
సాక్షి, అమరావతి: గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ బాధ్యతలను తిరిగి గ్రామ పంచాయతీలకు అప్పగించనున్నారు. వీధి దీపాల పర్యవేక్షణ పంచాయతీల ఆధీనంలోనే ఉండాల్సినా టీడీపీ హయాంలో దీన్ని పైవేట్‌పరం చేశారు. ట్యూబులైట్ల స్థానంలో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. ఎల్‌ఈడీ బల్బులు మాడిపోతే మార్చడం, సక్రమంగా వెలిగేలా చూసే బాధ్యతను ప్రైవేట్ సంస్థలే నిర్వహించేలా ఒప్పందాలు జరిగాయి. ఒక్కో ఎల్‌ఈడీ దీపానికి ఏటా రూ. 450 – రూ. 600 చొప్పున సంబంధిత గ్రామ పంచాయతీ ప్రైవేట్ సంస్థకు పదేళ్ల పాటు చెల్లించాలనేది ఒప్పందంలో ప్రధాన నిబంధన. రాష్ట్రంలో 13,065 గ్రామ పంచాయతీలు ఉండగా 11,032 పంచాయతీల్లో ఈ పనులను ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తున్నాయి.
పగలే వెలుగుతున్న లైట్లు: గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ ప్రైవేట్ పరం చేసిన తర్వాత పట్టపగలు కూడా లక్షల సంఖ్యలో లైట్లు వెలుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల పరిధిలో 23.90 లక్షల కరెంట్ స్థంభాలు ఉండగా 27,65,420 వీధి దీపాలున్నాయి. వీటిల్లో 2,29,194 వీధి దీపాలు నిరంతరాయంగా 24 గంటలూ వెలుగుతున్నాయని గుర్తించారు. మరోవైపు 2,77,324 వీధి దీపాలు అసలు వెలగటం లేదని పంచాయతీరాజ్ కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టింది.
ఎనర్జీ అసిస్టెంట్లకు బాధ్యత: వీధి దీపాలను రోజూ సాయంత్రం వెలిగించడం, తెల్లవారు జామున తిరిగి ఆఫ్ చేసే బాధ్యతను ప్రైవేట్ సంస్థల నుంచి తప్పించి గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్లకు అప్పగించాలని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. వారం పది రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment