Varre venkateswarlu
-
దేశ శ్రేయస్సుకు మార్పు అనివార్యం
భారతదేశం మతపరమైన చట్టాలు, మత బోధనల చట్రంలో ఇరుక్కోని సర్వ సత్తాక లౌకిక శ్రేయో రాజ్యం. ప్రపంచంలోనే అత్యంత బలమైన పునాదులతో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ప్రజాస్వామిక దేశం. నిజమే! కానీ ఇప్పుడు అధికారం కోసం లౌకికవాదానికి తూట్లు పొడిచే ఎత్తుగడలు దేశ లౌకికతత్వంతో పాటు సమాఖ్య స్పూర్తికీ పెను ముప్పుగా నిలువ బోతున్నాయి. మతం పేరుతో, కులం పేరుతో దేశాన్ని విడగొట్టే యత్నాలతో వచ్చే సాధారణ ఎన్నికలకు రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటు న్నాయి. కానీ దీనికి పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆధ్వ ర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ ఎస్) జాతీయ పార్టీ ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారి దేశ ఎన్ని కల రణ క్షేత్రంలో దూకుతోంది. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమం ఎజెండాతో వచ్చే ఎన్నికలకు వెళతామని ఖమ్మం సభలో ప్రకటించటం ఆయా వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ప్రాజెక్టులు పచ్చగా మార్చాయి దేశంలో వరుసగా రెండు సంవత్సరాలు కోవిడ్ సృష్టించిన కల్లోలంతో ప్రపంచ దేశాలన్నీ అతలాకు తలమయ్యాయి. పలు రంగాలు పూర్తిగా దెబ్బతిని ప్రభుత్వాలు నడవడం దుర్లభం అయిపోయింది. కానీ తెలంగాణలో ఎనిమిదేళ్లుగా అమలవుతున్న సమ్మిళిత అభివృద్ధి పథకాలు తెలంగాణ ను కోవిడ్ నష్టం నుండి తొందరగానే విముక్తం చేశాయి. పారిశ్రామిక రంగం కాస్త దెబ్బతిన్నా... వ్యవ సాయ రంగం మాత్రం ఆశించిన దానికంటే ఎక్కువగా పురోగతి సాధించింది. అందుకు కారణం... సమృద్ధి వర్షాలతో సముద్రం పాలయ్యే నీటిని బీడు భూములకు మళ్లించటమే. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్... నిరంతరం కరువుతో నకనక లాడే ఉత్తర తెలంగాణను ఇప్పుడు పచ్చని సీమగా మార్చింది. ‘మిషన్ కాకతీయ’ పాడుపడిన పల్లెల్లో కొత్త కళను తెచ్చింది. ఫలితంగా రాష్ట్రంలో 2021– 22లో 378 శాతం వరి ఉత్పత్తి పెరిగి తెలంగాణ ఇప్పుడు ‘రైస్‌బౌల్ ఆఫ్ ఇండియా’గా రూపాంతరం చెందింది. పత్తి ఉత్పత్తి 61 శాతం పెరిగి తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధిలో కీలకంగా మారింది. 2020–21లో తెలంగాణ వ్యవసాయం – అనుబంధ రంగాల అదనపు స్థూల విలువ 9.09 శాతం వృద్ధిని సాధించింది. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్నది. పండిన పంటను మద్దతు ధరతో కొనుగోలు కూడా చేస్తున్నది. సమాఖ్య స్ఫూర్తి చెదరకుండా... ఇక విద్య, వైద్యంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసి మిషన్ భగీరథతో నూటికి నూరుశాతం గ్రామాలకు రక్షిత మంచినీళ్లందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ముందడుగు వేసింది. ఇప్పుడు దేశమంతా తెలంగాణ మోడల్ అభివృద్ధి సంక్షేమం కావాలంటే, వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని ఆదరించా లని కేసీఆర్ ఇచ్చిన పిలుపును దేశం ఆసక్తిగానే గమనిస్తున్నది. ఇదే సభలో పాల్గొన్న కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు సైతం దేశ సమాఖ్య స్పూర్తికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక ప్రజలపైనే ఉందని పిలుపునిచ్చారు. ఉమ్మడి జాబితాల్లోని అంశాలపై ఇప్పటికే కేంద్రం అంతర్గత భద్రత, వ్యవసాయ, సహకారం, విద్యుత్ తదితర అంశాలపై రాష్ట్రాలతో చర్చించకుండానే చట్టాలను చేసుకుపోతోంది. అలాగే మరోవైపు రాష్ట్రాలు చేస్తున్న శాసనాలను గవర్నర్లతో నియంత్రించే ప్రయత్నాలు చేస్తు న్నది. ఈ తీరు భారత సమాఖ్య స్పూర్తికి భంగం కలిగించేలా ఉంది. ఈ నేపథ్యంలో అనేక జాతులు, మతాలు, భాషలు, కులాలు, జీవన విధానాలూ ఉన్న సువిశాల భారత దేశ ‘భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతి’ని ముందుకు తీసుకు వెళ్లడం ఇప్పుడు అత్యవసరం. ఈ విధిని నిర్వహించడంతో పాటూ... సమాఖ్య స్పూర్తికి దెబ్బ తగలకుండా తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అజెండా దేశమంతా విస్తరించాలంటే ఒక్కసారి భారత రాష్ట్ర సమితికి అవకాశం ఇచ్చి చూడాలి. మతం, కులం పేరుతో రాజకీయాలు చేసే చోట అభివృద్ధి–సంక్షేమంతో వచ్చే గుణాత్మక మార్పుతోనే లౌకిక స్ఫూర్తికి కొత్త శక్తి వస్తుంది. (క్లిక్ చేయండి: వ్యవస్థకు రక్షణ రాజ్యాంగమే!) - డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన సమాచార కమిషనర్ -
బీఆర్ఎస్కు పచ్చాజెండా ఊపిన మునుగోడు ఓటర్లు
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నారు పెద్దలు. ఆ దిశగానే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారిన తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ ప్రజలు పచ్చ జెండా ఊపేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో అభ్యర్థిని గెలిపించి ‘తెలంగాణ మోడల్’ను భారత దేశమంతా అమలు చేయమని ఆశీర్వదించారు. మేమంతా ఇప్పుడు ‘భారత్ రాష్ట్ర సమితి’ వెంటేనని తెలంగాణ మెజారిటీ ప్రజలు నిర్ణయించారు. ఇప్పుడు ఉప ఎన్నికలో వచ్చిన ఫలితమే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉంటుందని చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ రెట్టించిన ఉత్సాహంతో దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లి అభివృద్ధి, సంక్షేమాలను వివరించాల్సిన అవశ్యకత ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని 64 ప్రత్యేక పథకాలు ఇక్కడే అమలవుతున్నాయి. ముఖ్యంగా సామాజిక పింఛన్లు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, చేనేత బీమాలు తెలంగాణ సమాజంలో కేసీఆర్ మార్కును చూపిస్తున్నాయి. ఒక వైపు కాళే శ్వరం లాంటి భారీ ప్రాజెక్ట్‌లతో రాష్ట్రంలో సాగు లోకి వచ్చిన భూ విస్తీర్ణం అమాంతం పెరిగిపోయి గ్రామీణ ముఖ చిత్రమే మారిపోయింది. 24 గంటల విద్యుత్, ఉచిత విద్యుత్, సర్కారే ధాన్యం కొనుగోలు చేయడం, గొర్రె పిల్లలు పంపిణీ, చేప పిల్లల పంపిణీ వంటివి కూడా గ్రామీణఆర్థిక వ్యవస్థను రోజురోజుకూ పటిష్టం చేస్తున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో 2018 ఎన్నికల మేనిఫేస్టోలో పేర్కొన్న హామీల్లో మెజారిటీ నెరవేర్చటం, మిగిలినవి ప్రగతిలో ఉండటం విశేషం. అన్నింటి కంటే ముఖ్యంగా విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించే పని ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో విజయవంతమై రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రాబోతుండటం శుభ పరిణామం. ఇవి కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే డయాలసిస్, కేన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తుండటంతో నిరు పేదలు కార్పోరేట్ ఆస్పత్రుల దోపిడి నుంచి పూర్తిగా తప్పించుకున్నారు. గడిచిన ఐదేళ్లలో తెలంగాణ నుండి కేంద్రానికి వివిధ రూపాల్లో రూ. 2.15 లక్షల కోట్ల రూపాయలను చెల్లిస్తే... కేంద్రం నుండి తెలంగాణ కు లక్ష కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి. ఎక్కువ ఆదాయం పంపే రాష్ట్రాల్లో ఎక్కువ అభివృద్ధికి అవకాశం ఇవ్వాల్సిన అసవరం ఉంది. ఇక దేశంలో సామాజిక పింఛన్లు, రైతు సంక్షేమం, విద్య, వైద్య రంగాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ ఎంతో ముందున్నది. (క్లిక్: నిజాన్కి నేనే గెల్సిన.. రేపు తెలంగాన ముక్యమంత్రిని నేనే..) కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలో వెనకబడిన, అణచివేతకు గురవుతున్న ప్రాంతాలు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవశ్యకత నేడు ఎంతో ఉంది. సహజ సంపదలు ఎన్ని ఉన్నా... వాటిని వినియోగించు కోలేని స్థితి పలు రాష్ట్రాల్లో పక్కాగా కనిపిస్తున్నది. స్వాతంత్రం వచ్చాక 75 ఏళ్లకు సాకారమైన కాళేశ్వరం... నేడు తెలంగాణ ప్రగతిలో మేలి మలుపు అయింది. వివిధ నదుల కింద ప్రాజెక్ట్‌ల నిర్మాణం ద్వారా, అనేక పరిశ్రమల స్థాపనకు ద్వారాలు తెరిచి సంపద సృష్టించి, ఆ సంపదను మళ్లీ ప్రజలకే పంచడం కేసీఆర్ ప్రత్యేకత. అందుకే మునుగోడు ఓటరు కేసీఆర్‌ని దీవించి భారత్ రాష్ట్ర సమితికి పచ్చాజెండా ఊపారు. - డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు ఉభయ రాష్ట్రాల మాజీ ప్రధాన సమాచార కమిషనర్ -
సర్కారుకు హైకోర్టు షాక్
నలుగురు సమాచార కమిషనర్ల నియామకం రద్దు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాకిచ్చింది. రాష్ట్ర సమాచార కమిషనర్లుగా వర్రె వెంకటేశ్వర్లు, తాంతియా కుమారి, ఇంతియాజ్ అహ్మద్, ఎం.విజయనిర్మలల నియామకం చెల్లదంటూ తీర్పునిచ్చింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, విపక్ష నేత చంద్రబాబు ఆమోదంతో ఆ నలుగురిని సమాచార కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 75ను కోర్టు రద్దు చేసింది. ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆరు వారాల్లోపు కొత్త నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది. నియామకం నాటికి ఆ నలుగురికి రాజకీయ పార్టీలతో అనుబంధం ఉంది గనుక వారి నియామకాన్ని రద్దు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. గవర్నర్ తిరస్కరించినా... వర్రె వెంకటేశ్వర్లు, తాంతియా కుమారి, ఎం.విజయనిర్మల, ఇంతియాజ్ అహ్మద్‌లను సమాచార కమిషనర్లుగా నియమిస్తూ ఫైలును గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపడం, వారి పేర్లపై తీవ్ర విమర్శల నేపథ్యంలో గవర్నర్ తిరస్కరించడం తెలిసిందే. కానీ మరోసారి అవే పేర్లతో ఫైలును పంపడంతో వారి నియామకాన్ని గవర్నర్ ఆమోదించారు. ఆ మేరకు ్త 2013 ఫిబ్రవరి 6న ప్రభుత్వం జీవో 75ను జారీ చేసింది. ఆ జీవోను కొట్టివేయాలని కోరుతూ మాజీ ఐఏఎస్ కె.పద్మనాభయ్య, మాజీ ఐఎఫ్ఎస్ ఎం.పద్మనాభరెడ్డి, డాక్టర్ రావ్ చెలికాని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. తరవాత రూల్ ఆఫ్ లా అనే సంస్థ కూడా మరో వ్యాజ్యం వేసింది. నమిత్‌శర్మ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఈ నలుగురి నియామకం జరిగిందని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. ‘‘సమాచార కమిషన్ సభ్యుల్లో కనీసం ఇద్దరికి న్యాయ పరిజ్ఞానం ఉండాలని, పలు రంగాల్లో నిష్ణాతులైన వారినే నియమించాలని సుప్రీం చేసిన నిర్దేశాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా కమిషనర్లుగా నియమితులయ్యే వారికి రాజకీయ పార్టీలతో ఎలాంటి అనుబంధమూ, లాభదాయ పోస్టులు, వ్యాపారాలూ ఉండరాదన్న నిబంధనలకు విరుద్ధంగా వారి నియామకం జరిగింది. తాంతియాకుమారి చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్నారు. కమిషనర్‌గా ఆమె పేరును ముగ్గురు మంత్రులు సిఫార్సు చేశారు. ఇంతియాజ్ అహ్మద్ 2009లో టీడీపీ తరఫున ప్రస్తుత సీఎం కిరణ్‌పై పోటీ చేసి ఓడిపోయి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. విజయనిర్మల 2009లో నూజివీడు నుంచి పీఆర్పీ తరఫున పోటీ చేసి ఓడారు. వెంకటేశ్వర్లు నల్లగొండ జిల్లాలో యువజన కాంగ్రెస్ నాయకునిగా వ్యవహరించారు. కమిషనర్‌గా ఆయన పేరును పరిశీలించాలంటూ మంత్రులు జానారెడ్డి, రఘువీరారెడ్డి, పార్థసారథి రాతపూర్వకంగా సీఎంకు సిఫార్సు చేశారు’’ అని వాదించారు. వాటితో ధర్మాసనం ఏకీభవించింది. ‘‘నియామకం నాటికి తమకు ఏ పార్టీలతోనూ అనుబంధం లేదని వారు తమ కౌంటర్లలో ఎక్కడా చెప్పలేదు. తద్వారా పార్టీలతో తమ అనుబంధాన్ని వారు ఖండించలేదు’’ అని తీర్పులో పేర్కొంది. సమాచార కమిషనర్ల నియామకాలను ఆరీటై చట్టప్రకారమే చేపట్టాలంటూ నమిత్‌శర్మ కేసు తీర్పును పునః సమీక్షించి సుప్రీం తాజాగా తీర్పునిచ్చిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎన్.శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎంతో ఆ నలుగురు భేటీ సమాచార హక్కు కమిషనర్ల నియామకంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ నలుగురు ఆర్టీఐ కమిషనర్లు గురువారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిశారు. ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రభుత్వ నియామకంపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వ్యక్తిగతంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కమిషనర్లు యోచిస్తున్నారు.