న్యూఢిల్లీ: ఫిర్యాదులను ఓ ధర్మాసనం విచారిస్తుండగా అర్ధాంతరంగా దానిని రద్దు చేసి అదే ఫిర్యాదు విచారణకు మరో ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన విధానంపై సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) ఆర్కే మాథుర్‌కు శ్రీధర్ ఫిబ్రవరిలో 2 లేఖలు రాయగా అవి ఇటీవలే బయటకొచ్చాయి. ఇలా ధర్మాసనాలు ఏర్పాటు చేస్తే సమాచార కమిషనర్ల స్వతంత్రతపై తీవ్ర అనుమానాలు రేకెత్తుతాయనీ, పారదర్శకత, జవాబుదారీతనం లేనప్పుడు ఇక ఈ సమాచార కమిషన్ ఉండటం ఎందుకని ప్రశ్నించారు.
అసలేం జరిగింది..
బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్‌సీపీ, సీపీఐ, సీపీఎంలను 2013లో సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చారు. ఆ పార్టీలు ఈ చట్టానికి కట్టుబడి సమాచారం ఇవ్వడం లేదని ఫిర్యాదులు రావడంతో వాటిపై విచారణ జరిపేందుకు 2016లో సమాచార కమిషనర్లు శ్రీధర్ సభ్యుడిగా త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. ఆరు నెలల అనంతరం కమిషనర్లకు చెప్పకుండానే మాథుర్ ఆ ధర్మాసనాన్ని రద్దు చేసి 2017 ఆగస్టులో కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. కొత్త ధర్మాసనం ఆ ఫిర్యాదులను ఇప్పటివరకు విచారించలేదు.
ప్రధాని మోదీ ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ ఉత్తీర్ణులయినట్లుగా చెబుతున్న విద్యా సంవత్సరం రికార్డులను బయటపెట్టాలని 2017లో శ్రీధర్ ఆదేశించారు. వెంటనే ఆయనను మానవ వనరుల శాఖ ఫిర్యాదులపై విచారణ బాధ్యతల నుంచి తప్పించారు. ‘కేసులను ఎవరికి అప్పగించాలనే దానిని అర్థవంతమైన పద్ధతిలో కమిషన్ సభ్యులందరూ నిర్ణయించాలి. ఫిర్యాదులను మనం ఏళ్ల తరబడి విచారించడం లేదు. కీలకమైన రాజకీయ పార్టీలపై వచ్చిన ఫిర్యాదులను విచారించకపోతే, స్వతంత్రంగా వ్యవహరించలేకపోతే ఇక మనం పారదర్శకంగా ఉన్నామని ఎలా చెప్పగలం? ఈ కమిషన్ ప్రయోజనం లేకుండా ప్రభుత్వ ఖజానాకు భారంగా మారి కొనసాగాల్సిన అవసరమేంటి?’ అని లేఖలో శ్రీధర్ ఆచార్యులు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment