కూలుతున్న ‘పంచాయతీ’
Published Fri, Aug 23 2013 5:18 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
ఇందూరు, న్యూస్‌లైన్ :మారుమూల గ్రామ పంచాయతీలు సైతం చాలా వరకు నూతన భవనాలు నిర్మించుకున్నాయి. కానీ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం రేపోమాపో కూలుతుందేమోనన్నట్లు తయారైంది. పెచ్చులూడిన పైకప్పుతో, చెట్ల వేర్లు పాకిన, తేమతో నిండిన గోడలతో ఉద్యోగులను భయపెడుతోంది. అందులో కూర్చుండి పనిచేయడానికి శాఖ ఉద్యోగులు జంకుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోని భయం భయంగా పనిచేస్తున్నారు. ఇందులోని డీపీఓ, డీఎల్‌పీఓ చాంబర్‌లతో పాటు ఇతర గదులు ప్రమాదకరంగా మారాయి.
ఇటీవల పలు భవనాలు కూలిన సంఘటనల నేపథ్యంలో ఉన్నతాధికారులు శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీచేయాలని నోటీసులు జారీ చేశారు. కానీ పంచాయతీ అధికారి కార్యాలయానికి మాత్రం నోటీసులు పంపలేదు. గోడలపై చెట్లు మొలిచి, పెద్దపగుళ్లు వచ్చాయి. స్లాబు పూర్తిగా చెడిపోయి పెచ్చులూడుతోంది. వర్షకాలం సీలింగ్ నుంచి ధారగా ఊరుస్తూనే ఉంది. గోడలన్నీ తేమగా మారిపోయాయి. ఇప్పటికే కంప్యూటర్ విభాగంలో రెండు కొత్త కంప్యూటర్లు వర్షానికి తడిసి చెడిపోయాయి. ఉన్నవాటిని కాపాడుకునేందుకు సిబ్బంది కవర్లు కప్పి ఉంచుతున్నారు. పాతకాలం నాటి విలువైన దస్త్రాలు సైతం తడిసి ముద్దయ్యాయి. మొన్నటికి మొన్న నిర్వహించిన పంచాయతీ ఎన్నికల సామగ్రి సైతం వర్షంనీళ్లకు తడిసింది.
ఇప్పటికీ అద్దె భవనంలోనే..
అసలు జిల్లా పంచాయతీ అధికారికి సొంత భవనమే లేదు. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో కొనసాగుతున్న కార్యాలయ భవనం మునిసిపాల్టీకి చెందింది. దీనికి శాఖ అద్దె చెల్లిస్తోంది. ఇందులో 1991 నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో డీపీఓ కార్యాలయానికి స్థలం ఉంది. దీంట్లో నూతన భవన నిర్మాణం కోసం 2000లో ప్రణాళికలు వేశారు. తీరా నిధులు లేక నిర్మాణం అటకెక్కింది. నిధుల కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా మంజూరు మాటేలేదు.
నూతన భవనం కోసం..
-సురేశ్‌బాబు, డీపీఓ
ప్రస్తుతం ఉన్న జిల్లా కార్యాలయంలో శిథిలావస్థకు చేరుకుంది. జడ్పీలో ఖాళీస్థలం ఉన్నా నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. వీటికోసం మళ్లీ ప్రతిపాదనలు పంపుతున్నాం. అప్పటి వరకు మరో అద్దెభవనం కోసం గాలిస్తున్నాం.
Advertisement
Advertisement