సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల పునర్విభజన ప్రక్రియ గిరిజనుల రాజకీయ భవిష్యత్తును తిరగరాసింది. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. గిరిజనుల రాజకీయ అవకాశాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటివరకున్న ఎస్టీ సర్పంచుల సంఖ్య ఏకంగా డబుల్ కానుంది. పంచాయతీల పునర్విభజనకు ముందు రాష్ట్రంలో 1,308 గిరిజన గ్రామ పంచాయతీలున్నాయి.
ఐదువందల జనాభా కంటే ఎక్కువున్న గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా పునర్విభజన చేపట్టిన యంత్రాంగం... కొత్తగా 1,327 తండాలకు గ్రామ పంచాయతీ హోదా ఇచ్చింది. 5వందల జనాభాను ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ... తండాల మధ్య దూరం, మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు కొన్నిచోట్ల అంతకు తక్కువ జనాభా ఉన్న వాటిని కూడా పంచాయతీలుగా మార్చారు. కొన్నిచోట్ల జనాభా 700 నుంచి 900 వరకు ఉన్నప్పటికీ ఒకే పంచాయతీగా ఖరారు చేశారు. దీంతో రాష్ట్రంలో గిరిజన గ్రామ పంచాయతీల సంఖ్య 2,635కు చేరగా... సర్పంచుల సంఖ్య ఈ మేరకు పెరగనుంది.
గిరిజన సర్పంచులు రెండు వేలు...
ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన పంచాయతీ రాజ్ చట్టంతో గిరిజనుల నాయకత్వ పెరుగుదలకు మార్గం సుగమమైంది. నూరుశాతం ఎస్టీలున్న గ్రామ పంచాయతీల సర్పంచ్‌లుగా ఎస్టీలనే నియమించాలని ప్రభుత్వం చట్టంలో స్పష్టం చేసింది. గతంలో 1,308 గ్రామ పంచాయతీల్లో 627 పంచాయతీల్లోనే గిరిజన సర్పంచులుఉన్నారు. తాజాగా పంచాయతీల సంఖ్య 2,635కు పెరగగా ఇందులో 1,320 పంచాయతీల్లో నూరుశాతం జనాభా గిరిజనులే. దీంతో ఈ పంచాయతీలన్నీ గిరిజనుల పాలనలోకి వెళ్లనున్నాయి. ఇక్కడ సర్పంచ్ పదవులతో పాటు వార్డు సభ్యుల పదవులు కూడా ఎస్టీలకే దక్కనున్నాయి. అదేవిధంగా మిగిలిన 1,315 పంచాయతీల్లో రొటేషన్ పద్ధతిన గిరిజనులకు సర్పంచ్ అవకాశం దొరుకుతుంది. వీటిలో సగానికి పైగా పంచాయతీలు ఎస్టీలకే రిజర్వ్ కానున్నాయి. మొత్తంగా గిరిజన సర్పంచుల సంఖ్య రాష్ట్రంలో రెండు వేలకు పెరగనుంది.
ఆ పంచాయతీలకు అదనపు నిధులు
నూరుశాతం గిరిజన జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇవ్వనుంది. ఒక్కో గ్రామ పంచాయతీకి 3 నుంచి 5 లక్షల రూపాయలు ప్రత్యేక కోటాలో మంజూరు చేయనుంది. ఈ నిధులను ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా పూర్తిగా పాలకవర్గం తీర్మానంతో ఖర్చు చేసే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల అనంతరం పాలక వర్గాలు ఏర్పాటయ్యాక ఈ నిధులు విడుదల చేసే అవకాశం ఉందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
గిరిజనులకు పదవుల పంట...!
Published Sat, May 12 2018 1:37 AM | Last Updated on Sat, May 12 2018 1:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment