
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టర్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద ఇటీవల భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్9న భారత్ భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించిందని.. డ్రాగన్ చర్యను భారత బలగాలు ధీటుగా అడ్డుకున్నాయని మంగళవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. అయితే చైనా, భారత్ దళాల దాడి ఘటనను కేంద్రం ధృవీకరించిన మరుసటి రోజే ఓ వీడియో బయటకు వచ్చింది.
తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. చైనా దళాలు భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.భారత్ భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న చైనా జవాన్లను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పి కొట్టాయి. సరిహద్దు దాటాలనుకుంటున్న చైనా ఆర్మీని.. భారత సైనికులు ధైర్యంగా అడ్డుకున్నారు. గుంపుగా వచ్చిన చైనా దళాలపై ఇండియన్ ఆర్మీ లాఠీలతో మూకుమ్మడిగా దాడి చేసింది.
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో డిసెంబర్ 9 జరిగిన ఘటనకు సంబంధించినది కాదని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. 2020లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ఈ దాడి ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment