సిరిసిల్లకు మంత్రి యోగం
రాష్ట్ర ఐటీ, పీఆర్ మంత్రిగా కేటీఆర్
- సిరిసిల్ల చరిత్రలో తొలిసారి మంత్రి పదవి
- 38 ఏళ్లకే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : సిరిసిల్ల నియోజకవర్గ చరిత్రలో తొలిసారి మంత్రి పదవి దక్కింది. ఇప్పటి వరకు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోనే కూర్చున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఎమ్మెల్యే కేటీఆర్ మంత్రిగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) మంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తనయుడిగా నియోజకవర్గంలో అడుగిడిన కేటీఆర్ తిరుగులేని నేతగా ఎదిగారు. రాజకీయ విశ్లేషణలు, వాగ్ధాటితో తనదైన ముద్ర వేశారు.
2009లో తొలిసారిగా సిరిసిల్లలో మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2010 ఉప ఎన్నికలు, 2014 సాధారణ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. ప్రస్తుత మంత్రివర్గంలో కేటీఆర్ పిన్నవయస్కుడు. 38 ఏళ్లకే రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగారు. నేరెళ్ల నియోజకవర్గం ఉండగా.. అక్కడ గెలిచిన పాటి రాజం, సుద్దాల దేవయ్య రాష్ట్ర మంత్రులుగా పని చేశారు. నేరెళ్ల నియోజకవర్గం ఆనవాయితీ.. సిరిసిల్లకు కలిసి వచ్చింది. కేటీఆర్ కీలకమైన రెండు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న నేపథ్యంలో సిరిసిల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగుపడ్డాయి.
కీలక మంత్రిత్వ శాఖలు..
తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను కేటీఆర్ దక్కించుకున్నా రు. గ్రామీణాభివృద్ధిని పరుగు పెట్టించే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఐటీ రంగంలోని ఆయనకున్న అపార అనుభవంతో తెలంగాణలో ఐటీ పరిశ్రమల విస్తరణ జోరందుకునే అవకాశం ఉంది. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల రుణాన్ని అభివృద్ధి ఫలాలతోనే తీర్చుకుంటానంటూ.. కేటీఆర్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో అభివృద్ధి మంత్రించినట్లేనని స్థానికుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.