మీకిది తగునా? | Madabhushi Sridhar Article On RTI | Sakshi
Sakshi News home page

మీకిది తగునా?

Published Fri, Dec 20 2019 12:02 AM | Last Updated on Fri, Dec 20 2019 12:20 AM

Madabhushi Sridhar Article On RTI - Sakshi

‘బోలెడంత మంది  బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారు... వసూళ్లు నడుస్తున్నాయి’ అని ఆర్టీఐ గురించి మన దేశంలో సర్వోన్నత న్యాయమూర్తి బోబ్డేగారు సెలవిచ్చారు. జస్టిస్‌ బి ఆర్‌ గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌ తో కలిసి ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ ఎ బోబ్డే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారిస్తున్నారు. ఇదివరకు సుప్రీంకోర్టు అంజలీ భరద్వాజ్‌ కేసులో సమాచార కమిషనర్ల నియామకంలో ఆలస్యం చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ తీర్పులో ఇచ్చిన సూచనలు అమలు చేయడం లేదని కేంద్రంగానీ రాష్ట్రాలు గానీ సమాచార కమిషనర్లను నియమించడం లేదని న్యాయార్థులై నిలబడ్డారు. కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుంటే తప్ప ప్రభువులు నిశ్చర్య నుంచి నిద్రనుంచి మేలుకోవడం లేదు. ఆర్టీఐని బ్లాక్‌ మెయిల్‌ కోసం వాడుకుంటున్నారనేది ఆరోపణ. అందులో కొంత నిజం ఉందా లేదా అనడానికి సర్వే లేదు సాక్ష్యం లేదు.

బ్లాక్‌ మెయిల్‌ అంటే ఏమిటి? లంచం తీసుకోవడం వంటి ఒక తప్పు చేసి దాచిపెట్టిన అధికారి అక్రమాల సమాచారం సేకరించి బయట పెట్టడానికి ఆర్టీఐ కార్యకర్త ప్రయత్నించి ఆ పని ఆపడానికి డబ్బు అడిగినా, అతను అడగకపోయినా ఆ అధి కారి డబ్బు ఇచ్చి కప్పిపుచ్చడానికి ప్రయత్నించినా అది నేరమే. ఆ నేరానికి వారిద్దరికీ శిక్షలు విధించాల్సిందే. కానీ ఆ విధంగా బ్లాక్‌ మెయిల్‌ చేయకుండా ఉండేందుకు ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించే శక్తి పైన కోతలు విధిస్తానంటే ఎంత వరకు సమంజసం. ఒక సందర్భంలో అవినీతి పరుడైన ఒక ఇంజనీరు ఢిల్లీ ఫ్రభుత్వంలో లంచాలు తీసుకుని అందుకు అనుగుణంగా కాంట్రాక్టు ఫైళ్లను మార్చాడని తెలుసుకున్న ఒక ఆర్టీఐ కార్యకర్త ఆ ఫైల్‌ కాగితాల ప్రతులను సేకరించారు. దాంతో ఆ అధికారి పదివేలు లంచం ఇవ్వడానికి సంసిద్ధుడై నాడు. లంచం ఇవ్వజూపిన సంభాషణలను రికార్డు చేసి ఆ ఆర్టీఐ కార్యకర్త రెండో అప్పీలులో ఆ విషయమై ఫిర్యాదు చేశాడు. లంచం ఇవ్వబోయిన ఆ ప్రభుత్వ అధికారిపైన చర్య తీసుకోవాలని కోరాడు. సంభాషణ రికార్డు ఉన్న సీడీని కూడా కమిషన్‌కు సమర్పించాడు.

లంచం ఇచ్చినా నేరమే తీసుకున్నా నేరమే. కానీ అది ప్రభుత్వ అధికారి విషయంలో, ప్రభుత్వ కార్యక్రమం విషయంలో నేరమవుతుంది. ఆర్టీఐ కింద సమాచారం అడగకుండా ఉండడానికి మామూలు పౌరుడికి లంచం ఇవ్వడానికి ప్రభు త్వం అధికారి ప్రయత్నిస్తే, లేదా ఇచ్చినట్టు తేలిన తరువాత కూడా అతని పైన ఏ చట్టం కింద చర్య తీసుకోవాలి? అవినీతి నిరోధక చట్టాలలో ఇటువంటి లంచ గొండితనాన్ని శిక్షించేందుకు ఏ నియమాలు చట్టాలూ లేవు. పౌరుడికి ప్రభుత్వేతర పనికోసం ప్రభుత్వ అధికారి లంచం ఇవ్వడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ మరో చట్టం తెస్తే అందుకు వీలవుతుంది. లేకపోతే ఏం చేయాలి? ఎప్పుడూ జనం నుంచి లంచాలు వసూలు చేసే ప్రభుత్వ అధికారి పౌరుడికి లంచం ఇచ్చే పరిస్థితి రావడం ఒక వింత, విచిత్రం, రాజ్యాంగపాలన అమలైన 70 సంవత్సరాల కాలంలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. ఇందుకు సంతోషించాలో గర్వించాలో ఆలోచించుకోవచ్చు.

లంచం ఇవ్వకుండా లంచగొండి అధికారిని రక్షించాలన్నది మన లక్ష్యం కాదు. ఆర్టీఐ దుర్వినియోగం పేరుతో కొందరు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారనే ప్రచారంతో మనం ఆర్టీఐ కార్యకర్తలను నిరోధించడానికి ఈ చట్టాన్ని సవరించి, పరిమితులు విధించి, ఈ హక్కు ను నీరసించేట్టు చేస్తే అది ధర్మమని అంటారా? అది న్యాయమా? 130 కోట్ల మంది ప్రజలలో కేవలం 3 కోట్ల యాభై లక్షల మంది దాకా ఆర్టీఐ వాడుకున్నారని, వారిలో చాలామంది సమాచారం పొందారని, పది పదిహేను శాతం వరకు సమాచారం కోసం కోర్టులకెక్కి పోరాడవలసి వస్తున్నదని ఒక అంచనా. అంటే మన జనాభాలో కేవలం రెండు లేదా మూడు శాతం మంది సమాచార హక్కును విని యోగించుకుంటేనే ఇంతమంది ఇంతగా భయపడుతున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. మన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను రక్షించే ఒకే ఒక ఉత్తమ ఉన్నత సంస్థ న్యాయస్థానం. అంటే సుప్రీంకోర్టు. కానీ ఆ సర్వోన్నత న్యాయపీఠం కూడా సమాచార హక్కు  గురించి ఇంతగా చర్చించడం, ధర్మాసనం నుంచి ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఏ పరిణామాలకు సంకేతం?


మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్,కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement