
రాష్ట్రాల చీఫ్ కమిషనర్లు, కమిషనర్ల సదస్సులో మాట్లాడుతున్న అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వచ్చే దరఖాస్తులను తగ్గించడానికి ప్రభుత్వం ఇకపై క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్నంతటినీ ప్రజలకు అందుబాటులో ఉంచేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆర్టీఐ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల చీఫ్ కమిషనర్లు, కమిషనర్ల సదస్సులో అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడితే అది ప్రభుత్వ విజయానికి సంకేతం కాదని అన్నారు. ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగా ఉన్నప్పుడే ఆర్‌టీఐ కింద వచ్చే దరఖాస్తుల సంఖ్య తగ్గుతుందని షా అన్నారు.
ఆర్‌టీఐ దరఖాస్తు అవసరం లేకుండా ప్రజలు ఎలాంటి సమాచారాన్నయినా క్షణాల్లో తెలుసుకునేలా ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా షా వెల్లడించారు. ప్రజలకి తమ హక్కులతో పాటుగా బాధ్యతలు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నా చితకా కారణాలకి, అవసరం లేకపోయినా ఆర్‌టీఐని ప్రయోగిస్తూ దానిని దుర్వినియోగం చేయవద్దని అమిత్ షా ప్రజలకి హితవు పలికారు. ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత కోసం, ఎవరికైనా వ్యక్తిగతంగా అన్యాయం జరిగితే అప్పుడే ఆర్‌టీఐని వినియోగించాలని అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ఒక హక్కులా చూడకుండా, దానిని వినియోగించడంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అమిత్ షా కోరారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఎం. రవికుమార్, కమిషనర్లు బివి. రమణకుమార్, ఇలాపురం రాజా పాల్గొన్నారు.