Chief Information Commissioner
-
సీఐసీ పోస్టుకు 76 దరఖాస్తులు
న్యూఢిల్లీ: ముఖ్య సమాచార కమిషనర్(సీఐసీ) పదవిని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహా్వనించగా, ఇప్పటిదాకా 76 దరఖాస్తులు వచ్చాయి. సీఐసీ వైకే సిన్హా పదవీ కాలం మంగళవారం ముగిసింది. ఈ పోస్టు కోసం ముగ్గురు సమాచార కమిషనర్లు హీరాలాల్ సమారియా, సరోజ్ పున్హానీ, ఉదయ్ మహూర్కర్ పోటీ పడుతున్నారు. మాజీ సమాచార కమిషనర్ అమిత్ పాండోవ్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. -
చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా ఆర్ఎం భాషా.. సీఎం జగన్ నేతృత్వంలో..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా ఆర్ఎం భాషా ఎంపికయ్యారు. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా పత్తిపాటి శామ్యూల్‌ను ఎంపిక చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఎంపిక కమిటీ భేటీ అయి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చదవండి: (దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు: సీఎం జగన్) -
ఏపీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా రమేష్ కుమార్
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమాచార హక్కు(ఆర్టీఐ) చీఫ్ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.రమేష్‌కుమార్ నియమితులయ్యారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఆయన పశ్చిమ బెంగాల్ కేడర్ ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారు. పదవీ విరమణ తర్వాత పశ్చిమబెంగాల్ పరిపాలనా ట్రిబ్యునల్ సభ్యునిగా కూడా సేవలందించారు. ఉత్తమ అధికారిగా మన్ననలు అందుకున్న ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమించింది. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్లు లేదా 65 ఏళ్ల వయస్సు (ఈ రెండింటిలో ఏది ముందయితే అదే వర్తిస్తుంది) వరకు పదవిలో ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రమేష్‌కుమార్ తండ్రి అబ్బయ్య కూడా ఐఏఎస్ అధికారిగా పనిచేయడం విశేషం. (ఏపీలో అన్‌లాక్ 2.0 అమలు ఉత్తర్వులు జారీ) కమిషనర్‌గా శ్రీనివాసరావు రాష్ట్ర సమాచార కమిషనర్‌గా రేపాల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మూడేళ్లుగానీ లేదా 65 ఏళ్ల వయస్సు వరకు గానీ(ఈ రెండింటిలో ఏది ముందయితే అదే వర్తిస్తుంది) ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు సీఎస్ జీవో జారీ చేశారు. -
ప్రధాన సమాచార కమిషనర్‌గా బిమల్
న్యూఢిల్లీ: ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా ప్రస్తుత సమాచార కమిషనర్ (ఐసీ) అయిన బిమల్ జుల్కా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జుల్కా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సమాచార కమిషనర్‌గా అమిత పండోవే బాధ్యతలు స్వీకరించారు. ఆమె చేత సీఐసీ జుల్కా ప్రమాణ స్వీకారం చేయించారు. అమిత సమాచార కమిషనర్ కావడంతో కేంద్ర సమాచార కమిషన్‌లో మొత్తం కమిషనర్ల సంఖ్య (సీఐసీతో కలిపి) 7కు చేరుకుంది. మాజీ సీఐసీ సుధీర్ భార్గవ జనవరి 11న పదవీ విరమణ చేసినప్పటి నుంచి సీఐసీ పోస్టు ఖాళీగానే ఉంది. సీఐసీ కాకుండా 10 మంది కమిషనర్లు ఉండాల్సిన కేంద్ర సమాచార కమిషన్‌లో కేవలం 6 మందే కమిషనర్లు ఉన్నారు. ప్రస్తుతం అమిత పండోవే నియామకం తర్వాత మరో 4 సమాచార కమిషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత నెలలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ గతంలో సమాచార, ప్రసారశాఖ కార్యదర్శిగా పనిచేసిన జుల్కా పేరును సీఐసీ పదవికి, అమిత పండోవేను సమాచార కమిషనర్ పదవికి సూచించింది. -
ఆర్టీఐ లేకుండానే సమాచారం
సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వచ్చే దరఖాస్తులను తగ్గించడానికి ప్రభుత్వం ఇకపై క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్నంతటినీ ప్రజలకు అందుబాటులో ఉంచేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆర్టీఐ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల చీఫ్ కమిషనర్లు, కమిషనర్ల సదస్సులో అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడితే అది ప్రభుత్వ విజయానికి సంకేతం కాదని అన్నారు. ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగా ఉన్నప్పుడే ఆర్టీఐ కింద వచ్చే దరఖాస్తుల సంఖ్య తగ్గుతుందని షా అన్నారు. ఆర్టీఐ దరఖాస్తు అవసరం లేకుండా ప్రజలు ఎలాంటి సమాచారాన్నయినా క్షణాల్లో తెలుసుకునేలా ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా షా వెల్లడించారు. ప్రజలకి తమ హక్కులతో పాటుగా బాధ్యతలు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నా చితకా కారణాలకి, అవసరం లేకపోయినా ఆర్టీఐని ప్రయోగిస్తూ దానిని దుర్వినియోగం చేయవద్దని అమిత్ షా ప్రజలకి హితవు పలికారు. ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత కోసం, ఎవరికైనా వ్యక్తిగతంగా అన్యాయం జరిగితే అప్పుడే ఆర్టీఐని వినియోగించాలని అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ఒక హక్కులా చూడకుండా, దానిని వినియోగించడంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అమిత్ షా కోరారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఎం. రవికుమార్, కమిషనర్లు బివి. రమణకుమార్, ఇలాపురం రాజా పాల్గొన్నారు. -
నూతన సీఐసీగా సుధీర్ భార్గవ
న్యూఢిల్లీ: నూతన ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా కేంద్ర ప్రభుత్వం సుధీర్ భార్గవను నియమించింది. ఈయనతో పాటు మరో నలుగురు సమాచార కమిషనర్ల నియామకం చేపట్టింది. భార్గవ సీఐసీ సమాచార కమిషనర్‌గా చేశారు. ప్రధాన సమాచార కమిషనర్‌తో కలిపి మొత్తం 11 మంది ఉండాల్సిన ఈ కమిషన్‌లో ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు. ఐఎఫ్ఎస్ అధికారి అయిన యశ్వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్ఎస్ అధికారి వనజా ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ నీరజ్ కుమార్ గుప్తా, మాజీ లా సెక్రటరీ సురేశ్ చంద్రలను సమాచార కమిషనర్లుగా నియమిస్తూ సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఈ ఏడాదే ప్రభుత్వోద్యోగులుగా పదవీ విరమణ పొందారు. ఇటీవల ప్రధాన సమాచార కమిషనర్ ఆర్.కె.మాథుర్‌తో పాటు ముగ్గురు సమాచార కమిషనర్లు శ్రీధర్ ఆచార్యులు, యశోవర్ధన్ ఆజాద్, అమితవ భట్టాచార్య పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడున్న ఇతర ముగ్గురు కమిషనర్లు వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నియామకాల్లో పారదర్శకత ఏది?: మాడభూషి సాక్షి, న్యూఢిల్లీ: సీఐసీ నియామకాల్లో పారదర్శకత పాటించాలని మాజీ సీఐసీ మాడభూషి శ్రీధరాచార్యులు కోరారు. కేవలం పరిపాలన రంగానికి చెందిన అధికారులనే కాకుండా ఇతర రంగాలకు చెందిన వారినీ కమిషనర్లుగా నియమించాలన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఖర్గేకు లేఖలు రాశారు. సీఐసీ సభ్యుల ఎంపిక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత సభ్యులు. సీఐసీ సభ్యుల ఎంపిక సమాచార హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నందునే పలువురు కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యా(పిల్)లు దాఖలు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘సీఐసీ కమిషనర్లుగా కేవలం పరిపాలన వర్గాల వారినే ఎందుకు నియమిస్తున్నారు? న్యాయం, సామాజిక సేవ, మీడియా, జర్నలిజం, సైన్స్, టెక్నాలజీ తదితర రంగాల వారినీ నియమించాలన్న సమాచార హక్కు చట్ట నిబంధనలను ఎందుకు పాటించరు? ఇటీవల నియమించిన నలుగురినీ బ్యూరోక్రాట్ల నుంచే ఎందుకు ఎంపిక చేశారు?’ అని ప్రశ్నించారు. సీఐసీతోపాటు రాష్ట్రాల సమాచార హక్కు కమిషన్(ఎస్ఐసీ)లలో సకాలంలో నియామకాలు చేపట్టాలన్న నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. -
సమాచార కమిషన్లలో 30శాతం ఖాళీలు
న్యూఢిల్లీ: చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, ఇన్ఫర్మేషన్ కమిషనర్ల పోస్టుల్లో దేశవ్యాప్తంగా 30 శాతానికిపైగా ఖాళీగా ఉన్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ బుధవారం విడుదల చేసిన ఓ నివేదికలో ఈ వివరాలున్నాయి. సమాచార హక్కు చట్టం–2005 కింద సమాచారం ఇవ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు 2.5 కోట్ల ఆర్టీఐ దరఖాస్తులు వచ్చాయని నివేదికలో పేర్కొంది. రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 156 చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు, ఇన్ఫర్మేషన్ కమిషనర్ల పోస్టుల్లో 48 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్లో 30.8% పోస్టులు ఇంకా భర్తీకాలేదు. ఆంధ్రప్రదేశ్, జమ్మూకశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. 2005–16లో బాధ్యతారాహిత్యానికి సంబంధించి వేర్వేరు ప్రభుత్వ సం స్థలు, అధికారులపై సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ రూ.1.93 కోట్ల జరిమానా విధించింది. -
సమాచార కమిషన్ అవసరమా?
న్యూఢిల్లీ: ఫిర్యాదులను ఓ ధర్మాసనం విచారిస్తుండగా అర్ధాంతరంగా దానిని రద్దు చేసి అదే ఫిర్యాదు విచారణకు మరో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన విధానంపై సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) ఆర్కే మాథుర్‌కు శ్రీధర్ ఫిబ్రవరిలో 2 లేఖలు రాయగా అవి ఇటీవలే బయటకొచ్చాయి. ఇలా ధర్మాసనాలు ఏర్పాటు చేస్తే సమాచార కమిషనర్ల స్వతంత్రతపై తీవ్ర అనుమానాలు రేకెత్తుతాయనీ, పారదర్శకత, జవాబుదారీతనం లేనప్పుడు ఇక ఈ సమాచార కమిషన్ ఉండటం ఎందుకని ప్రశ్నించారు. అసలేం జరిగింది.. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎంలను 2013లో సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చారు. ఆ పార్టీలు ఈ చట్టానికి కట్టుబడి సమాచారం ఇవ్వడం లేదని ఫిర్యాదులు రావడంతో వాటిపై విచారణ జరిపేందుకు 2016లో సమాచార కమిషనర్లు శ్రీధర్ సభ్యుడిగా త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. ఆరు నెలల అనంతరం కమిషనర్లకు చెప్పకుండానే మాథుర్ ఆ ధర్మాసనాన్ని రద్దు చేసి 2017 ఆగస్టులో కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. కొత్త ధర్మాసనం ఆ ఫిర్యాదులను ఇప్పటివరకు విచారించలేదు. ప్రధాని మోదీ ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ ఉత్తీర్ణులయినట్లుగా చెబుతున్న విద్యా సంవత్సరం రికార్డులను బయటపెట్టాలని 2017లో శ్రీధర్ ఆదేశించారు. వెంటనే ఆయనను మానవ వనరుల శాఖ ఫిర్యాదులపై విచారణ బాధ్యతల నుంచి తప్పించారు. ‘కేసులను ఎవరికి అప్పగించాలనే దానిని అర్థవంతమైన పద్ధతిలో కమిషన్ సభ్యులందరూ నిర్ణయించాలి. ఫిర్యాదులను మనం ఏళ్ల తరబడి విచారించడం లేదు. కీలకమైన రాజకీయ పార్టీలపై వచ్చిన ఫిర్యాదులను విచారించకపోతే, స్వతంత్రంగా వ్యవహరించలేకపోతే ఇక మనం పారదర్శకంగా ఉన్నామని ఎలా చెప్పగలం? ఈ కమిషన్ ప్రయోజనం లేకుండా ప్రభుత్వ ఖజానాకు భారంగా మారి కొనసాగాల్సిన అవసరమేంటి?’ అని లేఖలో శ్రీధర్ ఆచార్యులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఆ వ్యాపారవేత్తల పేర్లు వెల్లడించండి
న్యూఢిల్లీ: విదేశీ పర్యటనల సందర్భంగా ప్రధాని మోదీ వెంట ఉండే ప్రతినిధుల పేర్లను వెల్లడించాలని ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ) ఆర్.కె.మాధుర్ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)ను ఆదేశించారు. ‘జాతీయభద్రత’తో ముడిపడిన అంశమైనందున పేర్లను వెల్లడించలేమంటూ పీఎంవో అభ్యంతరం వ్యక్తం చేయటాన్ని తోసిపుచ్చారు. అయితే, ప్రధాని వెంట ఉండే భద్రతా సిబ్బంది, అధికారుల వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదన్నారు. -
వేలాది పింఛన్లూ ఎగవేతేనా?
విశ్లేషణ అర్హులెవరో తేల్చి నెలనెలా పింఛను ఇస్తున్న ప్రభుత్వం ఆ పింఛన్ల చెల్లింపు ఉన్నట్టుండి ఆపేయడం ఎంత వరకు న్యాయం? సరైన కారణం లేకుండా పింఛను నిరాకరిస్తే పింఛను హక్కు భంగపరి చినట్టే. పింఛను ఆపేస్తే ఏ విధంగా పేదలు బతుకుతారు అనే ఆలోచన ఉండదా? అందుకు తగినన్ని నిధులు విడుదల చేయకపోవడం, ఎందుకో చెప్పకపోవడం న్యాయం కాదు. మరణించినా, ఆదాయం పెరిగినా, తరలిపోయినా పింఛను నిరాకరించవచ్చు. ఈ కార ణాలు లేకుండానే పింఛను ఇవ్వకపోవడం ఢిల్లీ సర్కార్ సమస్య. చరణ్‌జిత్‌సింగ్ భాటియా భార్య వికలాంగురాలు. ఆమెకు పింఛను మంజూరు చేసి 2014లో ఏప్రిల్ నుంచి జూన్ 2014 వరకు మూడువేల రూపాయలు ఫిబ్రవరి 2015లో చెల్లించారు. అంతే.. ఆ తరువాత ఆమెకు పింఛను ఇవ్వలేదు. ఢిల్లీ ప్రభుత్వానికి ఆయన ఎన్ని విన్నపాలు చేసుకున్నా విన్నవారు లేరు. పింఛను ఎందుకు నిలిపివేసారు? ఎప్పటి నుంచి ఇస్తారు? అని సమాచారం కోరుతూ దరఖాస్తు పెట్టుకున్నాడు. ఆయన దరఖాస్తును స్థానికసంస్థల డెరైక్టరేట్, ప్రణాళిక విభాగం, ఆర్థిక శాఖ, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఉత్తర) లకు బదిలీ చేశారనీ, వారినే సమాచారం అడుక్కోవాలని సలహా ఇచ్చింది ముఖ్యమంత్రి కార్యాలయం. అక్కడితో ఆగలేదు. సహ దరఖాస్తును మరో 29 కార్యాలయాలకు బదిలీ చేశారు. అందులో కొందరు మరికొన్ని శాఖలకు బదిలీచేశారు. మీరడిగిన సమాచారం మాదగ్గర లేదు, మరో శాఖకు బదిలీచేశాం మీకు వారి దగ్గరనుంచి సమాచారం వస్తుంది. రాకపోతే వారినడగండి అంటూ ఆయనకు అనేక ఉత్తరాలు చేరాయి. కాని కావలసిన సమాచారం మాత్రం అందలేదు. పింఛను చెల్లించకపోవడంపై సోషల్ జస్టిస్ అనే ఒక ఎన్జీవో పిల్‌ను దాఖలు చేసింది. ఢిల్లీ పురపాలక సంఘం వారు పింఛను పథకాన్ని సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ చేస్తున్నట్లు హైకోర్టుకు తెలియజేశారని, మునిసిపాలిటీ వారికి 2015లో 700 కోట్ల రూపాయల లోటు ఉందని, 73 వేల మందికి పింఛను పొందే అర్హత ఉన్నప్పటికీ దక్షిణ ఢిల్లీ మునిసిపాలిటీ 63,914 మందికి 30.9.2014 వరకు మాత్రమే పింఛన్లు చెల్లించిందనీ, తూర్పు ఢిల్లీ మునిసిపాలిటీ రెండేళ్ల నుంచి 107.52 కోట్ల రూపాయల మేరకు పింఛన్లు చెల్లించలేకపో యిందనీ, నిధులకొరతే కారణమని కోర్టుకు విన్నవిం చారు. ఇదే సమస్యపైన బీజేపీ నాయకులు హైకోర్టులో మరొక పిల్ వేశారు. 1.5 లక్షల మంది వృద్ధులకు పింఛను ఇవ్వడం లేదని పేర్కొన్నారు. మునిసి పాలిటీలు ఈ పింఛను పథకాన్ని ప్రభుత్వమే తీసుకో వాలని వినతి చేశాయంటూ పత్రికావార్తలు వచ్చాయి. పింఛను ఇవ్వలేకపోవడం వైఫల్యమే. పింఛనుదార్లకు పింఛను ఎప్పుడిస్తారో, ఎందుకివ్వడం లేదో చెప్పలేకపోవడం తీవ్రమైన వైఫల్యం. 2014లో, 2015లో కొత్త ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఈ పింఛను చెల్లింపులు ఎందుకు సమస్యగా మారాయో చెప్పాలని అడుగుతున్నారు. లక్షలాది పింఛన్లు చెల్లించకపోవడం మానవ హక్కుల భంగ సమస్యగా పరిణమిస్తుంది. అటు సీఎంఓ గానీ, ఇతర ప్రభుత్వ అధికారులు గానీ పింఛను ఎందుకు ఇవ్వలేకపోతు న్నారో జవాబుచెప్పడం లేదు. నిర్ణీత కాల పరిధిలో సేవలు పొందే పౌరుల హక్కుల చట్టం 2011 కింద, ఢిల్లీ ప్రభుత్వం 371 రకాల సేవలను అందించవలసి ఉంటుంది. ఇందులో నష్టపరిహార నియమాన్ని సరిగ్గా అమలుచేయడం లేదు. 15 రోజుల్లో ఇవ్వవలసిన సర్టిఫికెట్ ఇవ్వకపోతే 16వ రోజునుంచి రోజుకు కొంత చొప్పున పరిహారం పెరుగుతూ ఉండాలి. పింఛను ఇవ్వడం అనే పని చేయకపోవడం వల్ల ఎంత నష్ట పరిహారం ఇస్తారని చరణ్‌జిత్‌సింగ్ అడుగుతున్నారు. ‘అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తలమానికమైన ముఖ్యమంత్రి కార్యాలయం కూడా మామూలుగా సహ దరఖాస్తులను బదిలీ చేయడంతో కాలం వెళ్లబుచ్చడం న్యాయం కాదు. 38 విభాగాలకు బదిలీ చేయడానికి వేల రూపాయలు ఖర్చు చేస్తారు కాని పింఛనుకు డబ్బు లేదంటారు’ అని విమర్శించారు. కోరిన సమాచారం విడివిడిగా ఏ ఒక్క విభాగమూ ఇవ్వజాలదు. ఇది నిధుల లేమికి సంబంధించిన సమస్య కనుక ముఖ్యమంత్రి కార్యాలయం పట్టించు కొని వివరాలు ఇవ్వాలి. కనీసం వారి ఇబ్బందులేవో చెప్పాలి. డబ్బు లేదనో, కనుక కొన్నాళ్లు ఇవ్వలేమనో లేదా అసలు దీనికి సంబంధించి వారి ప్రణాళిక ఏమిటో వివరించవలసిన అవసరం ఉంది. చరణ్‌జిత్ సింగ్‌కు బోలెడు కాగితాలు వస్తున్నాయి కాని కావలసిన సమాచారం మాత్రం రాలేదు. సీఎం కార్యాలయం ఏ చర్య తీసుకున్నదని అడిగితే ఆ దరఖాస్తును కింది స్థాయి అధికారికి పంపడం సమాచారాన్ని నిరాకరించడమే అవుతుందనీ, ఈ ధోరణిని మానుకోవాలని, అనవ సరంగా ఆర్టీఐని బదిలీ చేసిన ప్రతి అధికారి నుంచి వంద రూపాయలు వసూలు చేసి ిసీఎం రిలీఫ్ ఫండ్‌లో జమచేయాలని, పింఛను ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా వేధించినందుకు చరణ్‌సింగ్‌కు లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని, జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని సీఐసీ ఆదేశించింది. పింఛను చెల్లింపులపైన 20 రోజులలో ఒక శ్వేతపత్రం ఇవ్వాలని కూడా ఆదేశించింది. (చరణ్‌జిత్ సింగ్ భాటియా వర్సెస్ డెరైక్టర్ లోకల్ బాడీస్, GNCTDCIC/SA/A/ 2015/001343 కేసులో 25.1.2016న తీర్పు ఆధారంగా) -మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
కేంద్ర సమాచార చీఫ్ కమిషనర్‌గా సుష్మా సింగ్
కేంద్ర సమాచార చీఫ్ కమిషనర్ (సీఐసీ)గా సీనియర్ అధికారిణి సుష్మా సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెలలో పదవీ విరమణ పొందనున్న దీపక్ సంధు స్థానంలో నియమితులయ్యారు. ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్‌తో కూడిన ప్యానెల్ సుష్మా సింగ్ నియామకంపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. సంధు తర్వాత సీఐసీగా బాధ్యతలు చేపడుతున్న రెండో మహిళ సుష్మానే. ఐఏఎస్ అధికారిణిగా రిటైరయ్యాక 2009లో సమాచార కమిషనర్‌గా ఆమె నియమితురాలయ్యారు. కేంద్ర సమాచార కమిషన్‌లో అందరికంటే ఆమే సీనియర్. -
సమాచార కమిషనర్లపై తీర్పులో పొరపాటు
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకాల్లో అర్హతలను సవరించాలంటూ సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తన తీర్పులో పొరపాటును గ్రహించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినవారిని మాత్రమే కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమించాలని, ఇందుకోసం సమాచార హక్కు చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఇచ్చిన ఆ తీర్పులో న్యాయపరమైన పొరపాటు దొర్లినట్లు పేర్కొంది. ఆ మేరకు ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లుగా న్యాయమూర్తులు ఎ.కె.పట్నాయక్, ఎ.కె.సిక్రిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ప్రకటించింది. సమాచార కమిషనర్ల పదవుల్లో నియామకానికి అవసరమైన అర్హతలకు సంబంధించి సమాచార హక్కు చట్టం-2005లోని 12, 15 సెక్షన్లను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీం గత ఏడాది సెప్టెంబర్ 13న తీర్పు వెలువరించింది. ఆ సెక్షన్లను రద్దు చేయడానికి నిరాకరించింది. అయితే సమాచార కమిషనర్లు వంటి న్యాయ సదృశమైన పదవుల్లో న్యాయపరమైన నేపథ్యం ఉన్నవారినే నియమించాలని, ఆమేరకు చట్టంలో సవరణలు చేయాలని తీర్పులో పేర్కొంది. ప్రధాన సమాచార కమిషనర్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోని సమాచార కమిషనర్లుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేస్తున్న లేదా పనిచేసిన వారినే నియమించాలని స్పష్టం చేసింది.