China Attack
-
చైనా అరాచకం.. తైవాన్ రక్షణ శాఖ అధికారి ఖతం!
తైపీ: ఉద్రిక్తతల నేపథ్యంలో తైవాన్ రక్షణ శాఖ అధికారి అనుమానాస్పద మృతి సంచలనం సృష్టించింది. తైవాన్ రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి విభాగం ఉన్నతాధికారి ఔ యాంగ్ లీ–సింగ్ శనివారం ఉదయం దక్షిణ తైవాన్‌లోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించారు. ఆయన మృతికి కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదని రక్షణ శాఖ వెల్లడించింది. ‘నేషనల్ చుంగ్–షాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ డిప్యూటీ హెడ్ హోదాలో ఔ యాంగ్ వివిధ క్షిపణి అభివృద్ధి ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బిజినెస్ ట్రిప్పై కొనసాగుతూ అనుమానాస్పదంగా మరణించారు. ఇదిలా ఉండగా, చైనా దాడుల్లోనే ఔ యాంగ్ ప్రాణాలు కోల్పోయాడని తైవాన్ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై చైనా ఇంకా స్పందించలేదు. ఇది కూడా చదవండి: ప్లీజ్ ఆయన్ని అక్కడే ఉండనివ్వండి... అభ్యర్థించిన శ్రీలంక -
తైవాన్ ‘ఒకే చైనా’లో అంతర్భాగమే!
ఉద్రిక్తతల నడుమ తైవాన్‌కు యూఎస్ అసెంబ్లీ ప్రతినిధులసభ స్పీకర్ నాన్సీ పెలోసీని పంపించటంతో చైనా–తైవాన్‌ల మధ్య భవిష్యత్తులో యుద్ధం జరిగే అవకాశాలను తెరపైకి అమెరికా తీసుకొ చ్చింది. ఇక యుద్ధ బూచితో ఆసియా పసిఫిక్ దేశాలకు ‘నాటో’ సభ్యత్వాన్ని ప్రోత్స హిస్తూ, మ్యాడ్రిడ్ నిర్ణయాల ప్రకారం నాటోను ఈ ప్రాంతానికి విస్తరించే ప్రయత్నంలో అమెరికా ఉంది. ఇప్పటికే మన భారతదేశానికి ‘నాటో ప్లస్’ సభ్యత్వం ఇవ్వటానికి 6వ దేశంగా అర్హత కోసం యూఎస్ అసెంబ్లీలో నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్‌డిఏఏ)కు సవరణలు చేశారు. ఈ తరహా అర్హతలు ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, ఇజ్రాయిల్, దక్షిణ కొరియాలు కలిగి ఉన్నాయి. బిల్లు ఆమోదం పొందితే నాటో దేశాలతో సఖ్యతగా మెలిగే అవకాశాలను మనదేశానికి కల్పించి, భవిష్యత్తులో నాటో చేసే యుద్ధాలకు మనల్ని బలి పశువులను చేసే అవకాశం ఉంది. పెలోసీ పర్యటనను మానుకోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హితవు పలికినప్పటికీ... యూఎస్ మిలటరీ, ఇంటెలిజెన్స్ విభాగాల అధికారులు పెడచెవినపెట్టి, పర్యటనను ప్రణాళిక ప్రకారం సాగించారు. నాన్సీ పెలోసీని తైవాన్‌కు పంపాలను కోవటం నిప్పుతో చెలగాటం వంటిదనీ, ఆ నిప్పులో ఆహుతిగాక తప్పదనీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తీవ్ర స్వరంతో టెలిఫోన్లో బైడెన్‌ను హెచ్చరించాడు. ఈ హెచ్చరికతో తాత్కాలికంగా పెలోసీ పర్యటన దేశాల లిస్టులో కేవలం సింగపూర్, మలేసియా, జపాన్, దక్షిణ కొరియా దేశాల పేర్లు మాత్రమే ప్రకటించారు. తైవాన్ చైనాలో అంతర్భాగం గనుక మమ్మల్ని రెచ్చగొట్టటానికి ప్రయ త్నిస్తే తైవాన్‌లో అడుగుపెట్టే ముందే పెలోసీ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేస్తామనీ, లేకుంటే చైనా ఆర్మీ విమానాలు తైవాన్‌లో దిగుతాయనీ మిలిటరీ శాఖ తీవ్రంగా హెచ్చరించింది. పెలోసీకి రక్షణగా అమెరికన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ‘రొనాల్ట్ రీగన్’, దాని అనుబంధ గ్రూపు యుద్ధ విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, గైడెడ్ మిస్సెల్ డిస్ట్రాయర్, క్రూయిజ్‌తో సహా రెండు రోజుల క్రితమే సింగపూర్ నుండి తైవాన్ వైపు దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి వచ్చాయి. చైనా నేవీ, ఎయిర్‌ఫోర్స్ కలిసి తైవాన్ జలసంధిలో మిలిటరీ విన్యాసాలు చేస్తున్న ఉత్కంఠ పరిణామాల మధ్య పెలోసీ ఆగస్టు 2 రాత్రి తైవాన్ విమానా శ్రయంలో దిగారు. ఇందుకు నిరసనగా ఆ తర్వాత తైవాన్ చుట్టుప్రక్కల ఉన్న సముద్రంలోని లక్ష్యాలపై క్షిపణుల వర్షం కురిపించి, తైవాన్ వాసులను చైనా భయకంపితులను చేసింది. ఈ దృశ్యాలను తైవాన్ మీడియా ప్రసారం చేసింది. అదేమంటే దీనికి పూర్తి బాధ్యత అమెరికాదేనని చైనా ఆరోపిస్తోంది. గతంలోకి వెళితే.. షియాంగ్ కై షేక్ పాలనలోని చైనాపై 1949లో మావో నాయకత్వాన విప్లవం విజయం సాధించగా, అమెరికా అండతో తైవాన్‌కు పారిపోయిన షియాంగ్ అక్కడ నుండి చైనాను పాలించడానికి ప్రయత్నించాడు. 1971 వరకు తైవాన్ కేంద్రమయిన ‘రిపబ్లిక్ ఆఫ్ చైనా’ను మాత్రమే ఐక్య రాజ్యసమితి గుర్తించింది. 1971 నుండి ‘ఒకే చైనా’ దేశంగా మెయిన్ ల్యాండ్ చైనాను తైవాన్‌తో సహా ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ (పీఆర్సీ)గా ఐరాస గుర్తించింది. ఈ ఒకే చైనాతో 1979 నుండి జిమ్మీ కార్టర్ ప్రభుత్వం దౌత్య సంబంధాలను ఏర్పర్చు కొంది. పీఆర్సీ అసలైన చైనా దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటంతో, ఎప్పటి వలెనే తైవాన్ చైనాలో అంతర్భాగంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా కనీసం డజను దేశాలు కూడా తైవాన్‌తో దౌత్య సంబంధాలను ఏర్పర్చుకోలేదు. మనదేశం కూడా దౌత్య సంబంధాలు ఏర్పర్చుకోలేదు. చైనా, తైవాన్‌ల మధ్య తరచూ అమెరికా కలహాలు సృష్టిస్తూ ఆయుధాల్ని అమ్ముతూ, మూడవ సంస్థలు, వ్యక్తులు, కంపెనీల ద్వారా వర్తక వాణిజ్యాలు చేస్తూ పరోక్ష సంబంధాలతో చైనాను కవ్విస్తూనే ఉంది. స్వదేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అమెరికాలో బైడెన్ ప్రభుత్వాన్ని గద్దె దింప టానికీ, రానున్న మధ్యంతర ఎన్నికల్లో రిబ్లికన్లను నెగ్గించటానికీ ఉక్రెయిన్, తైవాన్ యుద్ధాలను ప్రోత్సహించటానికై విపక్షాలు, మిలటరీ పరిశ్రమలు తీవ్రంగా కృషి సల్పుతున్నాయి. యుద్ధ వాతావరణాన్ని తక్షణమే ఆపి, చైనాలో అంతర్భాగంగా తైవాన్ను గుర్తించి, చైనా–తైవాన్‌ల అంతర్గత వ్యవహారంగా ఒకే చైనా సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. ఇప్పటికే అమెరికా ఏకధ్రువ ప్రపంచానికి కాలం చెల్లిందని అఫ్గానిస్తాన్, మధ్యప్రాచ్య యుద్ధాల చరిత్ర స్పష్టం చేసింది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ఆ సంగతిని గట్టిగా ధ్రువీకరించింది. రానున్న కాలం బహుళ ధ్రువ ప్రపంచానిదే. చైనా–తైవాన్, చైనా–హాంగ్‌కాంగ్, చైనా–మకావ్ వంటి సమస్యలు చైనా ఆంతరంగిక విషయాలుగా పరిగణించి, విదేశీ శక్తుల జోక్యం లేకపోవటం శ్రేయస్కరం. బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త హెచ్ఓడీ, ఫారెన్ లాంగ్వేజెస్, కేఎల్ యూనివర్సిటీ ‘ మొబైల్: 98494 91969 -
China-Taiwan: తైవాన్ జలసంధిపై చైనా బాంబుల వర్షం.. వీడియో విడుదల
బీజింగ్: తైవాన్ జలసంధిపై క్షిపణులతో విరుచుకుపడింది చైనా. ఈ చర్య అంతర్జాతీయ సమాజంలో కలకలం సృష్టించింది. చైనా సైన్యంపై తైవాన్ సమీపంలో బాంబులు కురిపించిన వీడియోనూ ఆ దేశ అధికారిక మీడియా సీసీటీవీ విడుదల చేసింది. ఈ దృశ్యాలు ప్రపంచదేశాలను విస్మయానికి గురిచేశాయి. డాంగ్‌ఫెండ్ క్షిపణులను కురిపించి తమ సేనలు అనుకున్న ఫలితాలు సాధించాయని చైనా సైన్యం ప్రకటించింది. సైనిక క్రీడల్లో భాగంగా చైనా తన అధునాతన యుద్ధవిమాన వాహక నౌక, అణ్వస్త్ర సామర్థ్య జలాంతర్గామిలను తైవాన్ జలసంధిలోకి ప్రవేశపెట్టింది. తైవాన్‌లోని జపాన్‌కు చెందిన ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ సమీపంలోనూ క్షిపణులు పడ్డాయి. ‘మేం ఏం చెప్తామో అదే చేస్తాం’ అని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి టాన్ కెఫీ వ్యాఖ్యానించారు. క్షిపణి పరీక్షలంటూ చైనా రాకెట్లను ప్రయోగించడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. విమాన సర్వీసులు రద్దు చైనా సైన్యం క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో అప్రమత్తమై తైవాన్ తన పౌర విమానాల రాకపోకలను వెనువెంటనే ఆపేసింది. రాజధాని తైపేలోని ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 50 విమాన సర్వీస్‌లు రద్దయ్యాయి. ప్రపంచవిపణిలో అత్యంత కీలకమైన ప్రాసెస్ చిప్స్‌ల సముద్రమార్గ రవాణా కొనసాగుతోందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. చైనా సైనిక డ్రిల్స్ చేస్తున్న అదే ప్రాంతానికి సమీపంలోకి అమెరికా పీ–8ఏ పోసిడాన్ గస్తీ విమానం, ఎంహెచ్–60ఆర్ జలాంతర్గామి విధ్వంసక హెలికాప్టర్లు వచ్చి ఉద్రిక్తతలను మరింత పెంచాయని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక కథనంలో పేర్కొంది. తైవాన్ సైతం మిరాజ్, ఎఫ్–5 యుద్ధ విమానాలతో చైనా దళాలున్న చోటుపై పర్యవేక్షణకు వెళ్లి వచ్చాయని స్థానిక మీడియా వెల్లడించింది. చైనా చర్యను చట్టవిరుద్ధ, బాధ్యతారాహిత్య చర్యగా తైవాన్ అభివర్ణించింది. తైవాన్‌పై నోరు మెదపని పెలోసీ తైవాన్ పర్యటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేసిన పెలోసీ.. దక్షిణ కొరియా పర్యటనలో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. ద.కొరియా పార్లమెంట్ స్పీకర్ కిమ్ జిన్ ప్యోను పెలోసీ కలిసినా తైవాన్ అంశాన్ని బహిరంగంగా ప్రస్తావించలేదు. ఉ.కొరియా ‘అణు’ ప్రమాదంపై చర్చించామని జిన్ చెప్పారు. చదవండి: పంజా విసిరిన చైనా.. అదే జరిగితే ప్రపంచానికే ముప్పు! -
Rekha Singh: భర్త కన్న కలల కోసం.. భారత ఆర్మీలోకి రేఖా సింగ్
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లోని గల్వాన్ లోయలో 2020 జూన్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన నాయక్ దీపక్ సింగ్ భార్య రేఖా సింగ్ ఇండియన్ ఆర్మీలో చేరారు. తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్న ఆమె లెఫ్టినెంట్ అయ్యారు. ఆర్మీకి సంబంధించిన శిక్షణని మే 28 నుంచి చెన్నైలో రేఖా సింగ్ తీసుకోనున్నారు. దీపక్ సింగ్‌కు తన భార్య కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని బలమైన కోరిక ఉండేది. ఆయన జీవించి ఉన్నప్పుడు ఆమెను ఆ దిశగా ప్రోత్సాహించారు. వారిద్దరికీ పెళ్లయిన ఏడాదిన్నరలోనే గల్వాన్ ఘర్షణల్లో దీపక్ సింగ్ వీర మరణం పొందడం రేఖను బాగా కుంగదీసింది. భర్త పోయిన దుఃఖం నుంచి కోలుకున్న ఆమె టీచర్ ఉద్యోగం వీడి తన భర్త కన్న కలల్ని సాకారం చేయడానికి ఆర్మీలో చేరారు. అది కూడా ఏమంత సులభంగా ఆమెకి రాలేదు. రెండు సార్లు ప్రయత్నించిన మీద లెఫ్టినెంట్ పదవి దక్కింది. -
వెనక్కు వెళ్లిన చైనా బలగాలు
న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం నుంచి చైనా దళాలు బుధవారం నాటికి పూర్తిగా వైదొలగాయి. శిబిరాలను తొలగించాయి. సరిహద్దుల్లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరుదేశాలు బలగాలను వెనక్కు తీసుకునే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అంతకుముందు, భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మధ్య ఆదివారం జరిగిన చర్చల్లో అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి సాధ్యమైనంత త్వరగా, దశలవారీగా బలగాల ఉపసంహరణ జరగాలని నిర్ణయించారు. దాంతో సోమవారం నుంచి గల్వాన్ లోయ, హాట్‌స్ప్రింగ్స్, గొగ్రా, పాంగాంగ్ సొలోని ఫింగర్ ఏరియాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది. గల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 నుంచి ఇప్పటికే చైనా వెనక్కు వెళ్లింది. హాట్ స్ప్రింగ్ వద్ద ఉన్న పెట్రోలింగ్ పాయింట్ 15 నుంచి బుధవారం నాటికి చైనా బలగాలు పూర్తిగా వైదొలగాయని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఉపసంహరణ ఏ మేరకు జరిగిందనే విషయాన్ని భారత దళాలు త్వరలో ప్రత్యక్షంగా పరిశీలించి నిర్ధారించుకుంటాయని తెలిపాయి. మరోవైపు, ఉపసంహరణ ప్రక్రియ అమలును భారత్, చైనా సైన్యాధికారులు సంయుక్తంగా పరిశీలించి, నిర్ధారించే అవకాశాలున్నాయని కూడా తెలుస్తోంది. గొగ్రా(పెట్రోలింగ్ పాయింట్ 17ఏ) నుంచి చైనా దళాలు గురువారం నాటికి వెనక్కు వెళ్లే అవకాశం ఉందన్నాయి. సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో హాట్ స్ప్రింగ్స్, గొగ్రా ఉన్నాయి. జూన్ 30న ఇరుదేశాల కమాండర్ స్థాయి చర్చల్లో.. ఘర్షణలకు అవకాశమున్న ప్రదేశాల్లో కనీసం 3 కిమీల వరకు బఫర్ జోన్(నిస్సైనిక ప్రాంతం)ను ఏర్పాటు చేయాలని ఒప్పందం కుదిరింది. -
రాజ్‌నాథ్ సింగ్ లద్దాఖ్ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు వివాదం ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లద్దాఖ్‌లోని లేహ్ ప్రాంతాన్ని పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నారావనే పాల్గొంటారు. పర్యటనలో భాగంగా మంత్రి సీనియర్ సైనిక అధికారులతో భేటీ కానున్నారు. అదే విధంగా వివాదస్పద ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో రాజ్‌నాథ్‌సింగ్ తెలుసుకోనున్నారు. ఇక భారత్- చైనా మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి భద్రతాపరమైన పరిస్థితులపై ఆయన ఉన్నత స్థాయిలో సమీక్షించడం కోసం తూర్పు లద్దాఖ్ సందర్శిస్తున్నట్లు తెలుస్తోంది. (మరిన్ని భేటీలు అవసరం) చైనా తన ఆర్మీకి చెందిన రెండు విభాగాలను వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించినట్లు భారత ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం అందించిన నేపథ్యంలో ఈ పర్యటన ఖరారు కావటంపై ఆసక్తి నెలకొంది. ఇక సరిహద్దు వివాదం పరిష్కారం దిశగా భారత్, చైనాల మధ్య మంగళవారం జరిగిన సైనికాధికారుల మూడో విడత సమావేశం అసంపూర్తిగా ముగిసిందని, వివాదం సమసిపోయేందుకు మరిన్ని భేటీలు అవసరమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. (‘భారత్ చర్యలను చైనా ఊహించలేదు’) -
‘చైనా సరిహద్దు వివాదంపై చర్చకు సిద్ధం’
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాహుల్ గాంధీ తీరుపై మండిపడ్డారు. ఓ మీడియ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. భారత సరిహద్దు వివాదం ఉద్రిక్తతలపై 1962లో జరిగిన భారత్-చైనా యుద్ధం నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పార్లమెంట్లో చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కానీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సారంలేని(అనవసరపు)రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. (‘వారి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’) భారత్- చైనా సరిహద్దు వివాదంలో ప్రధాని నరేంద్రమోదీని విమర్శిస్తూ చేసిన హ్యాష్ ట్యాగ్ ‘సరెండర్ మోదీ’ ఆరోపణల వెనుక పాకిస్తాన్, చైనాల హస్తం ఉందని అమిత్ షా తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వంపై పనిగట్టుకొని చేస్తున్న వ్యతిరేక ఆరోపణలపై చర్చించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఒక వైపు కరోనా వైరస్ వ్యాప్తి, మరోవైపు చైనా సరిహద్దు ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ భారత భూభాగాన్ని చైనా దురాక్రమణకు అప్పగించారంటూ రాహుల్ గాంధీ ఇటీవల ట్విటర్లో ఆరోపించిన విషయం తెలిసిందే. -
‘దేశ భద్రతను రాజకీయం చేయకండి’
ముంబై: దేశ భద్రత, సరిహద్దు వివాదాలను రాజకీయం చేయవద్దని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ సూచించారు. గత కొన్ని రోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ భారత భూభాగాన్ని చైనా దురాక్రమణకు అప్పగించారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపించిన నేపథ్యంలో శనివారం శరద్ పవార్ స్పందిస్తూ.. దేశ భద్రతను రాజకీయం చేయొద్దని హితవు పలికారు. (కరోనా: డెక్సామెథాసోన్కు కేంద్రం అనుమతి) అదే విధంగా 1962 భారత్- చైనా యుద్ధం అనంతరం చైనా ఆక్రమించుకున్న 45,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఇప్పటికీ మరచిపోలేమని శరద్ పవర్ పేర్కొన్నారు. అది ఇంకా చైనా అధీనంలోనే ఉందనే విషయాన్ని శరద్ పవార్ తాజాగా ప్రస్తావించారు. ఇప్పుడు ఏమి జరిగిందనే విషయం తనకైతే పూర్తిగా తెలియదన్నారు. కానీ దేశ భద్రత అంశాల్లో రాజకీయాలు తగదన్నారు. లద్దాక్ సమీప సరిహద్దుల్లోని గల్వాన్ లోయ వద్ద చోటు చేసుకున్న ఘటనను రక్షణ మంత్రి, ప్రభుత్వ వైఫల్యంగా ఆరోపించడం సరికాదన్నారు. ఇక గల్వాన్ లోయ వద్ద పొరుగు దేశం చైనాతో జరిగిన ఘర్షణ పరిస్థితులు చాలా సున్నితమైనవని తెలిపారు. గల్వాన్ లోయాలో చైనా.. భారత ఆర్మీని రెచ్చగోట్టే పాత్ర పోషించిందని పేర్కొన్నారు. జూన్ 15 రాత్రి తూర్పు లద్దాక్‌లో చైనాతో జరిగిన హింసాత్మాక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ('గాల్వాన్ లోయలో సైనికుల మరణాలకు మీరే కారణం') -
లదాఖ్ నేర్పుతున్న గుణపాఠాలు
సైనిక విన్యాసాలను సాకుగా చూపి ఏమార్చి మరీ లదాఖ్‌లోకి తన బలగాలను పంపిస్తూ వచ్చిన చైనా ఇప్పుడు ఆ ప్రాంతాలపై పట్టు సాధించింది. సరిహద్దు ప్రాంతాలకు అతి సన్నిహితంగా చైనా సైనిక కార్యకలాపాలు సాగుతున్నప్పుడు భారత విధాన నిర్ణేతలు అప్రమత్తం కావాల్సి ఉండింది. చైనా బలగాల తరలింపుపై ఇస్రో చాయాచిత్రాలను కూడా ఎవరూ పట్టించుకోలేదు. చైనా ఉద్దేశాన్ని గమనించకుండా అది ఆక్రమించిన భూభాగంలో ఒక సెక్టారును ఖాళీచేయించాలని ప్రయత్నించిన భారత సైనికులు నేరుగా చైనా ఉచ్చులో పడిపోయారు. ఈ ఘటన ఇటీవలి దశాబ్దాల్లో దేశం ఎదుర్కొన్న అతి పెద్ద సంక్షోభం అనే చెప్పాలి. ఈ సంక్షోభం రాబోయే దశాబ్దాల్లో భారతీయ విదేశీ, రక్షణ విధానాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. లదాఖ్‌లో భారత్–చైనా మధ్య వాస్తవాధీన రేఖ వద్ద తాజాగా సంభవించిన సంక్షోభాన్ని, గత కొన్ని దశాబ్దాలలో కేంద్రప్రభుత్వం ఎదుర్కొన్న అతి పెద్ద వ్యూహా త్మక, భద్రతాపరమైన సవాలుగా చెబుతున్నారు. జూన్ 15 రాత్రి చైనా ప్రజావిముక్తి సైన్య (పీఎల్ఏ) బలగాలు ఐరన్ రాడ్లతో, ఇనుప ముళ్లు చుట్టిన లాఠీలు, కర్రలతో చేసిన ఆకస్మిక దాడిలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత మే నెల నుంచి చైనా ఆక్రమించి ఉన్న 40–60 చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఒక సెక్షన్లో చైనా బలగాలు వెనుదిరిగేలా చేయాలని భారత సైనికులు ప్రయత్నించారు. ఇదే చైనా దాడికి కారణమైంది. చైనా తన దురాక్రమణను యధాతథంగా కొనసాగించి ఉంటే బీజింగ్ కైవసం చేసుకున్న ఆ భూమి ఒక నిరూపిత సత్యంగా మారి, భారత్ కూడా దాన్ని ఆమోదించాల్సి వచ్చేది. అంతే కాకుండా సరిహద్దు గస్తీకి సంబంధించిన కీలకప్రాంతాలు మన ఆధీనంలో లేకుండా పోయేవి. అంతకుమించి భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు కీలకంగా ఉంటున్న దార్బక్–షియోక్–దౌలత్ బెక్ ఓల్డీ రోడ్డుపై పీఎల్ఏకి ఆధిపత్యం లభించేది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీకి అందుబాటులో ఉన్న తొలి ఎంపిక ఏమిటంటే.. సైనిక బలంతో 1962 నాటి వాస్తవాధీన రేఖ వెనుకకు పోయేలా చైనా బలగాలను వెనక్కు నెట్టడమే. ఏ పరిణామాలు సంభవించినా సరే భారత్‌తో తలపడాల్సిందేనని చైనా నమ్ముతున్న నేపథ్యంలో 20 మంది భారత సైనికులు చనిపోవడం, అంతకు మూడురెట్లకు పైగా గాయపడటం జరిగింది. అయితే చైనా దూకుడు కారణంగా ఇలాంటి దాడులు మునుముందు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. అయితే సరిహద్దు ప్రాంతాల్లో భారత్, చైనా పోరాట బలగాల సంఖ్యపై ఇటీవలే చేసిన సమగ్ర అంచనా ప్రకారం, బలగాల తరలింపులో భారత్ చైనాను అధిగమించినట్లే చెప్పాలి. సరిహద్దుల్లోకి చైనా నూతన బలగాలను భారీ సంఖ్యలో తరలించినప్పటికీ భారత్ ఇప్పటికీ తన కీలక ప్రాధాన్యతా స్థానాన్ని అట్టిపెట్టుకునే ఉంటోంది. ఈ స్థితిలో భారత్ ముందున్న కొత్త అవకాశం ఏదంటే అరుణాచల్ నుంచి బయటపడి తూర్పు సెక్టా ర్లో చైనా భూభాగాన్ని కైవసం చేసుకోవడానికి ఒక కొత్త యుద్ధ రంగాన్ని తెరవడమే. ఇలా చేస్తే చైనా సైనిక బలగాల ఉపసంహరణ ప్రయత్నంలో న్యూఢిల్లీకి బేరసారాలాడే శక్తి సమకూరుతుంది. అయితే, చైనా దురాక్రమణ బలగాలతో మరిన్ని ఘర్షణలకు దిగకుండా మోదీ సంయమనం పాటించడానికే ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ప్రస్తుతానికి ఘర్షణల జోలికి పోకుండా తదుపరి చర్చల్లో పైచేయి సాధించడానికి మోదీ ప్రయత్నించవచ్చు. పైగా, చైనా దురాక్రమణ తత్వం గురించి, భారత బలగాలపై చైనా పాశవిక దాడి గురించి పలు దేశాల రాయబారులకు వివరించి చెప్పడం ద్వారా చైనాను అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ట దెబ్బతీయడానికి భారత్ గ్లోబల్ దౌత్య ప్రచారానికి కూడా సిద్ధపడవచ్చు. దీంతో తన సైనిక చర్యల ఫలితంగా చైనాకు రాజకీయంగా నష్టాలు పెరగవచ్చు కూడా. 2021లో భారత్ ఆతిథ్యమివ్వనున్న బ్రిక్స్ దేశాల సదస్సులో చైనాపై ఒత్తిడి తీసుకురావచ్చు కూడా. ఒకవైపు భారత భూభాగాన్ని చైనా అక్రమించిన తరుణంలో బ్రిక్స్ దేశాల సదస్సుకు ఆ దేశాన్ని తాను ఎలా ఆహ్వానించాలి అని మోదీ బహిరంగంగా ప్రశ్నించవచ్చు కూడా. గతంలో డోక్లామ్ సంక్షోభాన్ని ముగించడానికి 2017లో చైనా ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్ దేశాల సదస్సును భారత్ చక్కగా వినియోగించుకుంది. డోక్లామ్ సంక్షోభంపై ముందస్తు తీర్మానం చేయకుంటే ఆ సదస్సుకు తాను హాజరు కాబోనని హెచ్చరించిన భారత్ ఆ సదస్సుకు ఆతిథ్యమిచ్చిన చైనాకు బహిరంగంగానే ఇబ్బంది కలిగించగలిగింది. సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో శాశ్వతంగా తన బలగాలను చైనా మోహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చైనా భారత భూభాగంలోకి తన సైన్యాన్ని మోహరించిన తరుణంలో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ కనుగొన్నట్లుగా, సరిహద్దుల్లో చైనా తన కార్యకలాపాలను మరింతంగా పెంచి కొనసాగించే అవకాశం ఇక ముందు కూడా ఉంటుంది. దీనితో న్యూఢిల్లీ కూడా తన బలగాలను సరిహద్దు ప్రాంతాల్లో భారీగా మోహరించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పైగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బలగాలను తరచుగా యుద్ధరంగంలోకి తరలించవలసి రావచ్చు కూడా. దీనిద్వారా చైనా బలగాలు భారత సాంప్రదాయిక సైనిక బలాధిక్యతకు గండికొట్టి లాభపడకుండా అడ్డుకోవచ్చు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకటించిన చైనా దళాల కదలికలకు చెందిన చిత్రాలను సకాలంలో గమనించడంలో మన సైన్యం వెనకబడి ఉండవచ్చు కానీ చైనా భారీస్థాయిలో తలపెట్టే సైనిక మోహరింపులను అమెరికా సులభంగా పసిగట్టి ఆ సమాచారాన్ని భారత్‌కు అందచేసి అప్రమత్తం చేసే అవకాశం కూడా ఉంది. గతంలో డోక్లామ్ సంక్షోభ సమయంలో కూడా అమెరికా, ఇస్రోల మధ్య సమాచార పంపిణీ జరిగింది. అయితే భారత నిఘా సంస్థ పనితీరులో తీవ్రమైన లోపాలు తాజా సంక్షోభ సమయంలో స్పష్టంగా కనిపిం చాయి. సైనిక విన్యాసాలను సాకుగా చూపి ఏమార్చి మరీ లదాక్లోకి తన బలగాలను పంపిస్తూ వచ్చిన చైనా ఇప్పుడు ఆ ప్రాంతాలపై పట్టు సాధించింది. సరిహద్దు ప్రాంతాలకు అతి సన్నిహితంగా చైనా సైనిక కార్యకలాపాలు సాగుతున్నప్పుడు భారత విధాన నిర్ణేతలు అప్రమత్తం అయి ఉంటే భారత వాస్తవాధీన రేఖ ప్రాంతంలో గస్తీని పెంచడం, సాధారణ సైనిక సన్నాహక చర్యలను కొనసాగించడం జరిగి ఉండేది. పలు భారతీయ నిఘా సంస్థలు 2020 ఫిబ్రవరి కంటే ముందుగానే సరిహద్దుల్లో చైనా సైనిక కార్యకలాపాలకు సంబంధించి హెచ్చరిస్తూ వచ్చాయి. అయితే నిఘాసంస్థల హెచ్చరికలపై వ్యవహరించడంలో ఆలస్యం జరిగిందా అని అడిగినప్పుడు ప్రారంభ నివేదికలు అంత స్పష్టంగా లేవని, చైనా బలగాల మోహరింపు వెనుక ఉద్దేశం స్పష్టంగా కనిపించలేదని సైన్యాధికారులు తెలపడం గమనార్హం. చైనా బలగాల చొరబాటుకు సంబంధించిన నిర్దిష్ట ప్రాంతాన్ని 2020 ఏప్రిల్‌లో మాత్రమే గుర్తించారు. కీలకమైన నిఘా హెచ్చరిక తెలిసివచ్చేసరికి భారత బలగాలకు ఎంత తక్కువ సమయం అందుబాటులో ఉండిందంటే లేహ్ ప్రాంతానికి శరవేగంగా బలగాలను తరలించాల్సి వచ్చింది. చైనా బలగాల కదలికలకు సంబంధించి అమెరికా నిఘా సమాచారం బహిరంగంగా అందుబాటులో లేదు. ఒకవేళ అమెరికా చేసిన హెచ్చరికలను న్యూడిల్లీ సకాలంలో అందుకుని ఉన్నప్పటికీ విధాన నిర్ణేతలతో సహా భారత నిఘా వ్యవస్థ మొత్తంగా ముందస్తు హెచ్చరికలు అందిన కీలక సమయంలో సమర్థంగా వ్యవహరించలేదని కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఇంత తీవ్రస్థాయిలో నిఘా సంస్థలు విఫలం చెందినప్పుడు దానికి వ్యవస్థాగత కారణాలు, ప్రతిపాదిత సంస్కరణలపై అధికారిక సమీక్ష అవసరం ఉంది. కార్గిల్ రివ్యూ కమిటీ తరహాలో ఈ సమీక్ష జరగాల్సి ఉంది. ప్రభుత్వం స్వయంగా అలాంటి బహిరంగ విచారణకు పూనుకోకపోతే, రక్షణపై లోక్ సభ స్టాండిగ్ కమిటీనైనా నియమిం చాల్సి ఉంటుంది. ఈ విచారణకు తగిన ఆధారాలు అందివ్వడానికి నిఘా వ్యవస్థలో సుదీర్ఘ అనుభవం ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అందుబాటులో ఉండాలి. అయితే ఇలాంటి క్రాస్ పార్టీ చర్చలు, పారదర్శకత స్థాయిని మోదీ, బీజేపీల నుంచి ఆశించడం కష్టమేనని పరిశీలకులు సూచిస్తున్నారు. అయితే జూన్ 19వ తేదీనే మోదీ సరిహద్దు సంక్షోభంపై అఖిల పార్టీ సమావేశం నిర్వహించి ఆయా రాజకీయ పార్టీల నేతలకు పరిస్థితిని క్లుప్తంగా వివరించారు. చైనా బలగాలు చొరబాటు లేనేలేదని అంతకు ముందు స్పష్టం చేసిన మోదీ జూన్ 19 భేటీ తర్వాత పరిస్థితి తీవ్రతను గుర్తించి బహిరంగంగానే తమ మునుపటి ప్రకటనను సవరించుకున్నారు. మోదీ చేసిన ముందు ప్రకటనకే కట్టుబడి ఉన్నట్లయితే, గల్వాన్ రివర్ వేలీ తనదే అంటున్న చైనా ప్రకటనను భారత్ శషభిషలు లేకుండా అంగీకరించాల్సి వచ్చేది. అయితే ఫలితాలతో నిమిత్తం లేకుండానే ఈ ఉదంతం భారతీయ దౌత్యాన్ని సమూలంగా మార్చివేయగలదు. ఈ సంక్షోభం రాబోయే దశాబ్దాల్లో భారతీయ విదేశీ, రక్షణ విధానాన్ని పూర్తిగా మార్చివేయనున్న నేపథ్యంలో, మోదీ పైన పేర్కొన్న తరహా సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసి దాని ఫలితాలను బహిరంగంగా ప్రకటించడం తప్పనిసరి. దీనివల్ల భారత నిఘా వ్యవస్థలు, సైనిక బలగాలు బలాన్ని సంతరించుకుని నూతన శకంలో సుసంఘటితం కాగలవు. మోదీ పదవి నుంచి దిగిపోయాక దశాబ్దాలపాటు ఈ కొత్త శకం కొనసాగుతుంది కూడా. ప్రాంక్ ఒ డానెల్ వ్యాసకర్త నాన్ రెసిడెంట్ ఫెలో, స్టిమ్సన్ సెంటర్ సౌత్ ఆసియా ప్రోగ్రామ్ -
అప్రమత్తతకు అల్లంతదూరంలో!
జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ ప్రాంతంలో భారత సైనికుల బలిదానం ఆద్యంతం భారత సైనిక నాయకత్వం తప్పు అంచనా ఫలితమనే చెప్పాల్సి ఉంటుంది. ఇది మన సైనిక నాయకత్వం నిర్లక్ష్యానికి, ఘోరమైన అసమర్థతకు ప్రతిబింబం మాత్రమే. గతంలో చైనా సైనిక చొరబాట్లతో గల్వాన్ చొరబాట్లను సమానంగా లెక్కవేసి మన సైనిక నాయకత్వం అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చైనా దూకుడు చర్యకు తగిన సమాధానం ఇస్తామంటూ ప్రధాని నరేంద్రమోదీ జాతికి హామీ ఇచ్చారు కానీ ఆ సమాధానం సైనిక పరంగా కాకుండా ఆర్థికపరంగా, దౌత్యపరంగా మాత్రమే ఉండవచ్చు. భారత్–చైనా బలగాల మధ్య సరిహద్దుల్లో ఘటనల క్రమం ఒక స్పష్టమైన రూపుదిద్దుకుంటున్న కొద్దీ గల్వాన్ ప్రాంతంలో ఇరుసైన్యాల మధ్య విషాదకరమైన దాడికి తీవ్రమైన తప్పుడు చర్యలే దోహదం చేసివుంటాయని విస్పష్టంగా బోధపడుతోంది. ఏటా జరిగే చైనా ప్రజావిముక్తి సైన్యం (పీఎల్ఏ) సైనిక విన్యాసాలతోపాటు లదాఖ్ ప్రాంతంలో భారీ స్థాయిలో చైనా దళాల కదలికలు కనిపిస్తున్నాయని భారత నిఘా సంస్థ ఏప్రిల్ మధ్యలో నివేదించింది. దీనితర్వాత గల్వాన్, హాట్ స్ప్రింగ్, ప్యాంగాంగ్ ప్రాంతాల్లో చైనా బలగాలు ట్యాంకులు, ఫిరంగులతో సహా భారీ ఎత్తున సైనిక సామగ్రిని తరలిస్తూ వచ్చాయి. మే 9 నాటికి తూర్పున 1500 మైళ్ల దూరంలో ప్యాంగాంగ్ ట్సోలోనూ, సిక్కింలోని నకు లా పరి ష్కృత సరిహద్దు వరకు చైనా బలగాలు విస్తరించాయి. మే 15న, భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవణే ఈ దురాక్రమణలకు స్థానిక పీఎల్ఏ కమాండర్దే బాధ్యత అని ఆపాదించారు తప్పితే గల్వాన్ ప్రాంతంలో, సిక్కింలో పదే పదే చైనా బలగాలు చొరబడటానికి కారణం ఏమై ఉంటుందన్న అంశాన్ని పరిశీలించలేకపోయారు. మన ఆర్మీ నాయకత్వానికి చైనా చొరబాట్ల అసలు ఉద్దేశాన్ని గుర్తించడానికి కాస్త సమయం పట్టినా పీఎల్ఎ వ్యూహాత్మక కదలికలను నేటికీ గుర్తించడం లేదు. గతంలో దేప్సంగ్, చుమార్, డోక్లామ్ ప్రాంతాల్లో చైనా సైనికుల కదలికలకు, తాజా దురాక్రమణలకు పోలికే లేదన్నది స్పష్టం. చైనా దళాలు తూర్పు లదాఖ్ లోపలకి భారీ సంఖ్యలో ప్రవేశించాయని జూన్ 2న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించినప్పటికి గానీ చైనాబలగాల చొరబాట్ల స్థాయి గురించి స్పష్టం కాలేదు. జూన్ 6న, ఇరుదేశాల సైనిక జనరల్స్ మధ్య సంభాషణల ఫర్యవసానాలను కూడా మనవాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. జూన్ 9 నాటికి ఇరుదేశాల సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలైందని, ఇరు పక్షాలు తమ తమ భూభాగంలోకి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం మేరకు వెనక్కు తగ్గాయని భారత సైనిక వర్గాలు సమాచారం లీక్ చేశాయి. జూన్ 13న డెహ్రాడూన్‌లోని భారత మిలటరీ అకాడమీని సందర్శించిన జనరల్ నరవణే, వాస్తవాధీన రేఖ పొడవునా ఇరు సైన్యాల ఉపసంహరణ దశ కొనసాగుతోందని రిపోర్టర్లకు తెలిపారు. గల్వాన్ రివర్ వేలీ ప్రాంతంలో భారీ ఎత్తున బలగాలు వెనుకకు మళ్లుతున్నాయని, పరిస్థితి నిలకడగా ఉంటూ, అదుపులోనే ఉందని ప్రకటించారు. అయితే ప్రత్యేకించి గల్వాన్ రివర్ వేలీలో భారీగా చొరబడుతూ తమ స్థానాలను బలోపేతం చేసుకుంటూ ఉండటంలో ప్రజావిముక్తి సైన్యం ఉద్దేశం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. 2010లో డర్బుక్–షియోక్ నుంచి డీబీఏ వరకు భారత వ్యూహాత్మక రహదారి నిర్మాణాన్ని తలపెట్టినప్పటినుంచి ఎన్నడూ అభ్యంతరం వ్యక్తం చేయని చైనా తాజాగా ఆ రహదారి నిర్మాణాన్ని అడ్డగించే ఉద్దేశంతో ఉన్నట్లు భారత సైన్యాధికారులకు స్ఫురించనేలేదు. ఇక నేరుగా కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేసే ఐటీబీపీ తాజా పరిణామాల గురించి అప్రమత్తం చేయకపోవడం మరింత ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతోంది. ప్రమాద సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ గల్వాన్ రివర్ వేలీలో వ్యూహాత్మక రహదారి నిర్మాణ పనుల బాధ్యతను సైన్యానికి అప్పగించడాన్ని మన జాతీయ భద్రతా వ్యవస్థ కనీసం పరిశీలనకు తీసుకోకుండా ఆ ప్రాంతంలో ఐటీబీపీని గస్తీ పనులకు మాత్రమే పరిమితం చేయడంలో ఔచిత్యం ఏమిటి? జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ ప్రాంతంలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన ఆ ప్రాణాంతక ఘర్షణలు భయానకమైన తప్పు అంచనాగానే కనబడుతోంది. ఏరకంగా చూసినా ఇది ఘోరమైన అసమర్థ తకు ప్రతిబింబమనే చెప్పాల్సి ఉంటుంది. పీపీ14 సెక్టార్లో చైనా సైన్యం ఉపసంహరణ జరుగుతోందా లేదా అని నిర్ధారించుకోవడానికి ప్రయత్నించిన భారత సైనికులు నేరుగా పీఎల్ఎ అక్కడ సిద్ధపర్చిన ఆంబుష్‌లో ఇరుక్కున్నారు. అక్కడే ఇరుసైనికుల మధ్య ఆయుధాలు ప్రయోగించని అనాగరికమైన, పాశవిక దాడికి రంగం సిద్ధమైంది. 16వ బిహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారిపై, అతడి రక్షణ బృందంపై చైనా సైనికులు ఐరన్ రాడ్లతో దాడిచేసి కుప్పగూల్చారు. చైనా బలగాల అసలు ఉద్దేశాన్ని గుర్తించని భారత బలగాలు పోరాటానికి సిద్ధంగా లేని స్థితిలో బలైపోయారు. పైగా వారు సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత ప్రభావానికి గురై బలైపోయారు. బిహార్, పంజాబ్‌లకు చెందిన మూడు ఇన్ఫాంట్రీ బెటాలియన్లు చైనా దళాల ముట్టడిలో చిక్కుకున్నారని తెలుస్తోంది. వీరు ప్రధానంగా సిగ్నల్స్, ఫిరంగి విభాగాలకు చెందినవారు. ప్రధాన సైనికబలగాలకు రక్షణగా ముందున్న ప్రాంతాన్ని పరిశీలిస్తూ వెళ్లే బాధ్యతలో వీరు ఉంటారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు సహాయంగా వచ్చిన అదనపు బలగాల కిందికే వస్తారు. పీఎల్ఏ ట్రాప్‌లో చిక్కిన భారత సైన్యంలో 20 మంది బలికాగా, 76 మంది గాయపడ్డారు, 10 మంది బందీలుగా చిక్కి జూన్ 18న చైనా బలగాల ఆధీనం నుంచి విడుదల అయ్యారు. భారత సైనిక చరిత్రలో ఇది అత్యంత భారీ నష్టాలకు కారణమైన సైనిక ఎన్‌కౌంటర్‌గా ఇది మిగిలిపోతుంది. పైగా ఆత్మరక్షణ కోసం మన సైనికులు కనీసం ఒక్క తూటా కూడా కాల్చలేదు. ఇది కచ్చితంగా తప్పుడు ఆదేశాలు, నిబంధనల ఫలితమే. చైనాకు గుణపాఠం చెప్పడానికి ఏమీ మిగలకుండా పోయిన ఘటన ఇది. మరోవైపున చైనా విదేశీ మంత్రిత్వ శాఖ తమ వైపు నష్టాలకు సంబంధించిన ప్రశ్నలకు ఉలుకూలేకుండా మౌనం పాటించింది. ఆ ఘర్షణలో వాడిన మారణాయుధాలు, గల్వాన్ నదిపై డామ్ నిర్మాణాన్ని అడ్డుకోవడం గురించి ఏమాత్రం సద్దులేకుండా ఉండిపోయింది. ఇరుపక్షాలూ తీవ్రమైన సమస్యను మామూలుగానే పరిష్కరించుకోవాలని అంగీరించినట్లు, ఏకాభిప్రాయ సాధనకు ఇరుపక్షాల కమాండర్ స్థాయి చర్చలు మొదలుపెడుతున్నట్లు, ఉద్రిక్తతలను సడలింపజేస్తున్నట్లు యథావిధి ప్రకటన చేసి ఊరకుండిపోయాయి. తరలించిన బలగాల మధ్య అత్యంత ఉద్రిక్తతా వాతావరణం కొనసాగుతున్నప్పటికీ సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ కూడా వాయిదా పడింది. భారత యుద్ధ సన్నద్ధత, స్పందనా యంత్రాంగంలోని సాంకేతిక లోపాలు బయటపడటమే వ్యూహాత్మక సమాచార వ్యవస్థ కూడా విఫలమైంది. 2019లో జమ్మూ కశ్మీర్‌ను పునర్వ్యవస్థీకరించడం, హోంమంత్రి అమిత్ షా అక్సాయిచిన్‌ను కూడా స్వాధీన పర్చుకుంటామని ప్రతిజ్ఞ చేయడం నేపథ్యంలో ఆగ్రహంతో రగిలిపోయిన చైనా నాయకత్వం.. లదాఖ్‌ని కేంద్రపాలిత ప్రాంత హోదా కల్పించడానికి భారత్ దేశీయ చట్టాన్ని ఏకపక్షంగా మార్చివేయడం అనేది చైనా ప్రాదేశిక సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని, భారత్ చర్య ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కూడా చైనా తేల్చిచెప్పింది. చైనా ఘాతుక చర్యకు ప్రతీకారం తప్పదని ఇప్పుడు పిలుపునిస్తున్నారు. అయితే సమీప భవిష్యత్తులో అది సాధ్యపడకపోవచ్చు. చైనా అనేక పర్యాయాలు చొరబాట్లుకు సిద్ధపడి తన స్థావరాలను బలోపేతం చేసుకున్న ఘటన యుద్ధ సన్నద్ధతలో భాగమే తప్ప అదొక అవకాశ మాత్రంగా ఉండిపోదు. కాస్త ఆలస్యంగా అయినా సరే భారత్ వాస్తవాధీన రేఖ పొడవునా వివాదాస్పత ప్రాంతాలను తిరిగి కైవసం చేసుకుని, సైనిక శక్తిని పెంచుకుని చర్చలను కొనసాగించవచ్చు. కానీ కీలకమైన మందుగుండు సామగ్రి లేకపోవడం, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో సిబ్బంది కొరత, ఉన్న కొద్ది మందిని కోవిడ్ సంబంధిత సామగ్రి తయారీవైపునకు మళ్లించడం వంటి కారణాల వల్ల భారత్ చేపట్టే యుద్ధ సన్నాహక చర్యలు ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. సూత్రరీత్యా చైనాయే ప్రథమ శత్రువు అని ప్రతి భారత సైనికుడికి బోధిస్తారు కానీ పాకిస్తానే మన లక్ష్యాల్లో ప్రథమ స్థానం వహిస్తూ ఉంటుంది. భారతీయ మీడియా యూరి, బాలాకోట్ తరహా ప్రతీకార చర్యలు తీసుకోవాలని రెచ్చగొట్టడం ఆపి, వుహాన్ స్ఫూర్తిని, ఇరుదేశాల సైనిక వ్యూహాత్మక మార్గదర్శకాలను ఉల్లంఘించిన చైనాకు వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తే మంచిది. చైనా సోషల్ మీడియా మాత్రం జాతీయవాద ప్రచారంతో వెర్రెత్తిపోతోంది. ఇక పీఎల్ఏ అధికార వాణిగా పేర్కొనే పీఎల్ఏ డైలీ, పీపుల్స్ డైలీ పత్రికలు జూన్ 16న జరిగిన సైనిక ఘర్షణలను నివేదించలేదు. గ్లోబల్ టైమ్స్ మాత్రమే వెనుక పేజీలో ఆ ఘటనను క్లుప్లంగా పేర్కొంది. గల్వాన్ ఘర్షణ భారత్–చైనా సంబంధాలపై తీవ్ర ప్రభావం వేసింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మునుపటిలా ఇక ఎన్నటికీ ఉండవు. సరిహద్దుల్లో చైనా సేనల దూకుడు చర్యకు తగిన సమాధానం ఇస్తామంటూ ప్రధాని నరేంద్రమోదీ జాతికి హామీ ఇచ్చారు కానీ ఆ సమాధానం ఆర్థికపరంగా, దౌత్యపరంగా మాత్రమే ఉండవచ్చు. సైనికపరంగా ఉండకపోవచ్చు. జూన్ మొదట్లో మోదీతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎందుకోగానీ మోదీ మంచి మూడ్‌లో లేనట్లు పేర్కొన్నారు. గల్వాన్ ఘటనల క్రమం మోదీ మానసిక స్థితిని మరింతగా దెబ్బతీయవచ్చు. అశోక్ కె. మెహతా వ్యాసకర్త మాజీ సైనిక జనరల్, డిఫెన్స్ ప్లానింగ్ స్టాఫ్ మాజీ సభ్యుడు -
