ప్రభుత్వ పరిధిలోకి పంచాయతీ రహదారులు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో పంచాయతీరాజ్ మంత్రి కె. తారకరామారావు
మేజర్ పంచాయతీలు, మండల కేంద్రాల్లో పంట కల్లాలకు ప్లాట్‌ఫామ్‌లు
గ్రామలకు ఆర్వో ప్లాంట్లు..
గ్రామలకు అధికారాలే కాదు..జవాబుదారీతనం ముఖ్యమే..
హైదరాబాద్: అన్ని మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో రైతులకు ఉపయోగపడే విధంగా పంట కల్లాల ప్లాట్‌ఫామ్‌లు, గిడ్డంగులను గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. రైతులు పంటల సమయంలో తమ ధాన్యాన్ని రహదారులపై ఎండబెడుతున్నారని, దీనివల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటిని అరికట్టాలన్న ఉద్దేశంతోనే కల్లాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. పంచాయతీ రహదారులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అలాగే గ్రామాల్లో శుద్ధి చేసిన మంచినీటి ప్లాంట్ల(ఆర్వో) నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన కూడా ఉందన్నారు. గృహ నిర్మాణానికి కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బుధవారం మంత్రి తారక రామారావు ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు...
మేజర్ పంచాయతీల్లో 250 మెట్రిక్ టన్నులు, మండల కేంద్రాల్లో 500 మెట్రిక్ టన్నుల గిడ్డంగులు నిర్మిస్తామని వివరించారు. అలాగే ప్రతి గ్రామంలో మహిళా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకత పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఉపాధి కూలీలకు కల్పించే పని దినాలు చట్టం నిర్దేశించిన దానికంటే తక్కువగా ఉన్నాయని, పనిదినాల సంఖ్య పెంచడం వల్ల.. కూలీలకు వేతనాలతోపాటు, మెటీరియల్ కాంపోనెంట్ పెరగడం వల్ల.. ఎక్కువ ఆస్తుల కల్పనకు వీలు కలుగుతుందని తెలిపారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు.
ప్రభుత్వ పరిధిలోకి రహదారులు
గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీ రహదారులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పంచాయతీ పరిధిలోని రహదారుల నిర్వహణకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తే..అది రెవెన్యూ వ్యయంగా పరిగణిస్తున్నందున, ఆ రహదారులను ప్రభుత్వ అధీనంలోకి తెస్తే మరిన్ని నిధులు వ్యయం చేయడానికి వీలవుతుందని అన్నారు. త్వరలో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించామని గత ప్రభుత్వాలు ఇచ్చిన తప్పుడు సమాచారం వల్ల కేంద్రం నుంచి పీఎంజీఎస్‌వై నిధులు రావడం లేదని, ప్రస్తుతం ఆ తప్పును సరిచేసే పనిలో ఉన్నామన్నారు.
అధికారాలే కాదు.. బాధ్యతనూ గుర్తెరగాలి...
అధికార వికేంద్రీకరణ కోరుతున్న పంచాయతీలు బాధ్యత, జవాబుదారీతనం కూడా పెంచుకోవాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పంచాయతీల్లో ఆస్తిపన్ను, మంచినీటి బిల్లులు చెల్లించకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గ్రామ అభివృద్ధ్దిని సొంత అభివృద్ధిగా ప్రజలు భావించాలని సూచించారు. సర్పంచులు కేవలం అధికారమే కావాలంటే కాదని, బాధ్యత గుర్తెరగాలని చెప్పారు. వందకోట్లు ఖర్చు చేస్తే..మూడు వేల సింగిల్ విలేజ్ స్కీమ్స్‌కు తాగునీటి పథకాలు పూర్తి చేయొచ్చని, అలాగే వెయ్యికోట్లు నిధులు ఇస్తే.. సమగ్ర మంచినీటి పథకాలు పూర్తి చేసే అవకాశం ఉన్నందున వాటికి ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఆదర్శ పంచాయతీల అధ్యయనానికి ఇతర రాష్ట్రాలకు సర్పంచులను పంపిస్తామని తెలిపారు.
ఈ-పంచాయతీలు...: పంచాయతీల్లో బ్రాడ్‌బాండ్ నెట్‌వర్క్ ఉన్న వాటిని ఈ-పంచాయతీలుగా మారుస్తామన్నారు. ప్రయోగాత్మకంగా కరీంనగర్ జిల్లాలోని 57 పంచాయతీల్లో అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తు తం ఈ-సేవ కేంద్రాల ద్వారా 340 సేవలను అందిస్తున్నామని, వాటి లో 50 సేవలను పంచాయతీలను అందించినా ప్రయోజనం ఉంటుందన్నారు. ‘ప్రజల వద్దకు ప్రభుత్వం’ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. దీనిని ‘జీ టు పీ’(గవర్నమెంట్ టు పీపుల్)గా పిలువనున్నట్లు తెలిపారు.
విలీనం చేయాల్సిందే..
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చాలంటే శివార్లలోని పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి సాగాలంటే వీటి విలీనం తప్పనిసరి అని పేర్కొన్నారు.