నలుగురు సమాచార కమిషనర్ల నియామకం రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాకిచ్చింది. రాష్ట్ర సమాచార కమిషనర్లుగా వర్రె వెంకటేశ్వర్లు, తాంతియా కుమారి, ఇంతియాజ్ అహ్మద్, ఎం.విజయనిర్మలల నియామకం చెల్లదంటూ తీర్పునిచ్చింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, విపక్ష నేత చంద్రబాబు ఆమోదంతో ఆ నలుగురిని సమాచార కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 75ను కోర్టు రద్దు చేసింది. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆరు వారాల్లోపు కొత్త నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది. నియామకం నాటికి ఆ నలుగురికి రాజకీయ పార్టీలతో అనుబంధం ఉంది గనుక వారి నియామకాన్ని రద్దు చేస్తున్నట్టు అందులో పేర్కొంది.
గవర్నర్ తిరస్కరించినా...
వర్రె వెంకటేశ్వర్లు, తాంతియా కుమారి, ఎం.విజయనిర్మల, ఇంతియాజ్ అహ్మద్‌లను సమాచార కమిషనర్లుగా నియమిస్తూ ఫైలును గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపడం, వారి పేర్లపై తీవ్ర విమర్శల నేపథ్యంలో గవర్నర్ తిరస్కరించడం తెలిసిందే. కానీ మరోసారి అవే పేర్లతో ఫైలును పంపడంతో వారి నియామకాన్ని గవర్నర్ ఆమోదించారు. ఆ మేరకు ్త 2013 ఫిబ్రవరి 6న ప్రభుత్వం జీవో 75ను జారీ చేసింది. ఆ జీవోను కొట్టివేయాలని కోరుతూ మాజీ ఐఏఎస్ కె.పద్మనాభయ్య, మాజీ ఐఎఫ్‌ఎస్ ఎం.పద్మనాభరెడ్డి, డాక్టర్ రావ్ చెలికాని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. తరవాత రూల్ ఆఫ్ లా అనే సంస్థ కూడా మరో వ్యాజ్యం వేసింది. నమిత్‌శర్మ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఈ నలుగురి నియామకం జరిగిందని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. ‘‘సమాచార కమిషన్ సభ్యుల్లో కనీసం ఇద్దరికి న్యాయ పరిజ్ఞానం ఉండాలని, పలు రంగాల్లో నిష్ణాతులైన వారినే నియమించాలని సుప్రీం చేసిన నిర్దేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా కమిషనర్లుగా నియమితులయ్యే వారికి రాజకీయ పార్టీలతో ఎలాంటి అనుబంధమూ, లాభదాయ పోస్టులు, వ్యాపారాలూ ఉండరాదన్న నిబంధనలకు విరుద్ధంగా వారి నియామకం జరిగింది.
తాంతియాకుమారి చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్నారు. కమిషనర్‌గా ఆమె పేరును ముగ్గురు మంత్రులు సిఫార్సు చేశారు. ఇంతియాజ్ అహ్మద్ 2009లో టీడీపీ తరఫున ప్రస్తుత సీఎం కిరణ్‌పై పోటీ చేసి ఓడిపోయి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. విజయనిర్మల 2009లో నూజివీడు నుంచి పీఆర్పీ తరఫున పోటీ చేసి ఓడారు. వెంకటేశ్వర్లు నల్లగొండ జిల్లాలో యువజన కాంగ్రెస్ నాయకునిగా వ్యవహరించారు. కమిషనర్‌గా ఆయన పేరును పరిశీలించాలంటూ మంత్రులు జానారెడ్డి, రఘువీరారెడ్డి, పార్థసారథి రాతపూర్వకంగా సీఎంకు సిఫార్సు చేశారు’’ అని వాదించారు. వాటితో ధర్మాసనం ఏకీభవించింది. ‘‘నియామకం నాటికి తమకు ఏ పార్టీలతోనూ అనుబంధం లేదని వారు తమ కౌంటర్లలో ఎక్కడా చెప్పలేదు. తద్వారా పార్టీలతో తమ అనుబంధాన్ని వారు ఖండించలేదు’’ అని తీర్పులో పేర్కొంది. సమాచార కమిషనర్ల నియామకాలను ఆరీటై చట్టప్రకారమే చేపట్టాలంటూ నమిత్‌శర్మ కేసు తీర్పును పునః సమీక్షించి సుప్రీం తాజాగా తీర్పునిచ్చిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎన్.శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.
సీఎంతో ఆ నలుగురు భేటీ
సమాచార హక్కు కమిషనర్ల నియామకంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ నలుగురు ఆర్టీఐ కమిషనర్లు గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిశారు. ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రభుత్వ నియామకంపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వ్యక్తిగతంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కమిషనర్లు యోచిస్తున్నారు.
సర్కారుకు హైకోర్టు షాక్
Published Fri, Sep 13 2013 1:30 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement