
బిమల్ జుల్కాను అభినందిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
న్యూఢిల్లీ: ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా ప్రస్తుత సమాచార కమిషనర్ (ఐసీ) అయిన బిమల్ జుల్కా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జుల్కా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సమాచార కమిషనర్‌గా అమిత పండోవే బాధ్యతలు స్వీకరించారు. ఆమె చేత సీఐసీ జుల్కా ప్రమాణ స్వీకారం చేయించారు. అమిత సమాచార కమిషనర్ కావడంతో కేంద్ర సమాచార కమిషన్‌లో మొత్తం కమిషనర్ల సంఖ్య (సీఐసీతో కలిపి) 7కు చేరుకుంది.
మాజీ సీఐసీ సుధీర్ భార్గవ జనవరి 11న పదవీ విరమణ చేసినప్పటి నుంచి సీఐసీ పోస్టు ఖాళీగానే ఉంది. సీఐసీ కాకుండా 10 మంది కమిషనర్లు ఉండాల్సిన కేంద్ర సమాచార కమిషన్‌లో కేవలం 6 మందే కమిషనర్లు ఉన్నారు. ప్రస్తుతం అమిత పండోవే నియామకం తర్వాత మరో 4 సమాచార కమిషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత నెలలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ గతంలో సమాచార, ప్రసారశాఖ కార్యదర్శిగా పనిచేసిన జుల్కా పేరును సీఐసీ పదవికి, అమిత పండోవేను సమాచార కమిషనర్ పదవికి సూచించింది.