akash missile
-
దేశీయ ఆకాశ్-ఎన్జీ క్షిపణి పరీక్ష విజయవంతం
దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్-ఎన్జీ( న్యూ జెనరేషన్) క్షిపణి పరీక్ష విజయవంతం అయినట్లు భారత్ రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీఓ) ప్రకటించింది. ఒడిశాలోని చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్)లో శుక్రవారం ఉదయం 10. 30 గంటలకు తక్కువ ఎత్తులో ఉన్న మానవరహిత వేగవంతమైన లక్ష్యాన్ని చేధించే ఆకాశ్-ఎన్జీ మిసైల్ పరీక్ష విజయవంతం అయిందని పేర్కొంది. ఇకపై ఈ క్షిపణిని భారత సైన్యం, వాయుసేన ఉపయోగించుకోనుందని తెలిపింది. ఆకాశ్-ఎన్జీ క్షిపణ వ్యవస్థ అత్యాధునిక, హైస్పీడ్‌తో వైమానిక దాడులను అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ క్షిపణి పరిధి దాదాపు 80 కిలో మీటర్లు. ఆకాశ్ క్షిపణి ప్రయోగ పరీక్ష విజయవంతమైనట్లు డీఆర్డీఓ ‘ఎక్స్’(ట్విటర్)లో పేర్కొంది. Next Generation Akash missile successfully flight tested from ITR , Chandipur off the coast of Odisha today at 10:30hrs against a high speed unmanned aerial target at very low altitude. @DefenceMinIndia @SpokespersonMoD pic.twitter.com/ShRNi4dfAj — DRDO (@DRDO_India) January 12, 2024 పూర్తిస్థాయి ఆయుధ వ్యవస్థ విజయవంతమైన పనితీరును భారత్ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఈ క్షిపణ దేశియంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్, లాంచర్, మల్టీ-ఫంక్షన్ రాడార్, కమాండ్ కంట్రోల్, కమ్యూనికేషన్ వ్యవస్థతో కూడిన క్షిపణి అని రక్షణ శాఖ పేర్కొంది. చదవండి: Ram Mandir: ‘నా సోదరులు కన్న కల నిజమైంది!’ -
రక్షణలో ‘ఆత్మనిర్భరత’ దిశగా బీడీఎల్
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక సీకర్ ఫెసిలిటీ సెంటర్(ఎస్ఎఫ్సీ)లో ఆకాశ్ క్షిపణి కోసం ఉత్పత్తి చేసిన తొలి రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) సీకర్ను డీఆర్డీవోకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) అప్పగించింది. భూమి మీది నుంచి గాలిలోకి, గాలి లో నుంచి గాలిలోకి మిస్సైల్స్‌ను ప్రయోగించినప్పుడు లక్ష్య సాధన కోసం ఉపయోగించే క్లిష్టమైన టెక్నాలజీ కలిగిన ఇంటెన్సివ్ సబ్ సిస్టమ్‌నే సీకర్‌గా పేర్కొంటారు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ను డిఫె న్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో రూపొందించగా, బీడీఎల్ కంచన్‌బాగ్ యూనిట్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్సీలో ఉత్పత్తి చేశారు. కంచన్‌బాగ్ యూనిట్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో బీడీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ. మాధవరావు తొలిæ ఆర్ఎఫ్ సీకర్ను డీఆర్డీఓ చైర్మ న్, కార్యదర్శి డాక్టర్ సమీర్ వి కామత్‌కు అందజేశారు. దేశ రక్షణ సామర్థ్యాలలో ముందడుగు ఈ సందర్భంగా కామత్ మాట్లాడుతూ బీడీఎల్‌లో సీకర్ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఆర్ఎఫ్ సీకర్ ఉత్పత్తి రంగంలో భారత్ స్వయం ప్రతిపత్తిని సాధించి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో దోహదపడుతుందన్నారు. బీడీఎల్ సీఎండీ మాధవరావు మాట్లాడుతూ ఈ విజయం దేశ రక్షణ సామర్థ్యాలలో ముందడుగని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త యు.రాజాబాబు, డీఆర్డీఎల్ శాస్త్రవేత్త, డైరెక్టర్ జి.ఎ. శ్రీనివాసమూర్తి, ఆర్సీఐ డైరెక్టర్ అనింద్య బిశ్వాస్, ఎఎస్ఎల్ డైరెక్టర్ బి.వి.పాపారావు, బీడీఎల్ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసులు, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వెన్నం ఉపేందర్, బీడీఎల్ భానూర్ యూనిట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.ఆర్.ప్ర«దాన్ (రిటైర్డ్), బీడీఎల్ ఈడీ (కంచన్‌బాగ్) పీవీ రాజా రామ్, బీడీఎల్ జీఎం ఎం. శ్రీధర్‌రావు పాల్గొన్నారు. -
ఆకాశ్ ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఒడిశా రాష్ట్రం చండిపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్ 'ఆకాశ్ ప్రైమ్'ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) విజయవంతంగా పరీక్షించింది. ఆకాశ్ ప్రైమ్ అనే కొత్త క్షిపణి శత్రు విమానాలను అనుకరించే మానవరహిత వైమానిక లక్ష్యాన్ని ఈ క్షిపణి అడ్డగించి నాశనం చేసినట్లు డీఆర్డీఓ తెలిపింది. ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్‌ను మెరుగుపరిచి ఆ తర్వాత పరీక్షించినట్లు డీఆర్డీఓ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను డీఆర్డీఓ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. "ఆకాశ్ ప్రైమ్ క్షిపణిలో మెరుగైన ఖచ్చితత్త్వం కోసం దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన యాక్టివ్ ఆర్ఎఫ్ సీకర్ ఉంది. లక్ష్య ఛేదనలో క్షిపణి కచ్చితత్వాన్ని ఇది బాగా మెరుగుపరచింది. అధిక ఎత్తులో తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మంచి పనితీరును కనబరుస్తుంది" అని ఒక అధికారి మీడియాతో పంచుకున్నారు. ఈ క్షిపణి పరీక్ష విజయవంతంగా నిర్వహించినందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ), భారత సైన్యం, భారత వైమానిక దళం, ఇతర వాటాదారులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. ఆకాశ్ ప్రైమ్ వ్యవస్థపై భారత సైన్యం, భారత వైమానిక దళం విశ్వాసం మరింత పెరుగుతుందని డీఆర్డీవో ఛైర్మన్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. (చదవండి: నా కెరియర్లో విచిత్రమైన ఒప్పందం : సత్య నాదేళ్ల) DRDO today conducts Successful Maiden Flight Test of Akash Prime Missile from Integrated Test Range (ITR), Chandipur, Odisha. pic.twitter.com/QlvMHtTWVj — DRDO (@DRDO_India) September 27, 2021 -
ఆకాశ్-ఎన్జీ క్షిపణి పరీక్ష విజయవంతం
ఒడిశా: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆకాష్-ఎన్జీ(న్యూ జనరేషన్) క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఆకాష్-ఎన్జీ అనేది కొత్త తరం సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి. ఇది భారత వైమానిక దళం కోసం తయారుచేయబడింది. భారత వాయుసేన ఉపరితలం నుంచి గగన తలంలో శత్రుదేశాల చెందిన అధిక శక్తి గల వైమానిక దళాలను చేధించడానికి తోడ్పడుతుంది. ఈ క్షిపణి పరిక్ష సమయంలో అత్యంత కచ్చితమైన టైమింగ్‌తో లక్ష్యాన్ని చేధించింది.(చదవండి: వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా?) కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఆన్‌బోర్డ్ ఏవియానిక్స్, క్షిపణి యొక్క ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్ యొక్క పనితీరు ట్రయల్ సమయంలో విజయవంతంగా పనిచేసాయి అని డీఆర్డీవో ధ్రువీకరించింది. క్షిపణి పరీక్ష ప్రయోగ సమయంలో గగన తల విమాన మార్గాన్ని పర్యవేక్షించారు. తాజా ప్రయోగాన్ని భారతీయ వైమానిక దళం ప్రతినిధుల సమక్షంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), బీడీఎల్, బీఈఎల్ సంయుక్త బృందం ఈ పరీక్ష ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ విజయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. శాస్త్రవేత్తలను అభినందించారు. ఇటీవల కాలంలో సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నాటి నుంచి భారత్ తరచూ క్షిపణుల పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనాలు ఆధునిక ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నాయి. 2 వేల కి.మీల వరకు లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను, భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను జిన్జియాంగ్, టిబెట్ ప్రాంతాల్లో చైనా మోహరించింది. ప్రతిగా బ్రహ్మోస్, నిర్భయ్, భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్ క్షిపణులను భారత్ సిద్ధం చేసింది. బ్రహ్మోస్‌ది 500 కి.మీల రేంజ్ కాగా, నిర్భయ్‌ది 800 కి.మీ.ల రేంజ్. 40 కి.మీ.ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఆకాశ్ ఛేదించగలదు. చైనా తన ఆయుధ వ్యవస్థలను ఆక్రమిత అక్సాయ్ చిన్ ప్రాంతంలోనే కాకుండా, వాస్తవాధీన రేఖ వెంట కస్ఘర్, హోటన్, లాసా, నింగ్చి.. తదితర ప్రాంతాల్లోనూ మోహరించింది. ఆకాశం నుంచి ఆకాశంలో ఉన్న లక్ష్యాలను, ఆకాశం నుంచి భూమిపైన ఉన్న లక్ష్యాలను ఛేదించగల అత్యంత శక్తివంత బ్రహ్మోస్ క్షిపణి 300 కి.మీ.ల వార్‌హెడ్‌ను మోసుకుని వెళ్లగలదు. టిబెట్, జిన్‌జియాంగ్‌ల్లోని చైనా వైమానిక స్థావరాలను బ్రహ్మోస్ క్షిపణి లక్ష్యంగా చేసుకోగలదు. లద్దాఖ్ ప్రాంతంలో ఈ క్షిపణులను అవసరమైనంత సంఖ్యలో భారత్ సిద్ధంగా ఉంచింది. ఎస్‌యూ30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించవచ్చు. హిందూ మహా సముద్రంలోని కార్ నికోబార్ ద్వీపంలో ఉన్న భారత వైమానిక కేంద్రం నుంచి కూడా దీన్ని ప్రయోగించే వీలుంది. కార్‌నికోబార్‌లోని వైమానిక కేంద్రం నుంచి బ్రహ్మోస్, నిర్భయ్ క్షిపణులను ప్రయోగించి మలక్కా జలసంధి నుంచి లేదా సుందా జలసంధి నుంచి వచ్చే చైనా యుద్ధ నౌకలను సమర్ధంగా ఎదుర్కోవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద నిర్భయ్ క్షిపణుల సంఖ్య పరిమితంగా ఉంది. నిర్భయ్ క్షిపణి భూమిపై నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. లద్దాఖ్ ప్రాంతంలో ఆకాశ్ క్షిపణులను కూడా అవసరమైన సంఖ్యలో భారత్ మోహరించింది. భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను చేధించే ఈ క్షిపణి వాస్తవాధీన రేఖ దాటి వచ్చే చైనా విమానాలను లక్ష్యంగా చేసుకోగలదు. ఆకాశ్ క్షిపణిలోని రాడార్ ఏకకాలంలో 64 లక్ష్యాలను గుర్తించగలదు. అందులో 12 లక్ష్యాలపై దాడి చేయగలదు. ఆకాశంలోనే శత్రుదేశ యుద్ధవిమానాలు, క్రూయిజ్ మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్స్‌ను కూల్చివేయగలదు. ఈ మధ్యకాలంలో అక్సాయ్‌చిన్ ప్రాంతంలో చైనా వైమానిక దళ విమానాల కార్యకలాపాలు కొంత తగ్గాయి కానీ, కారాకోరం పాస్ దగ్గరలోని దౌలత్‌బేగ్ ఓల్డీ ప్రాంతంలో పెరిగాయి. రూ. 2,290 కోట్లతో రక్షణ కొనుగోళ్లు డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్‌ను ఆవిష్కరించిన రాజ్‌నాథ్ సింగ్ త్రివిధ దళాల కోసం రూ. 2,290 కోట్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయుధ వ్యవస్థల కొనుగోలు ప్రతిపాదనకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో అమెరికా నుంచి కొనుగోలు చేసే 72 వేల ఎస్ఐజీ సావర్ తుపాకులు ఉన్నాయి. ఆర్మీ కోసం వీటిని రూ. 780 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రక్షణ శాఖకు చెందిన అత్యున్నత నిర్ణయ మండలి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన సమావేశమై ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ రూ. 2,290 కోట్లలో రూ. 970 కోట్లతో నౌకాదళం, వైమానిక దళం కోసం ‘స్మార్ట్ ఎయిర్‌ఫీల్డ్ వెపన్(ఎస్ఏఏడబ్ల్యూ)’ వ్యవస్థలను కొనుగోలు చేయనున్నారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ క్షేత్రస్థాయి దళాల మధ్య అడ్డంకులు లేని సమాచార పంపిణీ కోసం రూ. 540 కోట్లతో హెచ్ఎఫ్ రేడియో సెట్స్‌ను సమకూర్చాలని నిర్ణయించారు. భారత్‌ను అంతర్జాతీయ మిలటరీ వ్యవస్థల తయారీ కేంద్రంగా మార్చడం, సాయుధ సామగ్రిని సమకూర్చుకోవడంలో అనవసర జాప్యాలను నివారించడం, అత్యవసర కొనుగోలు నిర్ణయాలను త్రివిధ దళాలే సులభమైన విధానం ద్వారా తీసుకునే అవకాశం కల్పించడం.. లక్ష్యాలుగా ‘డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్(డీఏపీ)’ని రాజ్‌నాథ్ ఆవిష్కరించారు. ఈ కొత్త విధానం ప్రకారం, భారత్‌లో ఉత్పత్తి చేసే సంస్థలకు డిఫెన్స్ కొనుగోళ్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆధునిక సమాచార సాంకేతికతల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలైన డీఆర్డీఓ, డీపీఎస్‌యూలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని డీఏపీని రూపొందించామని రాజ్‌నాథ్ చెప్పారు. -
లద్దాఖ్‌కు క్షిపణి వ్యవస్థ
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి ముందుకు చొచ్చుకువచ్చిన చైనా ఆర్మీ వెనక్కి తగ్గేది లేదంటూ మొండికేసింది. పైపెచ్చు వివాదాస్పద ప్రాంతాల్లోకి భారీగా సైనిక బలగాలను దించుతోంది. దీంతో భారత్ అదే స్థాయిలో చర్యలు చేపడుతోంది. లద్దాఖ్‌కు ఆర్మీతోపాటు వైమానిక బలగాలను తరలించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నైనా తిప్పికొట్టేందుకు కీలకమైన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థలను తరలించింది. గల్వాన్ ఘటన జరిగిన పెట్రోల్ పాయింట్–14 వద్దకు రెండు దేశాలు బలగాలను, సైనిక సంపత్తిని భారీగా తరలించాయి. ఈ ఘటన జరిగిన అనంతరం అదే రోజు రెండు దేశాల కార్ప్స్ కమాండర్ల స్థాయిలో చర్చలు ఒక వైపు సాగుతుండగానే చైనా అబ్జర్వేషన్ పోస్టులు, టెంట్లతోపాటు గోడను నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాల్లో తేలింది. అక్కడి నుంచి వెనక్కి తగ్గేందుకు చైనా నిరాకరించడంతో ఆ రోజు జరిగిన చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. గతంలో ఎన్నడూ కూడా గల్వాన్ లోయను తమ మ్యాప్‌లో చైనా చూపించుకోలేదు. అయినప్పటికీ, అది తమ భూభాగం కాబట్టే అక్కడికి వచ్చామనీ, తిరిగి ఎందుకు వెనక్కి వెళ్లాలని చైనా ప్రతినిధులు వాదించినట్లు సమాచారం. ఆ తర్వాత జరగాల్సిన చర్చల తేదీలు కూడా ఖరారు కాకపోవడం గమనార్హం. ఇదే సమయంలో రెండు దేశాలు ఎల్ఏసీ వెంట ఆయుధ సంపత్తిని, బలగాలను మోహరించడం కొనసాగిస్తున్నాయి. మరో మూడు నెలల తర్వాత లద్దాఖ్‌లో మళ్లీ మంచు కురియడం మొదలవుతుంది. ఆ సమయంలో లద్దాఖ్‌కు మిగతా భారత దేశంతో దాదాపు 6 నెలలపాటు సంబంధాలు తెగిపోతాయి. భారత సైన్యం కూడా అటువంటి పరిస్థితులకు తగ్గట్లుగా ఏర్పాట్లకు సిద్ధమైంది. చైనా మోహరింపులిలా.. ► ఎల్ఏసీ వెంట చైనా భారీగా బలగాలు, ట్యాంకులు, క్షిపణులు, యుద్ధ విమానాలను మోహరించింది. పాంగాంగ్ త్సోలోని ఫింగర్4 వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటుచేసింది. ► సుఖోయ్–30 వంటి యుద్ధ విమానాలు, వ్యూహాత్మక బాంబర్లను అక్కడ మోహరించింది. ఇవి భారత్‌తో సరిహద్దులకు 10 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి పహారా కాస్తున్నట్లు సమాచారం. ► దౌలత్ బేగ్ ఓల్డీ, పెట్రోలింగ్ పాయింట్–14 సమీపంలోని గల్వాన్ లోయ, పెట్రోలింగ్ పాయింట్–15,17, 17ఏ, ఫింగర్ పాయింట్, పాంగోంగ్ త్సోలకు సమీపంలోని చైనా సైనిక హెలికాప్టర్లు గస్తీ చేపట్టాయి. భారత్ ఏం చేస్తోందంటే.. ► ఉత్తర భారతదేశంలోని ఎయిర్ బేస్‌లు, కంటోన్మెంట్లలో ఉన్న బలగాలు, ఫిరంగులు, శతఘ్ని దళాలు, నిఘా రాడార్లు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు గత నెల నుంచి లద్దాఖ్‌కు తరలుతున్నాయి. నూతనంగా ఏర్పాటైన కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో ప్రస్తుతం 45వేల సైన్యం మోహరించి ఉంది. ► చైనా బలగాలు ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా తక్షణమే తప్పికొట్టేందుకు వైమానిక, నావికా దళాలకు చెందిన గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థను తూర్పు లద్దాఖ్‌కు తరలించింది. వేగంగా ప్రయాణించే యుద్ధ విమానాలతోపాటు డ్రోన్లను సైతం రెప్పపాటులోనే నేలకూల్చే సామర్ధ్యం ఉన్న ఆకాశ్ క్షిపణులు ఇందులో ఉన్నాయి. ► చండీగఢ్‌లోని వైమానిక స్థావరం నుంచి 46 టన్నుల భారీ టి90 యుద్ధట్యాంక్‌ను సి17 గ్లోబ్‌మాస్టర్ విమానం లద్దాఖ్‌కు మోసుకెళ్లింది. ► దౌలత్ బేగ్ ఓల్డీ, ఫుక్చే, నియోమాల్లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్‌ను ఎయిర్ ఫోర్స్ అప్రమత్తం చేసింది. ఈ ప్రాంతంలో ఎస్యు30 ఎంకేఐ యుద్ధ విమానాలను మోహరించింది. శ్రీనగర్, లేహ్‌లో జాగ్వార్, మిరాజ్–200 యుద్ధ విమానాలు, అపాచీ హెలికాప్టర్లను రంగంలోకి దించింది. ► సముద్రంలో చైనా కదలికలపై కన్ను వేసి ఉంచేందుకు నేవీ తన పి–81 నిఘా విమానాన్ని గస్తీకి పంపింది. ► లద్దాఖ్‌లోని 1,597 కిలోమీటర్ల పొడవైన చైనా సరిహద్దుల్లో ఉన్న 65 పాయింట్లలో పహారాను మరింత పెంచింది. ► సరిహద్దుల్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గల్వాన్ లోయ, లద్దాఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్, డెప్సంగ్ మైదానాలు, ప్యాంగాంగ్ త్సోతోపాటు ఉత్తర సిక్కింలోని నకు లా ప్రాంతాల్లో భారత్, చైనా బలగాలు అత్యంత సమీపంలో మోహరించి ఉండటంతో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. నిపుణులు ఏమన్నారంటే.. ► ‘అతిక్రమణలను, భారత భూభాగం వైపు నిర్మాణాలు చేపట్టడం చైనా నిలిపివేయాలి. సైనిక ప్రతిష్టంభన తొలగిపోవడానికి ఏకైక పరిష్కారం ఇదే’ అని చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రీ అన్నారు. ► వెనక్కి తగ్గేందుకు రెండు పక్షాలు ఏమేరకు సానుకూలంగా ఉన్నాయనే దానిపైనే వివాద పరిష్కారం ఆధారపడి ఉంది’ అని మాజీ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా అన్నారు. ► ‘సరిహద్దుల్లో మోహరింపులు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలున్నాయి. బలగాల ఉపసంహరణ టి–20 మ్యాచ్‌లాగా వెంటనే ఫలితం తేలేది కాదు, టెస్ట్ మ్యాచ్ వంటిది. ఇందుకు 2, 3 నెలల వరకు పట్టవచ్చు. అంతకంటే, ఎక్కువ కాలం కూడా కొనసాగవచ్చు’ అని సైనిక ప్రధాన కార్యాలయంలోని ఓ అధికారి అంచనా వేశారు. ► భారత్‌తో సరిహద్దుల వెంట చైనా అనుసరిస్తున్న వైఖరితో ఆ దేశం భవిష్యత్తులో సుదీర్ఘ కాలం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని డిప్యూటీ చీఫ్ ఆర్మీ స్టాఫ్(రిటైర్డు) లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ పేర్కొన్నారు. ఇలాంటి తీరుతో ఆ దేశం అంతర్జాతీయంగా ఏకాకిగా మారుతుందన్నారు. ప్రపంచమంతా కోవిడ్–19 మహమ్మారితో పోరాడుతుంటే చైనా మాత్రం లద్దాఖ్‌లో దుశ్చర్యకు పాల్పడటం ఆ దేశం నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిందని అమెరికాతో టారిఫ్ యుద్ధం, ఆస్ట్రేలియాతో విభేదాలు, హాంకాంగ్‌లో దిగజారుతున్న పరిస్థితులతో చైనాకు గడ్డు పరిస్థితులు తప్పవన్నారు. గల్వాన్ ఘటనతో చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఒక రాజకీయ బలగమే తప్ప దానికి ఎలాంటి సైనిక ప్రమాణాలు లేనట్లు అర్థమవుతోందని చెప్పారు. -
సైన్యం అమ్ములపొదిలోకి ఆకాశ్
- స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అధునాతన క్షిపణి - ఒకే సమయంలో బహుళ లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం - శత్రువుల హెలికాప్టర్లు, విమానాలను నాశనం చేయగలదు - మూడు దశాబ్దాల కృషి ఫలించిందన్న సైన్యాధిపతి న్యూఢిల్లీ: భారత రక్షణ శాఖ చరిత్రలో ఇదో ముఖ్యమైన ఘట్టం. అత్యంత అధునాతనమైన క్షిపణి భారత సైన్యం అమ్ములపొదిలో చేరింది. మూడు దశాబ్దాలకు పైగా చేసిన కృషి ఫలించింది. పూర్తి స్వదేశీ శాస్త్ర పరిజ్ఞానంతో రూపొందించిన ఉపరితల క్షిపణి ఆకాశ్ మన సైన్యానికి పెద్ద వరం కానుంది. హైదరాబాద్‌లోని రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) తయారుచేసిన ఈ క్షిపణి శత్రు దేశాల హెలికాప్టర్లు, విమానాలు, ద్రోణులను 25 కిలోమీటర్ల దూరం నుంచి సులభంగా ఛేదించగలదు. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ క్షిపణిని సైన్యానికి అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా సైన్యాధిపతి జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ మాట్లాడుతూ.. ఈ క్షిపణి చేరికతో దేశ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైందన్నారు. ఆకాశ్ తయారీ ప్రయాణం అంత సులువుగా సాగలేదని, దీని వెనుక మూడు దశాబ్దాల కృషి ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయన్నారు. ఉపరితలం నుంచి గగనంలోని స్వల్పదూర లక్ష్యాలను 20 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ క్షిపణి ఛేదించగలదు. ఒకే సమయంలో బహుళ లక్ష్యాలను సైతం ఛేదించగలదు. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే సామర్థ్యమున్న ఆకాశ్ యుద్ధక్షేత్రంలో సైన్యానికి కవచంగా ఉంటుంది. ఆర్మీలో చేరిన క్షిపణిని లాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగించేందుకు, ఎక్కడికైనా తరలించేందుకు అనువుగా ఉంటుంది. అందువల్ల సైన్యం అవసరాల మేరకు దీన్ని వాడుకోవచ్చని ప్రాజెక్టు డెరైక్టర్ జి.చంద్రమౌళి పీటీఐతో చెప్పారు. 1984 నుంచి డీఆర్డీఓ రూపొం దించిన 5 కీలక క్షిపణుల్లో ఆకాశ్ ఒకటి. -
ఆకాశ్.. అన్ని పరీక్షలూ పాస్!
* గగనతలంలో చిన్న యూఏవీనీ ధ్వంసం చేసిన క్షిపణి * సైన్యం అమ్ములపొదికి చేరేందుకు ఇక సిద్ధం న్యూఢిల్లీ: గగనతలంలో శత్రు విమానాలను తుత్తునియలు చేయగల ఆకాశ్ క్షిపణి ఎట్టకేలకు సైన్యం అమ్ములపొదికి చేరేందుకు సిద్ధమైంది. రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) రూపొందించిన ఆకాశ్ క్షిపణిని సైన్యం మరోసారి విజయవంతంగా పరీక్షించింది. బుధవారం సరిహద్దు వద్ద నిర్వహించిన పరీక్షలో గగనతలంలో 30 మీటర్ల ఎత్తులోనే ఎగురుతున్న బన్షీ అనే చిన్న మానవరహిత వాహనం(యూఏవీ)ని తక్కువ ఎత్తులోనే ఎగురుతూ వె ళ్లి ఆకాశ్ ధ్వంసం చేసిందని డీఆర్డీవో అధికారులు ప్రకటించారు. దీంతో సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను సైతం ఆకాశ్ ధ్వంసం చేయగలదని నిరూపణ అయిందని, తాజా పరీక్షతో అన్ని రకాల పరీక్షల్లోనూ ఆకాశ్ సత్తా చాటినట్లైందని వెల్లడించారు. ఆకాశ్ శక్తి, సామర్థ్యాల నిర్ధారణకు సైన్యం నిర్వహించిన ఆఖరు పరీక్ష ఇదని, దీంతో ఆకాశ్ సూపర్సోనిక్ క్షిపణులను సైన్యానికి అందించేందుకు మార్గం సుగమం అయిందని పేర్కొన్నారు. క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్డీవో శాస్త్రవేత్తలు, సైన్యం, అధికారులకు ఆ సంస్థ చీఫ్ అవినాశ్ చందర్ అభినందనలు తెలియజేశారు. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతోనే గగనతల రక్షణ సాంకేతికతలను సమకూర్చుకోవడంలో ఆకాశ్ కీలక మైలురాయి అని ఆయన అన్నారు. ఈ క్షిపణిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం కింద ఆకాశ్ క్షిపణి వ్యవస్థలను డీఆర్డీవో రెండు దశాబ్దాలుగా అభివృద్ధిపరుస్తోంది. సుమారు 30 మీటర్ల నుంచి 18 కి.మీ. ఎత్తులో, 30 కి.మీ. దూరంలోపు ఎగురుతున్న శత్రు యుద్ధవిమానాలను, యూఏవీలను, హెలికాప్టర్లను ఆకాశ్ క్షిపణి ధ్వంసం చేయగలదు. -
మధిర కీర్తి ఆకాశమంత
మధిర, న్యూస్‌లైన్: స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాశ్ క్షిపణి దేశానికే గర్వకారణం. శత్రుసైన్యం విమానాలను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయశాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ లేబోరేటరీ (డీఆర్డీఎల్)లో పనిచేస్తున్న ఆకాశ్‌క్షిపణి ప్రాజెక్టు డెరైక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి ఆధ్వర్యంలో దీన్ని రూపొందించారు. మే 1, 2 తేదీల్లో ఒడిశాలోని చాంద్‌పూర్ ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రమౌళి ఇక్కడివారే కావడం గమనార్హం. స్థానిక టీవీఎం పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం చేశారు. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన చంద్రమౌళి సాధించిన ఈ కీర్తిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా ఏడాదికోసారైనా తన స్వగ్రామం మధిరకు వచ్చి బంధుమిత్రులతో గడిపివెళ్లే గడ్డమణుగు చంద్రమౌళి ‘ఆకాశ’మంత ఎత్తు ఎదగడానికి దోహదపడిన అంశాలు ఆయన మాటల్లోనే... చిన్ననాటి నుంచే శాస్త్రీయ దృక్పథం మా నాన్నగారు పేరు గడ్డమణుగు సత్యనారాయణరావుగారు. ప్రభుత్వశాఖలో చిరుద్యోగి. ఆయనకు నవలలంటే ఎంతో ఇష్టం. నేను ఆరు, ఏడు తరగతులు చదివేటప్పుడు మధిరలోని గ్రంథాలయం నుంచి తెలుగు నవలలను ఇంటికి తెచ్చి చదివేవారు. వాటిని తిరిగి ఇచ్చేందుకు గ్రంథాలయానికి నన్ను పంపేవారు. అప్పుడు అక్కడి పుస్తకాలు, మేగజైన్లు చూసేవాణ్ని. వాటిలో రోదసికీ సంబంధించిన అంశాలు, కలర్ ఫొటోలతో కూడిన పుస్తకాలు నన్ను ఎంతగానో ఆకట్టుకునేవి. చిన్నప్పటి నుంచి నాకు శాస్త్రీయ దృక్పథం ఎక్కువగా ఉండేది. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే నాకెంతో ఆసక్తి. మానాన్నగారి లాగే నేను కూడా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలని అనుకునేవాణ్ని. సైన్స్‌పై ఉన్న ఆసక్తితో క్షి పణి ప్రయోగాల గురించి పరిజ్ఞానం పెంచుకున్నాను. చిన్ననాటి నుంచి నాకున్న ఆసక్తి నేడు ఆకాశ్ క్షిపణి ప్రయో గం దాకా తీసుకెళ్లింది. దేశానికి ఎంతో ఉపయోగపడే అత్యాధునిక క్షిపణిని నా చేతులమీదుగా తయారు చేయడం, ప్రయోగించడం నాకెంతో గర్వకారణంగా ఉంది. పుట్టుపూర్వోత్తరాలు... ఇంటర్మీడియెట్ వరకు మధిరలోనే చదివాను. వరంగల్‌లోని రీజనింగ్ ఇంజినీరింగ్ కళాశాలలో (ఆర్ఈసీ)లో 1981లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాను. ఢిల్లీలోని ఐఐటీలో ఎంటెక్ చదివాను. రెండేళ్లు ఓ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగం చేశాను. 1983 డిసెంబర్లో యూపీపీఎస్సీ ద్వారా డీఆర్డీఏలో ఉద్యోగం పొందాను. ఇంటిగ్రేటెడ్ గ్రైనెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఐజీఎండీపీ)ను మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్‌కలాం శిష్యరికంలో ప్రారంభించాను. ఆయన నన్ను ఆకాశ్ ప్రాజెక్టులో డాక్టర్ ప్రహ్లాద దగ్గర నియమించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పుడే నేను, ప్రహ్లాదగారు, మరొక ఆఫీసర్‌తో కలిసి ఈ ప్రాజెక్టు మొదలు పెట్టాం. అది ఇన్నాళ్లకు నా చేతులమీదుగా ఆవిష్కృతమై విజయవంతం కావడం ఆనందంగా ఉంది. స్ఫూర్తినిచ్చిన వారిలో... నాకు డాక్టర్ అబ్దుల్‌కలాం. టెన్నికల్ గెడైన్స్, ప్లానింగ్‌కు డాక్టర్ ప్రహ్లాద, పారజెక్టు మేనేజ్మెంట్ స్వర్గీయ డాక్టర్ పాణ్యం, ప్లానింగ్ స్కిల్స్‌లో డాక్టర్ జాగీర్దర్రావు, తోటి శాస్త్రవేత్తలు జీఎన్ రావు వంటివారు నాకు స్ఫూర్తినిచ్చారు. ఆకాశ్ క్షిపణి ప్రత్యేకతలు ఆకాశంలో ఎగిరే శత్రు విమానాలు, పెలైట్ రహిత విమానాలను ఛేదించేందుకు ఆకాశ్ క్షిపణి వ్యవస్థను హైద్రాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబోరేటరీ (డీఆర్డీఎల్) కేంద్రంగా రూపొందించాం. ఒకేసారి నాలుగు విమానాలను, నాలుగు సూపర్సోనిక్ క్షిపణులతో ఛేదించడం దీని ప్రత్యేక. ఈ వ్యవస్థను పూర్తిఆటోమేటిక్గా గానీ, సెమీ ఆటోమేటిక్‌గా గానీ ప్రయోగించవచ్చు. ప్రపంచంలో ఇటువంటి సామర్థ్యమున్న వ్యవస్థ అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే ఉంది. మన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోని దేశాలన్నింటికంటే ముందుంది. మన క్షిపణికున్న ప్రత్యేక ఫీచర్స్ ఇతర దేశాలకు లేవు. మన ‘ఆకాశ్’ ఫీచర్స్.. మన క్షిపణి వ్యవస్థకున్న ప్రత్యేకతలేంటంటే ప్రపంచంలోనే అతితక్కువ ఖర్చుతో ఒక విమానాన్ని ఛేదించగల సామర్థ్యం. దీనినే ‘లో కాస్ట్పర్ కిల్’ అంటారు. ఒకేసారి నాలుగు విమానాలను ఛేదించడం. సుముఖంగా ఉండే విమానాలను ఛేదించడం. ఆటోమోడ్ ఆపరేషన్, సూపర్సోనిక్ సామర్థ్యంగల క్షిపణి, తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని చేరడం, లక్ష్యాలను ఎక్కువ సామర్థ్యంతో ఛేదించడం దీని ప్రత్యేకతలు. ‘ఆకాశ్’ వేగంగా కదిలి... విన్యాసాలు చేస్తూ వేగంగా కదిలే విమానాలను సైతం మన ఆకాశ్ ఛేదిస్తుంది. కదిలే లక్ష్యాలను ఛేదించాలంటే అవి ఏ దిశగా కదులుతాయి, ఎంత వేగంగా కదులుతాయి, లక్ష్యానుగుణంగా క్షిపణులను ఎలా గైడ్ చేయాలి అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించాలంటే కొన్ని సంవత్సరాల కృషి అవసరం. అభివృద్ధి చెందిన దేశాలెన్నో ఇటువంటి ప్రయోగాలను మొదలు పెట్టి అవి సఫలం కాక మధ్యలోనే వదిలివేసిన సందర్భాలున్నాయి. మన శాస్త్రవేత్తలు ఇవన్నీ కూలంకషంగా పరిశీలించారు. ఓటమి నుంచే గెలుపును ఎలా కనుగొనాలో మన శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఒకటికి రెండుసార్లు ప్రయోగాలు చేశారు. అన్ని పాయింట్స్‌ను ఎంతో కఠోరశ్రమతో ఛేదించడంవల్ల వరల్డ్‌క్లాస్ క్షిపణి వ్యవస్థను తయారు చేయగలిగారు. దీనికి సంబంధించిన అతిముఖ్యమైన రాడార్లను బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఎల్ఆర్డీఈ)ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. రాడార్ గురించి.. క్షిపణులను ప్రయోగించేముందు లక్ష్యాలను గుర్తించేందుకు రాడార్‌ను వాడుతారు. క్షిపణులను లక్ష్యాలవైపు మళ్లించేందుకు మరొక రాడార్‌ను ఉపయోగిస్తారు. ఆకాశ్ వ్యవస్థ నుంచే ఈ రెండుపనులను ఏకకాలంలో రాడార్ చేస్తుంది. ఈ సిస్టం పూర్తిగా డిజిటల్-3 డైమన్షినల్ బీంస్కానింగ్. సూక్ష్మంగా ఉండే లక్ష్యాలను గుర్తించడం, అతివేగంగా పయనించే 64 లక్ష్యాలను ఒకేసారి ట్రాక్ చేయడం, ఒకేసారి ఎనిమిది క్షిపణులను గైడ్ చేయడం, శత్రు, మిత్ర విమానాలను గుర్తించడం, అత్యాధునిక ఎలక్ట్రానిక్ కౌంటర్ మెస్యూరింగ్ (ఈసీసీఎం) ఫీచర్స్‌తో ఈ రాడార్‌ను రూపొందించారు. డీఆర్డీఏలోని 13 లేబోరేటరీలు, ఐదు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఐదు డి ఫెన్స్ పబ్లిక్‌సెక్టార్ అండర్ టేకింగ్ తరతర 250 సంస్థల యాజమాన్యాల ఈ ప్రాజెక్టు విజయవంతం కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేశాయి. ‘ఆకాశ్’తో దేశానికి ప్రయోజనాలు.. మనదేశంపై ఆకాశమార్గంలో దండెత్తే శత్రుసైన్యాలను ఈ ప్రోగ్రాం ద్వారా ఎదుర్కోవచ్చు. ఈ క్షిపణులు, రాడార్లు, లాంచర్లు, కంట్రోల్ సెంటర్లను నిర్విరామంగా తయారు చేస్తూ ఉపరితలంపై ఎయిర్ మిసైల్ సిస్టంను ఉత్పత్తి చేయడానికి మంచి ప్లాట్‌ఫాం ఏర్పరుచుకున్నాం. మన సాంకేతిక నిపుణులకు మిలట్రీ గైడ్ విధానం డిజైన్‌పై అవగాహన వచ్చింది. ఈ ప్రాజెక్టు వల్ల బెల్, బీడీఎల్‌తో పాటు మధ్యతరహా పరిశ్రమల టర్నోవర్‌ను వృద్ధి చేసుకుంటున్నాయి. వాటిలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. సుమారు రూ.3,500 కోట్ల విలువైన క్షిపణి వ్యవస్థను మనదేశానికి ఇచ్చాం.