సానుకూల దృక్పథంతోనే పరిష్కారం
బ్రిటిష్ వలస సామ్రాజ్యవాద పాలకులు సామ్రాజ్య విస్తరణలో భాగంగా తలపెట్టిన ఊహాజనిత ’గీత’ మెక్‌మహన్ రేఖ. ఇది భూమి మీద గీసిన సరిహద్దు రేఖ కానందునే ఈ రోజు దాకా భారత్–చైనాల మధ్య స్వతంత్ర దేశాల హోదాలో కలతలు, కార్పణ్యాలు సమసిపోవడం లేదు. ఎవరికి తోచిన ఊహాజనిత రేఖ దానికదేగా వాస్తవ రేఖ కాదు కాబట్టి, భారత– చైనాల మధ్య ముఖాముఖిగా శాశ్వత ప్రాతిపదికన సంప్రదింపులు తక్షణం ప్రారంభం కావాలి. భారతదేశంలో ఏ పాలకుడైనా చారిత్రికంగా వేలాది సంవత్సరాల భారత్–చైనా సంబంధాలకూ, నాగరికతకూ తోడూనీడై నిలిచి నప్పుడే, అందుకు చైనా పాలకులూ దీటుగా స్పందించినప్పుడే ఉభయదేశాల ప్రజల మధ్య సంబంధాలు తిరిగి సముజ్వలంగా పెరుగుతాయి. ‘‘భారత్–చైనా సరిహద్దుల్లోని భారత భూభాగంలోకి ఎవరూ ప్రవేశించనూ లేదు. మన సరిహద్దు స్థావరాలను ఎవరూ స్వాధీనం చేసుకోనూ లేదు. మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. శాంతి, స్నేహ సంబంధాలనే భారత్ కోరుకుంటోంది. అయితే భారత్ వైపు చూసే ధైర్యం చేసేవారికి మన జవాన్లు తగిన గుణపాఠం చెప్తారు’’. – జూన్ 15న భారత్–చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్) వద్ద ఉభయ దేశాల సైనికుల మధ్య ఘర్షణలలో 20 మంది భారత సైనికులు చనిపోయిన ఘటనపై స్పందిస్తూ ప్రధాని మోదీ జూన్ 19న అఖిల పక్షాన్ని ఉద్దేశించి చేసిన ప్రకటన. ‘‘ప్రధానమంత్రి ప్రకటనే నిజమయితే ఉభయదేశాల మధ్య వాస్తవాధీన రేఖ ఉన్న ప్రాంత భూమి చైనాదే అయితే, మన సైనికులు ఎందుకు బలికావాల్సి వచ్చింది? వాస్తవానికి మన సైనికులు బలైన ప్రాంతం అసలు ఎక్కడ ఉంది? మోదీ ప్రయత్నం రాజకీయ పక్షాలను తప్పుదోవ పట్టింది దౌత్యపరమైన సంప్రదింపుల్లో భారత వైఖరిని బలహీనపరిచేదిగా ఉంది’’ – కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, వామపక్షాలు, ప్రతిపక్షాలు 1962లో భారత్–చైనాల మధ్య తూర్పున ఈశాన్య సరిహద్దుల నుంచి పశ్చిమాన వాయవ్య భారత సరిహద్దు వరకు జరిగిన పరస్పర సైనిక ఘర్షణలకు, ఆక్రమణలకు ప్రధాన కారణం– ఈ చివర నుంచి ఆ కొస దాకా బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులు, 18–19 శతాబ్దాల మధ్య బ్రిటిష్ అధికారి మెక్‌మహన్ గీసిన ఊహాజనిత సరిహద్దు రేఖలే. 3,800 కిలోమీటర్ల పైచిలుకు భూభాగంలో, ఆనాటి అస్వతంత్ర దేశాలైన భారత్–చైనా ప్రజల సార్వభౌమాధికారంతో నిమిత్తం లేకుండా కేవలం ఒక ఊహాజనిత రేఖతో గీసిన ‘గాలిపటం’ లాంటి పటం. దాని పేరే మెక్‌మహన్ రేఖ! బ్రిటిష్ వలస సామ్రాజ్యవాద పాలకులు సామ్రాజ్య విస్తరణలో భాగంగా తలపెట్టిన ఈ ఊహాజనిత ‘గీత’.. భూమి మీద గీసిన సరిహద్దు రేఖ కానందునే ఈ రోజు దాకా భారత్–చైనాల మధ్య స్వతంత్ర దేశాల హోదాలో కలతలు, కార్పణ్యాలు సమసిపోవడం లేదు. వాయవ్య దిక్కున అక్షయచీనా (అక్సయిచిన్), కారాకోరమ్ కనుమ నుంచి ఇటు ఈశాన్య భారతంలోని భారత చైనా సరిహద్దులలో ఉన్న అరుణాచల్‌ప్రదేశ్ దాకా చైనాలో అంతర్భాగమైన టిబెట్ దక్షిణ దిశవరకూ భారత్–చైనాల మధ్య ఉద్రిక్త సరిహద్దులుగా మారాయి. నేలమీద గుర్తించకుండా కేవలం బ్రిటిష్ వాడి మ్యాపులో సామ్రాజ్యవిస్తరణ విన్యాసాలలో భాగంగా ఉజ్జాయిం పుగా గీసుకున్న మెక్‌మహన్ రేఖపై మన రెండు స్వతంత్ర దేశాలు గత 58 ఏళ్లుగా తగాదాలతో, ఘర్షణలతో సతమతమవుతున్నాయి. సామ్రాజ్యవాదులు పటానికి పరిమితమై గీసిన ఉజ్జాయింపు సరిహద్దు కాస్తా ఒక వేళ స్థిరమైన సరిహద్దుగా మన రెండు దేశాల మధ్య ఖరారు కావాలన్నా, లేదా పరస్పర సర్దుబాట్లతో ఉభయతారకంగా పరిష్కారం కావాలన్నా ఏం జరగాలి? చర్చలకు కూర్చుని వెసులుబాట్లతో శాశ్వత సరిహద్దులను, 3,800 కిలోమీటర్ల పొడవునా కచ్చితమైన సరిహద్దు రేఖను నేలపై గుర్తించాలి. అప్పుడు అది వాస్తవమైన సరిహద్దు అవుతుంది. అందాకా ఎవరికి తోచిన ఊహాజనిత రేఖ దాని కదేగా వాస్తవ రేఖ కాదు కాబట్టి, భారత– చైనాల మధ్య ముఖాముఖిగా శాశ్వత ప్రాతిపదికన సంప్రదింపులు తక్షణం ప్రారంభం కావాలి. ఇది ఉభయ దేశాల పాలకుల ప్రయోజనాల సమస్యగాకంటే, నిత్యం ధన ప్రాణాలను, పరువు ప్రతిష్ఠలను కోల్పోతున్న 260 కోట్ల ప్రజల దీర్ఘకాల వాంఛ అన్న గుర్తింపు, స్పృహ పాలకులకు ఉండటం అవసరం. పైగా, ఇది పరస్పరం తప్పొప్పులను కెలుక్కునే సమయం కాదు. లద్దాక్ సమీపంలో సరిహద్దుల్లోని గాల్వాన్ లోయ వద్ద జరిగిన సాయుధ దళాల మోహరింపులో పరస్పరం జవాన్లకు కల్గిన ప్రాణ నష్టం బాధాకరమే అయినప్పటికీ, ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడం కోసం ఉభయత్రా శాంతికి అనుకూలంగా ఒక ప్రకటన చేయడం సంతోషించదగింది. పైగా 1962 భారత–చైనా సరిహద్దు ఘర్షణల సమయంలో మన సరిహద్దులు మన సైన్యానికి నిర్దిష్టంగా తెలియని స్థితిలో ముందుకు దూసుకెళ్ళమని సైన్యాధికారులకు ఆదేశమిచ్చి ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సింహళ పర్యటనకు వెళ్ళారు. ఇరుసైన్యాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆనాడు కూడా ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది. తాజాగా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో మన సైనికులు 20 మంది నిండు ప్రాణాలు విడువవలసి వచ్చింది. అంతేగాదు, మనవాళ్లను చైనా సైన్యం మరెంతమందిని బందీలుగా తీసుకు వెళ్లింది కూడా మనకు తెలియదు. చివరికి 10 మంది అని చైనా ప్రకటించి మనవాళ్లకి తిరిగి అప్పగించే వరకూ (జూన్ 19) మనకు వారి ఆచూకీ తెలియక పోవడం 1962 నాటి స్థితినే తెల్పుతుంది. ఆనాడు ఈశాన్య సరిహద్దు ఘర్షణల సమయంలో బోమ్డిలా వరకూ దూసుకు వచ్చి మన సేనల్ని తరిమికొట్టి తిరిగి తోక ముడిచిన చైనా వ్యూహం వెనక రహస్యం కూడా.. దౌత్యరీత్యా జరపవలసిన ముఖాముఖి చర్చల ద్వారా సరిహద్దుల్ని నేలమీద గుర్తించేదాకా, పరస్పరం యిచ్చిపుచ్చుకునే దౌత్యనీతికి కట్టుబడి ఉండేదాకా ఘర్షణలు తప్పక పోవచ్చునేమోనని పరిణామాల బట్టి అనిపిస్తోంది. ఈ పరిస్థితిని సమీక్షించుకుంటే బహుశా ప్రసిద్ధ యుద్ధ చరిత్రకారుడు ఆల్ఫ్రెడ్ వాట్స్ చేసిన హెచ్చరిక జ్ఞాపకం వస్తోంది. ‘‘పౌర ప్రభుత్వాల పదవీ కాంక్షలు, భావావేశాలు, ఘోర తప్పిదాల ఫలితంగా సైన్యనాధులు యుద్ధాలలో తలమునకలు కావలసిన దుస్థితి తరుచుగా ఏర్పడుతోంది’’ (ది హిస్టరీ ఆఫ్ మిలటరిజం)! అంతే కాదు, చైనాలో భారత రాయబారిగా పనిచేసిన గీతం బొంబావాలే హితవు చెప్పినట్లుగా, వాస్తవాధీన రేఖ ఎక్కడుందన్న విషయంపై ఉభయత్రా అభిప్రాయభేదాలున్న వాస్తవాన్ని భారత–చైనాలు రెండూ అంగీకరిస్తున్నాయి. కాబట్టి ఉభయ దేశాల మధ్య శాంతి సామరస్యాలను కాపాడుకుని తీరాలి. (గీతం ప్రకటన: 22–06–2020)! నిజానికి ఈ పరస్పర ప్రయోజనాలను సాధించేందుకే 1962లో సరిహద్దు ఘర్షణలు, తీవ్ర నష్టాలు జరిగాయి. అప్పుడు కూడా మన సైనికులు 3,800 మంది చనిపోయారని తెలియజెప్పిందీ, బందీలైన వందలాదిమందిని భారత సైనికులను తిరిగి అప్పజెప్పిందీ చైనానే కావడం మరో విశేషం. ఇప్పుడూ అలాగే జరిగింది. మెక్‌మహన్ రేఖ పూర్వాపరాలను నెవెల్లీ మాక్స్వెల్ పూర్తిగా వివరిస్తూ ‘ఇండియాస్ చైనా వార్’ అనే గ్రంథాన్ని ఆనాడే రాశారు. అంతేగాదు, భారత చైనాల మధ్య సామరస్య వాతావరణాన్ని కల్పించడానికి 1962 దుర్ఘటనల మధ్య శతధా ప్రయత్నించిన వారిలో శ్రీలంక ప్రధాని సిరిమావో బండారునాయకే, ఘనా అధ్యక్షుడు, రాజనీతిజ్ఞుడయిన ఎన్క్రుమా ప్రముఖులు. కొలంబో ప్రతిపాదనల సారాంశమంతా– బ్రిటిష్‌వాడు ఆసియాలో తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా.. టిబెట్‌ను చైనా నుంచి వేరు చేయడానికి చేసిన ప్రయత్నాన్ని ఖండించటంతోపాటు మెక్‌మహన్ రేఖకు భిన్నంగా భారత్–చైనాల మధ్య ముఖాముఖి చర్చల ద్వారా సరిహద్దులను పరిష్కరించుకోవాలనే. ఆ మాటకొస్తే, గాంధీజీ ప్రథమ శిష్యగణంలో అగ్రజులయిన పండిట్ సుందరలాల్, జేసీ కుమారప్ప భారత్–చైనాల మధ్య మూడో శక్తి ప్రమేయం లేకుండా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికే మొగ్గుచూపి తమ చైనా పర్యటన అనుభవాలను పూసగుచ్చినట్టు వెల్ల డించారు. ‘చైనా టుడే’ అన్న గ్రంథంలో పండిట్ సుందరలాల్.. టిబెట్, చైనాలో అంతర్భాగమేనని చాటారు. కానీ 1959లో దలైలామా టిబెట్ నుంచి ఉడాయించి మన దేశ పాలకుల సహకారంతో ఇండియాలో ఉంటున్నప్పటినుంచీ భారత్–చైనా సంబంధాలు మరింత చెడిపోవడానికి, చైనా వ్యతిరేక ప్రకటనలతో వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేయడానికి భారత పాలకులకు చేదోడువాదోడయ్యాడు, దలైలామా తర్వాత టిబెట్ లామాలకు నాయకుడైన మరో నాయకుడు అమెరి కాలో స్థిరపడి చైనా వ్యతిరేక ప్రచారానికి సమిధలు అందిస్తూ వచ్చాడు. భారతదేశంలో ఏ పాలకుడైనా చారిత్రికంగా వేలాది సంవత్సరాల భారత్–చైనా సంబంధాలకూ, నాగరికతకూ తోడూనీడై నిలి చినప్పుడే, అందుకు చైనా పాలకులూ దీటుగా స్పందిం చినప్పుడే ఉభయదేశాల ప్రజల మధ్య సంబంధాలు తిరిగి సముజ్వలంగా పెరుగుతాయి. అసలు మనకు ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు బాగున్నాయో, లేదో తెలిస్తే.. మిగతా ముచ్చట సంగతి తర్వాత! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
చైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి
ఇరుగు పొరుగుగా వున్నప్పుడూ, పరస్పరం మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోదగ్గ పరిస్థితు లున్నప్పుడూ అవాంఛనీయమైన పోకడలకు పోవడం చేటుతెస్తుంది. అది ఇరుపక్షాలకూ మంచిది కాదు. ఇప్పుడు భారత్–చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద గల్వాన్ లోయలో జరిగింది అదే. చైనా సైనికులు కుటిల ఎత్తుగడలకు పోయి ఇనుప రాడ్లు, రాళ్లు, కర్రలతో దాడి చేసి 20మంది భారత జవాన్ల ఉసురు తీసిన ఉదంతం జరిగాక దేశవ్యాప్తంగా పెల్లుబికిన ఆగ్రహావేశాల పర్యవసానంగా తప్పసరైనప్పుడు ఆయుధాల వినియోగంలో మన జవాన్లకు పూర్తి స్వేచ్ఛనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. క్షేత్ర స్థాయిలోవుండే కమాండర్లు ఇకపై ఎవరికి వారు అక్కడున్న పరిస్థితులను మదింపు వేసుకుని ఆయుధాలు ఉపయోగించడంపై స్వతంత్రంగా నిర్ణయం తీసు కుంటారు. సమస్యలుంటున్నా, అప్పుడప్పుడు అవి తీవ్ర రూపం దాలుస్తున్నా గత నలభై అయి దేళ్లుగా ఎల్ఏసీ ప్రశాంతంగా వుంటోంది. ఇందుకు కారణం–రెండు దేశాల సైనికాధికారులు చర్చించుకోవడం, ఒక అంగీకారానికి రావడం... అక్కడ పరిష్కారం కాకపోతే ఉన్నత స్థాయి సంప్ర దింపులు జరగడం. కానీ ఈ సామరస్య వాతావరణాన్ని కాస్తా ఈ నెల 15న చైనా ఛిద్రం చేసింది. పర్యవసానంగా మన ప్రభుత్వం జవాన్లకు స్వేచ్ఛనివ్వాల్సివచ్చింది. ప్రత్యర్థి పక్షాలు సాయుధంగా వున్నప్పుడు, ఊహించని రీతిలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ఊహకందని పరిణామాలు ఏర్పడ తాయి. నష్టం రెండుపక్కలా వుండొచ్చు. ఇది బాధాకరమే. కానీ ఇంతకన్నా గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడటానికి చైనాయే కారణం. మే నెల మొదటి వారం నుంచి అక్కడ ఇరు దేశాల సైనికుల మధ్యా చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకుంటూ వున్నాయి. ఇరుపక్షాలూ ఎల్ఏసీ నుంచి రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్లాలన్న ఒప్పందం కుదిరాక ఉద్రిక్తతలు ఉపశమించాయని అందరూ అనుకుంటున్న తరుణంలో చైనా సైనికులు రెచ్చిపోయారు. పరస్పర ప్రయోజనాలు, ఉభయులూ ఆర్థికంగా ఎదగడం ప్రాతిపదికగా గత కొన్ని దశాబ్దాలుగా భారత్–చైనా సంబంధాలు సాగుతున్నాయి. విస్తృతమైన మార్కెట్‌గా వున్న మన దేశం వల్ల చైనాకు ఈ కాలమంతా మేలే జరిగింది. మన ఎగుమతులతో పోలిస్తే చైనా నుంచి మనం దిగుమతి చేసుకునే ఉత్పత్తులే ఎప్పుడూ అధికం. ఏటా ఆ వాణిజ్య లోటు పెరుగుతోందే తప్ప తరగలేదు. ప్రపంచ దేశాలకు మన దేశం నుంచి అయ్యే ఎగుమతుల్లో చైనా వాటా 5 శాతమైతే... ఇక్కడికొచ్చే దిగుమతుల్లో చైనా వాటా 14 శాతం. వివిధ స్టార్టప్ కంపెనీలు, ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే చైనా కంపెనీలు 800 పైమాటే. సృజనాత్మక ఆలోచనలతో అడుగుపెట్టే ఔత్సాహికులకు మన దేశంలో కొదవలేదు. వారు స్థాపించే సంస్థలు లాభాల బాటలో పయని స్తాయన్న విశ్వాసం ఉండబట్టే చైనా కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్‌లో తమ పెట్టుబడులు సురక్షితంగా ఉండటమేకాక, దండిగా లాభాలు ఆర్జించి పెడతాయని వాటికి తెలుసు. చైనా ఉత్పత్తి చేసే సరుకులు వేరేచోట తయారయ్యే సరుకులతో పోలిస్తే చవగ్గా వుండబట్టి మన దేశంలో వాటికి ఆదరణ వుంది. పర్యాటక రంగంలో కూడా చైనాకే అధిక లాభం కలుగుతోంది. చైనా నుంచి ఇక్కడికొచ్చే సందర్శకులకన్నా, మన దేశం నుంచి అక్కడికెళ్లే సందర్శకులే ఎక్కువ సంఖ్యలో వుంటారు. దీన్నంతటినీ సానుకూల దృక్పథంతో చూసివుంటే, ఇచ్చిపుచ్చుకునే విధంగా చైనా వ్యవహరించివుంటే ఎల్ఏసీపై ఉభయులకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధ్యమయ్యేది. పక్కా సరిహద్దులు ఏర్పడేవి. ఆర్థిక, వాణిజ్య రంగాల్లో ఏర్పడ్డ సానుకూలతలను ఈ సంక్లిష్ట సమస్య పరిష్కారానికి వినియోగించుకుందామన్న స్పృహ చైనాకు వుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. భారత్–చైనాలకు ప్రయోజనం చేకూర్చే ఇతరత్రా అంశాలు చాలా వున్నాయి. మంగళవారం జరగబోయే రష్యా–భారత్–చైనా(ఆర్ఐసీ) విదేశాంగ మంత్రుల వీడియో భేటీ ఇందులో ఒకటి. పాశ్చాత్య దేశాల కూటమికి దీటుగా దీన్ని తీర్చిదిద్దాలని 90వ దశకంలో మూడు దేశాలూ సంకల్పించాయి. ఉగ్రవాదంపై పోరు, ప్రపంచంలో అంతకంతకూ పెరుగుతున్న ఆత్మరక్షణ విధా నాలు, వాతావరణ మార్పులు తదితర అంశాల్లో ఆర్ఐసీ ఛత్రఛాయ కింద సమష్టిగా పనిచేద్దామని ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు మూడు దేశాల అధినేతల భేటీ సందర్భంగా పిలుపునిచ్చారు. దాన్ని పటిష్ట పరిచే దిశగా చర్యలు తీసుకుంటే అది చైనాకే ఎక్కువ ఉపయోగకరం. మన దేశం అమెరికాకు దగ్గరవుతున్నదన్న శంక దానికుంది. అలాగే అమెరికా తనకు వ్యతిరేకంగానే భారత్‌ను కూడా కలుపుకొని ఇండో–పసిఫిక్ వ్యూహం రూపొందించిందన్న ఆందోళన వుంది. మన దేశం పట్ల సామరస్య ధోరణితో వ్యవహరిస్తే ఈ అంశాల్లో తనకు అనుకూలమైన ఫలితాలొస్తాయన్న స్పృహ దానికి లేకుండా పోయింది. సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో వుండే ఎల్ఏసీ వద్ద సమస్యలు ముదిరి ఉద్రిక్తతలు ఏర్పడితే అవి తీవ్ర రూపం దాల్చకుండా వుండేందుకు 2012లో ఇరు దేశాలూ భాగస్వాములుగా వుండే సంప్రదింపులు, సమన్వయ యంత్రాంగం(డబ్ల్యూఎంసీసీ) ఏర్పడింది. దాని సమావేశం కూడా ఈ వారంలోనే వుంటుంది. దాదాపు వెనువెంటనే జరిగే ఆ సమావేశంలో ఎల్ఏసీలో ఏర్పడిన సమస్యను లేవనెత్తి పరిష్కారానికి ప్రయత్నిద్దామని కూడా చైనా అనుకోలేదు. బలప్రయోగం చేసి, పాత ఒప్పందాలను బేఖాతరు చేసి భారత్ వంటి దేశాన్ని దారికి తీసుకురావొచ్చునని భావించడం దాని తెలివితక్కువ తనం. ఇప్పుడు భారత్, చైనాల మధ్య సామరస్యత ఏర్పర్చడానికి కృషి చేస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంటున్నారు. పరి స్థితిని ఇంతవరకూ తెచ్చింది తానేనన్న స్పృహ కనీసం ఇప్పటికైనా చైనాకు కలగాలి. తన తప్పిదాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. -
అడ్డుకున్న సంతోష్ నేతృత్వంలోని దళం
న్యూఢిల్లీ: చైనా, భారత్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలోని ఒక చిన్న పర్వత పాదంపై నిఘా కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేయడమే తాజా ఘర్షణలకు కారణమని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘర్షణల్లో భారత్, చైనాల సైనికులు భారీగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. భారత భూభాగంలో గాల్వన్ నది దక్షిణ తీరంలో చైనా ఆ పోస్ట్‌ను ఏర్పాటు చేయడాన్ని కల్నల్ సంతోష్ నాయకత్వంలోని భారత దళాలు అడ్డుకున్నాయి. ఆ పోస్ట్ ను తొలగించేందుకు సోమవారం సాయంత్రం ప్రయత్నించాయి. ఆ కేంద్రంలో ఉన్న కొద్దిమంది చైనా సైనికులు భారత సైనికులను అడ్డుకున్నారు. కానీ, కాసేపటికి వాస్తవాధీన రేఖకు ఆవల ఉన్న చైనా భూభాగం వైపు వెళ్లిపోయారు. ఈలోపు, భారత్ వైపు నుంచి మరిన్ని బలగాలు అక్కడికి చేరుకుని చైనా ఏర్పాటు చేసిన పోస్ట్‌ను కూల్చేయడం ప్రారంభించాయి. కాసేపటికి, మరిన్ని బలగాలతో చైనా సైనికులు మళ్లీ వచ్చారు. రాళ్లు, మేకులు కుచ్చిన కర్రలు, ఇనుప రాడ్లతో భారత సైనికులపై దాడికి తెగబడ్డారు. కొన్ని గంటల పాటు పరస్పర దాడులు కొనసాగాయి. దాడుల సమయంలో రెండు దేశాలకు చెందిన కొందరు సైనికులు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో నీరున్న గాల్వన్ నదిలో పడిపోయారు. చైనా బలగాల దాడిలో కల్నల్ సంతోష్ చనిపోయారు. కొందరు భారత సైనికులను చైనా బందీలుగా తీసుకువెళ్లిందని, అయితే, కాసేపటికి వారిని వదిలివేసిందని సమాచారం. అయితే, ఇంకా పది మంది భారత సైనికులు బందీలుగా ఉన్నట్లు ప్రముఖ రక్షణ రంగ విశ్లేషకుడు అజయ్ శుక్లా అభిప్రాయపడ్డారు. -
రేపు అఖిలపక్షం భేటీ
చైనా ఆర్మీ దాడిలో కల్నల్ సహా 20 మంది భారతీయ సైనికులు మరణించడం, తదనంతర పరిణామాలపై సమాచారం పంచుకునేందుకు ప్రధాని శుక్రవారం అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఆ భేటీలో విపక్ష, మిత్రపక్ష నేతలకు వివరించనున్నారు. ‘చైనా సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని చర్చించేందుకు జూన్ 19 సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పక్షాలతో సమావేశమవనున్నారు’ అని పీఎంఓ ట్వీట్ చేసింది. గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణలకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ అఖిలపక్ష భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. సరిహద్దు వివాదానికి సంబంధించి దేశమంతా ప్రభుత్వం వెనుక ఉందని, ఘర్షణలకు సంబంధించిన అన్ని వాస్తవాలను వెల్లడించాలని రాహుల్ గాంధీ బుధవారం డిమాండ్ చేశారు. -
సరిహద్దు ఘర్షణలో సరికొత్త సవాళ్లు
అంతర్జాతీయ సంబంధాల్లో వాస్తవికవాదానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇది జాతీయ ప్రయోజనాల రీత్యా ప్రభుత్వ చర్యలను సమర్థిస్తుంది పైగా అన్నిటికంటే జాతీయ ప్రయోజనాలను సంతృప్తిపర్చడమే అన్ని ప్రభుత్వాల విధి అని అది చాటిచెబుతుంది. లద్దాఖ్ రీజియన్‌లోని వివాదాస్పద అక్సాయ్ చిన్ ప్రాంతంలో భారత్, చైనా మధ్య ఘర్షణను ఈ దృక్కోణంలోంచే అంచనా వేయాలి. జూన్ 15వ తేదీన జరిగిన సైనిక ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అసువులు బాయడం, కొందరు చైనా సైనికులు గాయపడ్డానికి దారి తీసిన విషాదకర ఘటనలు నిజంగా కలవరం కలిగిస్తున్నాయి. సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన ఇరుదేశాల మధ్య ఘర్షణకు, ఇరుదేశాలు తమ భూభాగాలను పోగొట్టుకోవడానికి దారితీసే అవకాశాల గురించి పలు చర్చలకు దారి తీసింది. భారత్, చైనాలు కేవలం ఇరుగుపొరుగు దేశాలు మాత్రమే కాదు.. అవి అణ్వాయుధాలు కలిగిన దేశాలు. పైగా ప్రపంచంలోని ఆరు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఇవి భాగం. ఇరుదేశాల్లో 250 కోట్లపైగా జనాభా ఉంది. కాబట్టే ఇరుదేశాల మధ్య నెలకొనే ఎలాంటి ప్రయోజనాల మధ్య వైరుధ్యం అయినా సరే అంతర్జాతీయ వ్యవస్థ భౌగోళిక వ్యూహాత్మకతపై, ఆర్థిక పర్యవసానాలపై తీవ్రమైన ప్రభావం కలిగిస్తుంది. కాబట్టే్ట పరిస్థితిని, రాబోయే ఫలితాలను మదింపు చేయడానికి ముందు ఈ ప్రాంతంలో రెండు దేశాల ప్రయోజనాలను అర్థం చేసుకోవడం తప్పనిసరి. ఆర్టికల్ 370ని రద్దుతో చైనా అప్రమత్తం చైనా దృక్కోణం నుంచి చూస్తే ఈ ప్రాంతంలో దానికి కొన్ని కీలకమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి. చైనా జింజియాగ్ ఉగర్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని ఎచెంగ్ నుంచి టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని లెట్సెని కలుపుతున్న 2342 కిలోమీటర్ల పొడవైన 219 జాతీయ రహదారిని నిర్మించింది. ఈ రోడ్డు 1962 యుద్ధంలో చైనా ఆక్రమించిన అక్సాయ్ చిన్ ప్రాంతం గుండా వెళుతోంది. అధికారికంగా భారత్ ఇప్పటికీ ఈ ప్రాంతంపై తనకు హక్కులున్నాయని వాదిస్తూ దాన్ని లద్దాఖ్ రీజియన్‌లో భాగంగా చూస్తోంది. అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో, అక్సాయ్‌చిన్ ప్రాంతంపై భారత్ ఉద్దేశాలు చైనా అధికార వర్గాల్లో ప్రమాదఘంటికలు మోగించాయి. ఎందుకంటే 219వ జాతీయ రహదారి టిబెట్‌ను జింగ్జియాంగా ప్రావిన్సుతో అనుసంధానించడంవల్ల చైనాకు ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా, ఆర్థికంగా చాలా ముఖ్యమైనది. టిబెట్, జింజియాంగ్ ప్రావిన్సు రెండింటిలో ఇప్పుడు వేర్పాటువాదం ప్రబలంగా ఉంది. ఇప్పటికే టిబెటన్ ఆకాంక్షలకు భారత్ ఎత్తుగడల రీత్యా మద్దతు ఇవ్వడం చైనాను ఆందోళనకు గురిచేస్తోంది. రెండు, చైనా–పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) లోని కారంకోరం హైవేతో అనుసంధానించడంలో 219వ జాతీయ రహదారికి కీలక పాత్ర ఉంది. వాస్తవాధీన రేఖ నుంచి దౌలత్ బేగ్ వరకు భారత్ మౌలికవ్యవస్థాపనలను అభివృద్ధి పర్చుకోవడం అనేది ఇటు కారంకోరం, అటు ఎన్‌హెచ్ 219 హైవే రెండింటికి భద్రతాపరంగా చైనాకు హెచ్చరికలు పంపుతోంది. మూడు, సీపీఈసీకి భద్రతాపరమైన ప్రమాదం ఉందంటే ఈ ప్రాంతంలో చైనా మదుపు చేసిన 60 బిలియన్ డాలర్ల మేరకు మౌలిక వసతుల అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోతుంది. పైగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మానసపుత్రిక అయిన బెల్ట్ అండ్ రోడ్స్ ఇనిషియేటివ్ (బిఆర్ఐ)ని ఇది అడ్డుకుంటుంది. ఈ ఇనిషియేటివ్‌కు ఎలాంటి నష్టం వాటిల్లినా, స్వదేశంలో జీ జిన్‌పింగ్‌కు రాజకీయ సమస్యలను కొనితెస్తుంది. ఈ వ్యూహాత్మక, ఆర్థిక కారణాలే మొత్తం కశ్మీర్ సమస్యను కొత్త మలుపులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు చైనా తాను కూడా కశ్మీర్ సమస్యలో భాగమేనని భావిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఐక్యరాజ్యసమితిలోని చైనా శాశ్వత ప్రతినిధి భారత్ చర్యను చైనా సార్వభౌమాధికారానికి సవాలు అని ఆరోపించారు. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు అనేది అక్సాయ్ చిన్, గిల్గిత్–బాల్టిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ మూడింటికీ వర్తిస్తుందని భారత్ స్పష్టంగా ప్రకటించింది. అక్సాయ్ చిన్ ఏరియాపై చైనా బలంగా పట్టు సాధించాలంటే టిబెట్–జింజియాంగ్ కనెక్టివిటీనుంచి భారత్‌ను దూరంగా నెట్టేయాలి. భవిష్యత్తులో నెలకొనే ఏ ఘర్షణలో అయినా, కారంకోరం హైవేకి ప్రమాద అవకాశాలను తగ్గించడం అనేది లడాఖ్ రీజియన్‌లో చైనాకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక ప్రయోజనంగా మారింది. అందుచేత వివాదాస్పద భూభాగంలోపలికి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు తన బలగాలను చైనా ఉపసంహరించుకోవడం జరిగితే, దాన్ని తాత్కాలిక చర్యగానే భావించాల్సి ఉంటుంగది. అంతేకాకుండా భవిష్యత్తులో చైనా ప్రజావిముక్తి సైన్యం అనేకసార్లు ఇలా వివాదాస్పద ప్రాంతంలోకి వస్తూ, వెనక్కి వెళ్లిపోతూ ఉండే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అక్సాయ్‌చిన్‌లో తన ప్రయోజనాలను కాపాడుకోవడంతో పోలిస్తే సిక్కింలో నకూ లా సెక్టర్లో, భూటాన్ సమీపంలోని డోక్లామ్, అరుణాచల్ ప్రదేశ్ సెక్టర్లో చైనా ప్రయోజనాలు పెద్దగా ముఖ్యమైనవి కాదు. భారత్ దృష్టిని ఏమార్చడానికి, దాని శక్తిని బలహీనపర్చడానికి మాత్రమే ఈ ప్రాంతాల్లోని ఘర్షణలు ఉపయోగపడతాయి. ఎంపికలే భారత్ ముగుదాళ్లు కాబట్టి భారత్‌కు ఇప్పుడు మూడు అవకాశాలున్నాయి. ఒకటి, ప్రాదేశికప్రాంతం విషయంలో రాజీపడి యధాతథ స్థితిని కొనసాగించడం. అంటే పీఓకే, గిల్గిత్–బల్టిస్తాన్ ప్రాంతాలు పాకిస్తాన్‌తో కొనసాగేలా, అక్సాయ్‌చిన్ చైనాలో భాగంగా ఉండేలా భారత్ రాజీపడాలి. పైగా పాకిస్తాన్‌తో ఆధీన రేఖను పరిష్కరించడంలో చైనాతో వాస్తవాధీనరేఖను పరిష్కరించుకోవడానికి వాటిని అంతర్జాతీయ సరిహద్దులుగా గుర్తిస్తూ భారత్ దౌత్యపరంగా చర్చలకు కూర్చోవాల్సి ఉంటుంది. రెండు, అరుణాచల్ ప్రదేశ్‌తో సహా తూర్పు రంగంలో ఉండే అక్సాయ్‌చిన్ తదితర భూభాగాలపై చైనాతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. మూడు, భారత్ తనకు తానుగా సైనిక ఘర్షణకు సిద్ధం కావాల్సి ఉంటుంది. మొదటి రెండు ఎంపికలను భారత్ ఎంచుకోకపోతే భవిష్యత్తులో ఏ సమయంలోనైనా సైనిక ఘర్షణ తప్పదన్నమాట. ఇతర భూభాగాలకోసం అక్సాయ్ చిన్‌పై చర్చలు జరపటం అంటే రాజకీయ పార్టీలను పెద్ద ఎత్తున కూడగట్టాల్సి ఉంటుంది. పైగా ప్రజా తీర్పును కూడా కోరాల్సి ఉంటుంది. ఎందుకంటే సరిహద్దులు నిర్ణయించడమే భారత్ అసలు సమస్య. వాస్తవాధీన రేఖ ఒక సరిహద్దుగా ఉన్నప్పటికీ చైనా దాన్ని అవలీలగా దాటేస్తుంది. అందుకే ఈ ప్రాంతంలో ఇలాంటి ముఖాముఖి ఘర్షణలు తప్పవు. పైగా ఇప్పటికీ పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న పీఓకే, గిల్గిట్ బాల్టిస్తాన్ అనే కశ్మీర్‌లోని రెండు ప్రధాన భాగాల భద్రతకి అది హామీ ఇవ్వలేదు. పైగా, ఈ మూడు ఎంపికల్లో దేన్ని ఎంచుకోవాలన్నా అది అంత సులభం కాదు. దీనికి సుదీర్ఘకాల వ్యూహం అవసరమవుతుంది. మరోవైపు, ఈ ప్రాంతంలో భారత ప్రయోజనాలు ప్రధానంగా పాకిస్తాన్ చుట్టూనే తిరుగుతున్నాయి. 1947లో దేశ విభజన కాలం నుంచి మన సైనిక, వ్యూహాత్మక చింతన మొత్తంగా సీమాంతర ఉగ్రవాదం నుంచి, సైనిక కేంపెయిన్ల నుంచి కశ్మీర్‌ను కాపాడుకోవడంపైనే దృష్టి సారించింది. 1962లో చైనాతో యుద్ధం భారత్ కళ్లు తెరిపించినప్పటికీ, భారత్ రాజకీయ, వ్యూహాత్మక లక్ష్యాలు పాకిస్తాన్ నుంచి వస్తున్న ప్రమాదాలను మాత్రమే పట్టించుకుంటున్నాయి. పీఓకే, జీబీ భూభాగాలను పాకిస్తాన్ నుంచి లాక్కోవడానికి ప్రయత్నించడం కంటే ఈ ప్రాంతంలో పాకిస్తాన్ మరింతగా చొచ్చుకు రాకుండా చేయడం, సీమాంతర ఉగ్రవాదంతో పోరాడటమే భారత్ ఏకైక కర్తవ్యంగా మిగిలిపోయింది. కాబట్టి లద్దాఖ్ భద్రతతోపాటు కశ్మీర్ సమస్యను పాకిస్తాన్ నుంచి ప్రమాద హెచ్చరిక కోణంలోనే మనం చూస్తున్నాం. దీనివల్లే చైనాతో సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పన పట్ల భారత్ ఉదాశీనంగా ఉండిపోతోంది. అయితే కొత్త సహస్రాబ్దంలో భారతీయ వ్యూహాత్మక చింతనలో ప్రధానమైన మార్పు చేటు చోసుకుంది. లద్దాఖ్ రీజియన్‌లో 2003 నుంచి భారత్ రోడ్లు, బ్రిడ్జిలను నిర్మించడం ప్రారంభించింది. కఠినమైన సందర్భాల్లో పాకిస్తాన్–చైనా మిశ్రమ బలగాలు ముందుకు చొచ్చుకురాకుండా చేయడానికి వీటి నిర్మాణం అవసరం. 2013లో సీపీఈసీని చైనా ప్రారంభించి కారంకోరం హైవే అభివృద్ధిని ప్రకటిం చినప్పుడు భారత్ అప్రమత్తమై తన అభ్యంతరం వ్యక్తంచేసింది. కశ్మీర్ ప్రతిపత్తికి ఇది విఘాతం కలిగిస్తుంది కాబట్టే భారత్ చైనా ప్రతిపాదిత బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో చేరడానికి నిరాకరించింది. భారత్ అష్టదిగ్బంధనమే చైనా లక్ష్యం పైగా అంతర్జాతీయంగానే ఇరుదేశాల ప్రయోజనాలు దక్షిణ చైనా సముద్రం నుంచి తూర్పున హిందూ మహాసముద్రంవరకు, పశ్చిమ భారత్ లోని అప్ఘానిస్తాన్ వరకు వ్యాపించి ఉన్నాయి. చైనాతో లెక్కలు తేల్చుకోవడానికి అమెరికా పొంచుకుని ఉన్నందున భారత్‌తో సైనిక ఘర్షణను కోరి తెచ్చుకోవడం అంటే చైనాకు కొరివితో తల గోక్కున్నట్లే అవుతుంది. అందుకే పూర్తి స్థాయి యుద్ధానికి బలీయమైన కారణాలు కనిపిస్తే తప్ప, చైనా తన ప్రయోజనాల రక్షణ కోసం స్థానిక ఘర్షణలకు మాత్రమే పరిమితమవుతుంది. పైగా వివాదాస్పద ప్రాంతాలను కొంచెంకొంచెంగా ఆక్రమించడం, భారత్‌ను పొరుగుదేశాల సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పనను వృద్ధి చేసి భారత్‌ను అష్టదిగ్బంధానికి గురి చేయడం వంటి ఇతర వ్యూహాలను కూడా చైనా ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి దక్షిణాసియా ప్రాంతంలో చైనా జోక్యం ద్వారా ఎదురవుతున్న కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా భారత్ సిద్ధమై ఉండాలి. వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్శిటీ, సిక్కిం ఈమెయిల్ – opgadde@cus.ac.in -
చైనా దురాగతం
స్నేహం నటిస్తూనే ద్రోహం చేయడం అలవాటైన చైనా అదును చూసి దెబ్బ కొట్టింది. చర్చలకొచ్చినట్టే వచ్చి, ఉన్న ప్రాంతం నుంచి రెండు పక్షాలూ వెనక్కి వెళ్లాలన్న అవగాహనకు అంగీకరించినట్టే కనబడి హఠాత్తుగా సోమవారం రాత్రి దాడికి తెగబడింది. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్‌తో సహా 20మంది భారత జవాన్ల ప్రాణాలు బలితీసుకుంది. రాళ్లు, ఇనుపరాడ్లతో సైనికులు చేసిన దాడిని మన జవాన్లు తిప్పికొట్టడంతో అటువైపు 43మంది మరణించారని అంటున్నారు. ఎల్ఏసీ వద్ద భారత భూభూగంలో చైనా సైనికులు నిర్మిస్తున్న శిబిరంపై మన జవాన్లు అభ్యంతరం చెప్పడంతో చైనా సైనికులు దాడికి దిగారని మన ప్రభుత్వం చెబుతోంది. ఇదే సంగతిని చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ కి మన విదేశాంగమంత్రి జైశంకర్ చెప్పారు. ఒక్క తూటా కూడా పేలలేదు గనుక పరిస్థితి పూర్తిగా క్షీణించిందన్న నిర్ణయానికి రానవసరం లేదు. కానీ ఇదిలాగే కొనసాగితే ఆ పరిస్థితి కూడా ఏర్పడొచ్చు. నెల రోజులుగా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద లద్దాఖ్‌లో అలజడి రేగుతున్నదని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా గాల్వాన్ లోయ వద్ద చైనా సైనికులు దాదాపు వంద శిబిరాలు ఏర్పాటు చేసుకుని బంకర్లను నిర్మించే ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతంలోకి చొరబడటమే కాక... అది ఎప్పటినుంచో తన అధీనంలోనిదేనని, భారత సైనికులే దాన్ని ఆక్రమించే యత్నం చేశారని చైనా కొత్త పాట మొదలుపెట్టింది. వాస్తవానికి గత కొద్ది సంవత్సరాలుగా లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైనికుల కదలికలున్నాయి. ఆ ప్రాంతంలోని చుశాల్ సబ్ డివిజన్ వాసులు ఎప్పటినుంచో ఈ సంగతి చెబుతున్నారు. పశువుల మేత కోసం తాము మొదటినుంచీ వెళ్లే ప్రాంతంలో తిరగొద్దని చైనా సైనికులు బెదిరిస్తున్నారని ఫిర్యాదుచేశారు. వాటిపై సకాలంలో స్పందించి చర్య తీసుకునివుంటే బహుశా పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదేమో! చైనాతో మనకు చేదు అనుభవాలు చాలావున్నాయి. 1962లో జరిగిన యుద్ధం సంగతలావుంచి 1975లో మన భూభాగంలోకి చొరబడి అకారణంగా మన సైనికులు నలుగుర్ని పొట్టనబెట్టుకున్న చరిత్ర దానిది. 1962లో అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడిన 80,000మంది చైనా సైనికులను కేవలం 10,000మంది భారత్ సైనికులు నిలువరించారు. అప్పటికి పెద్దగా మెరుగైన ఆయుధాలు లేకపోయినా శక్తికొద్దీ పోరాడారు. చివరకు ఓటమి సంభవించినా మన జవాన్ల ప్రతిఘటన అంత తీవ్రంగా వుంటుందని చైనా వూహించలేదు. అప్పటి యుద్ధంలో పాలుపంచుకున్న లెఫ్టినెంట్ జనరల్ హెండర్సన్ బ్రూక్స్ రూపొందించిన నివేదిక ఆనాటి ఓటమికి ఏయే కారణాలున్నాయో రికార్డు చేసింది. అనంతరకాలంలో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుంటూ సరిహద్దు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందామని ఇరు దేశాలూ అంగీకారానికొచ్చాయి. కానీ సరిహద్దుల్లో చైనా తన చేష్టలు మానుకోలేదు. అడపా దడపా సమస్యలు సృష్టిస్తూనే వుంది. 2011నుంచి అది తరచు సరిహద్దుల్లో ఉల్లంఘనలకు పాల్పడుతూనేవుంది. 2013 జూలైలో అప్పటి మన రక్షణమంత్రి ఏకే ఆంటోనీ చైనా పర్యటనలో వుండగానే లద్దాఖ్ ప్రాంతంలోని చుమార్‌లో చైనా ఆశ్విక దళం చొరబడి అది తమ భూభాగమని, అక్కడినుంచి నిష్క్రమించాలని మన సైనికులను బెదిరించింది. అంతకు రెండు నెలలక్రితం లద్దాఖ్‌లోని దౌలత్‌బేగ్ వద్ద చైనా చొచ్చుకొచ్చి శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతంలో వున్న మన నిఘా కెమెరాను చైనా సైనికులు అపహరించారు. 3,488 కిలోమీటర్ల ఎల్ఏసీ పొడవునా వివిధచోట్ల సమస్యలున్నాయి. అక్కడి పశ్చిమ, మధ్య, తూర్పు సెక్టార్లలో ఈ రేఖ ఎలావెళ్తుందన్న అంశంలో రెండు దేశాల మధ్యా విభేదాలున్నాయి. ఆక్సాయ్‌చిన్, లద్దాఖ్ ప్రాంతాల్లో సుమారు 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించిందని మన దేశం చెబుతుంటే...భారత్ అధీనంలో తమకు చెందిన 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం వుందని చైనా దబాయిస్తోంది. గాల్వాన్‌లోయలో అది తరచు ఘర్షణలకు దిగుతోంది. ఇప్పటికే తన ఆక్రమణలోవున్న ఆక్సాయ్‌చిన్ ప్రాంతంలో మెరుగ్గా వుండాలంటే గాల్వాన్ లోయ తన సొంతం కావాలన్నది చైనా వ్యూహం. దీనికి గండికొట్టే విధంగా మన దేశం వాస్తవాధీనరేఖ ప్రాంతాల్లో విస్తృతంగా రోడ్ల నిర్మాణం సాగిస్తోంది. దీనికితోడు లద్దాఖ్‌ను మన దేశం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడంతో భవిష్యత్తులో ఆక్సాయ్‌చిన్ తన అధీనం నుంచి జారుకునే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన చైనాకు వున్నట్టు కనబడుతోంది. అందుకే మన దేశాన్ని చికాకుపరిచే ఎత్తుగడలకు దిగింది. సరిహద్దుల్లో ఎల్లకాలమూ ఘర్షణాత్మక వాతావరణం వుంటే ఎప్పుడో ఒకప్పుడు అది పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించే ప్రమాదం వుంటుంది. నెలరోజులుగా చైనా సాగిస్తున్న కవ్వింపు చర్యలపర్యవసానమే సోమవారంనాటి విషాద ఘటనలకు దారితీసింది. సీఎంలతో భేటీ సందర్భంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సార్వభౌమత్వానికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తే ప్రతీకార చర్య తప్పదని హెచ్చరించారు. మన విదేశాంగమంత్రి జైశంకర్ చైనా విదేశాంగమంత్రితో మాట్లాడినప్పుడు కూడా ఇటువంటి హెచ్చరికే చేశారు. ఇలా చైనాకు కఠినమైన సందేశాన్ని పంపడంతోపాటు సరిహద్దుల్లో మన ఇంటెలిజెన్స్ వ్యవస్థను మెరుగుపరచుకోవడం, చొరబాటు ప్రయత్నాలను మొగ్గలోనే తుంచడం కొనసాగుతుండాలి. అది లేనట్టయితే ఎంతో ధైర్యసాహసాలతో పోరాడే విలువైన జవాన్లను కోల్పోయే స్థితి ఏర్పడుతుంది. 1999లో కార్గిల్‌లో జరిగింది ఇదే. శుక్రవారం కేంద్రం అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నది. ఈ సమావేశం దేశ సమష్టితత్వాన్ని చాటాలి. యుద్ధం వరకూ వెళ్లాల్సిన అవసరం లేకుండానే చర్చల ద్వారా, అంతర్జాతీయంగా ఒత్తిళ్లు తీసుకురావడం ద్వారా చైనా మెడలు వంచగలగాలి. ఈ విషయంలో దృఢంగా వ్యవహరించాలి. -
కౌంటర్ : ట్రంప్‌కు చైనా దెబ్బ పడింది
బీజింగ్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చైనా గట్టి షాకిచ్చింది. అల్యూమినియం, స్టీల్ దిగుమతులపై అమెరికా విధించిన డ్యూటీలకు కౌంటర్‌గా, అమెరికా ఉత్పత్తులపై చైనా అదనపు టారిఫ్‌లు విధించింది. 128 అమెరికా ఉత్పత్తులపై అదనంగా 25 శాతం వరకు టారిఫ్ విధిస్తున్నట్టు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. దీనిలో పంది మాంసం, వైన్, కొన్ని పండ్లు, నట్స్ ఉన్నాయి. టారిఫ్‌లు విధించిన 3 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తుల జాబితాను విడుదల చేస్తున్నట్టు చైనా సోమవారం ప్రకటించింది. 120 అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు తగ్గించే బాధ్యతలను పక్కనపెట్టిన చైనా, ఒకేసారి వాటిపై మరో 15 శాతం టారిఫ్ అదనంగా విధిస్తున్నట్టు పేర్కొంది. పంది మాంసం వంటి మరో ఎనిమిది ఉత్పత్తులపై అదనంగా 25 శాతం వరకు టారిఫ్‌లను విధిస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి రానున్నట్టు కూడా తెలిపింది. అమెరికా దిగుమతులపై టారిఫ్ మినహాయింపును రద్దు చేయడం, డబ్ల్యూటీవో నిబంధనలు వాడుకుని చైనా ప్రయోజనాలను కాపాడుకోవడమేనని బీజింగ్ సమర్థించుకుంటోంది. చైనా విధించిన ఈ అదనపు టారిఫ్‌లు బీజింగ్‌కు, వాషింగ్టన్కు మధ్య ట్రేడ్‌వార్ ఆందోళనలను మరింత రేకెత్తిస్తున్నాయి. ఆర్థికంగా బలమైన రెండు పెద్ద దేశాల మధ్య ఈ యుద్ధం ఏ మలుపు తిప్పుతుందో అని ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా దిగుమతి సుంకాలు విధించిన తర్వాత కూడా.. మరో 50 బిలియన్ డాలర్లకు పైగా టారిఫ్‌లను చైనీస్ వస్తువులపై విధించాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. అమెరికా మేథోసంపత్తి హక్కులను చైనా దుర్వినియోగ పరుస్తుందని, ఈ మేరకు బీజింగ్‌ను శిక్షించాల్సి ఉందని ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఈ ఆరోపణలు బీజింగ్ ఖండిస్తోంది. -
వినాయకుడిని మోస్తున్న మోదీ.. పక్కనే షా
సాక్షి, అహ్మదాబాద్: వినాయక చవితి వచ్చిందంటే చాలూ భక్తిని ప్రద్శరిస్తూనే తమదైన టచ్ ఇస్తూ ఈ మధ్య కొందరు విగ్రహాలను పెట్టేస్తున్నారు. బాహుబలి లాంటి క్రేజీ చిత్రాల దగ్గరి నుంచి పాపులర్ వ్యక్తులను కూడా విగ్రహాల్లోకి లాగేస్తూ సమ్‌థింగ్ స్పెషల్‌ను చూపిస్తున్నారు. వడోదరలోని జుని గడి వినాయక మండపంలోని విగ్రహం కూడా ఇలాంటి కోవలోనిదే. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ భుజాన వినాయకుడితో ఏర్పాటు చేసిన విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పక్కనే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రతిమను కూడా చేర్చారు. చైనా పై దాడికి సిద్ధం అంటూ పక్కనే ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేయటం గమనించవచ్చు. ప్రస్తుత పరిస్థితులకు సరిపోయేలా ఈ మండపాన్ని రూపొందిచినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వచ్చే ఏడాది గుజరాత్ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఈ విగ్రహం ప్రత్యేకతను సంతరించుకుందనే చెప్పొచ్చు.