వీధిలో ‘ఎల్‌ఈడీ’ దీపం
భారీగా విద్యుత్ వాడే వీధి దీపాలకు మంగళం
హైదరాబాద్: భారీస్థాయిలో విద్యుత్ పొదుపు చర్యలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారీగా విద్యుత్‌ను వినియోగిస్తున్న సంప్రదాయ వీధిదీపాలకు మంగళంపాడి, వాటి స్థానంలో దశలవారీగా ఎల్‌ఈడీ దీపాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం హాలోజెన్, హెచ్‌పీఎస్‌వీ, హెచ్‌పీఎంవీ ల్యాంపులను వీధి దీపాలుగా వినియోగిస్తున్నారు. ఈ సంప్రదాయ దీపాలతో పోల్చితే ఎల్‌ఈడీ దీపాలు తక్కువ విద్యుత్‌తో ఎక్కువ కాంతినిస్తాయి. ఈనెల 8న నిజామాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. అక్కడి నగరపాలక సంస్థ పనితీరుపై సమీక్ష జరిపారు.
వీధి దీపాలకు వినియోగిస్తున్న విద్యుత్‌కు లక్షల రూపాయల బిల్లులు చెల్లిస్తున్న విషయం ఆయన దృష్టికి రావడంతో.. వీధి దీపాల్లో సాంప్రదాయ దీపాల స్థానంలో ఎల్‌ఈడీలను వినియోగించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. దీనిపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ చర్యలు ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టు కింద 12 పురపాలికలను ఎంపిక చేసింది. సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మునిసిపాలిటీలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, రామగుండం మునిసిపల్ కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నల్లగొండ, తాండూరు మునిసిపాలిటీలు వీటిలో ఉన్నాయి.