సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త పురపాలికల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. 28 కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుతో పాటు ప్రస్తుత పురపాలికల్లో 199 శివారు గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని జిల్లాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉండటం తో కొత్త పురపాలికలు, విలీన గ్రామ పంచాయతీల సంఖ్య పెరగనుంది. సమీపంలోని రెండు, మూడు గ్రామ పంచాయతీలను విలీనం చేసి కొత్త పురపాలిక ఏర్పాటు చేయా లని ప్రతిపాదనలు వచ్చాయి. మొత్తం 52 గ్రామ పంచాయతీల విలీనం ద్వారా 28 కొత్త పురపాలికలు ఏర్పాటు చేయాలని 15 జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 5 పురపాలికల ఏర్పాటుకు
ప్రతిపాదనలు వచ్చాయి.
జనాభా 15 వేలు మించితే పురపాలికే
15 వేలకు మించిన జనాభా కలిగిన మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు ప్రస్తుతం ఉన్న పురపాలికలకు చుట్టూ 1 నుంచి 5 కి.మీల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలను కొత్త పురపాలికలుగా ఏర్పాటు చేయాలని లేదా ప్రస్తుతం ఉన్న పురపాలికల్లో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ లక్షణాలు, స్వభావం కలిగిన గ్రామ పంచాయతీలను గుర్తించి పురపాలికలుగా ఏర్పాటు చేసేందుకు లేదా సమీప పురపాలికల్లో విలీనం చేసేందుకు అవసరమైన ప్రతిపాదనల తయారీ కోసం ప్రభుత్వం గత నెలలో 9 మంది ప్రత్యేకాధికారులను నియమించింది. జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన ప్రత్యేకాధికారులు 28 కొత్త పురపాలికల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న 73 పురపాలికల్లో 199 శివారు గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రతిపాదనలు సమర్పించారు.
ఆగస్టులో కొత్త పురపాలికల ఏర్పాటు
గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం వచ్చే జూలైతో ముగియనుంది. ఆ వెంటనే కొత్త పురపాలికల ఏర్పాటు, పురపాలికల్లో శివారు గ్రామ పంచాయతీల విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆ లోపే పూర్తి చేయనుంది. కొత్త పురపాలికల ఏర్పాటు, గ్రామ పంచాయతీల విలీన ప్రతిపాదనలకు తుదిరూపు లభించిన తర్వాత ప్రభుత్వం ఈ కసరత్తు ప్రారంభించనుంది. కొత్త పురపాలికల ఏర్పాటు లేదా పురపాలికల్లో విలీనంపై సంబంధిత గ్రామ పంచాయతీల్లో ప్రజాభిప్రాయ సేకరణ కోసం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బహిరంగ ప్రకటన జారీ చేయనుంది. అభిప్రాయాలు తెలపడానికి స్థానిక ప్రజలకు 10 రోజుల గడువు లభించనుంది. ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన అనంతరం సంబంధిత గ్రామ పంచాయతీలను డీనోటిఫై చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆ వెంటనే ఆయా గ్రామ పంచాయతీలను కొత్త నగర పంచా యతీలు, మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ, శివారు పురపాలికల్లో విలీనం చేస్తున్నట్లు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ ప్రక్రియ ఆగస్టు నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.
సెంచరీ దాటనున్న పురపాలికలు
రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీతోపాటు 73 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా 28 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రాగా, తుది ప్రతిపాదనలు సిద్ధమ య్యే సరికి ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఈ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం కొత్త పురపాలికలను ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో పురపాలికల సంఖ్య 100కి మించిపోనుంది.
కొత్తగా 28 పురపాలికలు!
Published Thu, Feb 1 2018 3:21 AM | Last Updated on Thu, Feb 1 2018 3:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment