ప్రజల అంచనాలను అందుకుంటాం: కేటీఆర్
పంచాయతీరాజ్ శాఖలో అధికార వికేంద్రీకరణ చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అలాగే ఐటీని పల్లెలకు అనుసంధానం చేస్తామని తెలిపారు. గురువారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేటీఆర్ ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు తాగునీరు అందించడం తన ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరుణంలో రాష్ట్రాభివృద్ధిపై ప్రజలకు అంచనాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకుంటుందని అన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కేటీఆర్ ఈ సందర్బంగా వివరించారు.