
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతోంది. కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వైరం చేరింది. కేసీఆర్ ప్రభుత్వానికి గవర్నర్ అంటే చిన్నచూపు అని, కనీస మర్యాద ఇవ్వకుండా అవమానపరుస్తారని సందర్భం వచ్చినప్పుడల్లా సీఎంపై తమిళిసై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వంపై అసంతృప్తి
రాష్ట్ర ప్రభుత్వంపై తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్‌భవన్‌లోనే జరుపుకోవాలన్న ప్రభుత్వ లేఖపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు జరపకపోవడం బాధాకరమని వాపోయారు. రాష్ట్రంలో గణతంత్ర వేడుకలను నిర్వహించకపోవడంపై గవర్నర్ తమిళిసై కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన్నట్లుగా సమాచారం.
హైకోర్టులో పిటిషన్
మరోవైపు తెలంగాణలో రిపబ్లిక్ వేడుకలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం దిక్కరించడంపై పిటిషన్ దాఖలు చేశారు. వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ మాధవి ధర్మాసనం బుధవారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు విచారించనుంది.
గవర్నర్‌కు లేఖ
తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసైకి లేఖ రాసింది. అనివార్య కారణాలతో పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ వేడుకలు జరపలేమని తెలిపింది. రాజ్‌భవన్‌లోనే వేడుకలు నిర్వహించాలని లేఖలో ప్రభుత్వం పేర్కొంది.