Study Certificate
-
ఒక ఉద్యోగిని.. మూడు కులాలు!
►స్టడీ సర్టిఫికెట్లో బీసీ–సీ ►సర్వీస్ రిజిస్టర్లో ఎస్టీ ►పదోన్నతి కోసం ఎస్సీ సర్టిఫికెట్ ►వైద్య ఆరోగ్యశాఖలో మాయాజాలం కడప రూరల్: సాధారణంగా ఎవరికైనా ఒక కులంపైనే ఉద్యోగం వస్తుంది. దానిపైనే పదోన్నతులు తదితర సర్వీసు అంతా నడుస్తుంది. వైద్యారోగ్యశాఖలో మాత్రం అలా జరగడం లేదు. ఓ ఉద్యోగిని వద్ద మూడు కుల ధ్రువీకరణపత్రాలు ఉన్నాయి. వాటిని శాఖ ఆమోదించడం గమనార్హం. ఈ వ్యవహారం ప్రస్తుతం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. సమాచారహక్కు చట్టం ద్వారా అందిన వివరాలు ఇలా ఉన్నాయి. పి దేవశిరోమణి స్కూల్ రికార్డ్స్‌లో బీసీ–సీ అని ఉంది. అనంతరం ఆమె జరనల్ కోటా కింద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఎర్రగుంట్ల పీహెచ్సీలో 1983 నవంబర్ 22న హెల్త్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. తర్వాత ‘ఇన్ సర్వీస్ కోటా’ కింద ముంబైలో 2001 మే 29 నుంచి 2002 మే 13 వరకు డీహెచ్ఈ (డిప్లమో హెల్త్ ఎడ్యుకేషన్)కోర్స్‌ను పూర్తిచేశారు. ఈ కోర్స్ చేసిన ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు మాత్రమే ఆ కోర్స్ చేసిన కాలానికి పే అండ్ అలవెన్స్‌ల (జీతభత్యాలు)ను అందజేస్తారు. అందుకు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఉద్యోగులు వైద్య ఆరోగ్యశాఖకు ‘డిక్లరేషన్’ పత్రాన్ని సమర్పించాలి. అందుకు దేవశిరోమణి తాను ఎస్టీ–సుగాలి అని ‘డిక్లరేషన్’ను సమర్పించారు. ఆ పత్రాన్ని 2001 మే 21న ఎర్రగుంట్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందారు. ఈ కుల ధ్రువీకరణకు వైద్య ఆరోగ్యశాఖ అంగీకారం తెలిపింది. దీంతో కోర్స్ పూర్తిచేసిన కాలానికి జీతభత్యాలను చెల్లించారు. అనంతరం ఆమె డీహెచ్ఈ కోర్స్ పూర్తి చేసినందున హెల్త్ ఎడ్యుకేటర్‌గా పదోన్నతి లభించింది. ప్రస్తుతం పోరుమామిళ్ల మండలం టేకూరుపేట పీహెచ్సీలో పనిచేస్తున్నారు. మరోసారి ఎస్సీగా.. అనంతరం ఇటీవల డిప్యూటీ డెమో పదోన్నతులు జరిగాయి. ఈ పదోన్నతులను కడప పాత రిమ్స్‌లోని ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం చేపట్టింది. అంతకుముందే ఈ పదోన్నతుల అనుమతుల కోసం డిపార్ట్మెంట్ ప్రమోషన్స్ కమిటీకి పంపారు. అందులో దేవశిరోమణి పేరు ఎస్సీ జాబితాలో ఉంది. ఆమె ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని 2000 మార్చి 19న కడప తహసీల్దార్ కార్యాలయం నుంచి పొందినట్లుగా ఉంది. ఈ తరుణంలో ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలను సేకరించడంతో పాటు ఈ విషయాలను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారమంతా వెలుగుచూసింది. దీంతో డిప్యూటీ డెమో పదోన్నతి మాత్రమే నిలిచిపోయింది. సర్వీస్ రిజిస్టర్లో ఎస్టీగా... ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ రిజిస్టర్ ఎంతో కీలకం. కాగా దేవశిరోమణి సర్వీస్ రిజిస్టర్లో ఎస్టీ–సుగాలి అని పేరొనడం గమనార్హం. వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో అయోమయ పరిణామాలు జరిగాయి. అయితే ఇలా ఎప్పడు జరగలేదని ఆ కార్యాలయ వర్గాలు అంటున్నాయి. ఈ విషయమై సర్వీస్ రిజిస్టర్‌ను తయారుచేసిన మెడికల్ ఆఫీసర్, దానిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమోదం తెలిపిన వైద్య ఆరోగ్య, రీజనల్ డైరెక్టర్ కార్యాలయం సిబ్బంది తప్పు ఉందా..లేదా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే రెవెన్యూశాఖ పనితీరుపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఆ శాఖ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు. విచారణలో ఏ విషయాలు వెలుగుచూస్తాయనేది ఆసక్తిదాయకంగా మారింది. వివరణ కోసం దేవశిరోమణిని సంప్రదించగా ఆమె అందుబాటులోకి రాలేదు. ఎస్సార్‌లో లోపాలు ఉన్నట్లుగా గుర్తించాం దేవ శిరోమణి సర్వీస్ రిజిస్టర్ (ఎస్సార్)ను పరిశీలించాం. కొన్ని లోపాలు ఉన్నట్లుగా గుర్తించాం. ఇంకా వాస్తవాలు తెలియాల్సి ఉంది. – డాక్టర్ గణపతిరావు డిప్యూటీ డైరెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ, అమరావతి విచారణకు ఆదేశించాం ఈ విషయం నా దృష్టికి వచ్చింది. విచారణకు ఆదేశించాం. ఆ వివరాలు అందగానే చర్యలు చేపడతాం – డాక్టర్ వీణాకుమారి రీజనల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ, కడప. ఫైల్‌ను ఆర్డీ కార్యాలయానికి పంపాం అందుకు సంబంధించిన ఫైల్ ఒకసారి మా వద్దకు వచ్చింది. దానిని ఆర్డీ కార్యాలయానికి పంపాం. – డాక్టర్ రామిరెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి. -
పోలీసుశాఖలో.. 610 కిరికిరి
జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మెదక్ జిల్లాలో చదివారు.. స్టడీ సర్టిఫికెట్ ప్రకారం చూస్తే ఆమె మెదక్ జిల్లావాసురాలు అవుతుంది. కానీ, పుట్టి పెరిగింది, తల్లిదండ్రులు నివాసం, ఉద్యోగ రిక్రూట్మెంట్ అన్నీ నల్లగొండలోనే. మరి ఆమెను స్థానికురాలు అనాలా..? స్థానికేతరరాలు అనాలా..? ఇప్పుడు జిల్లా పోలీసుశాఖలో ఇదే అయోమయం నెలకొంది.. !! పోలీసుశాఖలో 610 జీఓ సాక్షిగా కిరికిరి నడుస్తోంది. జిల్లాకు చెందినవారే అయినా, రిక్రూట్మెంట్ ఇక్కడే జరిగినా ‘స్థానికత’ విషయంలో సాంకేతికంగా ఇతర జిల్లాకు చెందిన వారవుతున్నారు. మొత్తంగా జిల్లాలో 610 జీఓ నిబంధనల మేరకు గుర్తించిన వారిలో 46మంది స్థానికేతరులుగా తేలారు. కాగా, వీరిలో 15మంది నిజంగానే ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కావడంతో, వీరి విషయంలో ఎలాంటి వివాదమూ లేదు. కానీ, మిగిలిన 31మందిది సొంత జిల్లా నల్లగొండ. కానీ, స్థానికత మాత్రం ఇతర జిల్లాకు చెందినవారిగా చూపెడుతోంది. దీనికి కారణం లేకపోలేదు. పదో తరగతి పూర్తయ్యేలోపు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అదే స్థానిక ప్రాంతం అవుతుందన్న నిబంధన ఇప్పుడు సమస్యగా మారింది. స్టడీ సర్టిఫికెట్ ప్రకారం 31మంది పోలీసు ఉద్యోగులు నాన్ లోకల్ అవుతున్నారు. కాబట్టి, 610 జీఓ నిబంధనల మేరకు వారు ఇక్కడినుంచి బయటకు వెళ్లిపోవాల్సి వస్తోంది. దీంతో సొంత జిల్లాను వదిలి, వేరే జిల్లాకు ఎలా వెళతాం అంటూ ఆవేదన చెందుతున్నారు. కేవలం స్టడీ సర్టిఫికెట్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఎలా..? ‘పేరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్’ను పరిగణనలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలన్నది వీరి డిమాండ్. ప్రభుత్వం దృష్టికి సమస్య.. ఇప్పటికే ఈ అయోమయం గురించి ప్రభుత్వం దృష్టికి కొందరు తీసుకెళ్లారు. రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లకు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. ఈ సమస్య దాదాపు అన్ని జిల్లాల్లో ఉన్నందున ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావంతో ఉన్నా, 610 జీఓను తక్షణం అమలు చేయడానికి అధికారులు నడుంబిగించడంతో ఈ 31మంది సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తాము నల్లగొండ జిల్లాలో రిక్రూట్ అయినా, నాన్‌లోకల్ అన్న పేరున ఇతర జిల్లాకు పంపిస్తే, అక్కడి అధికారులు తమకు విధుల్లో చేర్చుకోకుంటే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ‘610 జీఓ ఉద్దేశం తెలంగాణ ప్రాంతానికి చెందని వారిని బయటకు పంపడం. కానీ, తెలంగాణ రాష్ట్రం వారిని, తెలంగాణలోని మరో జిల్లాకు పంపడం ఏమిటి..? ఇదంతా కొందరు తమ పదోన్నతులు తేలిక కావడానికి, లిస్టులో పైకి ఎగబాకడానికి సృష్టిస్తున్న వివాదం. ప్రభుత్వం ఏదో ఒక క్లారిటీ ఇచ్చేదాకా మరో 2 నెలలు ఆగితే సరిపోతుంది కదా..’ అని ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు. కాగా, ఇబ్బందికరంగా ఉన్న లోకల్, నాన్-లోకల్ వివాదం గురించి ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు వెళ్లాయని చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ‘పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి గైడ్‌లైన్స్ రాలేదు. ఆందోళన చెందాల్సిన పనిలేదు. సమస్య పరిష్కారమవుతుంది..’ అని పోలీసు అధికారుల సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుందా అని సిబ్బంది ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా, జిల్లా పోలీసుశాఖకు చెందిన ఆంధ్రా ప్రాంత అధికారి కావాలనే ఈ విషయాన్ని వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.