మధిర కీర్తి ఆకాశమంత | the project director of akash missile gaddamanugu chandra mouli belongs to madhira | Sakshi
Sakshi News home page

మధిర కీర్తి ఆకాశమంత

Published Sun, May 4 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM

the project director of akash missile gaddamanugu chandra mouli belongs to madhira

మధిర, న్యూస్‌లైన్: స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆకాశ్ క్షిపణి దేశానికే గర్వకారణం. శత్రుసైన్యం విమానాలను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయశాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ లేబోరేటరీ (డీఆర్‌డీఎల్)లో పనిచేస్తున్న ఆకాశ్‌క్షిపణి ప్రాజెక్టు డెరైక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి ఆధ్వర్యంలో దీన్ని రూపొందించారు. మే 1, 2 తేదీల్లో ఒడిశాలోని చాంద్‌పూర్ ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు.

ఈ ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రమౌళి ఇక్కడివారే కావడం గమనార్హం.  స్థానిక టీవీఎం పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం చేశారు. ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన చంద్రమౌళి సాధించిన ఈ కీర్తిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. ఎంత బిజీగా ఉన్నా ఏడాదికోసారైనా తన స్వగ్రామం మధిరకు వచ్చి బంధుమిత్రులతో గడిపివెళ్లే గడ్డమణుగు చంద్రమౌళి ‘ఆకాశ’మంత ఎత్తు ఎదగడానికి దోహదపడిన అంశాలు ఆయన మాటల్లోనే...
 చిన్ననాటి నుంచే శాస్త్రీయ దృక్పథం
 మా నాన్నగారు పేరు గడ్డమణుగు సత్యనారాయణరావుగారు. ప్రభుత్వశాఖలో చిరుద్యోగి. ఆయనకు నవలలంటే ఎంతో ఇష్టం. నేను ఆరు, ఏడు తరగతులు చదివేటప్పుడు మధిరలోని గ్రంథాలయం నుంచి తెలుగు నవలలను ఇంటికి తెచ్చి చదివేవారు. వాటిని తిరిగి ఇచ్చేందుకు గ్రంథాలయానికి నన్ను పంపేవారు. అప్పుడు అక్కడి పుస్తకాలు, మేగజైన్లు చూసేవాణ్ని. వాటిలో రోదసికీ సంబంధించిన అంశాలు, కలర్ ఫొటోలతో కూడిన పుస్తకాలు నన్ను ఎంతగానో ఆకట్టుకునేవి.

 చిన్నప్పటి నుంచి నాకు శాస్త్రీయ దృక్పథం ఎక్కువగా ఉండేది. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే నాకెంతో ఆసక్తి. మానాన్నగారి లాగే నేను కూడా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలని అనుకునేవాణ్ని. సైన్స్‌పై ఉన్న ఆసక్తితో క్షి పణి ప్రయోగాల గురించి పరిజ్ఞానం పెంచుకున్నాను. చిన్ననాటి నుంచి నాకున్న ఆసక్తి నేడు ఆకాశ్ క్షిపణి ప్రయో గం దాకా తీసుకెళ్లింది. దేశానికి ఎంతో ఉపయోగపడే అత్యాధునిక క్షిపణిని నా చేతులమీదుగా తయారు చేయడం, ప్రయోగించడం నాకెంతో గర్వకారణంగా ఉంది.

 పుట్టుపూర్వోత్తరాలు...
 ఇంటర్మీడియెట్ వరకు మధిరలోనే చదివాను. వరంగల్‌లోని రీజనింగ్ ఇంజినీరింగ్ కళాశాలలో (ఆర్‌ఈసీ)లో 1981లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాను. ఢిల్లీలోని ఐఐటీలో ఎంటెక్ చదివాను. రెండేళ్లు ఓ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగం చేశాను. 1983 డిసెంబర్‌లో యూపీపీఎస్‌సీ ద్వారా డీఆర్‌డీఏలో ఉద్యోగం పొందాను. ఇంటిగ్రేటెడ్  గ్రైనెడ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఐజీఎండీపీ)ను మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్‌కలాం శిష్యరికంలో ప్రారంభించాను. ఆయన నన్ను ఆకాశ్ ప్రాజెక్టులో డాక్టర్ ప్రహ్లాద దగ్గర నియమించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పుడే నేను, ప్రహ్లాదగారు, మరొక ఆఫీసర్‌తో కలిసి ఈ ప్రాజెక్టు మొదలు పెట్టాం. అది ఇన్నాళ్లకు నా చేతులమీదుగా ఆవిష్కృతమై విజయవంతం కావడం ఆనందంగా ఉంది.

 స్ఫూర్తినిచ్చిన వారిలో...
 నాకు డాక్టర్ అబ్దుల్‌కలాం. టెన్నికల్ గెడైన్స్, ప్లానింగ్‌కు డాక్టర్ ప్రహ్లాద, పారజెక్టు మేనేజ్‌మెంట్ స్వర్గీయ డాక్టర్ పాణ్యం, ప్లానింగ్ స్కిల్స్‌లో డాక్టర్ జాగీర్దర్‌రావు, తోటి శాస్త్రవేత్తలు జీఎన్ రావు వంటివారు నాకు స్ఫూర్తినిచ్చారు.

 ఆకాశ్ క్షిపణి ప్రత్యేకతలు
 ఆకాశంలో ఎగిరే శత్రు విమానాలు, పెలైట్ రహిత విమానాలను ఛేదించేందుకు ఆకాశ్ క్షిపణి వ్యవస్థను హైద్రాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబోరేటరీ (డీఆర్‌డీఎల్) కేంద్రంగా రూపొందించాం. ఒకేసారి నాలుగు విమానాలను, నాలుగు సూపర్‌సోనిక్ క్షిపణులతో ఛేదించడం దీని ప్రత్యేక. ఈ వ్యవస్థను పూర్తిఆటోమేటిక్‌గా గానీ, సెమీ ఆటోమేటిక్‌గా గానీ ప్రయోగించవచ్చు. ప్రపంచంలో ఇటువంటి సామర్థ్యమున్న వ్యవస్థ అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే ఉంది. మన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోని దేశాలన్నింటికంటే ముందుంది. మన క్షిపణికున్న ప్రత్యేక ఫీచర్స్ ఇతర దేశాలకు లేవు.

 మన ‘ఆకాశ్’ ఫీచర్స్..
 మన క్షిపణి వ్యవస్థకున్న ప్రత్యేకతలేంటంటే ప్రపంచంలోనే అతితక్కువ ఖర్చుతో ఒక విమానాన్ని ఛేదించగల సామర్థ్యం. దీనినే ‘లో కాస్ట్‌పర్ కిల్’ అంటారు. ఒకేసారి నాలుగు విమానాలను ఛేదించడం. సుముఖంగా ఉండే విమానాలను ఛేదించడం. ఆటోమోడ్ ఆపరేషన్, సూపర్‌సోనిక్ సామర్థ్యంగల క్షిపణి, తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని చేరడం, లక్ష్యాలను ఎక్కువ సామర్థ్యంతో ఛేదించడం దీని ప్రత్యేకతలు.

 ‘ఆకాశ్’ వేగంగా కదిలి...
 విన్యాసాలు చేస్తూ వేగంగా కదిలే విమానాలను సైతం మన ఆకాశ్ ఛేదిస్తుంది. కదిలే లక్ష్యాలను ఛేదించాలంటే అవి ఏ దిశగా కదులుతాయి, ఎంత వేగంగా కదులుతాయి, లక్ష్యానుగుణంగా క్షిపణులను ఎలా గైడ్ చేయాలి అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించాలంటే కొన్ని సంవత్సరాల కృషి అవసరం. అభివృద్ధి చెందిన దేశాలెన్నో ఇటువంటి ప్రయోగాలను మొదలు పెట్టి అవి సఫలం కాక మధ్యలోనే వదిలివేసిన సందర్భాలున్నాయి.

మన శాస్త్రవేత్తలు ఇవన్నీ కూలంకషంగా పరిశీలించారు. ఓటమి నుంచే గెలుపును ఎలా కనుగొనాలో మన శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఒకటికి రెండుసార్లు ప్రయోగాలు చేశారు. అన్ని పాయింట్స్‌ను ఎంతో కఠోరశ్రమతో ఛేదించడంవల్ల వరల్డ్‌క్లాస్ క్షిపణి వ్యవస్థను తయారు చేయగలిగారు. దీనికి సంబంధించిన అతిముఖ్యమైన రాడార్‌లను బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎల్‌ఆర్‌డీఈ)ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు.

 రాడార్ గురించి..
 క్షిపణులను ప్రయోగించేముందు లక్ష్యాలను గుర్తించేందుకు రాడార్‌ను వాడుతారు. క్షిపణులను లక్ష్యాలవైపు మళ్లించేందుకు మరొక రాడార్‌ను ఉపయోగిస్తారు. ఆకాశ్ వ్యవస్థ నుంచే ఈ రెండుపనులను ఏకకాలంలో రాడార్ చేస్తుంది. ఈ సిస్టం పూర్తిగా డిజిటల్-3 డైమన్షినల్ బీంస్కానింగ్. సూక్ష్మంగా ఉండే లక్ష్యాలను గుర్తించడం, అతివేగంగా పయనించే 64 లక్ష్యాలను ఒకేసారి ట్రాక్ చేయడం, ఒకేసారి ఎనిమిది క్షిపణులను గైడ్ చేయడం, శత్రు, మిత్ర విమానాలను గుర్తించడం, అత్యాధునిక ఎలక్ట్రానిక్ కౌంటర్ మెస్యూరింగ్ (ఈసీసీఎం) ఫీచర్స్‌తో ఈ రాడార్‌ను రూపొందించారు.

 డీఆర్‌డీఏలోని 13 లేబోరేటరీలు, ఐదు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఐదు డి ఫెన్స్ పబ్లిక్‌సెక్టార్ అండర్ టేకింగ్ తరతర 250 సంస్థల యాజమాన్యాల ఈ ప్రాజెక్టు విజయవంతం కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేశాయి.

 ‘ఆకాశ్’తో దేశానికి ప్రయోజనాలు..
 మనదేశంపై ఆకాశమార్గంలో దండెత్తే శత్రుసైన్యాలను ఈ ప్రోగ్రాం ద్వారా ఎదుర్కోవచ్చు.
ఈ క్షిపణులు, రాడార్లు, లాంచర్లు, కంట్రోల్ సెంటర్లను నిర్విరామంగా తయారు చేస్తూ ఉపరితలంపై ఎయిర్ మిసైల్ సిస్టంను ఉత్పత్తి చేయడానికి మంచి ప్లాట్‌ఫాం ఏర్పరుచుకున్నాం.

 మన  సాంకేతిక నిపుణులకు మిలట్రీ గైడ్ విధానం డిజైన్‌పై అవగాహన వచ్చింది.  

 ఈ ప్రాజెక్టు వల్ల బెల్, బీడీఎల్‌తో పాటు మధ్యతరహా పరిశ్రమల టర్నోవర్‌ను వృద్ధి చేసుకుంటున్నాయి. వాటిలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి.

 సుమారు రూ.3,500 కోట్ల విలువైన క్షిపణి వ్యవస్థను మనదేశానికి ఇచ్చాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement