ఫేస్‌బుక్ నిండా దేశభక్తులే ఉంటారు. పత్రికా ప్రకటనలు, ప్రసంగాలు చేసేప్పుడు ప్రభువులంతా రాముళ్లే. ఇన్ని కోట్ల మంచివాళ్లుంటే ఇన్ని ఘోరనేరాలు ఎందుకో? మంచి ప్రభువులుంటే సంక్షేమం ఎందుకు అందడం లేదో? మనం దేశ భక్తులమేనా మన రాజులు మంచి రాజులేనా? కరోనా కాలంలో అప్పులు వాయిదా వేశాం అని గంభీరంగా రాజసింహాలు సింహనాదాలు చేశాయి. టీవీలు కొన్ని డజన్ల గంటలు చర్చలు జరి పాయి. పత్రికలు ఎకరాలకొద్దీ వ్యాసాలు రాశాయి. కోవిడ్ కాలంలో రామరాజ్యం అని ఆనందభాష్పాలు రాల్చారు. చిన్నవ్యాపారుల అప్పులపై వడ్డీపై వడ్డీ వేసి వారి నడ్డి విరుస్తారా? అని సుప్రీంకోర్టు నిలదీసింది. ప్రభువులు కరోనాలో అప్పులపై వడ్డీ వసూలు వాయిదా వేశామన్నారు కదా. మొదట మూడునెలలు వాయిదా వేశారు. అంటే మార్చి 2020 వరకు వడ్డీ పైన మారటోరియం. తరువాత మరో మూడు నెలలు మొత్తం ఆర్నెల్ల పాటు మారటోరియం అన్నారు కదా. తరువాత సంగతేమిటి? ఆ వడ్డీ ఉంటుందా ఉండదా? ఈ బకాయిలను బ్యాంకులవారు తరువాత చార్జీల్లో బాదుతారా, బాదరా? వడ్డీ వదిలేస్తారా?
ఈ ప్రశ్న నాది కాదు. ప్రతిపక్షాలది కాదు. లోక్‌సభ ఎంపీల సవాల్ కాదు. రాష్ట్ర ప్రభుత్వాలది కాదు. సామాన్యుడి ప్రశ్నే కానీ ఎవడు వింటాడు? సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా ఈ ప్రశ్న లేవనెత్తారు. భారతీయ రిజర్వ్ బాంక్, ఎట్టి పరిస్థితిలో వడ్డీ రద్దు కాదు– అని చెప్పింది. దీని అర్థం ఏమిటి, తరువాత వసూలు చేస్తారని. దీనిపైన కేంద్ర ప్రభుత్వం విధానం ఏమిటి? ఈ ప్రకటనలు చేసేముందు, పెద్ద సంస్కరణ చేసినట్టు ఆర్భాటం చేసే ముందు ఈ వడ్డీపై ఆర్నెల్ల మారటోరియం అంటే ఏమిటో వివరించాల్సిన బాధ్యత లేదా? సామాన్యుడి ప్రశ్నలకు జవాబు చెప్పరు. ఆర్టీఐ కింద అడిగినా చెప్పరు. కోవిడ్ కాలంలో కోర్టులు పూర్తిస్థాయిలో పనిచేయడం సాధ్యం కాదు. వీడియో సమావేశాల ద్వారా కేసులు వినాలంటే అన్నీ వినలేము. కేవలం అత్యంత కీలకమైన సంవిధాన, విధాన సమస్య ఉంటేనే కేసును వినడానికి ఎంచుకుంటారు.
మామూలుగా మారటోరియం ప్రకటించినపుడు ఆ స్కీంలోనే పొందుపరచవలసిన సామాన్యమైన సమాచారం కోసం పిల్ వేయాలి. ఆగ్రా నివాసి గజేంద్ర శర్మ పిల్ వేశారు. లాక్‌డౌన్‌లో బతకడమే కష్టంగా ఉంది. మారటోరియం కాలంలో కూడా వడ్డీ పడుతుందనీ, అప్పుతీసుకున్నవారు చెల్లించాల్సి వస్తుందని బ్యాంకులు వాదిస్తున్నాయని, లాక్‌డౌన్ కారణంగా వ్యాపారం దెబ్బతిన్నపుడు అప్పుతీసుకున్నవాడు చెల్లింపులు చేయడం సాధ్యం కాదని, అపుడు బతికే హక్కు భంగపడుతుం దని, అందుకని తాను కోర్టుకు వచ్చానని ఆయన కోర్టుకు నివేదించారు. సుప్రీంకోర్టు 2020 జూన్ 13న పిల్ విచారించింది, తరువాత జూన్, జూలైలలో కూడా విచారణ సాగించింది. ఆర్బీఐ జవాబు ఏమంటే.. ‘‘ఇప్పుడు వడ్డీ రద్దు కాలేదు. వసూలు చేయవలసిందే. కోవిడ్ కాలంలో ఇది వసూళ్ల ఒత్తిడి తగ్గించడానికి వాయిదా వేయడం మాత్రమే. వడ్డీ మాఫీ చేయడం లేదు, చేస్తే బ్యాంకింగ్ రంగం స్థిరత్వం దెబ్బతింటుంది. ఈ వడ్డీవాయిదా అంటే సామాన్యమైనది కాదు రెండు లక్షల కోట్ల రూపాయల సొమ్ము. అంటే ఇది మన జీడీపీలో ఒక్కశాతం. రుణం తీసుకున్నవాళ్లు రకరకాలుగా ఉంటారు కనుక ఈ డబ్బు ఎలా వసూలు చేయాలో ఆయా అప్పులిచ్చిన బ్యాంకులకు వదిలేస్తున్నాము’’ అని ఆర్బీఐ కోర్టుకు విన్నవించింది.
మారటోరియంపై మీ విధానమేమిటో తెలపండి అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. జూన్ 4న మొదటి విచారణలో ఈ చర్చ జరిగింది. కేంద్రం విధానమేమిటో చెప్పడం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎం ఆర్ షాలతో కూడిన బెంచ్ విచారణను రెండు సార్లు వాయిదావేసింది. తన విధానమేమిటో చెప్పకుండా ప్రభుత్వం వాయిదాలు అడిగింది. మేము ఆర్బీఐ, ఇతర బ్యాంకులతో మాట్లాడుతున్నాం అని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఆగస్టు 26 నాడు కూడా విధానం చెప్పలేకపోయింది. మారటోరియం కూడా 31 ఆగస్టున ముగుస్తుంది. అప్పు తీసుకున్నవాళ్లకు ఇంకా తెలియదు వడ్డీ కట్టాలా లేదా, వాయిదా పడితే వడ్డీమీద వడ్డీ వేస్తారా వేయరా అని. బ్యాంకుల వ్యాపారం విషయంపైనే దృష్టి కాని సామాన్యుల బతుకుల గురించి కరోనాలో వారి గతి గురించి పట్టించుకోరా? విధానం చెప్పకుండా ఎన్నాళ్లు దాటవేస్తారు. మీరు లాక్‌డౌన్ పెట్టడం వల్ల వచ్చిన సమస్య ఇది. రిజర్వ్ బ్యాంక్ వెనక దాక్కుం టారా, మీ వ్యాపారమే ముఖ్యం కాదు, ప్రజలకు ఊరట కలిగించడం ప్రధానం అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇది తీర్పుకాదు. ఒక ప్రశ్న.
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
వడ్డీపై వడ్డీతో చిన్నవ్యాపారి నడ్డి విరుస్తారా?
Published Fri, Aug 28 2020 1:57 AM | Last Updated on Fri, Aug 28 2020 1:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment