విభజన చర్చలో తిట్ల పురాణం | TDP, TRS leaders between war while on discussion of telangana bill | Sakshi
Sakshi News home page

విభజన చర్చలో తిట్ల పురాణం

Published Fri, Jan 10 2014 3:00 AM | Last Updated on Mon, Oct 8 2018 9:21 PM

విభజన చర్చలో తిట్ల పురాణం - Sakshi

విభజన చర్చలో తిట్ల పురాణం

సాక్షి, హైదరాబాద్: తోడు దొంగలు... వెన్నుపోటుదారుడు... మోసకారి... గజదొంగ... సిగ్గులేదు... లూటీచేశారు... ఇవీ ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ  బిల్లు-2013పై చర్చ సందర్భంగా వినిపించిన తిట్ల పురాణం. ఆవేశకావేశాలు, దూషణలు, ఆరోపణలు, ఉద్రిక్త పరిస్థితులతో శాసనసభ గురువారం దద్దరిల్లింది. టీడీపీ, టీఆర్‌ఎస్  సభ్యుల మధ్య యుద్ధవాతావరణం ఏర్పడింది. దీంతో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
 
 చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విభజన బిల్లుకు అనుకూలంగా మాట్లాడుతూ... చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించడానికి వీల్లేదని... వెనుకబడిన ప్రాంతమని ప్రస్తావించాలంటూ అప్పటి మంత్రి దాస్యం ప్రణయ్‌భాస్కర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారని ఆరోపించడంతో సభలో గందరగోళానికి తెరలేచింది. తెలుగుదేశం పార్టీ సభ్యులు దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకుని వచ్చారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ‘‘కాంగ్రెస్-టీఆర్‌ఎస్ తోడుదొంగలు.. చంద్రబాబును దెబ్బతీయాలని కలసి పనిచేశాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ైవె ఎస్ 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ కావాలంటూ సంతకాలు చేయించి పంపారు. 2004 ఎన్నికల్లో ఇద్దరూ కలసి చంద్రబాబును దింపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపు తెలంగాణ ఇస్తామని చెప్పి.. పదేళ్లయినా ఇవ్వలేదు. వెయ్యిమంది విద్యార్థుల చావుకు కారణం వీరే. చంద్రబాబు 2008లో రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చారు. ఆ లేఖను వెనక్కి తీసుకోలేదు.
 
 ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నారు. కాంగ్రెస్‌కు సిగ్గులేదు.. మీ సీఎం ఏం మాట్లాడుతున్నారో చెప్పండి’’ అంటూ దయాకర్‌రావు విరుచుకుపడ్డారు. తోడుదొంగలు వ్యాఖ్యపై ఆగ్రహంతో వెల్‌లోకి దూసుకొచ్చిన టీఆర్‌ఎస్ సభ్యులు చంద్రబాబును దూషించడంతో టీడీపీ సభ్యులు సైతం వెల్‌లోకి దూసుకొచ్చారు. ఇరు పార్టీల సభ్యులు పరస్పరం తీవ్రంగా దూషించుకున్నారు. ఒక దశలో టీడీపీ సభ్యుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ సభ్యుడు నల్లాల ఓదెలు నువ్వెంతంటే నువ్వెంత? అంటూ హైదరాబాద్‌ను లూటీ చేశారు... దోచుకున్నారంటూ తిట్లపురాణం ఎత్తుకున్నారు. ఇరుపార్టీల నేతలు వారికి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు.
 
 ఈ దశలో డిప్యూటీ స్పీకర్ కల్పించుకుని... సభ సజావుగా సాగడానికి సూచనలు ఇవ్వాలే తప్ప.. రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు.. కేవలం సూచనలే చేయండని సూచించారు. ఆ తరువాత టీఆర్‌ఎస్ నాయకుడు హరీశ్‌రావు మాట్లాడుతూ... ‘‘తోడుదొంగలు అన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నా. రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరికాయలు, ఆపరేషన్, ఇద్దరు పిల్లల సిద్ధాంతాలు ఎవరివి? ఎన్డీఏ హయాంలో తెలంగాణ రాకుండా అడ్డుకున్నామని చెప్పలేదా? స్పీకర్‌గా యనమల ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించడానికి వీల్లేదని రూలింగ్ ఇవ్వలేదా? పార్లమెంట్‌లో బిల్లు పెట్టమని మీ నాయకుడు ఎందుకు చెప్పరు? వెన్నుపోటుదారుడు, మోసకారి, గజదొంగ అన్న మారు పేర్లు చంద్రబాబునాయుడుకు ఉన్నాయి...’’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. దీంతో టీడీపీ సభ్యులు ఒక్కసారిగా పోడియంలోకి దూసుకెళ్లి హరీశ్‌రావు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ దశలోనే సభను డిప్యూటీ స్పీకర్ శుక్రవారానికి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement