సమాచార కమిషనర్లపై తీర్పులో పొరపాటు | Erred in order on RTI panel heads, Supreme Court says | Sakshi
Sakshi News home page

సమాచార కమిషనర్లపై తీర్పులో పొరపాటు

Published Wed, Sep 4 2013 4:46 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

Erred in order on RTI panel heads, Supreme Court says

న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకాల్లో అర్హతలను సవరించాలంటూ సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తన తీర్పులో పొరపాటును గ్రహించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినవారిని మాత్రమే  కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమించాలని, ఇందుకోసం సమాచార హక్కు చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఇచ్చిన ఆ తీర్పులో న్యాయపరమైన పొరపాటు దొర్లినట్లు పేర్కొంది. ఆ మేరకు ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లుగా న్యాయమూర్తులు ఎ.కె.పట్నాయక్, ఎ.కె.సిక్రిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ప్రకటించింది.
 
 సమాచార కమిషనర్ల పదవుల్లో నియామకానికి అవసరమైన అర్హతలకు సంబంధించి సమాచార హక్కు చట్టం-2005లోని 12, 15 సెక్షన్లను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీం గత ఏడాది సెప్టెంబర్ 13న తీర్పు వెలువరించింది. ఆ సెక్షన్లను రద్దు చేయడానికి నిరాకరించింది. అయితే సమాచార కమిషనర్లు వంటి న్యాయ సదృశమైన పదవుల్లో న్యాయపరమైన నేపథ్యం ఉన్నవారినే నియమించాలని, ఆమేరకు చట్టంలో సవరణలు చేయాలని తీర్పులో పేర్కొంది. ప్రధాన సమాచార కమిషనర్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోని సమాచార కమిషనర్లుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేస్తున్న లేదా పనిచేసిన వారినే నియమించాలని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement