సరిహద్దు ఘర్షణలో సరికొత్త సవాళ్లు | Guest Column On The Conflict Between India And China Over Ladakh Region | Sakshi
Sakshi News home page

సరిహద్దు ఘర్షణలో సరికొత్త సవాళ్లు

Published Thu, Jun 18 2020 1:02 AM | Last Updated on Thu, Jun 18 2020 1:03 AM

Guest Column On The Conflict Between India And China Over Ladakh Region - Sakshi

అంతర్జాతీయ సంబంధాల్లో వాస్తవికవాదానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇది జాతీయ ప్రయోజనాల రీత్యా ప్రభుత్వ చర్యలను సమర్థిస్తుంది పైగా అన్నిటికంటే జాతీయ ప్రయోజనాలను సంతృప్తిపర్చడమే అన్ని ప్రభుత్వాల విధి అని అది చాటిచెబుతుంది. లద్దాఖ్‌ రీజియన్‌లోని వివాదాస్పద అక్సాయ్‌ చిన్‌ ప్రాంతంలో భారత్, చైనా మధ్య ఘర్షణను ఈ దృక్కోణంలోంచే అంచనా వేయాలి. జూన్‌ 15వ తేదీన జరిగిన సైనిక ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అసువులు బాయడం, కొందరు చైనా సైనికులు గాయపడ్డానికి దారి తీసిన విషాదకర ఘటనలు నిజంగా కలవరం కలిగిస్తున్నాయి. 

సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన ఇరుదేశాల మధ్య ఘర్షణకు, ఇరుదేశాలు తమ భూభాగాలను పోగొట్టుకోవడానికి దారితీసే అవకాశాల గురించి పలు చర్చలకు దారి తీసింది. భారత్, చైనాలు కేవలం ఇరుగుపొరుగు దేశాలు మాత్రమే కాదు.. అవి అణ్వాయుధాలు కలిగిన దేశాలు. పైగా ప్రపంచంలోని ఆరు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఇవి భాగం. ఇరుదేశాల్లో 250 కోట్లపైగా జనాభా ఉంది. కాబట్టే ఇరుదేశాల మధ్య నెలకొనే ఎలాంటి ప్రయోజనాల మధ్య వైరుధ్యం అయినా సరే అంతర్జాతీయ వ్యవస్థ భౌగోళిక వ్యూహాత్మకతపై, ఆర్థిక పర్యవసానాలపై తీవ్రమైన ప్రభావం కలిగిస్తుంది. కాబట్టే్ట పరిస్థితిని, రాబోయే ఫలితాలను మదింపు చేయడానికి ముందు ఈ ప్రాంతంలో రెండు దేశాల ప్రయోజనాలను అర్థం చేసుకోవడం తప్పనిసరి.

ఆర్టికల్‌ 370ని రద్దుతో చైనా అప్రమత్తం
చైనా దృక్కోణం నుంచి చూస్తే ఈ ప్రాంతంలో దానికి కొన్ని కీలకమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి. చైనా జింజియాగ్‌ ఉగర్‌ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని ఎచెంగ్‌ నుంచి టిబెట్‌ స్వయంప్రతిపత్తి ప్రాంతంలోని లెట్సెని కలుపుతున్న 2342 కిలోమీటర్ల పొడవైన 219 జాతీయ రహదారిని నిర్మించింది. ఈ రోడ్డు 1962 యుద్ధంలో చైనా ఆక్రమించిన అక్సాయ్‌ చిన్‌ ప్రాంతం గుండా వెళుతోంది. అధికారికంగా భారత్‌ ఇప్పటికీ ఈ ప్రాంతంపై తనకు హక్కులున్నాయని వాదిస్తూ దాన్ని లద్దాఖ్‌ రీజియన్లో భాగంగా చూస్తోంది. అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంతో, అక్సాయ్‌చిన్‌ ప్రాంతంపై భారత్‌ ఉద్దేశాలు చైనా అధికార వర్గాల్లో ప్రమాదఘంటికలు మోగించాయి. ఎందుకంటే 219వ జాతీయ రహదారి టిబెట్‌ను జింగ్జియాంగా ప్రావిన్సుతో అనుసంధానించడంవల్ల చైనాకు ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా, ఆర్థికంగా చాలా ముఖ్యమైనది. టిబెట్, జింజియాంగ్‌ ప్రావిన్సు రెండింటిలో ఇప్పుడు వేర్పాటువాదం ప్రబలంగా ఉంది. ఇప్పటికే టిబెటన్‌ ఆకాంక్షలకు భారత్‌ ఎత్తుగడల రీత్యా మద్దతు ఇవ్వడం చైనాను ఆందోళనకు గురిచేస్తోంది. 

రెండు, చైనా–పాకిస్తాన్‌ ఆర్థిక కారిడార్‌ (సీపీఈసీ)  లోని కారంకోరం హైవేతో అనుసంధానించడంలో 219వ జాతీయ రహదారికి కీలక పాత్ర ఉంది. వాస్తవాధీన రేఖ నుంచి దౌలత్‌ బేగ్‌ వరకు భారత్‌ మౌలికవ్యవస్థాపనలను అభివృద్ధి పర్చుకోవడం అనేది ఇటు కారంకోరం, అటు ఎన్‌హెచ్‌ 219 హైవే రెండింటికి భద్రతాపరంగా చైనాకు హెచ్చరికలు పంపుతోంది. మూడు, సీపీఈసీకి భద్రతాపరమైన ప్రమాదం ఉందంటే ఈ ప్రాంతంలో చైనా మదుపు చేసిన 60 బిలియన్‌ డాలర్ల మేరకు మౌలిక వసతుల అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోతుంది. పైగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ మానసపుత్రిక అయిన బెల్ట్‌ అండ్‌ రోడ్స్‌ ఇనిషియేటివ్‌ (బిఆర్‌ఐ)ని ఇది అడ్డుకుంటుంది. ఈ ఇనిషియేటివ్‌కు ఎలాంటి నష్టం వాటిల్లినా, స్వదేశంలో జీ జిన్‌పింగ్‌కు రాజకీయ సమస్యలను కొనితెస్తుంది. 

ఈ వ్యూహాత్మక, ఆర్థిక కారణాలే మొత్తం కశ్మీర్‌ సమస్యను కొత్త మలుపులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు చైనా తాను కూడా కశ్మీర్‌ సమస్యలో భాగమేనని భావిస్తోంది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఐక్యరాజ్యసమితిలోని చైనా శాశ్వత ప్రతినిధి భారత్‌ చర్యను చైనా సార్వభౌమాధికారానికి సవాలు అని ఆరోపించారు. ఎందుకంటే ఆర్టికల్‌ 370 రద్దు అనేది అక్సాయ్‌ చిన్, గిల్గిత్‌–బాల్టిస్తాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మూడింటికీ వర్తిస్తుందని భారత్‌ స్పష్టంగా ప్రకటించింది. 

అక్సాయ్‌ చిన్‌ ఏరియాపై చైనా బలంగా పట్టు సాధించాలంటే టిబెట్‌–జింజియాంగ్‌ కనెక్టివిటీనుంచి భారత్‌ను దూరంగా నెట్టేయాలి. భవిష్యత్తులో నెలకొనే ఏ ఘర్షణలో అయినా, కారంకోరం హైవేకి ప్రమాద అవకాశాలను తగ్గించడం అనేది లడాఖ్‌ రీజియన్‌లో చైనాకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక ప్రయోజనంగా మారింది. అందుచేత వివాదాస్పద భూభాగంలోపలికి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు తన బలగాలను చైనా ఉపసంహరించుకోవడం జరిగితే, దాన్ని తాత్కాలిక చర్యగానే భావించాల్సి ఉంటుంగది. అంతేకాకుండా భవిష్యత్తులో చైనా ప్రజావిముక్తి సైన్యం అనేకసార్లు ఇలా వివాదాస్పద ప్రాంతంలోకి వస్తూ, వెనక్కి వెళ్లిపోతూ ఉండే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అక్సాయ్‌చిన్‌లో తన ప్రయోజనాలను కాపాడుకోవడంతో పోలిస్తే సిక్కింలో నకూ లా సెక్టర్లో, భూటాన్‌ సమీపంలోని డోక్లామ్, అరుణాచల్‌ ప్రదేశ్‌ సెక్టర్లో చైనా ప్రయోజనాలు పెద్దగా ముఖ్యమైనవి కాదు. భారత్‌ దృష్టిని ఏమార్చడానికి, దాని శక్తిని బలహీనపర్చడానికి మాత్రమే ఈ ప్రాంతాల్లోని ఘర్షణలు ఉపయోగపడతాయి. 

ఎంపికలే భారత్‌ ముగుదాళ్లు
కాబట్టి భారత్‌కు ఇప్పుడు మూడు అవకాశాలున్నాయి. ఒకటి, ప్రాదేశికప్రాంతం విషయంలో రాజీపడి యధాతథ స్థితిని కొనసాగించడం. అంటే పీఓకే, గిల్గిత్‌–బల్టిస్తాన్‌ ప్రాంతాలు పాకిస్తాన్‌తో కొనసాగేలా, అక్సాయ్‌చిన్‌ చైనాలో భాగంగా ఉండేలా భారత్‌ రాజీపడాలి. పైగా పాకిస్తాన్‌తో ఆధీన రేఖను పరిష్కరించడంలో చైనాతో వాస్తవాధీనరేఖను పరిష్కరించుకోవడానికి వాటిని అంతర్జాతీయ సరిహద్దులుగా గుర్తిస్తూ భారత్‌ దౌత్యపరంగా చర్చలకు కూర్చోవాల్సి ఉంటుంది. 

రెండు, అరుణాచల్‌ ప్రదేశ్‌తో సహా తూర్పు రంగంలో ఉండే అక్సాయ్‌చిన్‌ తదితర భూభాగాలపై చైనాతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. మూడు, భారత్‌ తనకు తానుగా సైనిక ఘర్షణకు సిద్ధం కావాల్సి ఉంటుంది. మొదటి రెండు ఎంపికలను భారత్‌ ఎంచుకోకపోతే భవిష్యత్తులో ఏ సమయంలోనైనా సైనిక ఘర్షణ తప్పదన్నమాట. ఇతర భూభాగాలకోసం అక్సాయ్‌ చిన్‌పై చర్చలు జరపటం అంటే రాజకీయ పార్టీలను పెద్ద ఎత్తున కూడగట్టాల్సి ఉంటుంది. పైగా ప్రజా తీర్పును కూడా కోరాల్సి ఉంటుంది. ఎందుకంటే సరిహద్దులు నిర్ణయించడమే భారత్‌ అసలు సమస్య. వాస్తవాధీన రేఖ ఒక సరిహద్దుగా ఉన్నప్పటికీ చైనా దాన్ని అవలీలగా దాటేస్తుంది. అందుకే ఈ ప్రాంతంలో ఇలాంటి ముఖాముఖి ఘర్షణలు తప్పవు. పైగా ఇప్పటికీ పాకిస్తాన్‌ ఆధీనంలో ఉన్న పీఓకే, గిల్గిట్‌ బాల్టిస్తాన్‌ అనే కశ్మీర్‌లోని రెండు ప్రధాన భాగాల భద్రతకి అది హామీ ఇవ్వలేదు. పైగా, ఈ మూడు ఎంపికల్లో దేన్ని ఎంచుకోవాలన్నా అది అంత సులభం కాదు. దీనికి సుదీర్ఘకాల వ్యూహం అవసరమవుతుంది.

మరోవైపు, ఈ ప్రాంతంలో భారత ప్రయోజనాలు ప్రధానంగా పాకిస్తాన్‌ చుట్టూనే తిరుగుతున్నాయి. 1947లో దేశ విభజన కాలం నుంచి మన సైనిక, వ్యూహాత్మక చింతన మొత్తంగా సీమాంతర ఉగ్రవాదం నుంచి, సైనిక కేంపెయిన్‌ల నుంచి కశ్మీర్‌ను కాపాడుకోవడంపైనే దృష్టి సారించింది. 1962లో చైనాతో యుద్ధం భారత్‌ కళ్లు తెరిపించినప్పటికీ, భారత్‌ రాజకీయ, వ్యూహాత్మక లక్ష్యాలు పాకిస్తాన్‌ నుంచి వస్తున్న ప్రమాదాలను మాత్రమే పట్టించుకుంటున్నాయి. పీఓకే, జీబీ భూభాగాలను పాకిస్తాన్‌ నుంచి లాక్కోవడానికి ప్రయత్నించడం కంటే ఈ ప్రాంతంలో పాకిస్తాన్‌ మరింతగా చొచ్చుకు రాకుండా చేయడం, సీమాంతర ఉగ్రవాదంతో పోరాడటమే భారత్‌ ఏకైక కర్తవ్యంగా మిగిలిపోయింది. కాబట్టి లద్దాఖ్‌ భద్రతతోపాటు కశ్మీర్‌ సమస్యను పాకిస్తాన్‌ నుంచి ప్రమాద హెచ్చరిక కోణంలోనే మనం చూస్తున్నాం. దీనివల్లే చైనాతో సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పన పట్ల భారత్‌ ఉదాశీనంగా ఉండిపోతోంది. 

అయితే కొత్త సహస్రాబ్దంలో భారతీయ వ్యూహాత్మక చింతనలో ప్రధానమైన మార్పు చేటు చోసుకుంది. లద్దాఖ్‌ రీజియన్‌లో 2003 నుంచి భారత్‌ రోడ్లు, బ్రిడ్జిలను నిర్మించడం ప్రారంభించింది. కఠినమైన సందర్భాల్లో పాకిస్తాన్‌–చైనా మిశ్రమ బలగాలు ముందుకు చొచ్చుకురాకుండా చేయడానికి వీటి నిర్మాణం అవసరం. 2013లో సీపీఈసీని చైనా ప్రారంభించి కారంకోరం హైవే అభివృద్ధిని ప్రకటిం చినప్పుడు భారత్‌ అప్రమత్తమై తన అభ్యంతరం వ్యక్తంచేసింది. కశ్మీర్‌ ప్రతిపత్తికి ఇది విఘాతం కలిగిస్తుంది కాబట్టే భారత్‌ చైనా ప్రతిపాదిత బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌లో చేరడానికి నిరాకరించింది.

భారత్‌ అష్టదిగ్బంధనమే చైనా లక్ష్యం
పైగా అంతర్జాతీయంగానే ఇరుదేశాల ప్రయోజనాలు దక్షిణ చైనా సముద్రం నుంచి తూర్పున హిందూ మహాసముద్రంవరకు, పశ్చిమ భారత్‌ లోని అప్ఘానిస్తాన్‌ వరకు వ్యాపించి ఉన్నాయి. చైనాతో లెక్కలు తేల్చుకోవడానికి అమెరికా పొంచుకుని ఉన్నందున భారత్‌తో సైనిక ఘర్షణను కోరి తెచ్చుకోవడం అంటే చైనాకు కొరివితో తల గోక్కున్నట్లే అవుతుంది. అందుకే పూర్తి స్థాయి యుద్ధానికి బలీయమైన కారణాలు కనిపిస్తే తప్ప, చైనా తన ప్రయోజనాల రక్షణ కోసం స్థానిక ఘర్షణలకు మాత్రమే పరిమితమవుతుంది. పైగా వివాదాస్పద ప్రాంతాలను కొంచెంకొంచెంగా ఆక్రమించడం, భారత్‌ను పొరుగుదేశాల సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పనను వృద్ధి చేసి భారత్‌ను అష్టదిగ్బంధానికి గురి చేయడం వంటి ఇతర వ్యూహాలను కూడా చైనా ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి దక్షిణాసియా ప్రాంతంలో చైనా జోక్యం ద్వారా ఎదురవుతున్న కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా భారత్‌ సిద్ధమై ఉండాలి.

వ్యాసకర్త అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
సెంట్రల్‌ యూనివర్శిటీ, సిక్కిం
ఈమెయిల్‌ – opgadde@cus.ac.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement