సాక్షి, వరంగల్: నగరంలో రాబోయే నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంగళవారం మంత్రి వరంగల్ నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వరద నీటి ప్రవాహ నాలాలు, మురికి నీటి నాలాలపై ఉన్న ఆక్రమణలు గుర్తించారు. అనంతరం నిట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ.. నగరంలో పర్యటించిన సందర్భంగా దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు ఒకే విషయం చెప్పారని, అది నాలాలపై ఆక్రమణల వల్ల వరద బయటకు పోకపోవడంతో రోడ్లపైకి నీరు వచ్చిందని, జనావాసాలు జలమయమయ్యాయని చెప్పారన్నారు. వారు చెప్పిదంతా నూటికి నూరుపాళ్లు నిజమని, నగరంలో అనేక చోట్ల నాలాలపై ఆక్రమ నిర్మాణాలు ఉన్నాయన్నారు. వాటిని తక్షణం తొలగించాలని, ఈ విషయంలో రాజీ పడేది లేదని అధికారులను హెచ్చరించారు. దీనిపై ఎలాంటి రాజకీయ ఓత్తిళ్లు ఉండవని, పెద్ద పెద్ద నిర్మాణాలను తొలగించడానికి భారీ యంత్రాలు తెప్పించాలని ఆయన అధికారులకు ఆదేశించారు.
ఇప్పటికే గుర్తించిన నిర్మాణాల తొలగింపు పనులు వెంటనే ప్రారంభం కావాలన్నారు. ఇంకా నీటి ప్రవాహాలు వెళ్లే నాలాలకు ఏమైనా అడ్డంకులున్నాయా అనే విషయాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. నాలాలపై ఆక్రమణలు గుర్తించి, వాటిని తొలగించే పని చేయడానికి కలెక్టర్ చైర్మన్ గా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీని నియమిస్తున్నామన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఎయుడి కమిషనర్ స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తారని చెప్పారు. వీరిద్దరిలో ఒకరు ప్రతీ వారంలో ఒక రోజు వరంగల్‌లో పర్యటిస్తారని, నెల రోజుల్లోగా మొత్తం ఆక్రమణలు తొలగించాలని ఆదేశం జారీ చేశారు. అవి ఆక్రమ నిర్మాణాలైతే నిర్ధాక్షిణ్యంగా తొలగించాలని, పేదల ఇళ్లు అయితే, వారికి ప్రభుత్వం తరుఫున డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ ఉన్న వారికి నష్ట పరిహారం చెల్లించి తొలగించాలని, ఏదేమైనా మొత్తం నాలాలపై ఆక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమ నిర్మాణాలను తొలగిస్తూనే, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి జరగకుండా వాటికి ప్రహారీ గోడలు(రిటైనింగ్ వాల్స్) నిర్మించాలన్నారు.
ఎస్ఆర్ఎస్పి కాలువ ఆక్విడక్ట్ వద్ద కూడా పూడిక తీయాలని కేటీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక రంగల్ నగర జనాభా ఇప్పటికే 11 లక్షలు అయ్యిందని, ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలని, పారిశుద్య పనుల్లో యాంత్రీకరణ జరగాలన్నారు. స్వీపింగ్ మిషన్ల ద్వారా నగరంలో పరిశుభ్రతను కాపాడాలని కేటీఆర్ అధికారులకు తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించడం, ముంపుకు గురైన వారికి అవసరమైన సాయం అందించడంతో పాటు దీనిని తక్షణ కర్తవ్యంగా అధికారులు భావించాలన్నారు. ముంపుకు గురైన వారికి ప్రభుత్వం తరపున నిత్యావసర సరుకులు అందించాలని అధికారులతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, ఇదే సమయంలో రాబోయే రోజుల్లో మళ్లీ భారీ వర్ష సూచన ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
ఇక లోతట్టు ప్రాంతాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని ఖాళీ చేయించాలన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కేటీఆర్ అధికారులకు సూచించారు. నాలాలపై ఆక్రమ కట్టడాలను తొలగించే కార్యక్రమంలో భాగంగా నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీకి వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ హన్మంతు చైర్మన్‌గా, పోలీస్ కమిషనర్ కో చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జల వనరుల శాఖ ఎస్ఈ వరంగల్ అర్బన్ ఆర్డీవో, నేషనల్ హైవేస్ అథారిటీ ఎస్ఈ సభ్యులుగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీనీ నియమిస్తూ.. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment