
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు మినహా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు సోమవారం నుంచి ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఎదుటి రాష్ట్రాల్లో తిరిగే కిలోమీటర్ల విషయంలో స్పష్టత రాకపోవటంతో తెలంగాణ–ఏపీ మధ్య సర్వీసులు ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టనుంది. కర్ణాటక, మహారాష్ట్రలతో వివాదం లేకపోవటంతో ఈ రెండు రాష్ట్రాలకు అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. శుక్రవారం సిటీ బస్సులతోపాటే వీటిని కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే ఆ రాష్ట్రాలు సంసిద్ధంగా లేకపోవటంతో ప్రారంభాన్ని సోమవారానికి వాయిదా వేసినట్లు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెల్లడించారు.
బెంగళూర్‌కు లేనట్టే..
కర్ణాటక అంతర్రాష్ట్ర సర్వీసులకు పచ్చజెండా ఊపినా, ఆ రాష్ట్ర రాజధాని బెంగుళూర్‌కు మాత్రం తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడిచే అవకాశం కనిపించడం లేదు. బెంగళూర్‌కు వెళ్లాలంటే ఏపీ భూభాగం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఏపీతో ఒప్పందం కుదరకపోవడంతో ఆ రాష్ట్ర భూభాగం మీదుగా తెలంగాణ బస్సులు వెళ్లేందుకు వీలుండదు. కాగా, లాక్‌డౌన్ కు ముందు తెలంగాణ నుంచి కర్ణాటకకు రోజుకు 260 బస్సులు నడిచేవి. వీటిలో బెంగళూర్‌కు వెళ్లే 60 బస్సులు మినహా మిగతా వాటిని తిప్పనున్నారు. ఇక, మహారాష్ట్రకు నిత్యం 130 బస్సులు తిరుగుతాయని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment