ఒక ఉద్యోగిని.. మూడు కులాలు!
►స్టడీ సర్టిఫికెట్‌లో బీసీ–సీ
►సర్వీస్ రిజిస్టర్‌లో ఎస్టీ
►పదోన్నతి కోసం ఎస్సీ సర్టిఫికెట్
►వైద్య ఆరోగ్యశాఖలో మాయాజాలం
కడప రూరల్: సాధారణంగా ఎవరికైనా ఒక కులంపైనే ఉద్యోగం వస్తుంది. దానిపైనే పదోన్నతులు తదితర సర్వీసు అంతా నడుస్తుంది. వైద్యారోగ్యశాఖలో మాత్రం అలా జరగడం లేదు. ఓ ఉద్యోగిని వద్ద మూడు కుల ధ్రువీకరణపత్రాలు ఉన్నాయి. వాటిని శాఖ ఆమోదించడం గమనార్హం. ఈ వ్యవహారం ప్రస్తుతం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. సమాచారహక్కు చట్టం ద్వారా అందిన వివరాలు ఇలా ఉన్నాయి. పి దేవశిరోమణి స్కూల్ రికార్డ్స్‌లో బీసీ–సీ అని ఉంది. అనంతరం ఆమె జరనల్ కోటా కింద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఎర్రగుంట్ల పీహెచ్‌సీలో 1983 నవంబర్ 22న హెల్త్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. తర్వాత ‘ఇన్ సర్వీస్ కోటా’ కింద ముంబైలో 2001 మే 29 నుంచి 2002 మే 13 వరకు డీహెచ్‌ఈ (డిప్లమో హెల్త్ ఎడ్యుకేషన్)కోర్స్‌ను పూర్తిచేశారు. ఈ కోర్స్ చేసిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు మాత్రమే ఆ కోర్స్ చేసిన కాలానికి పే అండ్ అలవెన్స్‌ల (జీతభత్యాలు)ను అందజేస్తారు.
అందుకు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఉద్యోగులు వైద్య ఆరోగ్యశాఖకు ‘డిక్లరేషన్’ పత్రాన్ని సమర్పించాలి. అందుకు దేవశిరోమణి తాను ఎస్టీ–సుగాలి అని ‘డిక్లరేషన్’ను సమర్పించారు. ఆ పత్రాన్ని 2001 మే 21న ఎర్రగుంట్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందారు. ఈ కుల ధ్రువీకరణకు వైద్య ఆరోగ్యశాఖ అంగీకారం తెలిపింది. దీంతో కోర్స్ పూర్తిచేసిన కాలానికి జీతభత్యాలను చెల్లించారు. అనంతరం ఆమె డీహెచ్‌ఈ కోర్స్ పూర్తి చేసినందున హెల్త్ ఎడ్యుకేటర్‌గా పదోన్నతి లభించింది. ప్రస్తుతం పోరుమామిళ్ల మండలం టేకూరుపేట పీహెచ్‌సీలో పనిచేస్తున్నారు.
మరోసారి ఎస్సీగా..
అనంతరం ఇటీవల డిప్యూటీ డెమో పదోన్నతులు జరిగాయి. ఈ పదోన్నతులను కడప పాత రిమ్స్‌లోని ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం చేపట్టింది. అంతకుముందే ఈ పదోన్నతుల అనుమతుల కోసం డిపార్ట్‌మెంట్ ప్రమోషన్స్ కమిటీకి పంపారు. అందులో దేవశిరోమణి పేరు ఎస్సీ జాబితాలో ఉంది. ఆమె ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని 2000 మార్చి 19న కడప తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందినట్లుగా ఉంది. ఈ తరుణంలో ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలను సేకరించడంతో పాటు ఈ విషయాలను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారమంతా వెలుగుచూసింది. దీంతో డిప్యూటీ డెమో పదోన్నతి మాత్రమే నిలిచిపోయింది.
సర్వీస్ రిజిస్టర్‌లో ఎస్టీగా...
ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ రిజిస్టర్ ఎంతో కీలకం. కాగా దేవశిరోమణి సర్వీస్ రిజిస్టర్‌లో ఎస్టీ–సుగాలి అని పేరొనడం గమనార్హం. వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో అయోమయ పరిణామాలు జరిగాయి. అయితే ఇలా ఎప్పడు జరగలేదని ఆ కార్యాలయ వర్గాలు అంటున్నాయి. ఈ విషయమై సర్వీస్ రిజిస్టర్‌ను తయారుచేసిన మెడికల్ ఆఫీసర్, దానిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమోదం తెలిపిన వైద్య ఆరోగ్య, రీజనల్ డైరెక్టర్ కార్యాలయం సిబ్బంది తప్పు ఉందా..లేదా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే రెవెన్యూశాఖ పనితీరుపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఆ శాఖ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు. విచారణలో ఏ విషయాలు వెలుగుచూస్తాయనేది ఆసక్తిదాయకంగా మారింది. వివరణ కోసం దేవశిరోమణిని సంప్రదించగా ఆమె అందుబాటులోకి రాలేదు.
ఎస్సార్‌లో లోపాలు ఉన్నట్లుగా గుర్తించాం
దేవ శిరోమణి సర్వీస్ రిజిస్టర్ (ఎస్సార్)ను పరిశీలించాం. కొన్ని లోపాలు ఉన్నట్లుగా గుర్తించాం. ఇంకా వాస్తవాలు తెలియాల్సి ఉంది. – డాక్టర్ గణపతిరావు డిప్యూటీ డైరెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ, అమరావతి
విచారణకు ఆదేశించాం
ఈ విషయం నా దృష్టికి వచ్చింది. విచారణకు ఆదేశించాం. ఆ వివరాలు అందగానే చర్యలు చేపడతాం
– డాక్టర్ వీణాకుమారి రీజనల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ, కడప.
ఫైల్‌ను ఆర్డీ కార్యాలయానికి పంపాం
అందుకు సంబంధించిన ఫైల్ ఒకసారి మా వద్దకు వచ్చింది. దానిని ఆర్డీ కార్యాలయానికి పంపాం.
– డాక్టర్ రామిరెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి.