గతవారం సాక్షి సంపాదక పేజీలో ప్రచురితమైన ‘కొత్త బందిపోట్లు–వైద్యవ్యాపారులు, వారి బౌన్సర్లు’ అనే నా వ్యాసం కొందరు డాక్టర్లకు కోపం తెప్పించింది. వాట్సాప్‌లో తిట్లను నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు. అసభ్య, అసత్యప్రచారం చేయిస్తున్నారు. సాక్షిలో నా కాలమ్ ఆపేయిస్తామని బెదిరించేవారు కొందరైతే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయమని ఆదేశాలిచ్చేవారు ఇంకొందరు. కానీ ఎవరూ నా వ్యాసం కాపీ పెట్టడం లేదు, దాంట్లో ఫలానా మాట తప్పు అని చెప్పలేకపోతున్నారు. వ్యాసం చదివిన తరువాత ‘నిజమే డాక్టర్లపై ఒక్క నింద కూడా లేద’ని తెలుసుకుని చెప్పిన డాక్టర్లు చాలామంది ఉన్నారు. అన్ని ప్రయివేటు హాస్పిటళ్లూ చెడ్డవి కాకపోవచ్చు. కానీ అవినీతి వ్యాపారం చేసే కొన్ని చెడ్డ కార్పొరేట్ల క్రూరత్వం కనబ డటం లేదా? వారిక్రౌర్యానికి బలైన బాధిత రోగులు వందలాది మంది సాక్షిలో నా వ్యాసం ముమ్మాటికి నిజం అన్నారు. దుర్మార్గాన్ని నిలదీసే బదులు నిలదీసిన సాక్షిని, రచయితను నిందించే ముందు డాక్టర్లు, వారి సంఘం ఆలోచించుకోవాలి– మీరు రోగుల వైపా.. బౌన్సర్ల వైపా?
డాక్టర్లను నిజాం కాలపు జీతగాళ్లుగా మారుస్తున్నారు కొన్ని కార్పొరేట్ వైద్య పెత్తందార్లు. వ్యాపారుల చేతుల్లో బలయ్యేవారు కొందరు, బానిసలయ్యేవారు కొందరు. అప్పులు చేసి చదువుకున్న డాక్టర్లు, వడ్డీకట్టడానికి జీతాలకోసం వారిచేతుల్లో పావులైపోతున్నారు. ఒకవైపు వృత్తిధర్మానికి కట్టుబడి కొందరు డాక్టర్లు ప్రాణాలు పోస్తుంటే బౌన్సర్లతో విపరీత బిల్లులతో రోగులను దోచుకునే కార్పొరేట్ హాస్పిటల్స్‌కు అండగా నిలబడేవారు మరికొందరు. ఈ విషయాలు వైద్యసంఘాలకు తెలియవా? తమ అనారోగ్యాన్ని లెక్కచేయకుండా వందలాది కరోనా రోగులకు చికిత్స చేసి తమ కుటుంబాల్ని ప్రాణాపాయంలో పడేసే డాక్టర్లూ ఉన్నారు, ప్రభుత్వ ఆస్పత్రులలో హక్కుల ఉల్లం ఘనలు, మరొకవైపు ప్రయివేటు వైద్యదుకాణాల్లో రోగులపై బౌన్సర్లు. వైద్యవ్యాపారంలో వస్తున్న దారుణ ధోరణులను ఎత్తిచూపడం అందరి బాధ్యత. రోగులు ఈ వ్యాపారుల చేతుల్లో నానాకష్టాలూ పడుతుంటే.. వైద్యవృత్తిలో ఉన్నవారు, వారిసంఘాలు ఈ దుర్మార్గపు వైద్య వ్యాపారాన్ని ఖండించకుండా భరించడం న్యాయమా?
