అడ్డుకోవాల్సిన బాధ్యత టి.మంత్రులదే: కేటీఆర్
హైదరాబాద్: అసెంబ్లీలో సీఎం కిరణ్ ప్రవేశపెట్టిన విభజన బిల్లు తీర్మానానికి ఎలాంటి నైతికత లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సీఎం బ్లాక్‌మెయిల్‌కు స్పీకర్ నాదెండ్ల మనోహర్ లొంగిపోయారని ఆరోపించారు. బీఏసీలో చర్చించకుండా విభజన విభజన బిల్లు తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారని తెలిపారు. స్పీకర్, ముఖ్యమంత్రి కుమ్మక్కై దొడ్డిదారిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో నెగ్గించుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.
ఈ తీర్మానాన్ని ఢిల్లీకి పంపించకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులపై ఉందన్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని సహా అన్ని పార్టీల నాయకులను కలిసి తెలంగాణకు మద్దతు కోరతామని కేటీఆర్ చెప్పారు. విభజన బిల్లు తీర్మానంతో శాసనసభలో ఒక ప్రహసనం ముగిసిందని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. ఈ తీర్మానం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదని కొట్టి పారేశారు.