సమస్యల శి‘వార్’
* కోట్లలో ఆదాయమున్నా.. సౌకర్యాలు సున్నా
* హైదరాబాద్ శివార్లలోని 37 గ్రామపంచాయతీల దుస్థితి
* తాగునీరు కూడా సరిగా అందని పరిస్థితి
* విచ్చలవిడిగా రాజ్యమేలుతున్న అవినీతి
* పాలకవర్గాలున్న చోట్ల కుమ్ములాటలు
* సమస్యలతో జనం అవస్థలు
రాష్ట్ర రాజధాని శివార్లలో ఉన్న గ్రామాలవి.. ఓ రకంగా రాజధానిలో భాగంగానే ఉన్న ప్రాంతాలవి.. కానీ సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్నాయి. వీధి దీపాల్లేవు.. రోడ్లన్నీ గతుకులు.. పారిశుద్ధ్యం అసలే కనపడదు.. డ్రైనేజీలు పాడైపోయి మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.. ఇక మంచినీటి సరఫరా సరిగా లేక జనం పడే అవస్థ వర్ణనాతీతం.. గ్రేటర్ హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న 37 గ్రామ పంచాయతీల్లో దుస్థితి ఇది. ఇందులో గ్రేటర్‌లో విలీనం నిలిచిపోయి ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న గ్రామాలు 12 కాగా.. పాలకవర్గాలుండీ పట్టింపునకు నోచుకోని గ్రామ పంచాయతీలు 25 ఉన్నాయి.
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ శివారు గ్రామాలు రెంటికీ చెడిన రేవడిగా తయారయ్యాయి. 20 నెలలుగా ఆలనా పాలనా లేని పంచాయతీలు 12 ఉండగా.. పాలకవర్గాలుండీ పట్టింపు లేని పంచాయతీలు 25 ఉన్నాయి. ఈ 37 గ్రామా ల్లో సుమారు 16 లక్షల జనాభా ఉంది. బోడుప్పల్ పంచాయతీ నుంచి ఏడాదికి రూ.3.5 కోట్లు, పీర్జాదిగూడ నుంచి రూ.3.05 కోట్లు ఆదాయం వస్తోంది. ఇలా ప్రజలు చెల్లించే పన్నులతో ఈ గ్రామాలకు ఏటా రూ.25 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. కానీ మౌలిక వసతులు ఎండమావిగా మారాయి. జీహెచ్‌ఎంసీలో విలీనం నిలిచిపోయిన 12 గ్రామాల్లో ప్రత్యేకాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపనికీ పైసలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ 12 పంచాయతీల్లో ప్రజల నుంచి పన్నుల రూపేణా ఏటా రూ.11 కోట్లు వసూలు చేస్తున్నారు. కానీ మౌలిక వసతుల కోసం పైసా ఖర్చు చేయడం లేదు. పాలకవర్గాలున్న పంచాయతీల్లోనూ రాజకీయాలు, కుమ్ములాటలు అభివృద్ధి నిరోధకంగా మారాయి. సమస్యలతో అవస్థలు పడుతున్నా.. వీటివైపు సర్కారు చూడడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
‘ప్రత్యేక’ బాధలు..
సరూర్‌నగర్ మండలం ఏర్పాటైనప్పుడు13 గ్రామాలుండేవి. రెండేళ్ల కిందట 8 గ్రామాలను కలిపి బడంగ్‌పేట నగర పంచాయతీని ఏర్పాటు చేశారు. మిగతా గ్రామాలు మీర్‌పేట, జిల్లెలగూడ, పహాడీషరీఫ్, కొత్తపేట, జల్‌పల్లి, బాలాపూర్ గ్రామంలోని కొంత భాగాన్ని గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేస్తూ ప్రకటన చేశారు. కానీ స్థానిక నేతలు కోర్టుకు వెళ్లి... వీటిని గ్రామ పంచాయతీలుగానే ఉండేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అప్పటికే రాష్ట్రవ్యాప్తం గా పంచాయతీ ఎన్నికలు ముగిసి పోవడంతో.. ఈ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. దీంతో ఇవి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఈ గ్రామాల్లోనూ మౌలిక సౌకర్యాలకు దిక్కులేదు. గ్రేటర్‌లో కలిపితే అభివృద్ధి జరుగుతుందని కొందరు భావిస్తుండగా.. పన్నులు పెరగడం తప్ప లాభమేమీ ఉండదని మరికొందరు వాదిస్తున్నారు.
అన్నీ అవస్థలే
రాజేంద్రనగర్ మండల పరిధిలోని 14 పంచాయతీల్లో అభివృద్ధి లేదు. రోడ్లు, నీటివసతి, పారిశుద్ధ్యం లేక ప్రజలు అవస్థలు పడుతున్నా రు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనుండడం, డివిజన్ల సంఖ్యను పెంచే యోచన ఉండడంతో.. పలు గ్రామాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బోడుప్పల్ పంచాయతీ పరిధిలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నీటికి కటకట
తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. కొత్తపేట, పహాడిషరీఫ్ గ్రామ పంచాయతీలకు ఎలాంటి ఆదా య వనరులు లేకపోవడంతో అభివృద్ధి ఏనాడో కుంటుపడింది. వీటిని గ్రేటర్‌లో కలపాలని చాలా ఏళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నాం.
- సిల్వేరు సాంబశివ, కొత్తపేట
సమస్యలు పరిష్కరిస్తలేరు
బాలాపూర్ చౌరస్తాకు ఆనుకొని మా కాలనీ ఉంది. డ్రైనేజీ, నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మూడేళ్ల నుంచి ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదు.
- మల్లేష్ ముదిరాజ్, మీర్‌పేట