న్యూఢిల్లీ: చైనా, భారత్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలోని ఒక చిన్న పర్వత పాదంపై నిఘా కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేయడమే తాజా ఘర్షణలకు కారణమని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘర్షణల్లో భారత్, చైనాల సైనికులు భారీగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. భారత భూభాగంలో గాల్వన్ నది దక్షిణ తీరంలో చైనా ఆ పోస్ట్‌ను ఏర్పాటు చేయడాన్ని కల్నల్ సంతోష్ నాయకత్వంలోని భారత దళాలు అడ్డుకున్నాయి. ఆ పోస్ట్ ను తొలగించేందుకు సోమవారం సాయంత్రం ప్రయత్నించాయి. ఆ కేంద్రంలో ఉన్న కొద్దిమంది చైనా సైనికులు భారత సైనికులను అడ్డుకున్నారు. కానీ, కాసేపటికి వాస్తవాధీన రేఖకు ఆవల ఉన్న చైనా భూభాగం వైపు వెళ్లిపోయారు. ఈలోపు, భారత్ వైపు నుంచి మరిన్ని బలగాలు అక్కడికి చేరుకుని చైనా ఏర్పాటు చేసిన పోస్ట్‌ను కూల్చేయడం ప్రారంభించాయి.
కాసేపటికి, మరిన్ని బలగాలతో చైనా సైనికులు మళ్లీ వచ్చారు. రాళ్లు, మేకులు కుచ్చిన కర్రలు, ఇనుప రాడ్లతో భారత సైనికులపై దాడికి తెగబడ్డారు. కొన్ని గంటల పాటు పరస్పర దాడులు కొనసాగాయి. దాడుల సమయంలో రెండు దేశాలకు చెందిన కొందరు సైనికులు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో నీరున్న గాల్వన్ నదిలో పడిపోయారు. చైనా బలగాల దాడిలో కల్నల్ సంతోష్ చనిపోయారు. కొందరు భారత సైనికులను చైనా బందీలుగా తీసుకువెళ్లిందని, అయితే, కాసేపటికి వారిని వదిలివేసిందని సమాచారం. అయితే, ఇంకా పది మంది భారత సైనికులు బందీలుగా ఉన్నట్లు ప్రముఖ రక్షణ రంగ విశ్లేషకుడు అజయ్ శుక్లా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment