుపేట పీహెచ్సీలో పనిచేస్తున్నారు. మరోసారి ఎస్సీగా.. అనంతరం ఇటీవల డిప్యూటీ డెమో పదోన్నతులు జరిగాయి. ఈ పదోన్నతులను కడప పాత రిమ్స్‌లోని ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం చేపట్టింది. అంతకుముందే ఈ పదోన్నతుల అనుమతుల కోసం డిపార్ట్మెంట్ ప్రమోషన్స్ కమిటీకి పంపారు. అందులో దేవశిరోమణి పేరు ఎస్సీ జాబితాలో ఉంది. ఆమె ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని 2000 మార్చి 19న కడప తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందినట్లుగా ఉంది. ఈ తరుణంలో ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలను సేకరించడంతో పాటు ఈ విషయాలను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారమంతా వెలుగుచూసింది. దీంతో డిప్యూటీ డెమో పదోన్నతి మాత్రమే నిలిచిపోయింది. సర్వీస్ రిజిస్టర్లో ఎస్టీగా... ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ రిజిస్టర్ ఎంతో కీలకం. కాగా దేవశిరోమణి సర్వీస్ రిజిస్టర్లో ఎస్టీ–సుగాలి అని పేరొనడం గమనార్హం. వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో అయోమయ పరిణామాలు జరిగాయి. అయితే ఇలా ఎప్పడు జరగలేదని ఆ కార్యాలయ వర్గాలు అంటున్నాయి. ఈ విషయమై సర్వీస్ రిజిస్టర్‌ను తయారుచేసిన మెడికల్ ఆఫీసర్, దానిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమోదం తెలిపిన వైద్య ఆరోగ్య, రీజనల్ డైరెక్టర్ కార్యాలయం సిబ్బంది తప్పు ఉందా..లేదా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే రెవెన్యూశాఖ పనితీరుపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఆ శాఖ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు. విచారణలో ఏ విషయాలు వెలుగుచూస్తాయనేది ఆసక్తిదాయకంగా మారింది. వివరణ కోసం దేవశిరోమణిని సంప్రదించగా ఆమె అందుబాటులోకి రాలేదు. ఎస్సార్‌లో లోపాలు ఉన్నట్లుగా గుర్తించాం దేవ శిరోమణి సర్వీస్ రిజిస్టర్ (ఎస్సార్)ను పరిశీలించాం. కొన్ని లోపాలు ఉన్నట్లుగా గుర్తించాం. ఇంకా వాస్తవాలు తెలియాల్సి ఉంది. – డాక్టర్ గణపతిరావు డిప్యూటీ డైరెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ, అమరావతి విచారణకు ఆదేశించాం ఈ విషయం నా దృష్టికి వచ్చింది. విచారణకు ఆదేశించాం. ఆ వివరాలు అందగానే చర్యలు చేపడతాం – డాక్టర్ వీణాకుమారి రీజనల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ, కడప. ఫైల్‌ను ఆర్డీ కార్యాలయానికి పంపాం అందుకు సంబంధించిన ఫైల్ ఒకసారి మా వద్దకు వచ్చింది. దానిని ఆర్డీ కార్యాలయానికి పంపాం. – డాక్టర్ రామిరెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి. -
స.హ.చట్టంపై కొరవడిన పర్యవేక్షణ
స.హ.చట్టం కమిషనర్ తాంతియాకుమారి ఉయ్యూరు : సమాచార హక్కు చట్టం అమలుపై జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ కొరవడటంతో ప్రజలకు పూర్తి న్యాయం జరగడంలేదని రాష్ట్ర కమిషనర్ లాం తాంతియకుమారి అన్నారు. స్థానిక ఆర్ అండ్ బీ బంగళాలో బుధవారం ఆమె సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లతో సమీక్ష, సామాజిక కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాంతియాకుమారి మాట్లాడుతూ కొందరు అధికారులు సమాచార హక్కు చట్టాన్ని శత్రువుగా చూస్తూ అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తమ నైతికతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం అమలుపై ఆశాజనక పరిస్థితులు లేవన్నారు. ఈ చట్టాన్ని సమర్థంగా అమలుచేయాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. సామాజిక కార్యకర్తలను బ్లాక్‌మెయిల్‌ర్లుగా చూపుతూ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఒకరిద్దరు చేసే తప్పులను పెద్దగా చూపి, చట్టం మొత్తాన్ని అపహాస్యం చేయడం తగదన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన పెంపొందించేలా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు జంపాన శ్రీనివాస్ గౌడ్, బేతపూడి జోగేశ్వరరావు, అలమూడి చంద్రమోహన్, వల్లే శ్రీనివాసరావు తదితరులు పాల్గొని తాంతియాకుమారిని సన్మానించారు. -
సమాచార హక్కు చట్టం అమలుకు సహకారం కరువైంది
నూజివీడు: సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో చైతన్యం పెంపొందించ డంలో ప్రభుత్వ సహకారం ఏమాత్రం లేదని రాష్ట్ర సమాచార కమిషనర్ లాం తాంతియాకుమారి పేర్కొన్నారు. నూజివీడు ఆర్అండ్ బీ అతిథి గృహంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషిచేయాల్సి ఉందన్నారు. అయితే కలెక్టర్లు ఆ పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం తీసుకువచ్చిన ఈ చట్టంపై ప్రజలకు పూర్తి అవగాహన వచ్చినట్లయితే అధికారులెవరూ తప్పు చేయడానికి సాహసించరన్నారు. అవినీతి కూడా చాలా వరకు తగ్గిపోతుందన్నారు. పారదర్శకత కోసం ఏర్పాటు చేసిన ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే సమాజానికే నష్టం వాటిల్లుతుందన్నారు. తన పరిధిలో ఇప్పటి వరకు 12వేల దరఖాస్తులు రాగా, వాటిలో 10వేల దరఖాస్తులు పరిష్కరించానని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కొందరు అధికారులు కోరిన సమాచారాన్ని దరఖాస్తు దారుడికి ఇవ్వకుండానే తమ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతున్నారని చెబుతున్నారని, ఇలా చేయడం సమంజసం కాదన్నారు. దరఖాస్తుదారుడు అడిగిన సమాచారం ఇవ్వడానికి అధికారులకు వచ్చే నష్టమేమిటని ఆమె ప్రశ్నించారు. తప్పు చేసిన అధికారులే సమాచారాన్ని ఇవ్వడానికి భయపడతారన్నారు. ప్రజలు కూడా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా సమాజానికి ఉపయోగపడేలా చూడాలన్నారు. -
రేపు సమాచారహక్కు చట్టంపై సదస్సు
పూడూరు: మండల కేంద్రంలో గురువార సమాచారహక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఆ చట్టం మండల కన్వీనర్ వెంకటయ్య తెలిపారు. ఉదయం 11 గంటలకు మండల పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల డీఎస్పీ శృతకీర్తి, చేవెళ్ల సీఐ ఉపేందర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. -
‘సమాచార హక్కు’ను వినియోగించుకోవాలి
- కేంద్ర సమాచార హక్కుచట్టం కమిషనర్, ప్రొఫెసర్ - శ్రీధరాచార్యులు కేయూక్యాంపస్ : సమాచారహక్కు చట్టాన్ని వినియోగించుకుని నిజాలను వెలికితీయూలని కేంద్ర సమాచార హక్కుచట్టం కమిషనర్ ప్రొఫెసర్ శీధరాచార్యులు సూ చించారు. కేయూలోని మైక్రో బయూలజీ విభాగం ఆధ్వర్యం లో ఎథిక్స్ ఇన్ మైక్రోబయాలజీ అనే అంశంపై పరిపాలనా భవనంలోని సేనేట్‌హాల్ శనివారం జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాసిన పుస్తకాన్ని వేరే వారు పబ్లిష్ చేశారని, దాన్ని కాఫీ రైట్ కింద కేసు వేసి గెలిచానని ఈ సందర్భంగా ఆయన వివరించారు. యూనివర్సిటీల్లో పరిశోధన అనేది నేడు నిజారుుతీగా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశోధనలను నేరుగా చేయూలని సూచిం చారు. కేయూసీడీసీ డీన్ ప్రొఫెసర్ సింగరాయచార్య పరిశోధనలుచేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నందుకు ఆయనను అభినందించారు. ఆయన గౌరవార్థం జాతీయ సదస్సు ను నిర్వహించడం అభినందనీయమన్నారు. కేయూ మాజీ వీసీ విద్యావతి మాట్లాడుతూ విలువలు పాటించినప్పుడే సమాజం బాగుంటుందని సూచించారు. ఈ సదస్సులో కేయూ మైక్రోబయాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్ గిరీశం, విభాగం అధిపతి ఎం. శ్రీనివాస్, బోర్డు ఆప్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ పి. వెంకటయ్య, డాక్టర్ ఈ సుజాత మాట్లాడారు. ఐఐసీటీ ప్రొఫెసర్ ఆర్ఎస్ ప్రకాశం మైక్రోబ్స్‌పై ప్రసంగించారు. ఈ సదస్సుకు కేయూసీడీసీ డీన్ ప్రొఫెసర్ సింగరాయచార్య అధ్యక్షతవహించి మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీధరాచార్యులను మాజీవీసీ విద్యావతి, సీడీసీడీన్ ప్రొఫెసర్ సింగరాయచార్య శాలువా కప్పి, మెమొంటో అందజేశారు.