రోగుల బంధువులు గొడవలకు దిగకుండా ఆపడానికే కండలు పెంచిన యువకులను బౌన్సర్ల పేరుతో హైదరాబాద్‌లోని కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు నియమించుకున్నామని, చెప్పుకుంటున్న వార్తలను చదవలేదా? రోగిని హాస్పిటల్లో చేర్చేప్పుడు తప్ప ఇంకెప్పుడూ రోగుల గతి, ప్రగతి తెలుసుకునే అవకాశం లేకుండా పోతున్నదనీ, బిల్లులు కట్టడానికి తప్ప వాటి విషయంలో వివరాలు అడగడానికి డైరెక్టర్ల దగ్గరికి వెళ్లనివ్వడం లేదని, పూర్తి డబ్బు చెల్లించేదాకా శవాలు కూడా ఇవ్వకుండా బౌన్సర్లు అడ్డుకుంటున్నారనే సంఘటనలు ఈ వైద్యనేతల కంటికి కనబడలేదా? రోగులను భయపెట్టే బౌన్సర్ సమస్య గురించి రాస్తే డాక్టర్లకు, సంఘంనేతకు కోపం రావడమేమిటి? దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి. బౌన్సర్ల నియామకాన్ని, రోగులపై వారి నియంత్రణను సమర్థిస్తున్నారా?
చేసిన చికిత్స ఏమిటో చెప్పరు. మెడికల్ రికార్డులు ఇవ్వరు. వేసిన ధరల సమంజసత్వం ఏమిటో చెప్పరు. ఎందుకంత విపరీతమైన రేట్లు వేస్తున్నారో వివరించరు. రోగి చనిపోతే శవం ఇవ్వరు. లక్షల రూపాయల బాకీలు తీర్చేదాకా శవం వారి అధీనంలో ఉంటుందని రాస్తే వైద్యవ్యాపారులు తేలుకుట్టిన దొంగల్లా మాట్లాడడం లేదు. కానీ పురమాయించి నామీద తిట్లు, వాట్సాప్‌ల ప్రచారాలు సాగిస్తున్నారు. పంపుతున్నారు. ఎంఆర్‌పీ ధరలకు అమ్మకపోతే చర్యలు తీసుకుంటామని వైద్యశాఖ మంత్రి హెచ్చరించారు. దీనికి వైద్యులు బాధ్యులని అనలేదే. హాస్పిటల్స్ నడుపుతూ లాభనష్టాలు భరించే కార్పొరేట్ హాస్పిటల్ యజమానులను ఈ ప్రశ్నలు అడగాలా వద్దా? డాక్టర్లు, ఉద్యోగులు కనుక రోగుల తరఫున అడగలేరు. కానీ కరోనాతో, ఇతర రోగాలతో, తప్పుడు చికిత్సలకు నిర్లక్ష్యాలకు బలైనవారితో, రోగుల శవాలతో వ్యాపారం చేస్తున్నవారు బౌన్సర్లను పెట్టుకుని వారి భద్రతలో అన్యాయాలు చేస్తుంటే డాక్టర్ల సంఘాలు ఏం చేస్తున్నాయి? అని ఇంకా అడగలేదు. ఇప్పుడడుగుతున్నాను.
ఈ సంఘాలను ఎవరూ నిలదీయవద్దా? నాకు చికిత్స చేయబోమంటూ అసభ్య పదజాలంతో దూషిస్తారా? బౌన్సర్లతో డాక్టర్లకు, సంఘాలకు సంబంధం ఉందని భావించడం లేదు, వారి నెందుకు ఖండించలేదన్నది మొదటి ప్రశ్న. వారినెందుకు సమర్థిస్తున్నారనేది రెండో ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యవ్యాపారంలో వస్తున్న అమానవీయ ధోరణులను కూడా అరికట్టడానికి కౌన్సిల్ చర్యలు తీసుకోవాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, స్వచ్ఛంద సంఘం. డాక్టర్లకు, ఐఎంఏ నాయకులకు, కార్పొరేట్ వైద్య వ్యాపారులపై అదుపు ఉండకపోయినా కనీసం దారుణాలను ఆపాలి. ఖండించాలి. వైద్యవ్యాపార దుర్మార్గాలను ప్రశ్నించలేని వైద్యసంఘాలను నిలదీయాలి.
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment