సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు | India rolls out its missiles to counter Chinese threat | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు

Published Tue, Sep 29 2020 3:21 AM | Last Updated on Tue, Sep 29 2020 4:08 AM

India rolls out its missiles to counter Chinese threat - Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనాలు ఆధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నాయి. 2 వేల కి.మీల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను, భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను జిన్‌జియాంగ్, టిబెట్‌ ప్రాంతాల్లో చైనా మోహరించింది. ప్రతిగా బ్రహ్మోస్, నిర్భయ్, భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్‌ క్షిపణులను భారత్‌ సిద్ధం చేసింది.

బ్రహ్మోస్‌ది 500 కి.మీల రేంజ్‌ కాగా, నిర్భయ్‌ది 800 కి.మీ.ల రేంజ్‌. 40 కి.మీ.ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఆకాశ్‌ ఛేదించగలదు. చైనా తన ఆయుధ వ్యవస్థలను ఆక్రమిత అక్సాయ్‌ చిన్‌ ప్రాంతంలోనే కాకుండా, వాస్తవాధీన రేఖ వెంట కస్ఘర్, హోటన్, లాసా, నింగ్చి.. తదితర ప్రాంతాల్లోనూ మోహరించింది. ఆకాశం నుంచి ఆకాశంలో ఉన్న లక్ష్యాలను, ఆకాశం నుంచి భూమిపైన ఉన్న లక్ష్యాలను ఛేదించగల అత్యంత శక్తివంత బ్రహ్మోస్‌ క్షిపణి 300 కి.మీ.ల వార్‌హెడ్‌ను మోసుకుని వెళ్లగలదు.

టిబెట్, జిన్‌జియాంగ్‌ల్లోని చైనా వైమానిక స్థావరాలను  బ్రహ్మోస్‌ క్షిపణి లక్ష్యంగా చేసుకోగలదు. లద్దాఖ్‌ ప్రాంతంలో ఈ క్షిపణులను అవసరమైనంత సంఖ్యలో భారత్‌ సిద్ధంగా ఉంచింది. ఎస్‌యూ30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. హిందూ మహా సముద్రంలోని కార్‌ నికోబార్‌ ద్వీపంలో ఉన్న భారత వైమానిక కేంద్రం నుంచి కూడా దీన్ని ప్రయోగించే వీలుంది. కార్‌నికోబార్‌లోని వైమానిక కేంద్రం నుంచి బ్రహ్మోస్, నిర్భయ్‌ క్షిపణులను ప్రయోగించి మలక్కా జలసంధి నుంచి లేదా సుందా జలసంధి నుంచి వచ్చే చైనా యుద్ధ నౌకలను సమర్ధంగా ఎదుర్కోవచ్చు.

ప్రస్తుతం భారత్‌ వద్ద నిర్భయ్‌ క్షిపణుల సంఖ్య పరిమితంగా ఉంది. నిర్భయ్‌ క్షిపణి భూమిపై నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. లద్దాఖ్‌ ప్రాంతంలో ఆకాశ్‌ క్షిపణులను కూడా అవసరమైన సంఖ్యలో భారత్‌ మోహరించింది. భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను చేధించే ఈ క్షిపణి వాస్తవాధీన రేఖ దాటి వచ్చే చైనా విమానాలను లక్ష్యంగా చేసుకోగలదు. ఆకాశ్‌ క్షిపణిలోని రాడార్‌ ఏకకాలంలో 64 లక్ష్యాలను గుర్తించగలదు. అందులో 12 లక్ష్యాలపై దాడి చేయగలదు. ఆకాశంలోనే శత్రుదేశ యుద్ధవిమానాలు, క్రూయిజ్‌ మిస్సైల్స్, బాలిస్టిక్‌ మిస్సైల్స్‌ను కూల్చివేయగలదు. ఈ మధ్యకాలంలో అక్సాయ్‌చిన్‌ ప్రాంతంలో చైనా వైమానిక దళ విమానాల కార్యకలాపాలు కొంత తగ్గాయి కానీ, కారాకోరం పాస్‌ దగ్గరలోని దౌలత్‌బేగ్‌ ఓల్డీ ప్రాంతంలో పెరిగాయి.  

రూ. 2,290 కోట్లతో రక్షణ కొనుగోళ్లు
డిఫెన్స్‌ అక్విజిషన్‌ ప్రొసీజర్‌ను ఆవిష్కరించిన రాజ్‌నాథ్‌ సింగ్‌
త్రివిధ దళాల కోసం రూ. 2,290 కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయుధ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో అమెరికా నుంచి కొనుగోలు చేసే 72 వేల ఎస్‌ఐజీ సావర్‌ తుపాకులు ఉన్నాయి. ఆర్మీ కోసం వీటిని రూ. 780 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రక్షణ శాఖకు చెందిన అత్యున్నత నిర్ణయ మండలి డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ అధ్యక్షతన సమావేశమై ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

ఈ రూ. 2,290 కోట్లలో రూ. 970 కోట్లతో నౌకాదళం, వైమానిక దళం కోసం ‘స్మార్ట్‌ ఎయిర్‌ఫీల్డ్‌ వెపన్‌(ఎస్‌ఏఏడబ్ల్యూ)’ వ్యవస్థలను కొనుగోలు చేయనున్నారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ క్షేత్రస్థాయి దళాల మధ్య అడ్డంకులు లేని సమాచార పంపిణీ కోసం రూ. 540 కోట్లతో హెచ్‌ఎఫ్‌ రేడియో సెట్స్‌ను సమకూర్చాలని నిర్ణయించారు.

భారత్‌ను అంతర్జాతీయ మిలటరీ వ్యవస్థల తయారీ కేంద్రంగా మార్చడం, సాయుధ సామగ్రిని సమకూర్చుకోవడంలో అనవసర జాప్యాలను నివారించడం, అత్యవసర కొనుగోలు నిర్ణయాలను త్రివిధ దళాలే సులభమైన విధానం ద్వారా తీసుకునే అవకాశం కల్పించడం.. లక్ష్యాలుగా ‘డిఫెన్స్‌ అక్విజిషన్‌ ప్రొసీజర్‌(డీఏపీ)’ని రాజ్‌నాథ్‌  ఆవిష్కరించారు. ఈ కొత్త విధానం ప్రకారం, భారత్‌లో ఉత్పత్తి చేసే సంస్థలకు డిఫెన్స్‌ కొనుగోళ్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆధునిక సమాచార సాంకేతికతల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలైన డీఆర్‌డీఓ, డీపీఎస్‌యూలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని డీఏపీని రూపొందించామని రాజ్‌నాథ్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement