మిడతల దండుపై కేసీఆర్ ఉన్నతస్థాయి‌ సమీక్ష | KCR Review Meeting With Officials Over Locust At Raj Bhavan In Hyderabad | Sakshi
Sakshi News home page

మిడతల కదలికలపై 5 కమిటీల నియమకం

Published Thu, May 28 2020 8:23 PM | Last Updated on Thu, May 28 2020 8:43 PM

KCR Review Meeting With Officials Over Locust At Raj Bhavan In Hyderabad  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిడతల దండు రాష్ట్రంలోకి దూసుకురాకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. మిడతల దండును అడ్డుకునేందుకు తీసుకునే చర్యలపై ఆయన ప్రగతి భవన్లో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు బి.జనార్థన్ రెడ్డి, ఎస్.నర్సింగ్ రావు, జయేశ్ రంజన్, పీసీసీఎఫ్ శోభ, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఫైర్  డీజీ సంజయ్ కుమార్ జైన్, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, సీఐపీఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. జె. రహమాన్ ప్రముఖులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  రాబోయే రోజుల్లో మిడతలు ఎటువైపు వెళ్లే అవకాశం ఉందనే విషయాన్ని ఆరా తీశారు. రాజస్తాన్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని భండార, గోండియా మీదుగా మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ వైపు వెళ్తున్నట్లు సమాచారం ఉందని అధికారులు చెప్పారు. (ఆదిలాబాద్‌కు 300 కి.మీ. దూరంలో మిడతలు)

అక్కడి నుంచి ఉత్తర భారతదేశం వైపు ప్రయాణించి పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నాట్లు అధికారు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. గాలివాటం ప్రకారం ప్రయాణించే అలవాటున్న మిడతల దండు, ఒకవేల గాలి దక్షిణం వైపు మళ్లితే చత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే మిడతలు తెలంగాణలో ప్రవేశించేందుకు తక్కువ అవకాశాలున్నప్పటికీ రాష్ట్రంలోకి అవి ప్రవేశించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న మిడతల దండును సంహరించేందుకు గోండియా ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారలు సీఎంకు తెలిపారు. అక్కడ కోట్ల సంఖ్యలో మిడతలను చంపగలిగారని అయినా మిగిలిన కొన్ని మిడతలు మధ్యప్రదేశ్ మీదుగా పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలున్నట్లు అంచనాలు ఉన్నాయని చెప్పారు.

కాగా గాలి మరలి చత్తిష్‌గఢ్ మీదుగా తెలంగాణవైపు కూడా రావచ్చని అధికారులు తెలిపారు. అందుకే మిడతల దండు తెలంగాణ వైపు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ ఆదేశించారు. సరిహద్దుల్లోనే వాటిని పెద్ద ఎత్తున పురుగుల మందు పిచికారి చేసి సంహరించాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ అజయ్, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, జీవన్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేషన్ల చైర్మన్లు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, బాలమల్లు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. (పొలాల మధ్యన డీజే, లౌడ్‌ స్పీకర్ల హోరు..)

మిడతల దండును అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు: 
ఇప్పటికే మహారాష్ట్ర, చత్తీష్‌గడ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లోని జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేసింది. ఈ చర్యల్లో భాగంగా ఫైర్ ఇంజన్లను, జెట్టింగ్ మిషన్లను, పెస్టిసైడ్లను సిద్ధంగా పెట్టినట్లు చెప్పారు. మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, రాష్ట్రంలో ప్రవేశించకుండా పర్యవేక్షించేందుకు అయిదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ మిడతల దండు ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, అవి రాకుండా అడ్డుకునే చర్యలను పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం సిఐపిఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. సునిత, వ్యవసాయ యూనివర్సిటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. జె. రహమాన్, వరంగల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అక్బర్, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల కలెక్టర్ భారతిలతో ఈ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలు శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు రామగుండంలోనే మకాం వేస్తుంది. హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట పరిస్థితిని గమనిస్తూ ఉంటారు. (బాలయ్య వ్యాఖ్యల దుమారం.. కళ్యాణ్‌ క్లారిటీ)

మిడతల దండు రాష్ట్ర సరిహద్దుల్లోకి వస్తే వాటిని సంహరించే చర్యలను పర్యవేక్షిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. వారు మిడతల దండు కదలికలను గమనిస్తూ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలి. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో 15 వేల లీటర్ల మాలాతియాన్, క్లోరోఫైరిపాస్, లామ్డా సైలోత్రిన్ ద్రావణాలను సిద్ధంగా పెట్టుకోవాలి. 12 ఫైర్ ఇంజన్లు, 12 జెట్టింగ్ మిషన్లలను కూడా సిద్ధంగా చేసుకోవాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ కార్యదర్శి, వ్యవసాయ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ యూనివర్సిటీ విసి హైదరాబాద్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలి. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఆయా జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితికి అనుగుణంగా పనిచేయాసేలా ఈ కమిటీలు చూసుకుంటాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement