kalvakuntla taraka rama rao
-
‘గోపీచంద్ మరిన్ని విజయాలు అందించాలి’
సాక్షి, హైదరాబాద్: భారత క్రీడారంగంలో ఆటగాళ్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కొందరు మాత్రమే రిటైర్మెంట్ తర్వాత కూడా ఆట కోసమే శ్రమించారని... వారిలో పుల్లెల గోపీచంద్‌ది ప్రత్యేక స్థానమని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ప్రశంసించారు. బ్యాడ్మింటన్ పట్ల గోపీచంద్‌కు ఉన్న అంకితభావం నేడు ప్రపంచం గర్వించదగ్గ చాంపియన్లను తయారు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్లేయర్‌గా, కోచ్‌గా గోపీచంద్ కెరీర్‌లోని కొన్ని కీలక అంశాలు, విశేషాలతో రాసిన ‘షట్లర్స్ ఫ్లిక్: మేకింగ్ ఎవ్రీ మ్యాచ్ కౌంట్’ పుస్తకాన్ని శుక్రవారం కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గోపీచంద్ శ్రమ, ప్రణాళిక కారణంగానే బ్యాడ్మింటన్ క్రీడకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారిందని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం తర్వాత భారత క్రీడాకారులు సాధించిన విజయాలన్నీ వ్యక్తిగత ప్రతిభతోనే వచ్చాయని, ప్రభుత్వ వ్యవస్థ ఎవరినీ తయారు చేయలేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. స్వయంగా తమ ప్రభుత్వం కూడా క్రీడలను ప్రాధాన్యత అంశంగా గుర్తించలేదని, ఇకపై పరిస్థితి మారుతుం దని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గోపీచంద్ ఆలోచనలకు రచయిత్రి ప్రియా కుమార్ పుస్తక రూపం ఇచ్చారు. ఇది పూర్తిగా తన ఆటోబయోగ్రఫీ కాదని గోపీచంద్ స్పష్టం చేశారు. ‘ఇది జీవిత చరిత్రలాంటి పుస్తకం కాదు. ఆటగాడిగా, కోచ్‌గా కెరీర్లో విభిన్న రకాల అనుభవాలు ఎదుర్కొన్నాను. ఇందులో పలు సవాళ్లు కూడా ఉన్నాయి. వాటిని ఆయా సందర్భాలకు తగినట్లుగా వ్యవహరించి ఎలా అధిగమించానో, వాటిలో స్ఫూర్తిగా నిలిచే అంశాలు ఈతరం క్రీడాకారులకు పనికొస్తాయనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాశాం. ఇది బ్యాడ్మింటన్‌కు సంబంధించింది మాత్రమే కాదు. అన్ని రకాల క్రీడాంశాలకు కూడా ఈ పుస్తకంలో తగిన సమాధానాలు లభిస్తాయి. గత కొన్నేళ్లుగా భారత్‌లో బ్యాడ్మింటన్ బాగా అభివృద్ధి చెందింది. శిక్షకుడిగా నా వృత్తిలో పలువురు తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచే ఎదురైన ప్రశ్నలకు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను’ అని ఆయన వెల్లడించారు. రచయిత్రి ప్రియా కుమార్ మాట్లాడుతూ... ‘ఒక సాధారణ వ్యక్తి విజేతగా నిలిచేందుకు ఎంత గా కష్టపడ్డాడో, దాని నుంచి ఎలా స్ఫూర్తి పొంద వచ్చో అనే విషయాన్నే ఇందులో ప్రముఖంగా ప్రస్తావించాం. రచనా శైలి కూడా అంశాల వారీగా ఉంటుంది. అనేక అంశాలపై గోపీచంద్ ఆలోచనలను పుస్తకంగా మార్చేందుకు మూడేళ్లు పట్టింది’ అని పేర్కొంది. సైమన్ అండ్ షుస్టర్ పబ్లిషర్స్ ఈ ‘షట్లర్స్ ఫ్లిక్’ను ప్రచురించింది. -
మోదీ బర్త్ డే నాడు మంత్రి కేటీఆర్ వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. రెండో డోసు శుక్రవారం వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా తెలిపారు. ‘రెండో వ్యాక్సిన్ పూర్తి’ చెబుతూ రెండు ఫొటోలను కూడా పంచుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఏకంగా 2.25 కోట్ల మంది వ్యాక్సిన్ వేసుకోవడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక చర్యలతో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. అయితే అది కాకతాళీయమో ఏమో తెలియదు కానీ ప్రధాని జన్మదినాన కేటీఆర్ వ్యాక్సిన్ వేసుకోవడం విశేషం. చదవండి: మహిళ మృతదేహంపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చదవండి: ఈటలకు మార్మోగిన చప్పట్లు: అమిత్ షా సభలో స్పెషల్ అట్రాక్షన్ Second jab done ✔️ #VaccinationUpdate pic.twitter.com/hfMVOZEV3T — KTR (@KTRTRS) September 17, 2021 -
ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి: పార్టీ నేతలతో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని.. దళిత బంధు అమలుపై పార్టీ శ్రేణులందరికీ అవగాహన కల్పించాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పార్టీ ప్రతినిధులకు చెప్పారు. తెలంగాణ భవన్లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల పునర్నిర్మాణంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు అమలులో పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నవంబర్ మొదటివారంలో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ప్రతిపక్షాల తప్పుడు విమర్శల్ని తిప్పికొట్టాలని సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీ ప్రతినిధులకు ఆదేశించినట్లు తెలిసింది. దేశ రాజధానిలో కేటాయించిన స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులకు సెప్టెంబర్ 2వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. కొన్ని గంటల పాటు సాగిన సమావేశం అనంతరం కేటీఆర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించినట్లు కేటీఆర్ తెలిపారు. ‘క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే జిల్లాల్లో పార్టీల కార్యాలయాల ప్రారంభోత్సవం అక్టోబర్‌లో చేసే అవకాశాలు ఉన్నాయి. ద్విదశాబ్ది ఉత్సవాలు ఘనంగా చేస్తాం. నవంబర్ మొదటివారంలో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహణకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నెలాఖరులోపు సభ్యత్వం పూర్తి చేయాలి. సెప్టెంబర్ మొదటివారంలో గ్రామ కమిటీలు పూర్తి చేయాలి. సెప్టెంబర్ రెండోవారంలో మండల కమిటీలు, సెప్టెంబర్ మూడో వారంలో జిల్లా కమిటీలు పూర్తికి చర్యలు’ అని తెలిపారు. చదవండి: చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయాలు ఇవి 20 ఏళ్లుగా విజయవంతవంగా రెండు దశాబ్దాలు పార్టీని నడిపడంతో త్వరలోనే ద్విదశాబ్ది ఉత్సవాలు నిర్వహణకు రాష్ట్ర కార్యవర్గం తీర్మానం. హైదరాబాద్, వరంగల్ మినహా జిల్లాలోని పార్టీ కార్యాలయాలు దసరా తర్వాత అక్టోబర్‌లో ప్రారంభం. ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనుల శంకుస్థాపన సీఎం కేసీఆర్ చేయనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన 12,769 పార్టీ పంచాయతీ కమిటీల ప్రకటన. మండల, మున్సిపల్, జిల్లా కమిటీలు కూడా సెప్టెంబర్‌లో ఏర్పాటు సంస్థాగత నిర్మాణం మొత్తం సెప్టెంబర్‌లో పూర్తి చేయాలని తీర్మానం కే కేశవరావు నేతృత్వంలో ఈ కమిటీలపై సంస్థాగత నిర్మాణం ప్లీనరీ సమావేశం కరోనా పరిస్థితులు చూసుకొని నవంబర్, డిసెంబర్లో నిర్వహించాలని యోచన. చదవండి: అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్.. -
అది నూటికి నూరుపాళ్లు నిజం: కేటీఆర్
సాక్షి, వరంగల్: నగరంలో రాబోయే నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంగళవారం మంత్రి వరంగల్ నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వరద నీటి ప్రవాహ నాలాలు, మురికి నీటి నాలాలపై ఉన్న ఆక్రమణలు గుర్తించారు. అనంతరం నిట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ.. నగరంలో పర్యటించిన సందర్భంగా దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు ఒకే విషయం చెప్పారని, అది నాలాలపై ఆక్రమణల వల్ల వరద బయటకు పోకపోవడంతో రోడ్లపైకి నీరు వచ్చిందని, జనావాసాలు జలమయమయ్యాయని చెప్పారన్నారు. వారు చెప్పిదంతా నూటికి నూరుపాళ్లు నిజమని, నగరంలో అనేక చోట్ల నాలాలపై ఆక్రమ నిర్మాణాలు ఉన్నాయన్నారు. వాటిని తక్షణం తొలగించాలని, ఈ విషయంలో రాజీ పడేది లేదని అధికారులను హెచ్చరించారు. దీనిపై ఎలాంటి రాజకీయ ఓత్తిళ్లు ఉండవని, పెద్ద పెద్ద నిర్మాణాలను తొలగించడానికి భారీ యంత్రాలు తెప్పించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన నిర్మాణాల తొలగింపు పనులు వెంటనే ప్రారంభం కావాలన్నారు. ఇంకా నీటి ప్రవాహాలు వెళ్లే నాలాలకు ఏమైనా అడ్డంకులున్నాయా అనే విషయాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. నాలాలపై ఆక్రమణలు గుర్తించి, వాటిని తొలగించే పని చేయడానికి కలెక్టర్ చైర్మన్ గా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీని నియమిస్తున్నామన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఎయుడి కమిషనర్ స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తారని చెప్పారు. వీరిద్దరిలో ఒకరు ప్రతీ వారంలో ఒక రోజు వరంగల్‌లో పర్యటిస్తారని, నెల రోజుల్లోగా మొత్తం ఆక్రమణలు తొలగించాలని ఆదేశం జారీ చేశారు. అవి ఆక్రమ నిర్మాణాలైతే నిర్ధాక్షిణ్యంగా తొలగించాలని, పేదల ఇళ్లు అయితే, వారికి ప్రభుత్వం తరుఫున డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ ఉన్న వారికి నష్ట పరిహారం చెల్లించి తొలగించాలని, ఏదేమైనా మొత్తం నాలాలపై ఆక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమ నిర్మాణాలను తొలగిస్తూనే, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి జరగకుండా వాటికి ప్రహారీ గోడలు(రిటైనింగ్ వాల్స్) నిర్మించాలన్నారు. ఎస్ఆర్ఎస్పి కాలువ ఆక్విడక్ట్ వద్ద కూడా పూడిక తీయాలని కేటీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక రంగల్ నగర జనాభా ఇప్పటికే 11 లక్షలు అయ్యిందని, ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలని, పారిశుద్య పనుల్లో యాంత్రీకరణ జరగాలన్నారు. స్వీపింగ్ మిషన్ల ద్వారా నగరంలో పరిశుభ్రతను కాపాడాలని కేటీఆర్ అధికారులకు తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించడం, ముంపుకు గురైన వారికి అవసరమైన సాయం అందించడంతో పాటు దీనిని తక్షణ కర్తవ్యంగా అధికారులు భావించాలన్నారు. ముంపుకు గురైన వారికి ప్రభుత్వం తరపున నిత్యావసర సరుకులు అందించాలని అధికారులతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, ఇదే సమయంలో రాబోయే రోజుల్లో మళ్లీ భారీ వర్ష సూచన ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఇక లోతట్టు ప్రాంతాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని ఖాళీ చేయించాలన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కేటీఆర్ అధికారులకు సూచించారు. నాలాలపై ఆక్రమ కట్టడాలను తొలగించే కార్యక్రమంలో భాగంగా నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీకి వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ హన్మంతు చైర్మన్‌గా, పోలీస్ కమిషనర్ కో చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జల వనరుల శాఖ ఎస్ఈ వరంగల్ అర్బన్ ఆర్డీవో, నేషనల్ హైవేస్ అథారిటీ ఎస్ఈ సభ్యులుగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీనీ నియమిస్తూ.. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
4నెలల్లో వై-ఫై నగరంగా హైదరాబాద్: కేటీఆర్
-
రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసేలా కథనాలు
ప్రజలు ఆ రెండు పత్రికల వార్తలను నమ్మేంత అమాయుకులు కాదు మెదక్ విజయుమే అందుకు ఉదాహరణ: కేటీఆర్ హైదరాబాద్: మహిళా సాధికారతే ధ్యేయం గా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ, భారీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. తాజ్‌కృష్ణలో బుధవారం ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్ఏ) ఏర్పాటు చేసిన వరల్డ్ ఎంపవర్మెంట్ పావర్టీ అండ్ అల్లెవేషన్ కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా 15 దేశాల నుంచి మహిళా ప్రతినిధులు హాజరయ్యారని ఆయున అన్నారు. వీరు మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో పర్యటించి స్వయం సహాయక బృందాలు సాధించిన ప్రగతిని పరిశీలిస్తారని చెప్పారు. రెండు పత్రికలు రాష్ట్ర ప్రగతిని కుంటుపరిచేలా వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. మెదక్ ఉప ఎన్నికల్లో భారీ మెజా రిటీ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మీద తమకున్న నమ్మకాన్ని ప్రజలు తెలియజేశారని తెలిపారు. ఈ విజయాన్ని కప్పిపుచ్చడానికే కావాలని ఆ పత్రికలు మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన కథనాన్ని బ్యానర్‌గా ఇచ్చారని దుయ్యబట్టారు. పథకం ప్రకారం నిరాధారపూరిత కథనాలు అల్లుతున్నాయన్నారు. ప్రజలు వాటిని నమ్మేంత అమాయకులు కారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ ఎ.మురళి, ఐఓఆర్ఏ సెక్రటరీ అబ్దుల్లా, విదేశీ వ్యవహారాల ఉపకార్యదర్శి బ్రహ్మకుమార్, భారత ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి సంచాలకులు నీతా కేజ్రీవాల్, ఎన్ఆర్ఎల్ఎమ్ మిషన్ మేనేజర్ ధ్రువ్ జే సేన్‌గుప్తా, ఎం.యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేయాలి
తొగుట: దశాబ్ధ కాలంగా తెలంగాణ ప్రజలను అష్టకష్టాలు పెట్టిన కాంగ్రెస్, బీజేపీలకు ఉప ఎన్నికలో డిపాజిట్లు గల్లంతు చేయాలని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ఉప ఎన్నిక దుబ్బాక నియోజక వర్గ ఇన్చార్జి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. తొగుట మండలం రాంపూర్ శివారులోని కోటిలింగాల దేవాలయ ఆవరణలోని కల్యాణ మండపంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షతన టీఆర్ఎస్ మండల కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన కేటీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌కు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ రావాలన్నారు. తెలంగాణలో సుమారు నాలుగేళ్లుగా వరుస కరువుతో రైతాంగం అల్లాడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వలేకపోయిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన సునీతా లక్ష్మారెడ్డి ఎందుకు నోరుమెదపలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి 480 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేశారన్నారు. అందులో మెదక్ జిల్లాకు 54 కోట్లు మంజూరయ్యాయన్నారు. తెలంగాణ ప్రాంతంలో పుష్కలంగా బొగ్గు నిక్షపాలున్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నేతల అసమర్థత వల్లే సీమాంధ్రులు థర్మల్, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఆంధ్రలో ఏర్పాటు చేసుకున్నారన్నారు. వారి అసమర్థత వల్లే తెలంగాణ ప్రాంత రైతాంగానికి విద్యుత్ సమస్య తలెత్తిందన్నారు. తెలంగాణ లో బీజేపీకి మంచిపేరుండేదని తెలంగాణ ద్రోహిగా మారిన జగ్గారెడ్డికి టికెట్ ఇచ్చి ఆ పేరు కోల్పోయిందన్నారు. బీజేపీలో జగ్గారెడ్డిని చేర్చుకోవడంతో బారతీయ జనతా పార్టీ బాబు జగ్గారెడ్డిపార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే (షాద్‌నగర్) అంజయ్య యాదవ్, జెడ్పీటీసీ కొక్కొండ రూప, ఎంపీపీ గంటా రేణుక తదితరులు పాల్గొన్నారు. -
వై-ఫై నగరంగా హైదరాబాద్: కేటీఆర్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆగస్టుకల్లా అన్ని ప్రభుత్వ పాఠశాల్లో మరుగుదొడ్లు నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, సమాచార సాంకేతికశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) తెలిపారు. 24 వందల గ్రామపంచాయితీలను ఈ-పంచాయితీలుగా మారుస్తున్నామని చెప్పారు. పెన్షన్లను ఈ-పంచాయితీలలో ఇచ్చేలా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌ను వై-ఫై నగరంగా మారుస్తామని అన్నారు. తమ రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. సమస్యలను సాధ్యమైనంత తర్వలో వాటిని అధిగమిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
ఐదేళ్లలో ఐటీకి మహర్దశ: కేటీఆర్
ఐటీఐఆర్‌లో భాగస్వామ్యం కోరిన ‘ఒరాకిల్’ హైదరాబాద్: రానున్న ఐదేళ్లలో రాష్ట్ర ఐటీ రంగానికి మహర్దశ పట్టిస్తామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈ రంగాన్ని దేశంలో ఐదో స్థానానికి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామనివెల్లడించారు. బుధవారమిక్కడ ఒరాకిల్, ఇతర సంస్థల ప్రతినిధులు సచివాలయంలో కేటీఆర్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో అభివృద్ధి చేయనున్న ఐటీఐఆర్ ప్రాజెక్టులో తమ భాగస్వామ్యం, పెట్టుబడులు, ప్రాజెక్టు లక్ష్యాలు, ఉద్యోగకల్పన వంటి అంశాలపై వారు మం త్రికి చిత్రపటాలు, గణాంకాలతో వివరించా రు. కేటీఆర్ వారికి పలు సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో ఎంపీ జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎస్డీఎఫ్ పనులు తక్షణమే ఆపేయండి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) కింద మం జూరైన పనులను నిలిపివేయాలని తెలంగాణ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని కింద ఉమ్మడి రాష్ట్రంలో పలువురు తెలంగాణ ఎమ్మెల్యేలకు రూ.150 కోట్లు ఇచ్చారు. వాటితో చేప ట్టిన పనులపై ఆరోపణలు రావడంతో ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య కలెక్టర్లకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ పరిధిలోకి పంచాయతీ రహదారులు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో పంచాయతీరాజ్ మంత్రి కె. తారకరామారావు మేజర్ పంచాయతీలు, మండల కేంద్రాల్లో పంట కల్లాలకు ప్లాట్‌ఫామ్‌లు గ్రామలకు ఆర్వో ప్లాంట్లు.. గ్రామలకు అధికారాలే కాదు..జవాబుదారీతనం ముఖ్యమే.. హైదరాబాద్: అన్ని మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో రైతులకు ఉపయోగపడే విధంగా పంట కల్లాల ప్లాట్‌ఫామ్‌లు, గిడ్డంగులను గ్రామీణ ఉపాధి హామీ నిధులతో నిర్మించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. రైతులు పంటల సమయంలో తమ ధాన్యాన్ని రహదారులపై ఎండబెడుతున్నారని, దీనివల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, వాటిని అరికట్టాలన్న ఉద్దేశంతోనే కల్లాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. పంచాయతీ రహదారులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అలాగే గ్రామాల్లో శుద్ధి చేసిన మంచినీటి ప్లాంట్ల(ఆర్వో) నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన కూడా ఉందన్నారు. గృహ నిర్మాణానికి కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బుధవారం మంత్రి తారక రామారావు ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు... మేజర్ పంచాయతీల్లో 250 మెట్రిక్ టన్నులు, మండల కేంద్రాల్లో 500 మెట్రిక్ టన్నుల గిడ్డంగులు నిర్మిస్తామని వివరించారు. అలాగే ప్రతి గ్రామంలో మహిళా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకత పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తున్న మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఉపాధి కూలీలకు కల్పించే పని దినాలు చట్టం నిర్దేశించిన దానికంటే తక్కువగా ఉన్నాయని, పనిదినాల సంఖ్య పెంచడం వల్ల.. కూలీలకు వేతనాలతోపాటు, మెటీరియల్ కాంపోనెంట్ పెరగడం వల్ల.. ఎక్కువ ఆస్తుల కల్పనకు వీలు కలుగుతుందని తెలిపారు. గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారు. ప్రభుత్వ పరిధిలోకి రహదారులు గ్రామీణ ప్రాంతాల్లోని పంచాయతీ రహదారులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పంచాయతీ పరిధిలోని రహదారుల నిర్వహణకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తే..అది రెవెన్యూ వ్యయంగా పరిగణిస్తున్నందున, ఆ రహదారులను ప్రభుత్వ అధీనంలోకి తెస్తే మరిన్ని నిధులు వ్యయం చేయడానికి వీలవుతుందని అన్నారు. త్వరలో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించామని గత ప్రభుత్వాలు ఇచ్చిన తప్పుడు సమాచారం వల్ల కేంద్రం నుంచి పీఎంజీఎస్‌వై నిధులు రావడం లేదని, ప్రస్తుతం ఆ తప్పును సరిచేసే పనిలో ఉన్నామన్నారు. అధికారాలే కాదు.. బాధ్యతనూ గుర్తెరగాలి... అధికార వికేంద్రీకరణ కోరుతున్న పంచాయతీలు బాధ్యత, జవాబుదారీతనం కూడా పెంచుకోవాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పంచాయతీల్లో ఆస్తిపన్ను, మంచినీటి బిల్లులు చెల్లించకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గ్రామ అభివృద్ధ్దిని సొంత అభివృద్ధిగా ప్రజలు భావించాలని సూచించారు. సర్పంచులు కేవలం అధికారమే కావాలంటే కాదని, బాధ్యత గుర్తెరగాలని చెప్పారు. వందకోట్లు ఖర్చు చేస్తే..మూడు వేల సింగిల్ విలేజ్ స్కీమ్స్‌కు తాగునీటి పథకాలు పూర్తి చేయొచ్చని, అలాగే వెయ్యికోట్లు నిధులు ఇస్తే.. సమగ్ర మంచినీటి పథకాలు పూర్తి చేసే అవకాశం ఉన్నందున వాటికి ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఆదర్శ పంచాయతీల అధ్యయనానికి ఇతర రాష్ట్రాలకు సర్పంచులను పంపిస్తామని తెలిపారు. ఈ-పంచాయతీలు...: పంచాయతీల్లో బ్రాడ్‌బాండ్ నెట్వర్క్ ఉన్న వాటిని ఈ-పంచాయతీలుగా మారుస్తామన్నారు. ప్రయోగాత్మకంగా కరీంనగర్ జిల్లాలోని 57 పంచాయతీల్లో అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తు తం ఈ-సేవ కేంద్రాల ద్వారా 340 సేవలను అందిస్తున్నామని, వాటి లో 50 సేవలను పంచాయతీలను అందించినా ప్రయోజనం ఉంటుందన్నారు. ‘ప్రజల వద్దకు ప్రభుత్వం’ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. దీనిని ‘జీ టు పీ’(గవర్నమెంట్ టు పీపుల్)గా పిలువనున్నట్లు తెలిపారు. విలీనం చేయాల్సిందే.. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చాలంటే శివార్లలోని పంచాయతీలను గ్రేటర్లో విలీనం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి సాగాలంటే వీటి విలీనం తప్పనిసరి అని పేర్కొన్నారు. -
ప్రజల అంచనాలను అందుకుంటాం: కేటీఆర్
పంచాయతీరాజ్ శాఖలో అధికార వికేంద్రీకరణ చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అలాగే ఐటీని పల్లెలకు అనుసంధానం చేస్తామని తెలిపారు. గురువారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేటీఆర్ ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీరు అందించడం తన ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో రాష్ట్రాభివృద్ధిపై ప్రజలకు అంచనాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకుంటుందని అన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కేటీఆర్ ఈ సందర్బంగా వివరించారు. -
సిరిసిల్లకు మంత్రి యోగం
రాష్ట్ర ఐటీ, పీఆర్ మంత్రిగా కేటీఆర్ - సిరిసిల్ల చరిత్రలో తొలిసారి మంత్రి పదవి - 38 ఏళ్లకే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం సిరిసిల్ల, న్యూస్‌లైన్ : సిరిసిల్ల నియోజకవర్గ చరిత్రలో తొలిసారి మంత్రి పదవి దక్కింది. ఇప్పటి వరకు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోనే కూర్చున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఎమ్మెల్యే కేటీఆర్ మంత్రిగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) మంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడిగా నియోజకవర్గంలో అడుగిడిన కేటీఆర్ తిరుగులేని నేతగా ఎదిగారు. రాజకీయ విశ్లేషణలు, వాగ్ధాటితో తనదైన ముద్ర వేశారు. 2009లో తొలిసారిగా సిరిసిల్లలో మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2010 ఉప ఎన్నికలు, 2014 సాధారణ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. ప్రస్తుత మంత్రివర్గంలో కేటీఆర్ పిన్నవయస్కుడు. 38 ఏళ్లకే రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగారు. నేరెళ్ల నియోజకవర్గం ఉండగా.. అక్కడ గెలిచిన పాటి రాజం, సుద్దాల దేవయ్య రాష్ట్ర మంత్రులుగా పని చేశారు. నేరెళ్ల నియోజకవర్గం ఆనవాయితీ.. సిరిసిల్లకు కలిసి వచ్చింది. కేటీఆర్ కీలకమైన రెండు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న నేపథ్యంలో సిరిసిల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగుపడ్డాయి. కీలక మంత్రిత్వ శాఖలు.. తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను కేటీఆర్ దక్కించుకున్నా రు. గ్రామీణాభివృద్ధిని పరుగు పెట్టించే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఐటీ రంగంలోని ఆయనకున్న అపార అనుభవంతో తెలంగాణలో ఐటీ పరిశ్రమల విస్తరణ జోరందుకునే అవకాశం ఉంది. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల రుణాన్ని అభివృద్ధి ఫలాలతోనే తీర్చుకుంటానంటూ.. కేటీఆర్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో అభివృద్ధి మంత్రించినట్లేనని స్థానికుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సోనియా దేవతా?: కేటీఆర్
ఇంటర్వ్యూ: కల్వకుంట్ల తారకరామారావు * వందలమంది బలిదానాలకు సోనియానే కారణం * తెలంగాణ ప్రజలకు ఆమె క్షమాపణ చెప్పాలి బోరెడ్డి అయోధ్యరెడ్డి: తెలంగాణ ప్రజల ఆకాంక్ష తనకు తెలుసని, అధికారంలోకి రాగానే నెరవేరుస్తానని కరీంనగర్ సభలో పదేళ్ల కిందట చెప్పిన సోనియాగాంధీ ఆ తర్వాత ఆ విషయంలో జాప్యం చేయడం వల్లే 12వందల మంది ఆత్మత్యాగం చేసుకున్నారని టీఆర్ఎస్ నేత, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో క్షణం తీరికలేకుండా ఉన్న ఆయన హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ‘సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణకు జరిగిన అన్యాయం, పార్టీని విలీనం చేయకపోవడానికి కారణాలు, తెలంగాణ పునర్నిర్మాణం.. తదితర అంశాలపై వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని దేవతని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 12వందల మందిని బలితీసుకున్న సోనియాని దేవత అని ఎలా అనాలి. 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తగ్గడం వల్లే ఇంతమంది ప్రాణం త్యాగం చేసుకున్నారు. తెలంగాణపై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ బిడ్డ యాదిరెడ్డి సాక్షాత్తూ పార్లమెంటు ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మబలిదానాలకు కారణమైన సోనియాగాంధీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ విషయంలో సోనియాగాంధీకి సోయి తెచ్చింది టీఆర్ఎస్సే. తెలంగాణ కోసం టీఆర్ఎస్, కేసీఆర్ చేసిన పోరాటం, త్యాగం వృథాపోవు. తెలంగాణ ఆకాంక్షలు, దు:ఖం, ఆర్తి తెలిసిన టీఆర్ఎస్తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. షరతుల మధ్య విలీనమెలా? తెలంగాణ అంశంలో కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కేసీఆర్ తీవ్రంగా కలత చెందారు. ఎలాంటి షరతులు లేకుండా వెంటనే తెలంగాణను ఏర్పాటు చేసి ఆత్మహత్యలు ఆపాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. అందుకు అవసరమైతే పార్టీని విలీనం చేస్తానని ఏడాదిన్నర క్రితమే మాటిచ్చారు. అయినా కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఆ పార్టీ నయవంచనతో ఆత్మహత్యల పరంపర కొనసాగింది. ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ బిల్లును తీసుకొచ్చి ఆమోదింపజేశారు. అందులోనూ ఎన్నో షరతులు. హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం, స్థానికత ఆధారంగా కాకుండా జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల విభజన వంటి మెలికలు పెట్టారు. ఇన్ని షరతుల మధ్య పార్టీని ఎలా విలీనం చేస్తాం. నెలల శిశువులాంటి తెలంగాణను కాంగ్రెస్ నేతల చేతుల్లో పెడితే భావితరాలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. తెలంగాణకు స్వీయ రాజకీయ శక్తి అవసరమని ప్రజలే భావిస్తున్నారు. సాధించుకున్న రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా, బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలంటే టీఆర్ఎస్ మనుగడ సాగించాల్సిందే. తెలంగాణ కష్టం, నష్టం తెలిసిన పార్టీ.. పునర్నిర్మాణంలో ఉండాలని ప్రజలు, ఉద్యమకారులు కోరుకుంటున్నారు. టీఆర్ఎస్కు ప్రజలే హైకమాండ్. వసూళ్ల పార్టీ అని నిరూపించగలరా.. టికెట్ల కోసం టీఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తున్నట్టు విమర్శలు చేస్తున్నవారు ఆ విషయం నిరూపించగలరా? టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత లెక్కలేనని బహిరంగ సభలు, కార్యక్రమాలు చేపట్టాం. ఉప ఎన్నికల్లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చాం. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ 13ఏళ్లలో పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. నిరసనలకు, పోరాటాలకు వాటిని వేదికలుగా చేసుకుంది. ఇందుకోసం విరాళాలను ప్రజల నుంచే సమీకరించాం. పార్టీ అధినేత కేసీఆర్‌తో సహా ముఖ్యనేతలంతా కూలి పనులు చేసి విరాళాలు సేకరించాం. తెలంగాణ వ్యతిరేక వర్గాలే టీఆర్ఎస్ వసూళ్ల పార్టీ అని దుష్ర్పచారానికి దిగుతున్నయ్. మరి కాంగ్రెస్, టీడీపీ నిధులు ఎలా సమకూరుస్తున్నయ్, వాటి గురించెందుకు మాట్లాడరు. వారసత్వ రాజకీయాలు లేని పార్టీ ఒక్కటీ లేదు రాజకీయాల్లోకి రావాలా, వద్దా అనేది వ్యక్తిగత ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణపై మమకారంతో మా కుటుంబమంతా ఉద్యమంలో మమేకమైంది. ఉద్యమంలో కేసీఆర్, హరీష్‌రావు, నేను, కవిత జైలుకు కూడా వెళ్లొచ్చాం. ఉద్యమానికి అడ్డురాని కుటుంబ నేపథ్యం.. ఎన్నికలకు మాత్రం అడ్డెలా అవుతుంది. కుటుంబ పెద్ద రాజకీయాల్లో ఉంటే వారి వారసులకు కొంత అడ్వాంటేజీ అవుతుందనేది కాదనలేని నిజం. అయినా దేశంలో వారసత్వ రాజకీయాలు లేని పార్టీ ఏది చెప్పండి. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీవి వారసత్వ రాజకీయాలు కావా? డీఎంకే, ఎన్సీపీ, సమాజ్‌వాదీ, శివసేన వంటి అన్ని పార్టీల్లోనూ వారసులు ఉన్నారు. పార్టీ నుంచి బయటికి వెళ్లినవారు చేసే ఇటువంటి విమర్శలు అర్థం లేనివి. -
'ఆంధ్రాలో ఓ వ్యక్తి దెబ్బకు కాంగ్రెస్ చచ్చిపోయింది'
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దేవత కాదని... బలిదేవత అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అభివర్ణించారు. బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో సోనియా గాంధీపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది చనిపోయిన తర్వాత సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని ఆరోపించారు. ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సోనియాను కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆంధ్రాలో ఓ వ్యక్తి కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ చచ్చిపోయిందని... ఆ తర్వాతే రాజకీయ అవకాశవాదంతోనే తెలంగాణ ఇచ్చారని సోనియాపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు. తెలంగాణ ఇవ్వడంలో ఎందుకు ఆలస్యమైంది సహ ఇతర అంశాలపై కరీంనగర్ సభలో సోనియా వివరణ ఇవ్వాలన్నారు. తెలంగాణ ద్రోహుల్ ఎవరో ... టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల సొంతూరులో చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ ఒడిపోతారని సర్వేలు చెబుతున్నాయని... అలాంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటెయ్యాలని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చినట్లు తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ బుద్దిమాంధ్యం గల నేతగా కేటీఆర్ అభివర్ణించారు. విశ్వాస ఘాతకుల చేతిలో తెలంగాణ పెడితే ప్రయోజనం ఉండదని ఆ ప్రాంత ప్రజల సూచించారు. ప్రముఖ సినీ నటుడు, జన సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పేరు జన సేన తీసేసి.... మోడీ భజన సేనగా మార్చుకోవాలని పవన్‌కు కేటీఆర్ సూచించారు. -
సీమాంధ్రులకు ఎటువంటి ఢోకాలేదు: కేటీఆర్
తెలంగాణ ప్రాంతంలో నివసించే సీమాంధ్రులకు ఎటువంటి ఢోకా ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీ నుంచి బుధవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి అన్నదమ్ముల్లా కలసి ఉండి అభివృద్ధి చేసుకుందామన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని కేటీఆర్‌కు స్వాగతం పలికారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలలో ఇటీవలే ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులంతా ఢిల్లీ తరలివెళ్లారు. ఆ క్రమంలో సోనియాను కలసి ఆదివారం కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు ధన్యవాదులు తెలిపారు. అనంతరం కేటీఆర్ బుధవారం హైదరాబాద్ తిరిగివచ్చారు. ఈ రోజు సాయంత్రం 3.00 గంటలకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హైదరాబాద్ నగరానికి రానున్నారు. -
అడ్డుకోవాల్సిన బాధ్యత టి.మంత్రులదే: కేటీఆర్
హైదరాబాద్: అసెంబ్లీలో సీఎం కిరణ్ ప్రవేశపెట్టిన విభజన బిల్లు తీర్మానానికి ఎలాంటి నైతికత లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సీఎం బ్లాక్‌మెయిల్‌కు స్పీకర్ నాదెండ్ల మనోహర్ లొంగిపోయారని ఆరోపించారు. బీఏసీలో చర్చించకుండా విభజన విభజన బిల్లు తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారని తెలిపారు. స్పీకర్, ముఖ్యమంత్రి కుమ్మక్కై దొడ్డిదారిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో నెగ్గించుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ తీర్మానాన్ని ఢిల్లీకి పంపించకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులపై ఉందన్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని సహా అన్ని పార్టీల నాయకులను కలిసి తెలంగాణకు మద్దతు కోరతామని కేటీఆర్ చెప్పారు. విభజన బిల్లు తీర్మానంతో శాసనసభలో ఒక ప్రహసనం ముగిసిందని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. ఈ తీర్మానం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదని కొట్టి పారేశారు.